నా కథ వింటావా?
గడియారం టంగ్ టంగ్ మని పదిగంటలు కొట్టింది !
సరిగ్గా అదే సమయానికి బయటి తలుపు దబదబా బాదిన చప్పుడయింది !
మంచంమీద కూర్చుని ఆలోచిస్తున్న కవిత, గబగబా వెళ్ళి తలుపు తీసింది.
దివ్య, అతనికి 'టా....టా....' చెప్పి లోపలికొచ్చింది.
"ఇంత పొద్దు పోయేదాకా ఎక్కడి కెళ్ళావ్ దివ్యా?" అడిగింది కవిత.
దివ్య మాట్లాడలేదు. చెప్పులు విప్పి లోపలికి వెళ్ళబోయింది.
"నిన్నే....!" అంది కొంచెం హెచ్చు స్వరంతో కవిత.
"సినిమాకి వెళ్ళాను."
"ఎవరితో?"
"రోహిత్ తో వెళ్లాను. అయినా ఏమిటీ ప్రశ్నలు? నేనేదో తప్పు చేసినట్టు?" విసుక్కుంటూ వెళ్ళబోయింది.
"ఇలా రోజూ అతనితో సినిమాలకీ, షికార్లకీ తిరుగుతే, నలుగురూ ఏమనుకుంటారు? మీ ఇద్దరూ ఇష్టపడితే ఒకరి నొకరు _ చెప్పండి పెళ్ళి చేస్తాను! అంతేకాని ఊరికే అతనితో తిరగడం, అందరి కంట్లోనూ పడితే బాగుండదు."
"అందరూ....అందరూ....ఎవరూ అందరూ?" దివ్య డ్రెస్సు మార్చుకుని నైటీ వేసుకుంటూ అంది విసుగ్గా.
"సమాజం!" శాంతంగా జవాబు చెప్పింది కవిత.
ఆమెకు తెలుసు, ఎదిగిన బిడ్డతో దబాయించి మాట్లాడితే, అది పోట్లాటలోకి దిగుతుందని.
"నాకు సమాజంతో పన్లేదు. నేనేమీ సమాజానికి సంజాయిషీ చెప్పుకోనక్కర్లేదు" విసుగ్గా వెళ్ళి మంచంమీద పడుకుంది దివ్య.
కవితకి దివ్య చెప్పే పెడసరి సమాధానాలకి కోపం వస్తోంది.కోపాన్ని అణుచుకుంటూ "ఏ మనిషీ సమాజానికి అతీతుడు కాదు. సమాజాన్ని కాదని తిరగడం ఏటికి ఎదురీదడం! సమాజానికి ప్రతివారు ఝడవాల్సిందే!"
"నేనేమీ తప్పు చేయ్యనంతవరకూ, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు!" అక్కడ నుండి వెళ్ళబోయింది దివ్య.
కవితకి ఆమె చూసే ధిక్కారానికి ఒళ్ళు మండుకొచ్చింది.
"ఆగు! ఈరోజున నేనడిగిన ప్రతి ప్రశ్నకీ నువ్వు సమాధానం చెప్పి తీరాలి! ఏమిటా తలబిరుసుతనం? ఎందుకా నిర్లక్ష్యం?" అంది కోపంతో ఊగిపోతూ కవిత.
దివ్య తీక్షణంగా చూసింది ఆమెవైపు!
ఆ చూపులు తూటాల్లాగా గుచ్చుకున్నయ్ కవిత గుండెలో.
"ఈ పిల్లకి ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు! అసలు దీనికి నేనంటే అంత కోపమెందుకు? ఒక్కొక్కసారి దీని ప్రవర్తన, కోపమో, అసహ్యమో కూడా తెలీనట్టుగా వుంటుంది! దీన్ని ఇంత గారాబం చేసి పెంచడం, తప్పు నాదేనేమో!.... జీవితంలో ఏది నేను మంచి పని అనుకుని చేసినా, అది తప్పుగానే పరిణమిస్తోంది." ఆలోచిస్తున్న కవితని, పరికించి చూసి, అక్కడి నుండి వెళ్ళబోయింది దివ్య.
