Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 5

 

    అదిరిపడింది మయూర.
    "సుజాత ----సుజాత ----చచ్చిపోయిందా? నిన్నటివరకూ బాగానే వుందిగా? నిన్న పొద్దున్న కూడా చూశాను. గుళ్ళో మంగళహారతి కూడా పాడింది.
    "ఏం జబ్బో మరి? రాత్రి వాంతులు అయ్యాయట? అంతలో ఏం ముంచుకొచ్చిందో ! సరే! నువ్వురా! నేను పోతున్నాను!"
    రాజ్యలక్ష్మి హడావుడి పడుతూ వెళ్ళిపోయింది. స్థానువై నిలిచిపోయింది మయూర.
    ఆ క్రిందటి రోజే వింది మధురమయిన సుజాత కంఠం అప్పుడే ఏదో విషాదం పలికింది ఆ కంఠంలో. కానీ, దైన్యం సుజాత వ్యక్తిత్వంలో ఒక భాగమయిపోబట్టి , ఆ విషాదాన్ని ప్రత్యేకంగా గమనించలేదు. ఇప్పుడాలోచిస్తుంటే, దీనంగా భగవంతుడికి ఏదో విన్నవించుకొంటున్నట్లుగా వుంది కంఠం సుజాతకు నిన్ననే తెలుసా? తన జీవితం ఇలా ముగిసిపోతుందని ఎలాగో ముఖం కడుక్కుని చీర మార్చుకుని తనూ ఎదురింటికి వెళ్ళింది. సుజాత తల్లి గుండె బాదుకుని ఏడుస్తోంది. సుజాత కూతురు మూడేళ్ళది "అమ్మా! అమ్మా! అని శవం మీద పడిపోతుంది. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది సుజాత ముఖం మాత్రం బాగా పాలిపోయినట్లు ఉంది. ఏమయింది సుజాతకి?
    మహా మహా సిటిల్లోనే అమ్మలక్కలకి కొదువ లేదు. చదువుకున్న వాళ్ళలోనే వున్నారు. కావలసినంత మంది అమ్మలక్కలు. అలాంటప్పుడు టౌన్స్ లో అలాంటి వాళ్ళకి తక్కువేమిటి? శవం అక్కడుండగానే , తల్లి గుండె బాదుకుని ఏడుస్తుండగానే అమ్మలక్కలు బయట గుసగుసలు  ప్రారంభించారు.
    "రెండు నెలలు కడుపట! కడుపు తీయించపోతే ప్రాణమే పోయిందిట!"
    "అయినా దీనికిదెం పోయే కాలం?"
    "ఆ! వెనకట రోజులు కావులే! వెధవ ముండలకి కూడా పెళ్ళిళ్ళయి పోతున్నాయి!"
    "ఆ! అవుతున్నాయి! కన్నేపిల్లలకే పెళ్ళిళ్ళు కావటం గగనంగా ఉంది. ఒక కూతురున్న వెధవ ముండని ఎవడు పెళ్ళాడతాడు?"
    "ఏం ప్రారబ్ధమో ! బంగారం లాంటి పిల్ల."
    "చాల్లేదు ? బంగారం లాంటిదయితే ఈ అవస్థ ఎందుకొస్తుంది?"
    ఈ గుస గుసలన్నీ ఇంచుమించు అక్కడున్న అందరి చేవుల్లోనూ పడుతున్నాయి. చూడటానికి వస్తున్న వాళ్ళలో సానుభూతి కంటే కుతూహలమే ఎక్కువవుతోంది.
    "ఎప్పుడు పోయింది? ఎలా పోయింది? డాక్టర్ కి చూపించారా? ఇంత అకస్మాత్తుగా ఎలా ముంచుకొచ్చింది?" ఇలాటి ప్రశ్నలను ఎదుర్కోవలసి వస్తోంది ఆ కుటుంబం. తల్లికి కూతురు పోయిన దుఖంతో పాటు ఈ పరిస్థితి దుర్భరంగా వుంది. అందరి మీదా,  చివరకు తనమీద తనకు కూడా పట్టరాని కోపం పొంగుతోంది ఆ తల్లి మనసులో. ఎంత కోపం వచ్చినా, మరింత కుమిలి కుమిలి ఏడవడం తప్ప చేయగలిగిందే ముంది.
    అప్పటికి మయూర వయస్సు పదిహేనేళ్ళు. పరిస్థితి లీలగా అర్ధమయింది. హడలిపోయింది. బెంబేలుగా అందరినీ చూసింది. కళ్ళు ముసుకు పడుకున్నట్లున్న సుజాత శవం చూడగానే, అంతక్రితం రోజు విన్న సుజాత పాట గుర్తొచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది.
