Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 1

                                 

 

                                                 నిశ్శబ్దసంగీతం

                                                                                         సి. ఆనందరామం

 

                 

 

    ఎదుటి వ్యక్తుల మంచితనం మనసు ఇబ్బంది పెట్టినంతగా ఎదుటి వ్యక్తుల దుర్మార్గం బాధించదు. ఎవరి విషయంలో ఎలా వున్నా మాధవను మాత్రం మొదటి నుండీ ఎదుటి వ్యక్తుల మంచితనమే కట్టి కుదుపేది. చిన్నతనంలో ఒకసారి ఒక దుడుకు కుర్రాడు మాధవను లెంపకాయ కొట్టాడు వెక్కిరించినందుకు. వెంటనే మాధవ తిరగబడి వాడిని చితకబాదాడు. మరోసారి తోటమాలి కొడుకు మంచి రంగు పెన్సిల్ తెచ్చుకున్నాడు. అది మాధవకి నచ్చింది. వాడి చేతిలోంచి లాక్కున్నాడు. మాలికొడుకు ఏడవలేదు. అరవలేదు. కనీసం 'నా పెన్సిల్ నాకియ్య' మని అడగలేదు. బిత్తరపోయి దీనంగా ఒక్కసారి మాధవ వంక చూసి తలదించుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా మాధవకు నిద్ర పట్టలేదు. మరునాడు వాడి పెన్సిల్ వాడికిచ్చి "సారీరా! నీ పెన్సిల్ లాక్కున్నాను" అని సిగ్గుపడుతూ చెప్పేవరకూ అతని మనసు స్థిమితపడలేదు. ఆ తరువాత వాడికి తన డబ్బులు పెట్టి ఒక రబ్బరూ, కారు బొమ్మా కొనిచ్చాక కానీ తనను తాను క్షమించుకోలేకపోయాడు.
    పైన సీలింగ్ ఫేన్ తిరుగుతున్నా కిటికీలలోంచి ధారాళంగా గాలి వీస్తున్నా మాధవ ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నిజానికి కాత్యాయని అడిగిన ప్రశ్నలో అంతగా గాభరా పడవలసిందేమీ లేదు. అతి సాధారణమైన ప్రశ్న "నువ్వేవ్వారినైనా ప్రేమిస్తున్నావా?" సమాధానం మాధవ దగ్గర సిద్దంగా ఉంది -" "నేను సరళను ప్రేమిస్తున్నాను." అని.
    కాని -
    తన సమాధానం వినగానే కాత్యాయని మండిపడితే - యెంత మాత్రం ఈ పెళ్ళి చేసుకోవడానికి వీల్లేదని ఖండిస్తే - 'చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసినందుకు ఇదా నీ కృతజ్ఞత ' అని చెప్పుతే - కనీసం కనుబొమలు ముడేసుకుని ముఖం తిప్పుకుంటే , మాధవ సునాయాసంగా ఆ సమాధానం చెప్పగలిగేవాడు. కాని  కాత్యాయని ఇవేమీ చెయ్యదు. తమ కులం కాని పిల్లను మాధవ ప్రేమించాడని తెలియగానే ఒక్కసారి ఆశ్చర్యంగా చూస్తుంది. తరువాత "నీ యిష్టం" అంటుంది. అంటే ఆవిడ మనసులో బాధ లేదని కాదు. ఎంత బాధైనా తనలో తానే భరిస్తుంది.