"ఆగు! నీ నిర్లక్ష్యాన్నీ, మొండిధైర్యాన్నీ ఇంక నేను భరించలేను" అంది కవిత ప్రతి అక్షరాన్నీ నొక్కి చెబుతూ.
"అధైర్య పడవలసిందీ, తలవంచుకోవలసిందీ, తప్పుని చేసిన వాళ్ళు! ఆ అవసరం నాకు లేదు!" అంది తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ దివ్య.
కవిత ఉలిక్కిపడింది!
నోట మాటరాక అవాక్కయిపోయింది!
దివ్య తల్లిని మరొకసారి పరికించి చూసి, లోపలి కెళ్ళబోయింది నిర్లక్ష్యంగా!
"ఆగు! ఏమిటా పొగరు? ఏం చూసుకుని ఆ గర్వం?" కవిత గొంతు వొణికింది, మాటలు తడబడ్డాయి.
ముందుకు వెళ్ళబోయిన దివ్య, అక్కడే ఆగిపోయింది.
తల్లికేసి చూసింది. ఆ చూపుల్లో వెటకారం,ధిక్కారం!
కవిత గుండె దడదడలాడింది.
ఆ క్షణంలో దివ్యని చూస్తే భయమేసింది కవితకి.
"అమ్మా! నీ ప్రశ్నలకి సమాధానం కావాలా? చెబుతా విను! నా నిర్లక్ష్యం, నువ్వు చెప్తున్న నీతులను చూసి! నా పొగరూ, నా గర్వం, నాలోని ఆత్మ విశ్వాసాన్ని చూసి? చాలా? ఇంకా వివరంగా చెప్పాలా?" ఒక్కొక్క అక్షరాన్నీ వొత్తి వొత్తి పలికింది దివ్య.
కవితకి మతి పోయినట్టనిపించింది!
గుండె ఆగిపోయి నట్టనిపించింది!
కాళ్ళకింద భూమి రెండుగా చీలిపోయి, తనని లోపలికి లాక్కుపోతూన్నట్టనిపించింది.
కళ్ళు చీకట్లు కమ్మాయి!
అంతవరకూ ఆమెని ఆవహించిన కోపం, ఆవిరై, కన్నీరై,చెంపలమీదుగా జాలువారింది.
దుఃఖంతో, బాధతో, గుండె బరువెక్కింది.
అంతలోనే ఏ మూలనో వున్న ధైర్యం మొండితనం, వీటన్నిటినీ తోసుకుంటూ ముందుకు రావడంతో, "ఛీ! దీని ముందు బేలగా నేను ఏడవడమా? జాలిగా అర్ధించడమా? ఎవరేమన్నా లెక్క చెయ్యకుండా, ఆత్మస్థయిర్యంతో ముందుకు సాగిపోయే నేను, నా వ్యక్తిత్వాన్ని చంపుకుని, దీనిముందు కన్నీరు కార్చడమా? నో!.... నో!.... అలా జరగదు. అంత నిస్సహాయస్థితే వొస్తే....?" కళ్ళు తుడుచుకుంది కవిత.
"నన్ను క్షమించు దివ్యా! నువ్వింకా చిన్నపిల్లవే అనుకున్నాను! నీకు నా సలహా అవసరమని అనుకుంటూ, నాకు తోచింది చెపుతూ వొచ్చాను. కానీ, ఆ అవసరం ఇక లేదని, నువ్వు చాలా ఎదిగిపోయావనీ, ఇప్పుడే తెలుసుకున్నాను! అయినా ఒక్క విషయం చెబుతున్నాను విను! లోకం నువ్వనుకుంటున్నంత మంచిది కాదమ్మా!
