Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 4


    వేదకాలం నుంచీ పొగడ్తలతోనూ, పూజలతోనూ ఆకాశానికి ఎత్తివేసిన ఆ మాతృదేవతే ఇంత నికృష్టమైన పనికి  ఎందుకు పాల్పడిందో ఎవరూ ఆలోచించడం లేదు. తన రక్తమాంసాలను పంచి ఇచ్చి, నవమాసాలూ మోసి, నరకయాతన అనుభవించి కన్నబిడ్డను ఒక మాతృమూర్తి తన చేతులతోనే ఎందుకు చంపుతున్నదో కొత్తకోణం నుంచి ఎవరైనా ఆలోచిస్తున్నారా?
    వారం రోజుల తరవాత పదో క్లాసు చదువుతున్న ఒక అమ్మాయి ఆమె తల్లిదండ్రులనూ అరెస్ట్ చేశారని తెలిసింది. ఆ బాలికను కోర్టులో జడ్జీముందు నిలబెడతారు. కోర్టులో జనం ఆమెని హంతకిని చూసినట్టు కుతూహలంతోనూ, ఏవగింపుతోనూ చూస్తారు.
    అదే తప్పుచేసిన ఆ యువకుడు తప్పించుకుంటాడు. అతనికి ఎలాంటి కళంకం అంటదు. బజారుపాలయిన ఆ బాలిక కళంకినిగా, హంతకిగా సమాజం ముందు నిలబడిపోతుంది. ఆమెకు వివాహం కాదు.     
    ఆ యువకునికి మాత్రం కట్నం ఇచ్చి పిల్లను ఇస్తారు. ఎందుకు? మగవాడు తిరగక చెడిపోతాడు. ఆడది తిరిగి చెడిపోతుంది వంటి సామెతలను జీర్ణించుకున్న జాతి మనది.
    "నేను స్త్రీని. తల్లి కావడం నా సహజ ధర్మం. నేను ప్రత్యేకమైన తప్పు చెయ్యలేదు. నా బిడ్డను పెంచుకునే హక్కు నాకు ఉన్నది" అని ధైర్యంగా ఆ బాలిక ఆ బిడ్డను పెంచుకోగల వాతావరణం మనకు ఉన్నదా?   
    అలా స్త్రీని ధైర్యం చేసి ఎదురు తిరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అలా చెయ్యాలంటే ఆమెకు సాంఘిక భద్రత కావాలి. ఆర్థికంగా తన కాళ్ళమీద తాను నిలబడే అవకాశం ఆమెకు అవ్యవస్థలో లభించాలి. స్త్రీ శరీరాన్ని చౌకగా, కారు చౌకగా, ఉప్పుచింతపండులా చీకటి బజార్లో కొనుక్కునే సంస్కృతి మనది. ఆ పెద్ద మనుషులే వెలుగులోకి వచ్చి శీలం అమ్ముకునే స్త్రీలను చీడపురుగులు అంటున్నారు.   
    శరీరానికి చీడ ఎప్పుడు పడుతుంది?
    కొయ్యకు చెదలు ఎప్పుడు పడుతుంది?
    రక్తంలో రోగ క్రిములు ప్రవేశించడం వల్ల శరీరం మొత్తం అనారోగ్యానికి గురి అవుతుంది. ఆ రోగక్రిములు చీడరూపంలో బయటపడతాయి రోగ క్రిముల్ని చంపకుండా చీడకు మందు రాసినందువల్ల ప్రయోజనం ఉండదు. అక్కడ చీడ మాడినట్టే మాడి మరో చోట ప్రారంభం అవుతుంది. రక్తంలోని క్రిముల్ని నిర్మూలిస్తే కాని శరీరం ఆరోగ్యవంతంకాదు. అలాగే చేవ చచ్చిన కొయ్యకే చెదలుపడుతుంది. ఆహారంగా మారి ఆ కొయ్యే ఆ చెదల్ని పోషిస్తుంది. అలాగే సంఘంలో బలహీనత ఏర్పడినప్పుడే మనుషులు చీడ పురుగుల్లా తయారు అవుతారు. ఆ చీడ పురుగుల్లాంటి వాళ్ళను శిక్షించీ, చంపీ లాభం లేదు. చచ్చేవాళ్లు చస్తుంటే కొత్త వాళ్లు తయారు అవుతారు. అన్యాయం పెరగడానికి అవకాశం ఉన్న వ్యవస్థలో న్యాయం మాత్రమే ఉండాలని కోరడం హాస్యాస్పదం.
    ఈ వ్యవస్థ మారాలి. సమస్యల్ని కొత్తకోణం నుంచి చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఈ దేశంలో స్త్రీల సమస్యలకు నిజమైన పరిష్కారం దొరుకుతుంది.
