Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 3

    ఏం? వేరే దేశాల్లో స్త్రీలు పిల్లల్ని కనడం లేదూ? ఇల్లూ వాకిలీ చూసుకోవడం లేదూ? పిల్లల్ని పెంచడం లేదూ? కూతురుగా, భార్యగా గుర్తించబడటం లేదూ? ఒకటి మాత్రం నిజం - ఆ దేశపు పురుషులు స్త్రీలను - "నువ్వు మాతృదేవతవు, గృహలక్ష్మివి, సుకుమారివి, పవిత్రమూర్తివి. నీ స్థానం ఇంట్లోనే, ఇల్లు నీ గుడి. అందులో నువ్వు దేవతవు" అంటూ నమ్మించలేదు. "ఆడదానిని, అబలవు, పురుషుడు అండలేకుండా నువ్వు బతకలేవు" అని చెప్పలేదు.   
    స్త్రీకి కావలసింది గుళ్లో దేవతగా పూజించబడటం కాదు. మానవిగా, సమాజంలో ఒక వ్యక్తిగా గుర్తించబడాలి. గుడిలోని దేవతకు గౌరవం పూజారి పూజలు అందిస్తున్నన్ని రోజులే ఉంటుంది పాడుపడిన గుడిలోని విగ్రహానికి మామూలు రాతికి ఉన్న విలువ కూడా ఉండదు. అలాగే స్త్రీని భర్త తన ఆస్తిగా ప్రేమిస్తాడు. గౌరవిస్తాడు. విముఖత కలిగిన రోజు బయటికి వెడతాడు. అప్పుడు ఆమె పాడుపడిన గుడిలోని అమ్మవారి విగ్రహం కంటే హీనమైన పరిస్థితులకు గురికావలసి వస్తుంది.  
    కొన్ని శబ్దాలను పట్టుకొని ప్రాచీనకాలంలో మన దేశంలో స్త్రీ చాలా చాలా గౌరవాన్ని పొందినదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అవి అరిగిపోయిన రికార్డులోని మాటలు: వాటినే మళ్ళీ మళ్ళీ వల్లిస్తున్నాం. గత గౌరవాన్ని నెమరువేసుకుంటున్నామేగాని, గతంలో జరిగిన అన్యాయాలను తల్చుకోవడానికి కూడా భయపడుతున్నాం. ఎవరైనా ధైర్యం చేసి ఎత్తి చూపిస్తే వాళ్ళను దుమ్మెత్తి పోస్తున్నాం.   
    స్త్రీ సాధ్వీమణిగా ఉండాలంటూ చెప్పిన హితవులు ఎన్నో మన ప్రాచీన సాహిత్యంలో కన్పిస్తాయి. ఒకవైపు "ఇయంగేహేలక్ష్మీ" అంటూ మరోవైపు "పతియచుట్టంబు, బతియగురువు, బతియదైవంబుగావున నతని పనియొనర్చుటయెధర్మంబు నాతి కరయ" అన్నారు.  
    "మగవాడు చేసెనని తొయ్యలియన్ దురితంబు సేసినబరమ పవిత్రతాచరణ భంగముగాదే" జక్కన "విక్రమార్కచరితం"లో అన్నాడు.   
    పురాణాల కేసి ఒకసారి చూద్దాం. రెండవసారి కూడా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలని రాముడు కోరినప్పుడు సీత ఏం చేసింది? ఔచిత్యం కోసం భూదేవి ప్రత్యక్షమై తనబిడ్డను ఒడిలోకి తీసుకున్నట్టు చెప్పారు. సీత ఆ అవమానాన్ని భరించలేక వెంటనే నేలమీద వరిగి ప్రాణాలు విడిచి ఉంటుంది.   