    "హయ్యో! హయ్యో! " అని రాజ్యలక్ష్మి గుండెలు బాదుకుంటూ మరో ఇద్దరి సాయంతో మయూరను తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టింది. వేదాంతయ్య డాక్టర్ కోసం పరుగెత్తాడు.
    మయూర కళ్ళు తెరిచేసరికి తనమీడకి కొంచెం వంగి ఆదుర్దాగా చూస్తున్న యతి కనిపించాడు. "యతీ! సుజాత-" అని ఏదో అనబోతుండగా డాక్టర్ "హుష్" అని వారించాడు. "ఆ విషయం మరిచిపో తల్లీ" అంది రాజ్యలక్ష్మి ఏడుపు గొంతుకతో. యతి అభిమానంగా లాలనగా , చేతిని నొక్కాడు.
    మయూర కోలుకోటానికి వారం రోజులు పట్టింది. ఈ వారం రోజులలోనూ యతి ఎందుకో ముభావంగా ఉన్నటుగా అనిపించింది భయం వేసింది.
    "యతీ! నా మీద కోపం వచ్చిందా?" అంది.
    "నీ మీద కాదు. మనచుట్టూ ఉన్న అందరి మీద మంటగా ఉంది, వెళ్ళందరినీ చూస్తూ ఏం చెయ్యలేని నామీద  నాకు అంతకంటే మంటగా వుంది ."
    "యతీ!"
    "మయూరా! నువ్వింకా అర్ధం చేసుకోవటం లేదు. మనం వుంటున్న సమాజం ఎంత నికృష్టంగా వుందో అర్ధం చేసుకోగలిగితే , మనం సిగ్గుతో చచ్చిపోవాలి. సుజాత చచ్చిపోలేదు. హత్య చేసారు. కన్న తల్లిదండ్రులే అతి ప్రేమగా హత్య చేసారు!"
    "అలా మాట్లాడకు యతీ!
    "నిజాలు వినటానికి, తెలుసుకోవటానికీ భయపడకూడదు మయూరా? పూర్తిగా విను , పాపం! సుజాత రెండు నెలల గర్భవతి - కడుపు పోవటానికి ఏదో నాటు మందు తినిపించింది తల్లి. అమాయకురాలైన సుజాత నిండు జీవితం నిలువునా ఆహుతయిపోయింది. పరువు మిగిలింది! తల్లిని పోగొట్టుకుని "అమ్మా! అని అడలిపోతున్న ఆ పసి కూన మిగిలింది!"
    కానీ ......కానీ....ఈ పరిస్థితుల్లో ఆ తల్లి మాత్రం అంతకంటే ఏం చెయ్యగలదు యతీ?"
    "మయురా! నువ్వు ఆడదానివి----చదువుకున్న దానివి ........నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా?
    యతి చూపులకు నిలువునా వణికి తలెత్తలేకపోయింది మయూర.
    సుజాత గర్భవతి అయితేనేం? బిడ్డను ప్రసవిస్తే నేం? తన బిడ్డను తనే పోషించుకుంటుంది. అందుకు బలవంతాన ప్రాణాలు తీయాలా/ ఇష్టమైతే ఎవరినో పెళ్ళి చేసుకుంటుంది. లేకపోతె లేదు."
    "యతీ! నీ మాటలు వినటానికి బాగున్నాయి కాని మన సమాజంలో అది సాధ్యం కాదు."
    "ఎందుకు కాదూ? మనం దద్దమ్మలం కనుక. "కళ్ళున్న గుడ్డివాళ్ళం కనుక" చెవులు మూస్సుకున్న చవటలు కనుక! మనసు పనిచెయ్యని మర బొమ్మలం కనుక! మనం గట్టిగా తలచుకుంటే ఈ సమాజం ఎందుకు మారదు?"
    యతి ఉద్రేకం చూసి హడలిపోయి బెదురుగా చూసింది మయూర!
    "ఎక్కడో చదివినట్లు - పిరికివాడై ప్రతిక్షణం చచ్చేకంటే, సాహసంతో ఒక్కసారి చావటం మేలు! ఛ! ఛ" చరచర వెళ్ళిపోయాడు యతి.
    అతడిని అపుచేయాలనీ ఏమేమో చెప్పాలనీ , ఎంతగానో అనిపించింది మయూరకు.
    కానీ ఆ పసి మనసుకి ఆ సమయంలో తను చెప్పాలనుకున్న దానికి బాష దొరకలేదు. యతి తనకంటే ఏంతో ముందుకు పోతున్నట్టూ అనిపించింది. ఏం చెయ్యాలో తోచని అయోమయ స్థితిలో బిత్తరపోయి నిలబడి పోయింది.

