Previous Page Next Page 
నా కథవింటావా పేజి 3

     "ఏమిటే నీ ఊహలు? ఏ విషయంలో తల్లకిందులయ్యాయి?" అడిగింది.
    "నీ విషయంలోనే మమ్మీ! నువ్వు చెప్పే మాటలకీ ,చేస్తున్న పనులకీ, నలుగురూ నీ గురించి అనుకుంటున్న మాటలకీ పొంతన కుదరక, నా ఊహలన్నీ, తల్లకిందులయ్యాయి."
    "ది....వ్యా....!" పిచ్చిదానిలా  అరిచింది కవిత!
    "ఏమ్మా? వినడానికి కష్టంగా వుందా? నేను ఒక్కసారి ఈ మాటంటేనే, నువ్వు అంత బాధపడిపోతున్నావే! నేను ప్రతిరోజూ, బయట అడ్డమైన వాళ్ళూ  నీ గురించి  కూసే కూతలు వింటూవుంటే, నాకెలా ఉంటుందో ఆలోచించావా? నీలాగా అరవడానికీ, ఏడవడానికీ  కూడా నాకు చోటులేకుండా పోయింది. ఒక్కొక్కసారి వాళ్ళూ  వీళ్ళూ  అనే మాటలు వినలేక, పడలేక చావాలనిపిస్తుంది!" టేబుల్ మీద రెండు మోచేతులూ  పెట్టి, తల ఆనించి వెక్కి వెక్కి ఏడ్చింది.
    స్థాణువులా నుంచుండిపోయింది  కవిత, ఏం చెయ్యాలో తోచక!
    కన్నబిడ్డ పాలు తాగుతూ, రొమ్ము చీల్చినంత బాధపడింది. వెనక నుంచి ఎవరో వీపలో పొడిచినంత  బాధ పడింది. నీరసం ముంచుకొచ్చినట్టయితే, సత్తువంతా  సడలిపోగా, కుర్చీలో కూలబడిపోయింది  కవిత.
    ఇద్దరి మధ్యా నిశ్శబ్దం!
    ఇద్దరిలోనూ  మౌనఘోష!
    ఇద్దరికీ మూగ బాధ!
    ఆ నిశ్శబ్దానికి  గాలి విసురు, ఫ్యాక్టరీ మోతలా వినిపించింది. భరించలేని  నిశ్శబ్దం!
    దుర్భరమైన  ఆవేదన!
    "అమ్మా! చివరిసారిగా  అడుగుతున్నాను. మా నాన్నెవరు? ఎక్కడున్నాడు? మనం ఎందుకిలా  ఒంటరిగా, దిక్కులేని వాళ్ళలాగా  బతుకుతున్నాం? ఈ ప్రశ్నలకి  జవాబు, కనీసం, నాకైనా చెప్పమ్మా! బయట వాళ్ళందరూ, నీ గురించి చెబుతూన్న కధలు, కధలేననీ, నిజాలు కావనీం నిరూపిస్తాను!" దివ్య వెక్కి వెక్కి ఏడుస్తోంది.    
    కవిత జాలిగా చూసింది దివ్యవైపు!
    "ఏమని చెబుతుంది? ఎలా చెబుతుంది?" ఆలోచిస్తూ  కూర్చుంది  కవిత సుడిగుండంలో పడి విలవిలా  కొట్టుకుంటున్న  చేపలాగా!
    "చెప్పవెందుకమ్మా? నేనిప్పుడు  చిన్నదాన్ని  కాను. ఎటువంటి సంఘటననైనా  ఎదుర్కొనే శక్తీ, విని భరించే శక్తీ  నాలో ఉన్నాయి. చెప్పు" అంది.
    కవిత మాట్లాడ లేదు. నేల చూపులు చూస్తూ వుంది.
    ఆమె గుండెల్లో  సముద్రం పొంగినంత   ఆందోళన!
    "అంత నాతోకూడా చెప్పకూడనిదా  అమ్మా  నీ జీవితం? నీ తప్పు ఏమీలేకపోతే, ఆ మౌనం ఎందుకమ్మా? సత్యానికీ, ధర్మానికీ పిరికితనం లేదు. నిజానికి చావు లేదు .నిలకడ మీద తెలుస్తుంది, చెప్పమ్మా...."
    "దివ్యా....!" బతిమాలుతున్న్ట్టట్టుగా  వుంది  ఆమె గొంతు.
    "అమ్మా! నువ్వేమీ చెప్పకపోతే, నీ వెనక ఏదో పెద్ద గ్రంధమే వుందని నమ్మవలసి వస్తుంది. ఎందుకమ్మా ఇంకా  దాచి పెడతావ్? కన్నబిడ్డతో  కూడా పంచుకో లేని  ఆ బాధ ఏమిటో చెప్పు! నీ బాధలో నన్నూ భాగస్థురాలిని చెయ్యి! చెప్పమ్మా! లేకపోతే  నామీద ఒట్టే! అంది ఏడుస్తూనే దివ్య.