    చట్టాలు స్త్రీల విమోచనలకొరకు ఎన్నో బిల్లులు పాసు చెయ్యడం జరిగింది. అందులో కాళేశ్వరరావు బిల్లు ఒకటి. ఈ బిల్లు బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్నది. భార్య బ్రతికి ఉండగా మరో వివాహం చేసుకోకూడదు.   
    పునర్వివాహం చేసుకుంటే భార్య కేసు పెట్టవచ్చును. (ఈ భారత దేశంలో ఎంతమంది స్త్రీలు భర్తల మీద కేసు పెట్టకలిగే స్థితిలో ఉన్నారనేది వేరు విషయం) పునర్వివాహం చేసుకున్నట్టు రుజువు అయితే న్యాయశాస్త్రం ప్రకారం ఆ పురుషుణ్ణి జైలుకు పంపించవచ్చును. భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ ఉద్యోగి మరో వివాహం చేసుకుంటే అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
    ఆ రెండో భార్య కూడా ఉద్యోగిని అయి ఉంటే ఆమెను కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఇన్ని నిబంధనలు విధించినా పురుషులు రెండో వివాహం (అది చట్టసమ్మతం కాకపోవచ్చును) చేసుకుంటూనే ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది?
    ఆ మధ్య కమల సూపర్ బజార్ లో కన్పించింది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ కన్పించే ఆ పిల్ల ముఖం కళావిహీనంగా ఉండటాన్ని గమనించాడు. జీన్స్ లో తప్ప కన్పించని కమల ఆ రోజు అతి సింపుల్ గా సాదా వాయిల్ చీరలో కన్పించింది. కమలను ఆశ్చర్యంగా చూస్తున్నాను.
    "ఆంటీ బాగున్నారా?" కమల పలకరించింది.
    ఆ అమ్మాయితో మాట్లాడగా తెలిసిన విషయం ఇది -- కమల చదువు మానేసి ఎల్.డి.సి.గా పని చేస్తూంది. కమల ఆ కుటుంబంలో పెద్దకూతురు. మరో ఇద్దరు ఆడపిల్లలూ, ఒక మగపిల్లాడూ ఉన్నారు. కమల తండ్రి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నలభై ఐదు ఏళ్ళు దాటిన రాజారావు, తన ఆఫీసులోనే పనిచేసే పాతిక సంవత్సరాల పడతి ప్రేమలో పడ్డాడు. వేరు కాపరం పెట్టాడు. ఇంటికి రావడం మానేశాడు. డబ్బు ఇవ్వడం కూడా మానేశాడు. ఇల్లు జరగడం కష్టం అయింది. అందుకే  కమల ఉద్యోగంలో చేరింది.
    చాలామంది కమల తల్లితో కేసు పెట్టమని చెప్పారు. కాని ఆమె అంగీకరించలేదు. భర్త మీద కేసు పెట్టడం అనే ఆలోచన రావడం కూడా ఆమె దృష్టిలో పాపం. తన రాత బాగుంటే తన భర్త ఏనాటికైనా వస్తాడని ఆమె నమ్మకం. నలుగురు బిడ్డల తండ్రిని తన దగ్గర కట్టిపడేసుకున్న ఆ స్త్రీని ఏమనాలి? ఆమె చదువుకున్నది ఉద్యోగం చేస్తున్నది. మరొక స్త్రీకి ద్రోహం చేస్తున్నాననే గ్రహింపు ఆమెకు లేదా?  
    ఈ విషయం మీద చాలాసేపు ఆలోచించాను. యౌవనంలో తప్పులు చేస్తే (మగవాడికి మాత్రమే సుమా) వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంది. ప్రౌఢవయస్సులో మార్గం తప్పిన వ్యక్తి అనేక మందికి సమస్యగా తయారు అవుతాడు. నాకు తెలిసిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని భార్య ఉన్న పురుషుణ్ణి వివాహం చేసుకున్నది. అతను కూడా ప్రభుత్వ ఉద్యోగే. అతను ఆమెతో వేరు కాపరం పెట్టలేదు. ఆమె దగ్గరకు వస్తూపోతూ ఉంటాడు. కుటుంబాన్ని వదిలి వెయ్యలేదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
    అతని మొదటి భార్య భర్త ప్రవర్తనను సహించలేకపోయింది. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇద్దరి మీదా ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఉద్యోగాలనుంచి ఎందుకు తొలగించకూడదో సంజాయిషీ ఇచ్చుకోవలసిందిగా ప్రభుత్వం కోరింది. ఆ యువతి ఉద్యోగం పోయినా తను అతని భార్యగా గుర్తింపబడాలని పట్టుబట్టింది. కాని అతను అందుకు అంగీకరించలేదు. అతను "ఆమెతో ఉంటున్నాననీ - వివాహం చేస్కోలేదనీ" సమాధానం ఇచ్చాడు.  
