"ఛీ! ఛీ! ఏమిటమ్మా, ఇది ? లే! లే!" ప్రభాకర్ లేవదియ్యబోయాడు. మయూర లేవాలేదు. ఆమె కన్నీళ్లు ప్రభాకర్ పాదాలను తడుపుతున్నాయి.
"ఛీ! ఏమిటమ్మా ఇది? అతనెవరు? నీకెలా తెలుసు?" ఇంత సేపటికి ప్రశ్నించాడు ప్రభాకర్.
మయూర తలెత్తి కళ్ళు తుడుచుకుంది.
వణుకుతున్న పెదవులతో "అతడు మాకు దూరపు బంధువు. కొన్నాళ్ళు మా యింట్లో వుండి చదువుకునేవాడు. చదువుకొనే రోజుల్లోనే వెంకటయ్యగారి రామదండులో చేరిపోయి చదువు మానేశాడు. చాలా రోజులయింది చూసి ....." అంది.
"వెంకటయ్యగారి రామదండులో చేరాడా?....." సాలోచనగా అన్నాడు ప్రభాకర్ "వెంకటయ్యలో ఆవేశం, ఆర్భాటం వున్నంతగా సిన్సియారిటీ కనిపించదు. ఇటీవల అతడు విద్యార్ధి లోకాన్ని విపరీతంగా రేచ్చాగోడుతున్నాడు. ఫలితం ఎలా వుంటుందో?"
మయూర సమాధానం చెప్పలేదు.
"వెళ్లి పడుకోమ్మా!" అన్నాడు ప్రభాకర్.
"అత్తగారిని కూడా అక్కడ పడుకోమనండి. నేను కింద పడుకుంటాను." తల దించుకుని అంది మయూర.
ప్రభాకర్ హేళన చేస్తున్నట్లుగా నవ్వి "విన్నావా కమలా? కోడలికి కాపలాగా పడుకుంటావా?" అన్నాడు. ఆహేళన గుర్తించి కమల మూతి ముడుచుకుని "నాకెందుకూ? నేను దేనిలోనూ కల్పించుకొను!" అని తన పక్కమీద అటు తిరిగి పడుకుంది.
"వెళ్ళమ్మా! వెళ్ళి పడుకో! అతడిని ఈ రాత్రి కాస్త కనిపెట్టి వుండు. అవసరమయితే నన్ను లేపు!" వాత్సల్యం వుట్టిపడుతున్నట్లు అన్నాడు ప్రభాకర్. కమల లేచి తన గదిలోకి వచ్చింది. తలుపులు మూయలేదు. తెరిచే వుంచింది. ప్రమాదం దాటిపోయింది. కింద ఒక చాప పరచుకొని పడుకుంది. చాతి నిండా కట్లతో డాక్టర్ ఇచ్చిన మత్తు ఇంజక్షన్ కారణంగా మైకంలో వుండి కూడా సన్నగా మూలుగుతున్నాడు. మనసుకు కూడా అతీతమైన శరీర బాధ అది!
యతి? ఎలాంటివాడు? ఎలా అయిపోయాడు? ఎక్కడున్నా నవ్వులు జల్లులు కురిపిస్తూ వాతావరణమంతా విద్యుదయస్కాంత శక్తితో నింపేసేవాడు. అలాంటి వాడిని ఇలా చూడవలసి వస్తుందని ఊహించిందా ఏనాడైనా? ఇదంతా దేశం కోసమేనా? ఈ రామదండు, వెంకటయ్య వీళ్ళ వల్ల నిజంగా దేశానికి మేలు జరుగుతుందా ? ఈ బలిదానానికి ఫలితం వుంటుందా?