    అందుకే మాధవ చెప్పలేకపోయాడు. ఆ సమాధానం అదీగాక సరళ తనూ పెళ్ళి చేసుకోబోవటం లేదు. సరళ బి.యస్. సి పూర్తయ్యాక అంటే యింకో రెండేళ్ళు పోయాక ఆలోచించవలసిన సంగతి - అలాంటప్పుడు ఇప్పటి నుంచే కాత్యాయనీ మనసు నొప్పించవలసిన అవసరమేముంది?
    "అంత దీర్ఘంగా ఆలోచించవలసినదే ముంది ఇందులో ?' మాధవ వంక చూస్తూ నవ్వింది కాత్యాయనీ. మళ్ళీ అంది.
    "ప్రేమించినవాళ్ళకు తప్ప మిగిలిన వారికి పెళ్ళి చూపులకు కూడా రాననే అధికారం లేదు. ప్రేమిస్తే చెప్పు - ప్రేమించకపొతే పిల్లను చూసుకుందాం రా !"
    మాధవ కొంతసేపు అలోచించి అన్నాడు - "ఒక్క రెండేళ్ళ వరకూ నా పెళ్ళి ప్రయత్నాలు తలపెట్టకు అత్తయ్యా! రెండేళ్ళు పోయాక కాని పెళ్ళి చేసుకోవాలని లేదు నా కసలు...."
    "ఈ ప్రయత్నం నేను తల పెట్టింది కాదు. నిన్న సరోజినీ వచ్చింది. తను చెప్పింది ఈ సంబంధం గురించి. చాలా మంచి పిల్లని చెప్పింది. అన్నా వదినలు కట్నం ఇచ్చుకోలేక ఎవడికో ఒకడికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు ఒప్పుకుంటే నీకు చేసుకుంటే మంచిదని చెప్పింది. సహనం గల పిల్లని సరోజినీ చెప్పిన దగ్గర్నుంచీ నాకా అమ్మాయి మీద అభిమానంగా వుంది. నిన్ను చేసుకోమని బలవంతపెట్టడం లేదుగా! వచ్చి చూడు. నచ్చితేనే చేసుకో"
    మాధవ మాట్లాడకుండా కూర్చున్నాడు.
    ఇలాంటి సందర్భంలో తనెలా ప్రవర్తిస్తే బాగుంటుందో అతని ఉహాకందటంలేదు.
    "ఏమంటావ్? రెండేళ్ళ వరకూ ఆ అమ్మాయిని ఉంచరుగా! అసలు రెండేళ్ళ వరకూ నువ్వెందుకు ఆగమంటున్నావో అర్ధం కావటం లేదు. చదువు పూర్తయింది. ఉద్యోగంలో స్థిరపడ్డావ్. ఇంక ఆగటం దేనికి? అంతగా అయితే పెళ్ళి చేసుకుని రెండేళ్ళ వరకూ ఆ అమ్మాయిని నా దగ్గిరే ఉంచు. రెండేళ్ళయిన తరువాతే కాపురం పెట్టుకుందువు గాని...."
    "పోనీ ఉంచకపోతే .....ఆ అమ్మాయే కావాలని ఏముందీ?"
    కాత్యాయనీ నిట్టూర్చింది....."నీకు అర్ధం కావాటం లేదు నేను చెపుతున్నది నిజమే! మనకు ఆ అమ్మాయి కంటే అన్ని విధాల మంచి సంబంధమే రావచ్చు. కానీ, ఆ అమ్మాయే నీకు నచ్చితే , ఒక అమాయకురాలిని చిక్కు ల్లోంచి రక్షించినవాళ్ళమవుతాం గదా!"
    ఇప్పుడర్ధమైంది మాధవకు. కాత్యాయనీని ఆకర్షించింది ఆ అమ్మాయి స్పౌందర్యము కాదు. గుణమూ కాదు. ఆమెను ఆవరించుకుని ఉన్న కష్టాలు - ఆ కష్టాల్లోంచి ఒక అమాయకురాలికి విముక్తి కలిగించాలనే తపన.