    వివాహం జరిగిన రుజువులు లేవు. అందుకే ప్రభుత్వం వారిమీద ఎలాంటి చర్యనూ తీసుకోలేకపోయింది. అంటే భార్య ఉండగా మరో స్త్రీని వివాహం (చట్టరిత్యా) చేసుకోకూడదు. కాని 'ఉంచు'కోవచ్చును. ఆవిడ నా భార్య కాదు, "ఉంపుడుగత్తె" అంటే ఉద్యోగం పోదు. పైన చెప్పిన యువతి అభిమానంతో ఆత్మహత్య చేసుకున్నది. కాని చాలామంది అలాగే రాజీపడి జీవిస్తున్నారు.    
                                       3వ భాగము
    పిల్లల్ని కూడా కంటున్నారు ఆ పిల్లలకు తండ్రి ఆస్తి మీద ఎలాంటి హక్కూ ఉండదు. ఇటువంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంధియుగంలో చదువుకొని, ఉద్యోగాలు చేస్తున్న అనేకమంది యువతులు అవివాహితులుగానే ఉండిపోతున్నారు. అందుకు కారణాలు అనేకం.
    చదువుకున్న అమ్మాయికి అంతకంటే ఎక్కువ చదివిన భర్తను తేవాలి. తల్లిదండ్రులు కట్నం ఇవ్వలేని స్థితిలో ఉంటారు. ఆ అమ్మాయి ఉద్యోగంలో ప్రవేశిస్తుంది. స్వంత అభిరుచులూ, అభిప్రాయాలూ ఏర్పడతాయి. తగిన వరుడికోసం వేచి ఉంటారు. చివరకు భార్యా పిల్లలు ఉన్న ఏ ప్రౌఢ వ్యక్తివలలోనో చిక్కుకుంటారు.   
    ఇందువల్ల పురుషులు ఎదుర్కొనే పెద్ద బాధలు ఏం ఉండవు. ఆమె కూడా ఉద్యోగం చేస్తున్నది. అతను పోషించవలసిన అవసరం ఉండదు. పైగా జేబు ఖర్చుకు డబ్బు కూడా ఇస్తుంది. అడపాదడపా టెర్లిన్ సూటు కూడా కుట్టిస్తుంది.    
    ఈ విధంగా ఒకవైపు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను మానసిక వ్యధకు గురిచేస్తున్నాడు. రెండోవైపు నిస్సహాయస్థితిలో ఉన్న మరో స్త్రీ బలహీనతను ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నాడు.    
    ఆరునెలల తర్వాత ఒకసారి కమల కన్పించింది. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేశాడట. మళ్ళీ తను కాలేజీలో చేరానని ఉత్సాహంగా చెప్పింది.     
    "ఆవిడ ఏమైంది?" కుతూహలంతో అడిగాను.
    "ఆ పాడు ముండ ఏమైతేమాకెందుకు? మా నాన్న మాకు దక్కాడు" అన్నది కమల.
    "మీ నాన్న చేసిన బుద్ధితక్కువ పనికి ఆమెను నిందిస్తావేం?"
    "మా నాన్న మగవాడు. ఆవిడకు ఉండాలి బుద్ధి ఒకరోజు సరాసరి ఇంటికే వచ్చేసింది. ఒకటే ఏడుపు! అమ్మ తిట్టి తరిమేసింది."    
    "అప్పుడు మీ నాన్న ఉన్నాడా?"
    "ఆ! తలవంచుకొని కూర్చున్నాడు. అసలు మానాన్న చాలా మంచివాడు. మా అమ్మ అంటూ ఉంటుంది - అది ఏదో మందు పెట్టిందట అందుకే మా నాన్న అలా మారిపోయారట." ఆ పిల్లను చాచి చెంప మీద కొట్టాలనిపించింది.    
    అందుకే జార్జి బెర్నార్డ్ షా అన్నాడు. "నలభై దాటిన మగవాడు స్కౌండ్రల్" అని. చదువుకొని ఉద్యోగాలు చేసే యువతులి లాంటి ఆకర్షణలకు లోనయే ముందు బాగా ఆలోచించుకోవాలి. భార్య ఉన్న పురుషుడి ఆకర్షణలో పడడం అంటే మరో స్త్రీకి ద్రోహం చెయ్యడమే కాకుండా తమను తాము కించపరుచుకోవడమేననే విషయాన్ని గుర్తించాలి.

 Previous Page Next Page