    ఆ చిన్ని మన్సులోని ఆవేదన అర్ధం చేసుకుంది  కవిత! ఒక్క నిమిషం  ఆలోచించింది.
    "దివ్యా! ఆడుతూ పాడుతూ  తిరగవలసిన  ఈ వయస్సులో, నా కథ చెప్పి, నీ మనసును పాడు చెయ్యిడం ఇష్టంలేకనే, ఇన్నాళ్ళూ ఎవరేమన్నా మాట్లాడకుండా  ఊరుకున్నాను. నిప్పులాంటి  నిందలని  నా గుండెలో దాచుకున్నాను. ఇప్పుడనవసరంగా  గొడవ చేసుకుని నీ మనసు  పాడుచేసుకుని బంగారంలాంటి  భవిష్యత్తుని  పాడు చేసుకోకు" లేచి వెళ్ళిపోయింది  కవిత!
    "అమ్మా! నా మనస్సు  ఇప్పుడు  పాడవకుండా  వుందనే అనుకుంటున్నావా? ప్రతివాళ్ళు నన్నుచూచి గేలిచేసినప్పుడో, జాలిపడ్డప్పుడో, నా గుండె ముక్కలు ముక్కలయి, నేను పడే బాధ నీకెలా చెప్పను? అమ్మా! మా నాన్నెవరో  చెప్పు? ఒక్కసారి అతనెవరో  ఏమిటో  తెలుసుకోవాలని వుంది. అతను మన నెందుకిలా  నట్టేట్లో  ముంచేసి, గాలికొదిలేసి  వెళ్ళిపోయాడో  తెలుసుకోవాలనివుంది. అతనెవరో  తెలిస్తే, కాళ్ళమీద పడైనా సరే తీసుకొచ్చి, నీ దగ్గర వుంచాలనినుంది! అమ్మా! చెప్పమ్మా అతనెవరో? ఎక్కడున్నాడో? అసలు వున్నాడో? లేడో?"
    "దివ్య!....ఇంకా మాట్లాడకమ్మా! నేను భరించలేను!" మంచంమీద పడిదిండులో తలపెట్టుకుని, పసిపిల్లలా ఏడ్చింది కవిత!
    "అమ్మా! నువ్విలా బాధపడుతూ వుంటే, చూళ్ళేక పోతున్నాను. జనం నీ గురించి నిష్ఠూరంగా మాట్లాడుతూ వుంటే వినలేక పోతున్నాను. అమ్మా చెప్పు! అందరూ అనుకుంటూన్నట్లు, నాన్నెవరో  నీకేతెలీదా?"
    పిడుగు పడ్డట్టయింది  కవితకి!
    కన్నీళ్ళు భయంతో గడ్డకట్టుకున్నట్టు  ఆగిపోయాయి! నరాలు చిట్లిపోయి, ప్రాణాలు పోతూన్నట్టనిపించింది. కవితకి! వొంట్లోని శక్తినంతా  కూడబెట్టుకుని, మాటలు గొంతుదాటి రాకుండా వుంటే, అతి కష్టం మీద చెప్పింది. దివ్యా! నిజంగానే, మీ నాన్నెవరో, నాకు తెలీదమ్మా" అని!
    ఈసారి దివ్య తలమీద పిడుగు పడ్డట్టయింది!
    పళ్ళు పటపటా కొరుకుతూ, తల్లివైపు  అసహ్యంగా చూసింది! ఆ క్షణంలో ఆమె తనకి తల్లికాకపోతే, పీక పిసికి చంపేసుండేదేమో! కానీ ఆ సంబంధమే ఆమె చేతులని బంధించింది!
    ఏహ్యభావంతో చూసి, తల్లి  మంచందగ్గరి నుంచి  జరిగి  వెళ్ళిపోబోయింది.
    "దివ్యా! దివ్యా! చూడమ్మా! నల్లనివన్నీ  నీళ్ళూకావు ,తెల్లనివన్నీ పాలూకావు! నా మాటనమ్ము. నేనేపాపమూ ఎరుగను. భగవంతుడి మీద ఒట్టేసి  చెబుతున్నాను. మీ నాన్నెవరో  నాకు తెలీదు! తెలుస్తే నేనే వెళ్ళి నిన్ను అతనికి అప్పగించి, నా బాధ్యత  తీర్చుకునేదాన్ని!"
    "దయచేసి  ఇంకేమీ చెప్పకమ్మా! ఇంతవరకు  విన్నది చాలు ఇంకా ఎందుకీ నటన? ఎవరిని నమ్మించడానికి?"
