"అమ్మా ! మీరు విధ్యాధికులు . మహిళా లోకానికి ఆదర్శప్రాయమయినవారు. నా గురించి ఆదరంతో అలోచించి నాకు మంచి చేయాలని సంకల్పించినవారు. వయసులో ఉన్న ఆడపిల్ల మంచి చెడుల గురించి ఆలోచించవలసిన తల్లి నాకు లేదు. ఆ తల్లి నాకు మీరే అన్పించినారు. నేను మిమ్మల్ని తల్లి లాగే భావిస్తాను. మీ మాటను అలాగే గౌరవిస్తాను. నన్ను "ఏం చేయమంటారో చెప్పండి" అన్నది జ్యోతి . ఆ మాటలకూ శ్రద్దాదేవి కనులు చేమరించినాయి.
అడుగు కదపటం మరచిపోయిందామే.
ప్రతి ఆడదాని జీవితం లోనూ ఒక సమయాన మనసుని శాసిస్తుంది. మాతృత్వం తాలుకూ మహత్వపూర్ణమయిన ఆకాంక్ష. ఆ స్పందనలు ఫలించి సఫలీకృతమయిననాడు బ్రతుకులో నిండుదనం వస్తుంది.
అటువంటి మహత్వపూర్ణమయిన మాతృత్వమనే పదవి నుంచి వంచితురాలయింది శ్రద్దాదేవి. బ్రతుకులో కొన్ని కఠినమయిన లక్ష్యాలను విధించుకుంది.
వాటిని సాధించేందుకు , అన్ని ఆశలకు, అరాతాలకు, దూరంగా ఒంటరిగా మిగిలిపోయింది. ఈనాడు అమరావతినించి ప్రారంభమయిన ఒక సాధారణ పడవ ప్రయాణంలో అసాధారణమయిన లక్షణాలతో ఈ పిల్ల కనిపించింది. ఎంత చక్కని రూపం; చూస్తె ప్రతి కదలికలోనూ అప్సరసలు నాట్యం చేసినట్లు అనిపిస్తోంది.
ఎంత చక్కని కంఠస్వరం. పలికితే యక్షిణులు గానం చేసినట్లుంది. వీణ మీద వేదనాదాలు పలికించినట్లు మాధుర్యం వోలుకుతోంది అంతేకాదు !
ఈ మాటలు ఎన్నడో కర్తవ్యాల వెనుక కన్ను మూసినా తనలోని మాతృత్వ మహత్వపూర్ణమయిన ఆకాంక్షను వెన్నుతట్టి నిద్రలేపుతున్నాయి.
అమ్మా!!! ఎంత తీయని అనుభూతి. ఆ రెండక్షరాల వెనుక ఎన్నెన్ని మాధుర్య సింధువులు దాగున్నాయో!
ఇప్పుడు అవన్నీ నిద్రలేచి జూలు విదిల్చిన సింహాల్లా మనసు మీద దాడిచేస్తున్నాయి. ఇంతకాలంగా ఎన్నో కఠినతరమయిన పరీక్షలను ఎదుర్కొని మనసుని స్థిరంగా కర్తవ్యాల మీద నిలుపుకుని సాధించిన ఈ ప్రొఫెసర్ పదవి ఇచ్చిన తృప్తిని ఆ పదవి ముందు ఎంత అనిపిస్తోంది.
అమ్మా! అనే రెండక్షరాల పిలుపుతో ఏనాడో మనసు పొరల మధ్య పాతుకుపోయిన దివ్యమయిన అనుభూతులు పైకి తేలి వచ్చాయి. ఏమిచ్చి ఈ అపురుపమయిన అమ్మాయి ఋణం తీర్చుకోవాలి. అనుకుంది శ్రద్దాదేవి.
"డియర్ జ్యోతి! ప్రతిభ కలిగిన వారు ఏమైనా చేయగలరు. నీవు ఏమి చేయగలవో తెలియాలి అంటే ముందు ఈ చేస్తున్న పనిని అపు చెయ్యాలి.
అడబ్రతుకులూ, మరువరాని, మరుపురాని అర్ధాలను మరచిపోయిన దురదృష్టవంతురాలను నేను. అమ్మా! అని పిలిచి ఆ మరచిపోయిన మధురానుభూతులను మళ్ళీ జ్ఞాపకం చేసినావు. నీకు ఏమిచ్చినా రుణం తీరదు తల్లీ! నాతొ రాగలవా?" అని అడిగిందామె.
జ్యోతి ఆమె వంక విచిత్రంగా చూసింది. ముఖాన్ని రవంత అవనంతగా చేసి కొంతసేపు ఆలోచనామగ్నురాలాయి అక్కడే ఉండిపోయింది.
"అమ్మా! మీరు అన్నీ తెలిసినవారు. తల్లిదండ్రులు నన్ను ఒంటరిదాన్ని చేసి పోయాక ఈ లాంచిని నమ్ముకుని బ్రతుకుతున్నాను. అందివచ్చిన అవకాశాన్ని ఆశ్రయిన్చుకున్నాను. యిలా బ్రతికేయటమే కాని, ఈ బ్రతుకులో పొందగలిగినది ఏమిటో, పోగొట్టుకున్నది ఏమిటో నాకు తెలియదు.