                                                         5
    
    మయూర, యతి ఇద్దరూ ఇంటర్ పాసయ్యారు. ఆ సంవత్సరమే ఆ కాలేజిలో బి.ఏ. కూడా ప్రారంభించారు. రాజ్యలక్ష్మిలో ఇంకా పాతకాలపు సంప్రదాయాపు వాసనలు పూర్తిగా నశించలేదు. మయూరకు వెంటనే పెళ్ళి చేసెయ్యాలని ఆవిడ కోరిక. వెంటనే యతితోనూ, తల్లిదండ్రులతోనూ సంప్రదించమని భర్తను ఊదర కొట్టింది. వేదాంతయ్యకు కూతుర్ని ఇంకా చదివించాలనే ఉంది. కానీ భార్య నోటికి భయపడి ముందు యతిని కదిలించి చూసాడు.
    "నాకు పెళ్ళా?" అన్నాడు నిర్ఘంతపోయినట్లు యతి. ఆ తర్వాత అదేదో పెద్ద హస్యమయినట్లు నవ్వేశాడు.
    "చదువు పూర్తయి తన కాళ్ళ మీద తను నిలబడకుండా పెళ్ళి చేసుకొనే వెర్రి వాళ్ళేవారుంటారు మావయ్యా?" అన్నాడు. సంగతి తెల్చేస్తూ. వేదాంతయ్య తగ్గిపోయినా, రాజ్యలక్ష్మి ఊరుకోలేదు. "అయితే! అమ్మాయికి మరో సంబంధం చూసుకోమంటాడేమో, అడగండి " అంది బెదిరిస్తున్నట్లు.
    "మీ ఇష్టం" అన్నాడు యతి. అతి మాములుగా.
    "ఆ! అని నోరు తెరిచేసింది రాజ్యలక్ష్మి. తర్వాత కూతురితో "యతి నీకు వేరే సంబంధం చూసుకోమన్నాడు, మీ నాన్నాగారిని ఈరోజు నుంచే మంచి మంచి సంబంధాలు చూడమంటాను. వేడిని తలదన్నే సంబంధం వస్తుంది" అంది. మయూర తల్లిని చూస్తూ "నేనంతా విన్నాను. యతి ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోనన్నాడు. అంతే! నేనూ చేసుకోను. చదువుకుంటాను" అంది. దిమ్మెర పోయింది రాజ్యలక్ష్మి. తన కూతురు - తను పసిపిల్ల అనుకొంటున్నా మయూర- తన ఎదుట నిలబడి ఇంత సూటిగా తన పెళ్ళి విషయం మాట్లాడుతుందని అనుకోలేదు. అంతటితో ఆవిడ మరో బేరానికి దిగింది. "మయూరను కూడా చదివిస్తాం! చదువు అయ్యాక అయినా,  మయూరనే ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటానని మాటియ్య మనండి" అని దీనికీ యతి లొంగలేదు. "ఎప్పటి సంగతో ఇప్పుడెలా మాటియ్యగలను ? అప్పటి సంగతి అప్పుడు నిర్ణయించుకోవలసిందే!" అన్నాడు.
    "చూసావా! వీడిలా మాట్లాడుతున్నాడు? ఇట్లాంటి వాడిని నమ్ముకుంటానంటావు లక్షణంగా నా మాట విని ....." తల్లి మాట్లాడుతుండగానే అక్కడి నుంచి లేచి పోయింది మయూర. కానీ, యతి అలా మాట్లాడటం మయూరకూ కష్టంగానే ఉంది. ఇప్పుడు పెళ్ళి చేసుకోమంటే , చదువు పూర్తీ కాకుండా పెళ్ళి చేసుకోననటం బాగానే ఉంది. కానీ జీవితంలో స్థిరపడ్డాకయినా, తననే చేసుకుంటానని వాగ్దానం చేయక పోవటంలో అర్ధం ఏమిటి? కొంపదీసి అతని మనసులో వేరు వేరు ఉద్దేశాలేమైనా ఉన్నాయా? మయూరలో రోషమూ, దుఖమూ కలిగాయి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని చదువుకుంటున్న యతి దగ్గరకు వచ్చింది. అదేం పుస్తకమూ అని రహస్యంగా  చూసింది. "పాలక వర్గాలలో అవినీతి" "ఇదేమిటి? ఈ పుస్తకం ఎందుకు చదువుతున్నావు నువ్వు ఆ ప్రయత్నంగా అనేసింది. యతి పుస్తకం మూసి వెనక్కు తిరిగి, మయూరను  చెయ్యి పట్టుకొని ముందుకు లాగాడు. మయూర కోపంగా చెయ్యి విదిలించుకుంటూ "నన్ను వదులు" అంది.
    "ఎందుకంత కోపం?" చెయ్యి వదలకుండానే , నవ్వుతూ అడిగాడు యతి.

 Previous Page Next Page