    ద్రౌపది విషయం తీసుకోండి. ఏదో కాయను తెచ్చినట్టు చెబితే "అందరూ సమానంగా పంచుకోండి నాయనా!" అన్నదట కుంతీదేవి అర్జునుడితో. ఇంకేం పంచుకున్నారు. ఆమెకు ఇష్టమో, కాదో కూడా తెలుసుకోవాల్సిన అవసరంగానీ, ఆలోచనగానీ ఎవరికీ రాలేదు. కొందరు మహాపండితులు ఆమెకు కర్ణుడి మీద కూడా మనసు ఉన్నదని చెప్తారనుకోండి. అది వేరే విషయం.    
    ధర్మరాజు జూదంలో ఆస్తితోపాటు భార్యను కూడా పందెంలో ఒడ్డి ఓడిపోయాడు. అంటే భార్య ఆస్తిలో ఒక భాగమనేగా? నిండు సభలో ఐదుగురి భక్తుల ముందు వలువలు వలిచారు. అతీంద్రియ శక్తుల్ని నమ్మేవాళ్ళను వదిలేయండి. హేతువాదంతో ఆలోచిస్తే ద్రౌపది పరిస్థితి ఏమై ఉంటుందో అర్థం అవుతుంది.
    హరిశ్చంద్రుడు అబద్ధం ఆడడట. మాట తప్పడట. తన కీర్తి కోసం భార్యను నడి బజార్లో వేలంపాట పాడాడు. సినిమాలో ఆ సన్నివేశం చూస్తూ చంద్రమతి కోసం పాపం మన ఆడవాళ్ళు ఎన్ని కన్నీళ్ళు కారుస్తారో? అంతేకాదు. చంద్రమతి పుట్టిన గడ్డమీద పుట్టినందుకు గర్విస్తారు కూడా. అంతేకాని చంద్రమతి ఎదురు తిరిగితే ఎంత బాగుండేది అనుకోరు.
    పురాణాల్లో, కావ్యాల్లో, సూక్తుల్లో, జానపదాల్లో, అప్పగింతల పాటల్లో - అన్నింటిలోనూ స్త్రీ పాతివ్రత్యాన్ని గురించే చెప్పడం జరిగింది. ఈ విషయం స్త్రీల నరనరంలోకి ఎక్కించబడింది. జారిణి, చపలకాముకి అంటూ ఎన్నో కావ్యాలలో స్త్రీని కించపరచడం జరిగింది. స్త్రీలను కించపరుస్తూ వ్రాసిన కావ్యాలను, కనీసం ఆయా భాగాలను భావితరాలవారికి అందుబాటులో ఉంచకూడదు. బాలికల మనసుల్లో తమకంటే పురుషుడు అధికుడనే భావాన్ని ఎక్కించే సాహిత్యాన్ని ప్రోత్సహించకూడదు.
    ఈనాటికి ఆఫీసుకు వెళ్తూ (చాలా పెద్ద ఆఫీసర్లే) భార్యను లోపలపెట్టి తాళం వేసే పురుషులు ఉన్నారంటే మీరు నమ్మరు కదూ? ఇది ముమ్మాటికి నిజం. ఒక స్త్రీ ఎం.ఏ. చదివింది. భర్త చాలా చాలా పెద్ద ఆఫీసరు. జిల్లాకే తలకాయ (హెడ్). భార్య లోపల ఉంటుంది. బంగళా ముందు వాకిలికి తాళం ఉంటుంది. అయినా ఆమె ఎందుకు సహిస్తున్నది? మరో ఆఫీసరు - అయినా అంత పెద్ద ఆఫీసరే. తనను తను సాక్షాత్తు భగవంతుని అవతారంగా భావిస్తూ ఉంటాడు. అంటే అంత అహంకారి. వారానికి ఒక రోజు (గురువారం అనుకుంటాను)  కుర్చీలో కాలుమీద కాలువేసుకొని కూర్చొని భార్యచేత హారతి ఇప్పుంచుకుంటాడు. పాపం! ఆవిడ వంగుతూ లేస్తూ చెమటలు పట్టేంతవరకూ హారతి పళ్లెం అతని చుట్టూ తిప్పుతూనే ఉంటుంది. అర్థ నిమిలిత నేత్రాలుతో కూర్చుని పళ్లెం కింద పెట్టాక భార్యను ఆశీర్వదిస్తాడు. అతను భార్యను వారానికి రెండుసార్లయినా బడితెపూజ చేస్తాడు. ఇది అతిశయోక్తి కాదు. ముమ్మాటికి నిజం. ఈ నిజం హైదరాబాదులో ఉండేవారికి చాలామందికి తెలుసు.
