Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 4

                                      3
   పదిహేను రోజులు గడిచిపోయాయి.
    ఈ మధ్య కాలంలో అతని గేయం ఒకటి ఓ పత్రికలో అచ్చయింది. కాంప్లిమెంటరీ కాపీతో పాటు అడపాదడపా గేయాలు పంపుతూ వుండమని సంపాదక మహాశయులవారు రాయించిన ఉత్తరమూ వచ్చింది.
    ఆ పత్రిక డబ్బివ్వదు! అయితేనేం గేయాలు అచ్చేస్తుంది. రచయితలని ప్రోత్సహిస్తుంది.
    గేయాన్ని మరో మారు అక్షరాల్లో చూసుకుంటున్నాడు రవి.
    "నమస్కారం సార్!"
    చెట్టుక్రింద నుంచి లేవకుండానే తలతిప్పాడు తననెవరా సర్ అంటున్నదని ఆశ్చర్యపోతూ.
    ఎవరో కుర్రాడు. పద్దెనిమిదేళ్ళకి అటూయిటూగా వుంటాయి.
    రవి కనుబొమలు ముడిపడటం చూసి "సర్! నా పేరు రంగ రామానుజం! మాది చిత్తూరు! ఇక్కడికి లాటరీ టిక్కెట్లు అమ్ముకుంటూ వచ్చాను. ఇక్కడో వారం పదిరోజులుంటాను!" అన్నాడు.
    నాతో ఏమిటి పని అన్నట్టుగా చూశాడు రవి.
    "మొన్న కాలేజీ ఫంక్షన్ చూస్తిని! మీ మాటలు వింటిని! శానా పసందుగా ఉన్నాయ్!" కాంప్లిమెంటరీ విసిరేశాడు.
    రవికి తన అవసరమేమిటో తెలిసిరాలేదు.
    "మీరు మాటలు బాగా పేలుస్తారు! నాకు నాలుగు వాక్యాలు రాసిస్తారా! అని చెప్పి టికెట్లు అమ్ముకుంటాను. ఈ రోజుల్లో వ్యాపారం నిండా కష్టమైపోయింది సార్! ఎట్రాక్షన్ లేందే బండి ముందుకు నడవదు! సినిమాలకి జయమాలిని ఊపులు ఎసెట్స్! కవరుబొమ్మలు పత్రికలకి ఎక్షన్స్! మాకు మాటలు అవసరం!"
    అర్ధమైపోయింది రవికి. "లాటరీ గురించి నాలుగు రసగుళికల్లాటి వాక్యాలు కావాలి ఇతనికి. వాటిని ప్రయోగించి, మామూలు మనుషుల మనస్సులను ఆకర్షించి తన వ్యాపారం చేసుకుంటాడు. అదోరకం దోపిడీ! చెప్పి చేసే దొంగతనం? కళ్ళెదురుగా చేసే చోరీ! ఊహే తను అందుకు అంగీకరిస్తాడా?"
    "సారీ! నేను రాసివ్వలేను!"
    "అమ్మమ్మ? మరలా అంటే ఎలా మాస్టారూ! మీతో కాకపోతే యింకెవరితో అవుతుంది. మొన్న ఎంతబాగా చెప్పారు మీరు! రసవాహిని! గాన మోహిని! రాజ్యలక్ష్మి రసరాజ్యలక్ష్మి! సరససంగీత సామ్రాజ్యలక్ష్మీ! శానా బావున్నాయి సార్!"
    "పొగడ్త! తొలి ఉచ్చు! "ఉహూఁ" అనుకున్నాడు రవి. "ఇదిగోనండీ? నాకు అవి యిష్టం! యివి అలవాటు లేదు! పైగా మనషుల్ని తికమకపెట్టే వాక్యాలు నేను రాయను! లాటరీ వ్యసనం!"
