నేరుగా రిక్షా గోకుల్ చంద్ గారి యింటి ముందు ఆగింది. రిక్షాలోంచి దూకేడు జామూన్. రిక్షా అబ్బాయి చేతిలో రూపాయి పెట్టేసి గబగబా గేటు దాటి, మెట్లెక్కి తన గదికి తీసికెళ్ళాడు రవిని. అతని గదికి బయటనుంచే మెట్లున్నాయి. కొడుకు చదువుకోటానికి, ఫ్రీగా తిరగటానికి యిబ్బంది కలగకూడదని ప్రత్యేకించి ఓ గది యిచ్చాడు సేటుగాడు.
"అదిగో టాయిలెట్ రూం! అందులో దూరి స్నానం చెయ్!"
"ఇప్పుడు స్నానమేమిటిలెద్దూ!" నసిగాడు రవి. నిజానికి ఇద్దరూ ఒక ఈడువాళ్ళే. కాలేజీలో క్లాసులో తేడా వచ్చినా హైస్కూల్లో రవికి అతను క్లాస్ మేట్. టెన్త్ లో ఓసారి, ఇంటర్ లో ఓసారి తప్పి కూర్చోవటంతో దూరమయ్యారు.
"ఇదిగో రవీ! ఇక నసపెట్టకు! వెళ్ళి స్నానంచేసి వచ్చి నా డ్రస్ వేసుకో!" ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు జామూ్.
ఇక విధిలేనట్టు వెళ్ళి తలారా స్నానంచేసి వచ్చాడు. షాంపూతో మెత్తబడిన వెంట్రుకలు ఫానుగాలికి రెపరెపలాడుతూ అల్లిబిల్లిగా చెదురుతున్నాయి.
"ఇదిగో డ్రెస్!"
ఒకే కలర్ లో కుట్టించిన టెర్రికాటన్ పైజమా జుబ్బా.
"నువ్వు ఫ్రిన్స్ ఛార్లెస్ లా వున్నావు!" గొప్పగా చూస్తూ అన్నాడు జామూన్.
"లా కనిపించటం మన కలవాటేగా---నాటకాల్లో నాగేశ్వరరావులా, రామారావులా, గుమ్మడిలా, శోభన్ లా కనిపించి నటించలా!" నవ్వాడు రవి.
"అదిగో! అలా మాటలతో మందిరాన్ని నిర్మిస్తావనే నిన్ను ప్రిన్సిపాల్ గారు మరీ మరీ రమ్మని చెప్పేరు!"
"థాంక్యూ!" అన్నాడు రవి.
"టిఫిన్!" అన్నాడు జామూన్.
బ్రేక్ ఫాస్ట్ చేశారిద్దరూ. పొటాటో కూర, పూరీలు చాలా రుచికరంగా వున్నాయి. కడుపునిండా తిన్నాడు రవి! జామూన్ కొసరి కొసరి వడ్డించాడు. అతడికి రవి కుటుంబస్థితి బాగా తెలుసు.
బోర్నవిటా తాగేరు ఇద్దరూ.
"ఈ హార్లిక్స్, బోర్నవిటా లాటి ఫుడ్ మంచిది కాదట!"
నవ్వేడు జామూన్.
"వెళదామా!"
"ఊఁ" ఇద్దరూ కాలేజీకి వెళ్ళేసరికి ప్రిన్సిపాల్ రాజుగారు చాలా హడావుడిగా వున్నారు. సాయంకాలం జరుగబోయే కార్యక్రమాలకి ముఖ్య అతిధిగా ఆ జిల్లాకి సంబంధించిన కేంద్రమంత్రి పరేణ్యులు వస్తున్నారు.
"కమాన్ రవీ! నువ్వు రావటం నాకు చాలా సంతోషంగా వుంది. ధైర్యంగానూ వుంది! ఇక కల్చరల్ ప్రోగ్రాం విషయమంతా నీకే వదిలేస్తున్నాను. మధ్యాహ్నం నీ లంచ్ యిక్కడే ఈవినింగ్ టీ పార్టీ వుంది. రాత్రికి డిన్నర్ కూడా యిక్కడే!" గబగబా అన్నారాయన.
నవ్వుతూ "థాంక్స్!" చెప్పి తలూపి వెళ్ళాడు రవి.
