Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 2


    ఆ కంపచెట్టుకి దాదాపు రవి వయస్సు వుంటుంది. అతనికి బుద్ధి తెలిసి హైస్కూల్లో పై తరగతులలోకి వచ్చేసరికి అది ఆచ్ఛాదన యిచ్చే ఎంత ఎత్తుకి పెరిగింది.
    ఓరోజు దానిక్రింద శుభ్రంచేసుకుని చింకిచాప వేసుకుని కొద్దిదూరంలో గలగలా పారుతున్న ఏటినీళ్ళని చూస్తూ చదవటం ప్రారంభించాడు రవి!
    ఏదయినా అంతే! తనదంటూ స్వంతం చేసుకునే వరకే చిక్కు! తర్వాత ఎవరూ అడ్డగించలేరు. ఆ స్థలానికి కొంచెం దూరంలో బట్టలుతుక్కునే వాళ్ళు కానీ, కంపకొట్టుకుని వెళ్లేవాళ్ళు కానీ ఆ ఛాయలకి రారు! అది --- ఆ స్థలం రవి బాబుదిగా దాఖలు అయిపోయింది.
    ఇంటిముందు నీడనిచ్చే చెట్లుకానీ, పార్కుకానీ పెంచుకునే అవకాశంలేని రవికి ఆ తుమ్మచెట్టు ఆశ్రయదాత, ప్రాణ స్నేహితురాలూ అయిపోయింది.
    "బాబూ రవీ!"
    మసక మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి.
    అదో ధ్యాసతో వున్న రవికి సుబ్బమ్మగారి పిలుపు వినిపించలేదు.
    "రవీ!" రోడ్డుదాటివచ్చి కేకేసింది ఆమె.
    ఆ పిలుపుకి ఉలిక్కిపడ్డాడు రవి! చప్పున లేచి నుంచున్నాడు. పుస్తకం మూసి గబగబా నడిచాడు ఇంటివైపు. రోడ్డుదాటుతూ వుండగా అటువైపు దూరంగావున్న అరటి తోటనుంచి గెల యింటికి తీసుకపోతున్న జానయ్య కనిపించాడు.
    "బాగుండావా బాబూ! ఇదిగో రెండరటికాయలు రాత్రికి అమ్మని కూరచెయ్యమను!" కాయలందించాడు జానయ్య.
    "తోట బాగుందా? జానయ్యా!" అడిగింది సుబ్బమ్మ.
    "ఏదో తల్లీ! మీదయ సల్లగుంది. గెలలు బాగా దిగినాయ్. కండపట్టినయ్!" అని వెళ్ళిపోయాడు.
    తల్లివెంట ఇంట్లోకి నడిచాడు రవి.
    ఇంటిముందు స్థలంచుట్టూ వెదుళ్ళతో కంచె ఏర్పాటు చేశాడు రవి. ఆ యాభయ్ గజాల్లో పూలమొక్కలు పెంచుకోవాలనీ, ఇంటి ముందు రెండు అశోకాలూ, ఆ చివరా ఈ చివరా రెండు కొబ్బరిచెట్లు పెంచుకోవాలనీ రవికి ఎంతో ఆశ! కానీ ఎన్నో సంవత్సరాలుగావున్న ఆ కోర్కె యింకా తీరనేలేదు. దానికి ఎన్నో కారణాలు!
    "తూర్పున గాలి రేగుతుంది! వాన వస్తుందేమో! అందుకే నిన్ను పిలిచాను!"
    రవి సమాధానంగా ఏమీ అనలేదు.
    ఇంట్లోకి వెళ్ళాడు. హాలులాంటి ఆ పెద్దగదిలో ఓ మూల ఓ నవారమంచం వుంది. దానిపై తండ్రికాలంనాటి పరుపువుంది, దాన్ని దొర్లించి పడుకున్నాడు రవి!
    "పోతే పోయింది! దీని బాబులాటి ఉద్యోగం వస్తుంది నువ్వేం దిగులుపడకురా బాబూ!" అంటూ ఆమె మధ్యగది దాటి వంటింటివైపు వెళ్ళింది.
    నిరాశగా నిట్టూర్చాడు రవి! 'ఇంటర్వ్యూలు తప్పిపోయిన ప్రతిసారీ అమ్మయిలాగే అంటుంది!' అనుకున్నాడు. బరువెక్కిన కళ్ళురెప్పల ఆచ్ఛాదనని కోరేయి.
  
