ఈ సౌభాగ్యానికి తోడూ అయన పాఠం చెప్తూ మధ్యలో కంఠతా పట్టింది మధ్యలో మరచిపోతారు. అప్పుడు అటెండేన్స్ తీయడం మొదలుపెడతారు. తన పాఠం గుర్తువచ్చే వరకూ , ఒక్కక్కరి పేరు సాగదీసి సాగదీసి పలుకుతూ అటెండెన్స్ తీస్తాడు. ఈలోగా గుర్తు వస్తే మళ్ళీ పాఠం అందుకుంటాడు. గుర్తుకురాకపోతే అటెండెన్స్ తో ఆ రోజు క్లాసు పూర్తవుతుంది.
"ఆ మొద్దు కృష్ణ గారి క్లాసు కోసం కాలేజికి పోకపోతే మా నాటకంలో సీత వేషం వెయ్యరాదూ'?"
ఎందుకు! నీ చేత పరుత్యజింపబడి ఏడుస్తూ కూచోవటానికా? నేను సీత వేషం వేస్తె రాముడు సీతను వదిలేయాడు."
"అదెలా ? రామాయణంలో అలా లేదు!"
"లేకపోతె పోనీ ! పాతపాతా గాధలే తవ్వుకుంటూ కూచోవాలని ఏముంది? మనం కొత్త చరిత్ర సృష్టించకూడదా!"
"ఎడిసినట్టుంది . రామాయణం పాడుచేశారని జనం రాళ్ళు రువ్వుతారు."
"ఏం రువ్వరు . మహాతల్లి సీతమ్మ వారు సుఖపదిందని సంతోషిస్తారు."
"మహాతల్లీ! నీకొక నమస్కారం! నువ్వు వేషం వెయ్యక్కర లేరు. కాని, చరిత్ర మార్చకు!"
మయూర వెంటనే కోపం తెచ్చుకుని, మూతి బిగించి "నేను లేకపోతే మీ నాటకంలో సీత, సీతలా వుండదు. శూర్పణఖలా వుంటుంది." అని కాలేజికి బయలుదేరింది. కొంచెం దూరమే వెళ్ళింది. కాని, యతి లేకుండా వెళ్ళటం ఎలాగో అనిపించింది. సావిట్లో కూర్చుని తనఖా పాత్రలు చూసుకుంటున్న వేదాంతయ్య దగ్గిరకు వచ్చింది. వేదాంతయ్యది ప్రధానంగా వడ్డీ వ్యాపారం. ఎప్పటికప్పుడు ఆ లెక్కలన్నీ చూసుకోవడమే అతనికెంతో ఇష్టమైనవి.
"ఏమ్మా, కాలేజీ లేదా?" అన్నాడు దగ్గిరకు వచ్చి కూచున్న కూతురితో.
"ఉంది నాన్నా! కానీ యతి కాలేజీకి రాకుండా నాటకాల్లో వేషాలు వేస్తున్నాడు" అని చెప్పింది.
వేదాంతయ్యకు వెంటనే కోపం వచ్చింది. యతి తల్లిదండ్రులు లక్ష చెప్పి అతడిని తనకు అప్పగించారు. ఇప్పుడతడు చదువుకోకుండా పాదయిపోతే ఆ మాట తనకోస్తుంది. వెంటనే లేచి పెరట్లో జామచెట్టు మొదట్లో కూచుని "చెలీ! కర్తవ్య దీక్షా బద్దుడునై ...." అంటున్న యతి దగ్గరకు వచ్చాడు.
"ఏరా! నువ్వూ నీ కర్తవ్యం! నీ మొదటి కర్తవ్యం కాలేజీకి పోవడం వెంటనే బయలుదేరు" అన్నాడు .
ఆ కంఠ స్వరం విని హడాలిపోతూ లేచి నిలబడ్డాడు యతి. వేదాంతయ్యనూ, అతని ప్రక్కన మయూరనూ చూడగానే సంగతి అర్ధమయిపోయింది అతనికి. వెంటనే లేచి కంగారుగా "వెళతాను" మావయ్యా! అన్నాడు అప్పటికే వేదాంతయ్య అక్కడి నుంచి కదలక పోయే సరికి హడావుడిగా బట్టలు మార్చుకుని కాలేజికి బయలుదేరాడు చచ్చినట్లు. దారిలో "మావయ్యకు చెప్పావు కదూ!" అన్నాడు గుర్రుగా....
గర్వంగా నవ్వింది మయూర! "లేకపోతే , కాలేజి ఎగ్గొట్టి , నాటకాలు వేద్దమనుకున్నావా. నాటకాలు?" అని వెక్కిరించింది.
మయూరను కాదని తానేమి చెయ్యలేనని అనుభవం మీద తెలుసుకున్నాడు యతి. అంచేత ఎలాగైనా మయూరను కూడా నాటకాల్లోకి దింపితే తప్ప తనకు ఆ "మొద్దు కృష్ణ గారినే లెక్చర్ వినే బాధ తప్పదు.
"మయూరా! ప్లీజ్! నువ్వూ నాటకంలో వేషం వెయ్యి" అన్నాడు బ్రతిమాలుతున్న గొంతుకలో.