అన్ని ప్రోగ్రాములా ఐటమ్ వైజ్ ఛాక్ అవుట్ చేశాడు ఏదీ బోర్ కొట్టకుండా కార్యక్రమాన్ని రూపొందించాడు. మధ్యపాటలు పాడవలసిందిగా మ్యూజిక్ ప్రోగ్రాం యిస్తోన్న సుభాషిణిని, రాజ్యలక్ష్మిని అడిగేడు.
రాజ్యలక్ష్మి అతనివైపు ఆరాధనా పూర్వకంగా చూస్తోంది. ఆ అమ్మాయి ఆ సంవత్సరమే కొత్తగా ఆ కాలేజీలో చేరింది. అంతదాకా ఎక్కడో చదువుతూ వున్నదల్లా అక్కడేదో అవాంతరం రావటం వల్ల యిక్కడి స్వంత వూళ్ళోనే చేరిపోయింది.
గబగబ మిషన్ లాగా, కంప్యూటర్ లాగా చెప్పేస్తోన్న అతని తీరుకి ముగ్ధురాలైంది. ప్రోగ్రాం అంతా తయారయ్యాక ఆఖరి రిహార్సల్స్ కోసం అంతా వెళ్ళిపోయారు.
రవి ఒక్కడే నిలబడిపోయాడు.
టైం చూస్తే పన్నెండు!
ఒక్కో ఐటమ్ ముందు పలుకవలసిన పలుకులు రాసుకుంటూ కూర్చున్నాడు రవి! ఆ పని పూర్తయ్యేదాకా అతన్నెవరూ డిస్టర్బ్ చేయలేదు.
దాదాపు మూడుగంటల ప్రాంతంలో వచ్చాడు జామూన్. అలసిపోయినట్టుగా మాగన్నుగా పడుకున్న రవిని చూసి "రవీ! రవీ!" అంటూ మృదువుగా తట్టి పిలిచాడు.
చప్పున లేచాడు రవి.
"ఓహ్ మూడైపోయిందా!" అన్నాడు ఉలికిపడ్డట్టుగా.
"భోజనం చేయలేదా!"
"ఉహూ! ఇప్పుడింకేం భోజనంలే! ఇవి చూడు!" కవితాత్మకంగా తను రాసిన వ్యాఖ్యానాల్ని చూపాడు.
జామూన్ ముఖం విప్పారింది. పున్నమినాటి చంద్రుడికి మల్లే.
"టీ పార్టీ వుంది! పద!"
"ఊహూ! యిప్పుడేం వద్దు. టీ చాలు!" అన్నాడు రవి. జామూన్ ఎంత బలవంతం చేసినా అతను టీ తప్ప మరేం పుచ్చుకోలేదు. భోజనం లేనందుకి కాస్తంత అలసటగా వున్నాటీ తాగ్గానే హుషారు వచ్చింది.
మంత్రిగారు మాటాడుతున్న చోటుకు వెళ్ళారు "మీ కాలేజీ బాడ్మింటన్ టోర్నమెంట్స్ లో గెలిచినందుకు చాలా సంతోషం! నేను చిన్నప్పటి నుంచీ రెండే ఆటలు ఆడేను. బాడ్మింటన్, టోర్నమెంట్స్! ఈ రెండే నా యీ దృఢ శరీరానికి కారణాలు. ఆటలు అందరూ ఆడాలి. దృఢంగా వుండాలి! శరీరం బలంగా వుంటే మనస్సు బలంగా వుంటుంది. మానసిక వికాసం ముఖ్యం. ఇప్పుడు ఈ కాలేజీకి వస్తూ దార్లో చూశాను. ఒక హాల్లో అంజనా ఆడుతోంది ఇంకో హాల్లో నీల్ కరుల్ ఆడుతోంది. మరో దాంట్లో ఇంగ్లీషు రినొవేషన్. ఇక్కడ యింకా రెండు మూడు ధియేటర్లు ఉండొచ్చు. వాటిల్లో ఏం వున్నాయో తెలియదు! అయినా మనం తెలుగువాళ్ళం! మనది తెలుగుదేశం! మన భాష తెలుగు! మరి ఇక్కడేమో ఇంగ్లీషు, హిందీ సినిమాలు ఆడుతున్నాయి. జాతీయ భావం మంచిదే. జాతీయ సమైక్యతకోసం పోరాడాల్సిందే. మనది భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతి."
ప్రవాహంలాగా పోతోంది మంత్రిగారి ఉపన్యాసం.