                                                                                 2
    నిన్నటి ఆలోచనాభారం మనస్సుపై చూపిన ప్రభావం వల్ల మరుసటిరోజు కాస్త ఆలస్యంగా లేచాడు రవి. ఆ సరికి సుబ్బమ్మగారు అన్నిపనులూ ముగించుకున్నారు.
    "లేచావా! ముఖం కడుక్కుని రా కాఫీ యిస్తాను!"
    "ఎక్కడిదమ్మా?"
    నవ్విందామె. "మన పెరడులో పొట్ల కాసింది కదా! లెక్చరర్ రమాదేవి భర్త విశ్వబ్రహ్మంగారు అడిగారట! వాళ్ళమ్మాయి శ్రీప్రియ వచ్చి యాభై పైసలిచ్చి రెండు తీసుకెళ్ళింది. మార్కెట్లో ఒక్కొక్కటి రూపాయట ఆ అమ్మాయే చెప్పింది! దాంతో ధనియాల కాఫీ కాచాను. మన ఆవు పాలు యిస్తోందికదా!"
    ముఖం కడుక్కుని వచ్చి కాఫీ తాగాడు.
    "రేపు పంచదార యిస్తారట రేషన్లో!"
    "మన కేజీకి డబ్బుకావద్దూ!" వాళ్ళకి రెండు కేజీలు యిస్తారు ప్రతికోటాకీ. ఒక కేజీ చక్కెర రోడ్డవతలి షావుకారు పిచ్చయ్య తీసుకుంటాడు మూడు రూపాయలు యిస్తాడు లేదా దానికి తగినన్ని అపరాలు యిస్తాడు.
    "ఈసారి రెండు కేజీలూ కావాలన్నాడు! ఆర్రూపాయలిస్తాడట!"
    "ఎందుకివ్వడు? బజార్లో కేజీ పదేసి అమ్ముతోంటే!" అనుకున్నాడు రవి. అతనికి పిచ్చయ్యకి ఆ కేజీ యివ్వటం కూడా యిష్టంలేదు కానీ యివ్వక తప్పదు. ఇవ్వకపోతే కొట్లో అప్పు పుట్టదు.
    సరిగ్గా అప్పుడే వచ్చాడు జామూన్, అతను గోకుల్ చంద్ గారి ఏకైక పుత్రుడు కాలేజీ యూనియన్ సెక్రటరీ. వచ్చే సంవత్సరం ప్రెసిడెంటు అవుతాడు.
    "హలో!"
    "హో నమస్తే!"
    "ఓ చిన్న ఆహ్వానం తీసుకుని వచ్చా!"
    "ఏమిటి!"   
    "ఈ రోజు కల్చరల్ డే! రాత్రికి నాటకాలూ అవీ వున్నాయి. డాన్స్ ప్రోగ్రాం వుంది. మిమిక్రీ వుంది. మ్యూజిక్ వుంది. నిన్ను వ్యాఖ్యాతగా పిలువమని పంపేరు ప్రిన్సిపాల్ రాజుగారు!"
    ఉత్సాహం పొంగివచ్చింది రవిలో! ఒక్కసారిగా గత మూడు సంవత్సరాలూ తను ఎలా కండక్టు చేసిందీ గుర్తుకొచ్చింది. ఛాతీ ఉప్పొంగింది. "థాంక్స్!" అన్నాడు సింపిల్ గా.
    "మరి నువ్వు బయలుదేరితే బావుంటుంది!"
    "ఇప్పుడా?"
    "ఏం? అభ్యంతరమా? ఎనీ ఎంగేజ్ మెంట్!"
    "లేదనుకో... ప్రోగ్రాం ఈవినింగ్ కదా! ఇప్పుడే వెళ్ళి చేసేది ఏముంటుంది?"
    "ఎందుకులేదు. బోలెడంత వుంది! పద! పద!"
    "నేనింకా స్నానమే చేయలేదు!"
    "నువ్వు నా రూంకి వచ్చెయ్! అక్కడే అన్నీను!"
    ఇహ తప్పదనుకున్నాడు రవి.
    తల్లివైపు చూశాడు.
    "వెళ్ళిరా!" అన్నట్టుగా తలూపింది ఆమె.
    మిత్రులిద్దరూ ఇల్లు విడిచారు.
                                *        *        *

 Previous Page Next Page