"సరే! నువ్వు వెయ్యకపోతే, మంజులను వెయ్యమంటాను. నేను రాముడూ, మంజుల సీత."
మయూర ముఖంలోకి ఓరగా చూస్తూ అన్నాడు యతి. ఆ ముఖంలో అతనికి కావలసిన మార్పులోచ్చేసాయి. మయూరకీ, మంజులకీ అన్నింటిలోనూ పోటాపోటీ. ప్రాణ స్నేహితులుగా ఉంటూ అన్నింటిలోనూ పోటీ పడుతుంటారు.
యతి రాముడు, మంజుల సీత ఊహించుకొంటూ ఉండగానే మతిపోయినట్లనిపించింది మయూరకి.
మంజుల యతి పక్కన సీతగా నటించడం, మంజుల గర్వంగా తనవంక చూసి నవ్వడం, ఇక ఆపైన ఆలోచించ లేకపోయింది.
"నాటకంలో వేస్తాను" అని ఒప్పేసుకుంది.
"గుడ్ గాళ్!" అని మయూర వీపు తట్టాడు. మయూర కనుబొమలు చిట్లించి, "ఏయ్!" అనగానే "సారీ" అని గట్టిగా నవ్వేశాడు.
4
అయినింటి పిల్లలు నాటకాలలో వేయటం , అదీ , మొగవాళ్ళ పక్కన ఆడవాళ్ళుగా వెయ్యటం అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ, సర్వసాధారణం కాదు. అందుకే నాటకంలో వేషం వెయ్యటానికి ఇంట్లో చాలా పోట్లదవలసి వచ్చింది. చివరకు ఎలాగో సాధించింది.
అయితే రిహార్సల్స్ లో ఎప్పటి కప్పుడే మయూరతో ప్రాణ గండంగా వుండేది. మిగిలిన వాళ్ళకి.
యతి పరమ గంభీరంగా "చెలీ! కర్తవ్య దీక్షాబద్దుడనై నిన్ను పరిత్యజించ వలసి వచ్చినది" అనగానే మయూర తన పోర్షన్ మర్చిపోయి , ఛీ! సంఘానికి భయపడి నా తప్పేమీ లేకపోయినా, నామీద ప్రేమ ఉన్నా, నన్ను వదిలేస్తావా! అనేసేది.
"నాధా! నాకింత క్రూర శిక్షయా! కానిండు! నా హృదయమున ప్రతిష్టించుకొన్న మీ పాద పద్మములే నాకు రక్ష!" అని మయూర చేత అనిపించటానికి తాతలు దిగి వచ్చేవారు. కానీ, ఆ మాటలు మయూర రోషంగా అనేది కాని, దీనంగా కాదు. "కర్మ" అని యతి తలకోట్టుకుంటే మరింత రోషంగా "అవును! ఇందత కర్మే! చేతులోరా తెచ్చిపెట్టుకున్న కర్మ" అనేది.
నాటకం ప్రదర్శించినప్పుడు జనంలోంచి ఎలాంటి రెస్పాన్స్ ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడ్డారు. నాటకం వేస్తున్న అందరూ . కానీ , తీరా నాటకం ప్రదర్శిస్తున్నప్పుడూ మయూర దీనంగా అనటం మాత్రమే కాక, నిజంగానే సొమ్మసిల్లి పడిపోయింది. మయూరను ఆ అవస్థలో చూసిన యతికి కళ్ళు చెమ్మగిల్లాయి.
జనంలోంచి చప్పట్లు మార్మోగాయి. ప్రశంసలు కురిసాయి. కానీ, మయూర మాత్రం అనేక విధాల శీతలోపచారాలు చేసాక కాని తెప్పరిల్లలేదు. బహుమతులు అందుకొంటున్నప్పుడు కూడా మయూర ముఖం వడలిపోయే ఉంది. అది చిన్న టౌన్ కావటం వల్ల నాటకం ప్రదర్శించిన హాలు నుంచి నడుచుకొంటూనే ఇంటికి బయలుదేరారు మయూర , యతి.
"చాలా బాగా నటించావు . ఇంత బాగా చేస్తావని అనుకోలేదు" అన్నాడు యతి.
ఆ ప్రశంసకి పొంగిపోవటానికి మారుగా అతని భుజానికి తల ఆన్చి బావురుమని ఏడ్చేసింది.
"ఏమిటది? ఊరుకో! ఊరుకో!" అన్నాడు, బుజ్జగిస్తున్నట్లు యతి.
"ఏమిటో, ఆ సమయంలో , నేను నిజంగా సీతనే అయినట్లూ, నువ్వు నిర్ధాక్షిణ్యంగా వెళ్ళ గొట్టేస్తున్నట్లూ అనిపించింది. భరించలేకపోయాను. ఇప్పటికింకా గుండె ఝల్లు మంటోంది!"
మయూరి చుట్టూ చెయ్యి చుట్టి తనకు మరింత దగ్గిరగా తీసుకున్నాడు , యతి.