అందరూ ఏ ధియేటర్ లో ఇంగ్లీషు సినిమావచ్చిందా అని ఆలోచిస్తున్నారు. దార్లో థియేటర్స్ చూసి. ఓ థియేటర్ రినొనేషన్ లో వుంది అని చెప్పిన కమిటీ సభ్యుడు మంత్రిగారి ఇంగ్లీషు పరిజ్ఞానానికి నవ్వుకుంటున్నాడు. టోర్నమెంట్స్ ని ఓ గేమ్ గా చేసిన ఆయన గొప్పదనానికి అందరూ నవ్వుకున్నారు. "ఇలాంటి వాళ్ళా దేశాన్ని ఏలేది?" అనుకున్నాడు రవి.
అతనక్కడి నుంచి కదలి ఆడిటోరియం వైపు వెళ్ళాడు.
మంత్రిగారూ, వందిమాగధులూ, ఆ స్థానికులూ అంతా ప్రసంగించాక సభ ముగిసింది. జనం అంతా మంత్రిగారి వెనువెంట ఆడిటోరియానికి కదలివచ్చాను.
మంత్రిగారు కుర్చీలో ఆసీనులయ్యారు. ఆయన కటూ యిటూ, వెనుక మూడు కుర్చీల్లో ముఖ్యులు కూర్చున్నారు.
ప్రిన్సిపాల్ రాజుగారు స్వాగతం పలికాడు.
తర్వాత కార్యక్రమాలు మొదలు.
రవి ప్రారంభించాడు "సహృదయులరా? రసహృదయులారా! సరస హృదయులారా! మా కళాశాల సాంస్కృతిక ప్రదర్శనలకి విచ్చేసిన ప్రముఖులకు, పుర ప్రముఖులకు, నూపుర ప్రముఖులకు మా కళాంజలులు!
ఇప్పుడు రాధాకృష్ణ నృత్య నాటిక! మీరంతా ఒక్కసారి కళ్ళు మూసుకోండి! లైట్లు ఆరిపోతాయి! మీ ముందు సుందర బృందావనం ప్రత్యక్షమవుతుంది!"
తూచ తప్పక అలాగే జరిగింది.
"అదుగో కృష్ణుడు! నవనీత చోరుడు! బాగవత ధీరుడు."
"ఎవడయ్యా! కుర్రాడు భలేగా దంచేస్తున్నాడు. మన ఎలక్షన్సికి బాగా పనికొస్తాడే!" అన్నాడు మంత్రి ఎమ్మెల్యేతో.
ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ వైపు చూశాడు.
కూల్ డ్రింక్ అందించి "మన కాలేజీ ఓల్డు స్టూడెంటేనండి! బి.ఏ. డబుల్ లిట్. ఈ ఏడే పాసయ్యాడు"
"చాకులా వున్నాడు! సెక్రట్రీ తర్వాత అడ్రసు తీసుకో---"
"మీకాశ్రమ అక్కర్లేదండీ! అవసరమయినపుడు కాకితో కబురు పంపితే వస్తాడు!" అన్నాడు ప్రిన్సిపాల్--
"ఊఁ" తలూపాడు మంత్రిగారు.
రాజ్యలక్ష్మికి అంతా కొత్తగా వుంది. తన ఫ్రెండ్స్ అతన్ని వ్యాఖ్యాతగా గొప్పగా చెబుతోంటే ఆ అమ్మాయి నమ్మలేదు. ఇప్పుడు వింటుంటే అద్భుతంగా వుంది.
దాదాపు కార్యక్రమం మూడు గంటలసేపు సాగింది. మధ్యలో మంత్రిగారు భోజనాలకని వెళ్ళిపోయారు. ఆయన మరోచోట రేపు ఉదయం కార్యక్రమానికి హాజరు కావాలి! ఎన్ని ఊళ్ళు! ఎంత జనం! ఎన్ని ప్రోగ్రాములు! ఎవరినని ఆయన కాదంటాడు. పైగా సన్మానాలాయె.
తొమ్మిది గంటలవేళ రవి దప్పికకోసం నీళ్ళడిగాడు.
డ్రింక్ కోసం వెళ్ళిన విద్యార్ధి మరో అరగంటకి చల్లటి నీళ్ళడగిన రవికి వెచ్చటి నీళ్ళు అందించాడు. అతడి టేస్టంతా చచ్చిపోయింది. రాత్రి పదింటికి కాళ్ళీడ్చుకుంటూ యిల్లు చేరాడు, ఉదయం నించీ తిండిలేమి అతన్ని మరీ నీరసపరిచింది.