    ఈ భార్యలు ఎందుకు సహిస్తున్నారు? ఆడవాళ్ళకు భర్తను వదలి వెళ్ళిపోతే ఎలా బతకగలం అనే భయం కంటే చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారనే భయమే ఎక్కువ. లోకోపవాదభయం.
    ఈ పిరికితనం వదలాలి. స్త్రీలలో భావవిప్లవం రావాలి. మానసిక బానిసత్వం వదలాలి. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులే అనే ఆత్మ విశ్వాసం స్త్రీలలో కలిగించాలి. మానవతావాదాన్ని ప్రతిపాదించే సాహిత్యం రావాలి. గొడ్లకాడ బుడ్డోడు అమాంతం ఒక లక్షాధికారి కూతుర్ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నట్టు రాస్తే ఆవురావురుమని చదవడానికి బాగానే ఉంటుంది. అంతవరకు కూడా సహించవచ్చును. కాని ఆ తర్వాత ఆ అమ్మాయి భర్త పెట్టే బాధల్ని కిక్కురుమనకుండా భరిస్తూ పాఠకుల చేత కన్నీళ్ళు పెట్టించడమే క్షమించరాని విషయం.
    భావితరాల ఆడపిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచి మానసిక బానిసత్వం వదిలించాలంటే ఈనాడు చదువుకుని విజ్ఞానవంతులైన స్త్రీలు రచయిత్రులు "నేను ఈ పవిత్ర భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను" లాంటి అరిగిపోయిన మాటల్ని పదే పదే వల్లించడం మానెయ్యాలి.   
                                    ప్రగతి పథంలో స్త్రీ
    వారం రోజుల క్రితం ఏదో పత్రికలో "ప్రగతి పథంలో స్త్రీ" అనే వ్యాసం చదివారు. చదివి నిజంగా స్త్రీ ప్రగతి పథంలో ముందుకు -- చాలా ముందుకు పయనించింది అనే అనుకున్నారు. ఆ పక్కనే మరో వార్త చదివి గతుక్కుమన్నాను. నగరంలోని ఒక స్త్రీ కళాశాల దగ్గరలో ఆరునెలల శిశుపిండం పడి ఉన్నదట. అదే సందర్భంలో నాలుగు రోజుల క్రితం ఒక పోలీసు స్టేషన్ దగ్గర వదిలి వెయ్యబడిన పసికందు ఉదంతం కూడా ఉటంకించడం జరిగింది. ఈ వార్త చదవగానే ద్వాపరయుగం నాటి కుంతీదేవి జ్ఞాపకం వచ్చింది.     
    బహు భర్తృత్వాన్ని ఆమోదించిన ఆనాడు కూడా అవివాహితగా బిడ్డను కనిన కుంతీదేవి ఏం చేసింది ఎందుకు చేసింది? లోకాపవాదభయం వివాహానంతరం భర్త అనుమతితో పర పురుషులకు ఐదుగురు బిడ్డలనుకన్నందుకు కుంతీదేవిని ఎవరూ తప్పుపట్టలేదు. పై వార్తలోని ఇద్దరు తల్లులూ చేసింది ఏమిటి? ఎందుకు చేశారో వేరుగ చెప్పవలసిన పనిలేదు. ప్రగతి పథంలో చాలా ముందుకు పయనించిన ఈ నాటి స్త్రీ కూడా కుంతీదేవిలా ఎందుకు చెయ్యవలసి వచ్చింది? నిజంగా స్వేచ్చ లభించిందా? ఏ విధమైన ప్రగతిని మనం సాధించాం? మేధస్సు పెరిగింది.