    "అమ్మమ్మ! మీలా అంటే ఎలా ఇది నా స్వంతమ! ఈ టికెట్లు చూడండి! ఇది తమిళనాడుది! లక్షలు! ఇది కర్నాటక లక్షలు! మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళే లాటరీ నడుపుతున్నారు. నాదేవుంది. సవాలక్ష లింగాల్లో బోడిలింగాన్ని. లక్షలాది ఏజంట్లలో నేనొకడిని!"
    రవి మాటాళ్ళేదు.
    "మీరు ఊరికే రాయొద్దు! పదివాక్యాలు రాయండి! అయిదు రూపాయలిస్తాను. కావాలంటే ఒక టిక్కెట్టు యిస్తాను తోడుగా"
    "అమ్ముకోమంటావా?"
    "అమ్మమ్మ! ఎంతమాట! మీరు కవిత్వం రాస్తే అచ్చేసుకుని డబ్బివ్వడంలా? సినిమాకి పాటలు కూర్చితే డబ్బు తీసుకోవడంలా? ఇదీ అంతే పారితోషకం!"
    "పారితోషకం!" ఆ మాట రవిని కట్టేసింది.
    "ఇదిగోండి అయిదు రూపాయలు! మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను! సాయంకాలమో! రేపో---" నోటు చాచి అన్నాడు.
    అప్రయత్నంగా అందుకున్నాడు రవి. అతన్ని రంగ రామానుజం మాటలు ప్రభావితం చేశాయి. అతనేం సామాన్యుడా! వేలకొద్దీ మనుష్యుల్ని తన వాగ్ధాటితో మంత్రముగ్ధుల్ని చేసి లాటరీ టిక్కెట్లు తగలగడతాడు. తన పని పూర్తికాగానే వెళ్ళబోయాడు.
    రవి పెన్ అందుకుని పాకెట్ బుక్ తెరిచాడు "గలగలా సెలయేటి సంగీతంలా రూపాయల్లో నడిచివస్తోంది!-- చదివి బావులేదనుకుని కొట్టివేసి ఆలోచించసాగాడు.
    ఎలాగయితేనేం సాయంకాలానికి పది స్లోగన్స్ తయారుచేశాడు రవి. అతనికి అవి అట్టే నచ్చలేదు కానీ రంగరామానుజానికి మాత్రం చాలా బాగా నచ్చాయి.
    "పండుగ దండుగ-లాటరీకే కడితే అదే పండుగ. నిండుగ ధనలక్ష్మి వరించి వస్తుంది" ఇది ఒక స్లోగన్.
    మీరు లక్షాధికారి కావచ్చు? అదృష్టం మిమ్ము వరించి వస్తోంది. అందుకే ఏనాడూ లాటరీ కొనని మీరు ఈనాడు టిక్కెట్టు కొంటున్నారు.
    రేపు మీరు సమితి ప్రెసిడెంటు కావచ్చు, లేదా ఎం.ఎల్.ఏ. కావచ్చు. అదృష్టం కలసివస్తే మంత్రీ కావచ్చు! అంతా కేవలం రూపాయి పెట్టుబడితో!"
    చదువుకునేకొద్దీ రంగరామానుజానికి ఎంత ఆనందంగా వుందో రవీంద్రకి అంత కంపరంగా వుంది.
    ఇవి స్లో-గన్స్. నిజం స్లో-గన్స్! మామూలు మనిషి ఆశకి గురిపెట్టిన తుపాకీలు-ఇవి అతడి పాకెట్ మనీని లూటీ చేయొచ్చు! లేదా టిఫిన్ డబ్బుల్ని ఖాళీ చేయొచ్చు. ఏది ఏమైనా ఇది నిజంగా లూటీయే!
    తల విదిలించుకున్నాడు అతను.
    "ఇదిగో సర్! మళ్ళీ నెలకో రెండు నెల్లకో యిటు తిరిగి వస్తాను. అప్పుడు నాకు మళ్ళీ రాసివ్వండి. మరో మాట, ఈ మాటలు యింకెవరికీ రాసియ్యకండి" నవ్వుతూనే ముందటి కాళ్ళకి బంధం వేశాడు.

 Previous Page Next Page