    "దివ్యా! ఎవరినీ  నమ్మించవలసిన  అవసరం నాకులేదు. నటనలూ గిటనలూ  నాకు చాతకాదు. అయిన వాళ్ళందరికీ  దూరమై  ఏకాకిగా బ్రతుకుతున్న  నాకు, ఎవరినో నమ్మించవలసిన  అవసరం లేదు."   
    "ఇంకా ఏం చెప్తావమ్మా! నేనొక కులటకి  పుట్టిన బిడ్డని! నా తండ్రెవరో, నా తల్లికే తెలీని స్థితిలో  పుట్టిన అభాగ్యురాలిని!
    సమాజంలో ఎక్కడి కెళ్ళినా  ఈ ముద్ర నాతోనే వస్తుంది."
    "దివ్యా!...."
    "పేరు దివ్యంగా పెట్టావమ్మా! కానీ నా చరిత్ర పరమ హీనమైనది నన్నెందుకు  పెంచావు? పుట్టగానే, గొంతు పిసికి చంపెయ్యకుండా  పెంచి, పెద్దచేసి, నన్నీ చిత్రహింసకి  ఎందుకు గురి చేశావు? నలుగురిలో  తలెత్తుకుని  తిరగలేక, మర్యాదగా బ్రతకలేక, చావలేక బతకలేక, ఛస్తూ  బతికే స్థితిలో ఎందుకు పెంచావు?" పిచ్చిదానిలా తల బాదుకుని  ఏడ్చింది దివ్య.
    కవితకి మతిపోయింది! శరీరం పట్టుతప్పి  తూలిపోతూన్నట్టయింది. మెల్లగా వెళ్ళి, తల గోడకేసి  కొట్టుకుంటూన్న  దివ్య  చెంపమీద  చెళ్ళున కొట్టింది.
    ఉలిక్కిపడి  తలెత్తి  చూసింది దివ్య.
    "అమ్మా! చిన్నప్పుడు  చెయ్యలేని  పని కనీసం ,ఇప్పుడయినా చేసి  పుణ్యం కట్టుకో! నన్నీ చిత్రవధ నుంచి  రక్షించి  శాశ్వతంగా  చంపెయ్యి!" చేతులు జోడించి  అంది దివ్య ప్రార్ధిస్తున్నట్టుగా!
    కవిత చిన్నగా నవ్వింది!
    ఆ నవ్వులో పేలవం!
    ఆ నవ్వులో అదో రకమైన ఆనందం!
    దివ్య చెయ్యి  పట్టుకుని  తీసుకొచ్చి, మంచంమీద  తన   పక్కన  కూర్చోబెట్టుకుంది.
    "దివ్యా! నాకు  ఈ రోజున  నిన్ను చూస్తే  చాలా  గర్వంగా వుందమ్మా! నీతో ఏ విషయాన్నయినా  భరించే శక్తి  కలిగినందుకు, నా కృషి, నిన్ను తీర్చిదిద్దడంలో ఫలించినందుకు, నాకు మహదానందంగా వుంది. కూర్చో! ఈరోజు, అన్ని విషయాలూ  చెప్పేస్తాను!" అంటూ దివ్య తల నిమురుతూ  మంచం మీద తనపక్కన  కూర్చోబెట్టుకుంది.
    దివ్య తల్లికేసి  ఆశ్చర్యంగా చూస్తూ  కూర్చుంది.
    "అది నేను బి.ఏ. ఫైనల్  పరీక్షలు  రాస్తూన్న  రోజులు...."
    .......చెబుతోంది  కవిత!
    దివ్య ప్రతి అక్షరం నోట్ చేసుకుంటూ  వింటోంది....
                                                                               2
    కళ్ళు కుండపోతగా వర్షిస్తున్నాయి. ఏడుపు ముంచుకొస్తూ, గొంతులోంచి  మాట రానీయడంలేదు. తనని తాను నిభాయించుకోవడానికి  ప్రయత్నాలు చేస్తూ _ చెప్పడం మొదలెట్టింది కవిత __
    "అది సికింద్రాబాదు  బేగంపేట  దగ్గర వున్న  ఒక పోష్ లొకాలిటీలో వున్న బంగ్లా! ఇంటిముందు  చిన్న పూలతోట. పోర్టికోలో  పార్క్ చేస్తున్న  ఎర్రటి మారుతీకారు. ఇంట్లోకెళితే, అందంగా వున్న ఇంటికి అనురాగ దీపాలు వెలిగించే ఇల్లాలు సీతాదేవి! ఆమెకి అందాన్ని  చేకూర్చే  చిలకల్లాంటి  చిన్నారులు  క్రాంతీ, కావ్య! ఆ ఇంటి యజమాని శ్రీ ఎ.వి. రామానంద్. బి.టెక్. ఎల్.ఎల్.బి., బి.హెచ్.ఇ.ఎల్. కంపెనీలో ఆఫీసరు!