"దూరపు బంధువు . కొన్నాళ్ళు మా ఇంట్లో వుండి చదువుకొనేవాడు...." అంతే చెప్పింది మావగారితో. అంతేనా? యతి తనకు దూరపు బంధువు మాత్రమేనా? అన్ని బందుత్వాలకు అతీతమైన అనుబంధం మాట ఏమిటి? అది ఈనాడు నశించి పోయినట్లేనా? అలా నశించి పోవటమే నిజమయితే ఈనాడు తన మనసు ఎందుకింతగా క్షోభిస్తుంది?
3
పల్లె, పట్నం కాని టౌన్ అది! చాలారోజుల వరకూ ఆ టౌన్ లో కాలేజియే లేదు. హైస్కూలు వరకే ఉండేది. కొందరు పెద్దల సత్సం కల్పంతో ఇటివలే ఒక కాలేజీ నడుస్తోంది. అదో కో ఎడ్యుకేషన్ కాలేజి.
రాధాకృష్ణ, జార్జి, మధుసూదనరావు, బాబురావు వీళ్ళంతా మేనేజింగ్ బాడీ మెంబర్స్. జగపతి రెడ్డి దానికి చైర్మన్. వీళ్ళంతా వి.ఐ.పి. లే!
ఏ ఒక్కరూ ప్రత్యక్షంగా పదవులలో లేరు. కానీ, పదవులన్నీ వాళ్ళ గుప్పిట్లోనే వున్నాయి. గవర్నమెంట్ సహాయం పొందుతూ కూడా , రూల్సన్నీ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటూ వుంటారు.
"చెలీ! కర్తవ్య దీక్షా బద్దుడను. నిన్ను పరిత్యజించక తప్పదు" అని తన పోర్షన్ కంఠతా పెట్టేస్తున్నాడు యతి. హావ భావాలు సాధ్యమైనంతగా ప్రదర్శిస్తూ.....
యతి పూర్తీ పేరు యతీంద్ర. అతడి తల్లి దండ్రులకి అతడొక్కడే సంతానం. ఇద్దరు ముగ్గురు పిల్లలు పోయాక ఇతడు పుట్టాడు. ఇతడు బ్రతికి బాగుపడాలంటే "సన్యాసి" అని పేరు పెట్టమని సలహా యిచ్చారు కొందరు పెద్దలు. అదునికుడయిన అ తండ్రి పెద్దల మాట కాదనలేక , మరీ సన్యాసి, పేరు పెట్టలేక , కొంత మధనపడి, చివరకు సన్యాసి పేరును నాగరికం చేసి "యతీంద్ర" అని పెట్టాడు.
"అందరూ 'యతి' అంటారు. ఆ టౌన్ చుట్టుపక్కల పల్లెటూర్లలోని విద్యార్ధులందరూ ఆ కాలేజీలోనే చదువుకుంటారు. యతి కూడా దూరపు బందువయిన వేదాంతయ్య గారింట్లో ఉండి చదువుకుంటున్నాడు. వేదంతయ్య గారి భార్య రాజ్యలక్ష్మి సౌమ్యురాలు కావటం వల్లా, వాళ్ళ అమ్మాయి మయూర కూడా అదే కాలేజిలో చదువు తుండటం వల్లా, యతికి, తన ఇంటి కంటే ఈ ఇల్లే బాగుంది.
"ఏయ్ హీరో! చదువులక్కర్లేదా? నాటకలేస్తూ కూచుంటవా? లేక "కర్తవ్య దీక్షాబద్ధుడవై , కాలేజీని కూడా పరిత్యజిస్తావా?" తన పోర్షన్ రిహార్సల్ చేసుకుంటున్న యతిని అనుకరిస్తూ , వెక్కిరిస్తూ అంది మయూర.
"పోవోయ్! వెధవ కాలేజీ! రాజగోపాల్ గారు వెళ్ళిపోయాక, ఇంకా కాలేజీలో ఏముంది? చెత్త ---చేత్తన్నర చెత్త!..."