    కాని మనసులకు పట్టిన బూజు ఇంకా వదలలేదు. ఈ అణుయుగంలో మానవుడు చంద్రమండలం మీద మనుగడ సాగించడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని మన దేశంలో స్త్రీ తన చుట్టూ నీతి పేరు మీద గీచిన గిరుల్ని కూడా దాటలేని స్థితిలో ఉన్నది. మన దేశంలో భ్రూణహత్యలూ, శిశు హత్యలూ జరుగుతూనే ఉన్నాయి. ఉరవళ్ళు పరవళ్ళు తొక్కే వయసులో యువతీయువకులు క్షణిక ఆవేశానికి లోనై తప్పటడుగు వెయ్యడం జరుగుతున్నది. ప్రకృతి స్త్రీని శిక్షిస్తున్నది. పురుషుడు చిన్నగా తప్పుకుంటాడు. అనాదిగా మన శాస్త్రాలు స్త్రీ పాతివ్రత్యాన్ని గురించి బోధించాయి.   
    ఆడదానికి ఒక నీతి, మగవాడికి మరొకనీతి కావడమే ఇన్ని అనర్థాలకి మూలం. స్త్రీని మాతృదేవత అన్నారు. మరి మాతృత్వం ధరించడం కళంకంగా ఎందుకు భావించడం జరుగుతూంది? పైన ఉటంకించిన వార్త ప్రకారం ఎవరో విద్యార్థిని అబార్షన్ చేసుకోవడానికి ప్రయత్నించిందనే స్పష్టం. ఆ బాలిక తను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో వూహించగలరు. తన గర్భంలో రూపులు దిద్దుకుంటున్న శిశువుకు తండ్రి ఫలానా అని పదిమంది మధ్యలో చప్పగలిగిన పరిస్థితులే ఉంటే ఇలాంటి అనర్థాలు జరగవు.
    "ముల్లు వచ్చి అరిటాకు మీద పడినా అరిటాకు ముల్లు మీద పడినా నష్టం అరిటాకుకే" లాంటి సామెతల్ని ప్రచారంలోకి తెచ్చి స్త్రీని నమ్మించారు. 'చెడిపోయిన స్త్రీ' అంటారు "చెడిపోయిన పురుషుడు" అనరు. ఎందుచేత?
    కొంతకాలం క్రితం ఎయిర్ పోర్టుకు దగ్గరలో ఉన్న మైదానంలో జనం గుమిగూడి ఉన్నారు. వాకబు చెయ్యగా తెలిసిందేమిటంటే-- ఎవరో పసికందును బట్టలో చుట్టి పాతి పెట్టారు కుక్కలు ఆ కళేబరాన్ని బయటికి లాగి తింటున్నాయి, పోలీసులు వచ్చారు. చుట్టూ చేరిన జనం తలొక విధంగా కామెంట్సు పాస్ చేస్తున్నారు.
    కొందరు ఆ తల్లి రాక్షసత్వాన్ని నిందిస్తూ, శిశువు కోసం కన్నీళ్ళు కారుస్తున్నారు. కొందరు మన హైందర సంప్రదాయం మంటగలసిపోతున్నదని నెత్తి నోరూ కొట్టుకుంటున్నారు. మరి కొందరు సమాజానికి పట్టిన చీడ గురించీ, చీడపురుగుల్లాంటి వ్యక్తుల్ని గురించీ ఎవరికి తెలిసిన కథ వాళ్ళు చెబుతున్నారు.               

 Previous Page Next Page