                                               *    *    *

    కష్టాల్లో ఉన్న ఏవరిని చూసినా కాత్యాయని హృదయం  అలానే తల్లడిల్లిపోతుంది..... ఆరోజు తనకు బాగా గుర్తుంది.
    "అత్తయ్యోచ్చింది.....అత్తయ్యోచ్చింది....." అంటూ వీధిలోకి పరుగెత్తారు రాము, రాధా, గోపీ అందరూ. ఇంట్లో అందరి తలంట్ల కోసం కుంకుడు కాయలు కొడుతున్న తను పరుగెట్టలేకపోయాడు. కాని గుండ్రాయి చేతిలో పట్టుకుని ఒక్కసారి వీధిలోకి చూశాడు. తెల్లని బట్టల్లో అతి సాధారణంగా ఉన్న ఒకావిడ పిల్లల చేతులు పట్టుకుని లోపలకు వస్తోంది. ఆవిడను . ఆవిడ మెత్తని చిరునవును చూస్తోంటే -- ప్రసన్నమైన ఆవిడ చూపులు  చూస్తోంటే ఎంతసేపైనా అలా చూస్తూ కూర్చోవాలని పించింది మాధవకు.
    "ఏమిటలా చోద్యం చూస్తావు? కొట్టు కుంకుడుకాయలు " ఒక్క కసురు కసిరింది పిన్ని. ఉలిక్కిపడ్డ తను ఆవిడ మీంచి చూపులు మరల్చుకుని మళ్ళీ కుంకుడు కాయలు కొట్టడంలో మునిగిపోయాడు.
    "ఎవరా అబ్బాయి?" తనవంక జాలిగా చూస్తూ అడిగింది.
    "తద్దినం - మా అక్కయ్య పోయింది. మా బావ అంతకు ముందే పోయడుగా! ఈ శని నా నెత్తికి చుట్టుకుంది వదినా! ఏం చెయ్యను? ఈ రోజుల్లో కన్నపిల్లల్నే సాకలేక సతమతమవుతుంటే పరాయి పిల్లల్ని కూడా ఎక్కడ పెంచగలం?" విసుక్కుంటూ చెప్పింది పిన్ని. సిగ్గుతో తన తల మరింత కిందకు దిగిపోయింది. ఆవిడ ఇంకేం అడగలేదు. పిల్లలందరకూ చాక్లెట్లు పంచింది. తననూ పిలవబోతుంటే "వాడికేందుకులే వదినా" అంది పిన్ని. మళ్ళీ కల్పించుకుని.
    "పోనిద్దూ వాడూ చిన్నపిల్లాడేగా! ఇలారా బాబూ! నీ పేరేమిటి?" వాత్సల్యంతో తనను పిలుస్తూ అడిగింది ఆవిడ. అమ్మ పోయి పిన్ని దగ్గర చేరిన సంవత్సరం నుండీ అభిమానమంటే ఏమిటో ఎరగని తనకు ఆవిడ చూపిస్తున్న అభిమానానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బిడియంగా వెళ్ళాను.
    చాక్లెట్లు తన చేతిలో పెడుతూ "అదేమిటి ? ఏడుస్తున్నావా ?" అంది ఆవిడ.
    "మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది" కొద్దిపాటి ఆప్యాయత దొరకగానే గడ్డకట్టిన ఆవేదనంతా కరిగి కళ్ళల్లోంచి ప్రవహించింది తనకు. ఆవిడ తనను దగ్గరకు తీసుకొని వాత్సల్యంతో తల నిమిరింది.
    "తప్పమ్మా ! ఏడవకు . మీ అమ్మ ఎక్కడున్నా నిన్ను ఆశీర్వదిస్తుంది."
    "అదేమిటి వదినా! ఆ మురికి వెధవని ఒళ్లోకి తీసుకుంటారు? మీ బట్టలన్నీ పాడైపోతాయి. వెధవా! ఒళ్లోంచి లే! " కోపంగా అరిచింది పిన్ని. ఉలిక్కిపడి ఆవిడ ఒళ్లోంచి లేచి పారిపోయాడు.
    తరువాత తెలిసింది తనకు ఆవిడ బాబాయి గారి అక్కగారని, పేరు కాత్యాయని అని. గోపీ గొప్పపడిపోతూ చెప్పాడు తనతో. "ఆ అత్తయ్య నన్ను పెంచుకుంటుంది. మా అత్తయ్య దగ్గర బోలెడు డబ్బుంది. అదంతా నాకే ఇస్తుంది."
    మాధవ ఆశ్చర్యంగా విన్నాడు. లోలోపలే గోపీ అదృష్టానికి కొంచెం ఈర్ష్య కూడా కలిగింది. తన దురదృష్టాన్ని తలుచుకుని ఒక్క నిట్టుర్పు విడిచాడు. 

Next Page