"నామీద నమ్మకముంచి మీరు రమ్మంటున్నారు. కాని నా వెనుక ఉన్న కధ గురించి మీకు తెలియదు కదా! నాకు మీరు చూపాలనుకున్న దారి ఏమిటో, నాపై మీరు ఉంచాలనుకున్న బాధ్యత ఏమిటో నాకు తెలియదు. ఉన్నదాన్ని ఒదులుకుని లేనిదాని కోసం పరుగెత్తాలనుకున్న ఆరాటం నాకు లేదు. నన్ను ఇలాగే బ్రతకనివ్వండి" అని చెప్పింది జ్యోతి.
అంతకు పూర్వమే శ్రద్దాదేవి కనులలో వున్న మెరుపులు మాయమయినాయి. నిరాశగా చూసిందామె.
"ఎప్పుడయినా రావాలని అనిపిస్తే తప్పక నా దగ్గరకు రా తల్లీ!" అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ అందించి వెళ్ళిపోయింది శ్రద్దాదేవి. ఆమె కనుమరుగై వెళ్ళి పోయేదాకా అలాగే చూస్తూ వుండిపోయింది జ్యోతి.
ఆ తరువాత తిరిగి లాంచి మీదకు చేరుకుంది. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. ప్రయాణికులు ఎవరూ లేరు. అవసరమయే చిన్న చిన్న పనులు చూసుకుందుకు నియమించిన పని పిల్లవాడు రమణ జోగుతూ బల్ల మీద కూర్చుని వున్నాడు.
"లేచి అన్నం తిని పడుకో" అని హెచ్చరించి తాను డెక్ మీదికి పోయి కూర్చుంది జ్యోతి. ప్రొఫెసర్ శ్రద్దాదేవి గురించిన ఆలోచనలతో మనసంతా నిండిపోయింది.
దీర్ఘతరమయిన ఓ ఊర్పు విడిచి వెనుకకు జేరగిలపడిపోయిందామె. ఈ బంధాలు ఎందుకు ఏర్పడుతాయో, అర్ధం కాదు. జన్మజన్మల శాఖా చంక్రమణంలో చావు పుట్టుక లనేవి చిన్న చిన్న మజిలీలు. చావు పుట్టుకల మధ్య నడిచే జీవితకాలం ఆత్మ చరిత్రలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే!
ఒకరిని ప్రేమించేందుకయినా, ద్వేషించెందుకయినా అసహ్యించుకునేందుకయినా అనూహ్యమైన కారణాలేవో ప్రేరేపిస్తాయి. మనసు పొరల్లో కదులాడే ప్రతి చిన్న కదలికకూ వెనుక అగధమయిన రహస్యమయమయిన చరిత్ర లేవో ఉంటాయి. అవే హృదయగతమయిన స్పందనలను శాసిస్తాయి. ఈ ప్రొఫెసర్ శ్రద్దాదేవి తనపై అటువంటి అత్మీయతాభావాన్ని ప్రదర్శించటానికి అటువంటి ప్రేరణలోవో కారణమయి వుంటాయని ఊహించింది జ్యోతి.
తాను ఒంటరి. ఆమె ఒంటరి!
ఆ ఒంటరితనమే ఇద్దరి మధ్య ఆకర్షణ కావచ్చు!
కాని అంతగా ప్రేమించి ఆదరించేందుకు సంసిద్దురాలాయిన సౌజన్యమూర్తి ప్రొఫెసర్ శ్రద్దాదేవి కోరికను మన్నించలేని స్థితిలో తానుండి పోయింది.
తన దురదృష్టకరమయిన స్థితికి తానే జాలిపదిపోయింది జ్యోతి. తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి. ఆ మాటలే అడ్డు నిలవకపోతే ఈనాడు శ్రద్దాదేవి అమృతమాయమయిన హృదయంతో ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించవలసివచ్చేది కాదు.
మృత్యువు అనే చల్లని నీడ తండ్రి మీద పరచుకుంటూ ఉండగా తుది క్షణంలో చావు బ్రతుకుల సంధ్యలో తండ్రి తనను దగ్గరగా పిలిచాడు.
"అమ్మా! నీ తల్లి చనిపోయినది మొదలు నీకు తండ్రి అయినా, తల్లి అయినా నేనే అనుకున్నాను. నిన్ను చదివించి యోగ్యురాలుగా, నీకు పెళ్ళి చేసి గృహిణిగా , నీకు బిడ్డలు పుట్టాక మాతృమూర్తిగా నిన్ను చూడుకుని బ్రతుకులో అర్దాలన్నింటిని అందుకున్న తృప్తితో చనిపోవాలనుకున్నాను. కాని విధి అనే వేటగాడు నా బ్రతుకు మీదికి బాణం ఎక్కు పెట్టాడు. నాకు తుది ఘడియలు సమీపించినాయి. నిన్ను యీ సువిశాలమయిన ప్రపంచంలో ఒంటరిగానే ఒదిలిపోతున్నాను. నా గురించిన జ్ఞాపకాలు తప్ప నీకు ఇంకెవ్వరూ తోడు? తల్లీ! సువిశాలమయిన ఈ ప్రపంచం అడవి లాంటిది. ఇందులో అనేక వన్య మృగాలు ఆవులించి కోరలు చాచుకుని ఎదుటి వారి సర్వస్వాన్ని మ్రింగి వేసేందుకు సంసిద్దమయి వుంటాయి.
నేను ఏ ఒక్క వ్యక్తినీ నిందించటంలేదు. మనిషిలోని స్వార్ధమే క్రూరమృగం. దురాశ తోడేలు వంటిది. క్షణికమయిన శారీరక సుఖం కోసం అందివచ్చిన అడ బ్రతుకుని అపవిత్రం చేయటమనే ఆలోచన మనవరక్తం రుచి మరిగిన మృగరాజు వంటిది.