"నాకు అలాగే అనిపించింది నిన్ను ఎందుకు వదలాలి? వెధవ సంఘం ఎమయిపోతే , ఎవడికి కావాలి? అనిపించింది. పోనీ ఈసారి ఈ నాటకం వెయ్యొద్దు. భవభూతి ఉత్తర రామ చరిత్రలో సీతారాములు తిరిగి కలుసుకున్నట్లుగా వ్రాసాడట! అది వేద్దాం!"
"ఎందయ్యోయ్ ఎంత ఆలుమగలు కాబోతున్నా, నడిబజారులో కావలించుకుంటారేమిటి?" నవ్వుతూ అన్నాడు దారిన పోతున్న కనకయ్య.
దానితో బెదిరినట్లయి ఇద్దరూ ఎడం ఎడంగా జరిగారు. ఒకరినొకరు భయంగా చూసుకున్నారు అంతలో సిగ్గు పడ్డారు. అంతకు ముందెన్నడూ కలగని భావసంచలనం ఏదో కలిగింది ఇద్దరిలో.
ఇంటికి వచ్చేసరికి రాజ్యలక్ష్మి , వేదాంతయ్య ఇద్దరూ ఏదో వాదించుకుంటున్నారు దక్షిణపు గదిలో. యతి మయూర ఇద్దరూ వసారాలోనే ఆగిపోయారు.
"ఆ! మీకు చిన్నతనంలాగానే ఉంటుంది. ఆ వయసుకి నేను కాపురానికి వచ్చేసాను."
"అబ్బబ్బ! ఆరోజులు మారాయే!"
"ఆ! మారాయి! ఏం మారినా , వయసు పొంగులు మాత్రం మారవు. మీరిలా మీ అమ్మాయి 'చిన్నపిల్ల' అనుకుంటూ కూచోండి. అదేదో వాళ్ళే చేసేసుకుంటారు."
యతికి, మయూరకి పెద్దవాళ్ళు మాట్లాడుతున్న దేమిటో అర్ధమయింది. ఇద్దరూ ఒకరి నొకరు చూసుకోబోయారు. సిగ్గుతో కళ్ళు వాలిపోయాయి. చెరో వైపు నుంచీ లోపలి పారిపోయారు.
మయూరని చూడగానే రాజ్యలక్ష్మి సంభాషణ మార్చేస్తూ "ఎంత బాగా వేసావే వేషం! ఆచ్చు సీతమ్మ లాగే వున్నావు " అంది.
"యతి కూడా రామయ్యలాగే వున్నాడు" అని చేర్చాడు వేదాంతయ్య.
"సరి! సరి! కాళ్ళు కడుక్కో! వడ్డించేస్తా! ఇప్పటికే ఆలస్యమయిపోయింది" అని వంటింట్లోకి వెళ్ళి పీటలు వాల్చి యతికీ, మయూరకి కంచాలు పెట్టింది. అలా పక్కపక్కన కూచుని తినడం ఎప్పుడూ వున్న అలవాటే అయినా, ఆరోజు ఎందుకో చాలా విచిత్రమైన స్పందన కలిగింది మయూరలో. అతడి పక్కన కూచోలేకపోయింది. లేచిపోవటానికి శక్తి చాలటం లేదు. యతి మాత్రం మాములుగా భోజనం చేసేస్తున్నాడు ఓరగా అతని వైపు రెండు మూడు సార్లు చూసింది. అతడు వంచిన తల ఎత్తలేదు.
కంచంలో అన్నీ వడ్డించి, మీరు వడ్డించుకోమని, కూరలూ, పులుసూ, పెరుగూ అన్నీ దగ్గిర పెట్టి వెళ్ళి పడుకుంది రాజ్యలక్ష్మి.
అందుకోసమే కాచుకుని కూచున్నట్లు అన్నం తింటున్న మయూరను గభాలున తన వళ్ళోకి లాక్కుని ఎంగిలి మూతితో ముద్దు పెట్టుకున్నాడు. తనను తను మరిచిపోయింది మయూర.
"నేను సీతనే! ఏ పరిస్థితుల్లోనూ రాముణ్ణి వదలని సీతని!' అంది.\
కమ్మని కలలతో నిద్రపోయిన మయూరకి అంత కమ్మగానూ తెల్లవారలేదు. గందరగోళంగా యేవో అరుపులు, కేకలు వినిపించి గభాలున లేచి కూచుంది. ఒక్క క్షణం అంతా అయోమయంగా తోచింది. హృదయ విదారకంగా ఏడుపులు వినిపిస్తున్నాయి.
మయూర మనసంతా కలవర పడిపోయింది. కిటికీలోంచి బయటకు చూసింది. ఎదురింట్లోంచి ఏడుపులు వినిపిస్తున్నాయి.
రాజ్యలక్ష్మి ఎదిరింటికి వెళ్ళటానికి తయారవుతూ మయూర లేవటం చూసి ! "లేచావా, నేనే నిన్ను లేపుదామను కుంటున్నాను - పాపం , సుజాత చచ్చిపోయిందట! నేను వెళుతున్నాను. చూడటానికి. నువ్వు ముఖం కడుక్కుని కాఫీ తాగిరా!" అంది దిగులుగా.