    ఆ ఇల్లూ, ఇంట్లో వాళ్ళూకూడా చూడముచ్చటగా అన్యోన్య దాంపత్యంతో, ఉన్నదానిలో హాయిగా వుండేవారు .వీరి జంట చూసేవారికి  కన్నులపంటగా వుండేది. 'సీతారాములు' అనేవారు! పేర్లు కూడా అలాగే కలిశాయి!
    ఒకరోజున రామానంద్ ఆఫీసునుంచే  ఫోన్ చేసి చెప్పాడు  సీతాదేవికి, తనింటి కొచ్చేసరికి తయారై వుండమని, సినిమాకెళ్దామని.
    సరేనంది సీతాదేవి, వెంటనే  క్రాంతినీ, కావ్యనీ పిలిచి, ముస్తాబు చేసింది. క్రాంతి ఆరో క్లాసులో వున్నాడు. మన బూజుపట్టిన  వ్యవస్థ మారాలనీ  రాజకీయం అంటే ఏమిటో తెలీకుండానే, తెలుసుకునే అవకాశాన్ని   కలిగించే విద్యాప్రాప్తికి నోచుకోలేని  అజ్ఞానులు ,ఎంతో విలువైన ఓటు వేసి, వాళ్ళ నాయకునిగా ఎవరిని ఎన్నుకుంటున్నారో, ఎటువంటి వారిచేత పాలింపబడుతున్నారో, తెలుసుకోలేని  స్థితి నుంచి మనిషికి చైతన్యం రావాలని కోరుకునేవారు  రామానంద్!        
    డబ్బుతో వ్యక్తుల్ని  కొని, నీతిని అమ్మేసి, జాతిని తాకట్టు పెట్టి అమాయకుల నోళ్ళు కొడుతూ, ఆస్తిని రెట్టింపు చేసుకునే దౌర్జన్యాన్ని  తెలుసుకుని, మనిషి మనిషిగా బ్రతికే రోజుకోసం, ఎదురుచూస్తూ వుండేవారిలో రామానంద్ గారొకరు. ఆ చైతన్యంకోసం, ఆ విప్లవంకోసం  ఎదురుచూస్తూ, తనకి పుట్టిన కొడుకులో ఆ లక్షణాలుండాలని  ఆశిస్తూ. ముద్దుగా 'క్రాంతి' అని పేరు పెట్టారాయన.
    మన కావ్యాలు, ప్రతి మతానికీ, ప్రతి కులానికీ  కూడా, సమానంగా పనికొచ్చేటటువంటి  విజ్ఞాన దీపాలు! మన పంచరత్నాలు  చదివితే, మానవుడి  అజ్ఞానం పటాపంచలై, ఆ చీకటిలోంచి  స్వచ్చమైన వెలుగుని  చూడగలుగుతాడు. మన కావ్యాలు ప్రగతికి దీపాలు! విజ్ఞానానికి  సోపానాలు! అంటూ, సాహిత్యం మీదున్న మమకారంతో 'కావ్య' అని అమ్మాయికి పేరు పెట్టుకున్నారు. కావ్య మూడో తరగతిలో  వుండేది.
    సినిమా టైమయిపోయినా  రామానంద్ ఇంటికి రాలేదు! సీతాదేవి ముస్తాబై, భర్తకోసం ఎదురుచూస్తూ వుంది. ఆయన రాగానే, టిఫినూ, కాఫీ ఇచ్చేస్తే ఆయన అయిదు నిమిషాల్లో  తయారై పోతారు! టిక్కెట్లు ముందుగానే తెప్పించుంటారులే" అనుకుంది, పోర్టికోలోని  కుర్చీలో కూర్చుని భర్తకోసం ఎదురుచూస్తూ.
    ఇంటిముందు  కారాగింది. సీతాదేవి  లేచి  నుంచుంది. క్రాంతీ, కావ్యా, కారు దగ్గరికెళ్ళారు తండ్రొచ్చాడని.
    కానీ_ కారు వెనక డోరు తెరిచి, నలుగురు  మనుషులు  మోసుకొచ్చారు  రామానంద్ గారి శరీరాన్ని!
    ఏం చూస్తోందో అర్ధం కాలేదు సీతాదేవికి!
    వాళ్ళే చెబుతున్నారో బుర్రకెక్కడంలేదు!
    ఆ దృశ్యాన్ని చూస్తూ స్థాణువులా నుంచుండిపోయింది!
    క్షణంలో ఊరూ వాడా ఏకమయింది!
    ఎన్నో గొంతుకలు! ఏవేవో అంటున్నారు!

 Previous Page Next Page