మనిషి ఆయువును పెంచే అమృతమూ, ప్రాణాలు తీసే కాలకూట విషమూ రెండూ కలిసి ఒకే సముద్రంలో వున్నట్టు, మంచీ, చెడూ, ఈ లోకంలో కలబోసుకుని వుంటాయ్! మంచేదో తెలుసుకుని ఎంచుకోవడం, చెడుని విస్మరించడం మన చేతుల్లోనే వుంది. మన విచక్షణా జ్ఞానం పైన ఆధారపడి వుంది! మంచిని ఎంచుకుంటే, జీవితమనే ఈ వైకుంఠపాళీలో సోపానా లెక్కవచ్చు! చెడుని ఎంచుకుంటే, పాము నోట్లోపడి, పాతాళానికి పడిపోవలసి వొస్తుంది! జాగ్రత్తగా ఆలోచించుకోవాలి! ఇది వేదాంతం కాదూ, వెర్రితనమూ కాదు. జీవిత సత్యం!" అంది ఎంతో నిదానంగా కవిత.
దివ్య తల్లి కేసి అయోమయంగా చూసింది!
మనసు గజిబిజిగా వుంది!
ఏది నిజమో,. ఏది అబద్ధమో, ఎటు తేల్చుకోలేని స్థితిలో వుంది దివ్య.
పిచ్చిదానిలా తల్లిని చూస్తూ వుండిపోయింది!
"ఏమిటలా చూస్తున్నావ్? పద _ భోంచేద్దాం" అంది టేబుల్ మీద ప్లేట్లూ, గ్లాసులూ పెడుతూ కవిత.
"నువ్వు భోంచెయ్యలేదా?" అడిగింది దివ్య.
"లేదు!"
నిజానికి దివ్య భోజనం అయిపోయింది. తనూ, రోహిత్ కలిసి సినిమా అయిపోయాక హోటల్ కెళ్ళి భోంచేసొచ్చారు. కానీ, ఆ మాట చెబితే తల్లి భోంచెయ్యదు. అందుకని, కంచం ముందు కూర్చుంది.
కానీ మెతుకు నోట్లోకి పోవడం లేదు.
"ఏమిటా తిండి?" అంది కవిత.
"నేనూ రోహిత్ హోటల్లో భోంచేశాం!" అంది దివ్య.
"ఓ...."
"ఏమీ? అదీ తప్పేనా? అందరూ ఏమైనా అనుకుంటారా?"
ఈసారి కవితకి ఒళ్ళుమండి పోయింది. కంచంలో చెయ్యి కడుక్కుని లేచి నుంచుంది. చిలకకు చెప్పినట్టు చెప్పినా, దివ్య చూపే ధిక్కారాన్ని భరించలేకపోయింది. కోపంతో ఊగిపోతూ ఒక్కటేద్దామన్నంత కోపంతో చెయ్యెత్తింది.
అంతలోనే తనలోని సంస్కారం మేలుకుంది.
ఇంచుమించు తనంత ఎదిగిన బిడ్డమీద చెయ్యి చేసుకోవడం, అవివేక మనిపించింది. ఎత్తిన చేతిని దించేసింది.
"ఎందుకు ఆగిపోయావ్? కొట్టు....కొట్టూ...." అంటూ వీపు నందించింది దివ్య!
"మైగాడ్! నీలో ఇంత మొండితనం గూడు కట్టుకునుందని కలలో కూడా అనుకోలేదు. చెట్టంత ఎదిగిన బిడ్డని కొట్టడానికి నా సంస్కారమే నాకడ్డొచ్చి చేతులు రాలేదు. "మంచి మనిషికొక మాట! మంచి గొడ్డుకొక దెబ్బ!" అన్నారు. నిన్ను మనిషిగా ఊహించుకుని, మంచిగా చెబితే, చాలనుకున్నాను. కానీ...."
మరి మాట్లాడలేకపోయింది. దుఃఖం గొంతుకి అడ్డు పడింది. కాస్సేపటికిగొంతు సవరించుకుని "చాలాసార్లు, చాలా విషయాలలో, నా ఊహ తల్లికిందులైందమ్మా!" అంది.
"నా ఊహలూ అలాగే తల్లకిందులయ్యాయమ్మా!" అంది దివ్య.
కవితకి షాక్ కొట్టినట్టయింది.