మయూర వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. ఆమెకూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నిజంగా రాజ గోపాల్ గారు యెంత మంచి లెక్చర్! ఫిజిక్స్ అయన భోదిస్తుంటే, ఎంత మొద్దు బుర్రలకైనా అర్ధమయి పోతుంది. పిల్లలతో ఎంత కలిసి మెలిసి వుంటారు? క్లాస్ రూమ్ లో వున్నంతసేపు పరమ గంభీరంగా ఉపన్యాసమిస్తారు. ఒక్క విద్యార్ధికయినా, మాట్లాడటానికి కానీ, అల్లరి చేయటానికి కాని, అవకాశం ఇయ్యడు. ఎవరైనా అల్లరి చెయ్యబోతే పాఠం చెబుతూనే కోపంగా ఒక్క చూపు చూస్తారు. ఆ చూపులో తీక్షణత ఎటువంటిదో కాని, ఎంత అల్లరి పిల్లవాడైనా టక్కున నోరు మూసేస్తాడు. క్లాసు రూమ్ దాటి బయటకు రాగానే అయన లెక్చరర్ కాడు. పిల్లలకు స్నేహితుడు. పిల్లలతో సరదాగా కబుర్లు చెపుతాడు. నవ్వుతూ నవ్వుతూనే దురలవాట్లు వున్న వాళ్ళని మందలిస్తాడు. ఏయే పుస్తకాలు చదవాలో చెపుతాడు ఏవైనా సందేహ లుంటే ఫ్రీగా చర్చిస్తాడు. చేరిన ఒక్క సంవత్సరం లోగానే అతడు మొగపిల్లలకూ , ఆడపిల్లలకు , అన్ని క్లాసుల వారికీ అందరికీ అప్టుడయి పోయాడు. అలాంటి లెక్చరర్ ని ఆ సంవత్సరం చివరలోనే తొలిగించి వేశారంటే , కంట తడి పెట్టని విద్యార్ధి లేడు.
రాజగోపాల్ గారిని ఎందుకు తీసేస్తున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. ఆయననే అడిగారు అయన నవ్వి "నాకేం తెలుసూ, నిజాయితిగా వుండడమే ఈ లోకంలో పెద్ద నేరమేమో!" అన్నారు అయన. నవ్వుతూనే వున్నారు. విద్యార్ధులకు మాత్రం కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. ఆయనే అందరిని భుజం తట్టి ఓదార్చారు.
విద్యార్ధినీ విద్యార్ధులంతా రైలు స్టేషన్ కి వెళ్ళి వీడ్కోలు చెప్పారు. అందరి మనసులలోను అది అన్యాయమనిపించింది. కానీ , వాళ్ళంతా ఇంటర్ విద్యార్ధులు. ఒక్కరికయినా నిండా ఇరవై ఏళ్ళు లేవు - పాపం! ఎవరి నడగగలరు? ఏమని అడగగలరు?
రాజగోపాలరావు గారు వెళ్ళిపోయాక ముద్దుకృష్ణ అనే అయన లెక్చరర్ గా వచ్చాడు. విద్యార్ధులు త్వరలోనే అతనికి "మొద్దు కృష్ణ " అని నామకరణం చేసారు. క్లాస్ లోకి వచ్చి స్టేజి మీద నిలబడగానే అయన కాళ్ళు వణుకుతాయి . గొంతు పోదారిపోతుంది. పాఠం ప్రారంభిస్తాడు. కంఠతా పట్టినట్లు గబగబ అప్పగిస్తాడు, స్టూడెంట్స్ నానా గోల చేస్తారు. ఈలలూ, పిల్లికూతలూ , దరువులూ వగైరాలతో ఆ విద్యార్ధులను అదుపులో పెట్టగలిగే సామర్ధ్యం అతనికి లేదు. వాళ్ళ గోల వాళ్ళది. ఈయన పాఠం ఈయనది . దీనితో సిన్సియర్ గా పాఠం వినాలనుకొనే కొద్దిమంది కూడా వినలేకపోతున్నారు.