తల్లీ: ఈ ఆలోచనలున్న మనుషుల మధ్య నీవు ఒంటరిగా మిగిలి పోతున్నావు. కానీ ఎన్నడూ , దేనికీ భయపడకు.
ధైర్య సాహసాలు రక్తమంసాలుగా, నిజాయితీ ఊపిరిగా జీవించు, నేను నీకు ఇచ్చే ఆస్తిపాస్తులు విషాదపూర్వమయిన జ్ఞాపకాలు మాత్రమే! ఇంతకాలం మన కుటుంబాన్ని పోషించిన ఆ లాంచి ఒక్కటే నీకు జీవనాధారం.
దాన్ని ఎలాంటి స్థితిలలోనూ వొదులుకోకు.
నిన్ను ఎన్నడయినా ఆపదలు చుట్టిముట్టి ఎదురు ఆయె సమస్యలను సమాన్యయించుకునేందుకు నీకున్న శక్తి సంపన్నత చాలకపోవచ్చు. అల్లాంటి సమయంలో నా తండ్రి సంపాయించి యిచ్చిన యీ పాత లాంచి నిన్ను కాపాడుతుంది.
`నా తండ్రి నాకు యీ లాంచి అప్పగిస్తూ యిదే మాట చెప్పాడు.
ఈ లాంచీలో కొన్ని చోట రహస్య మయిన అరలున్నాయి. సరంగులు విశ్రాంతి కోసం కూర్చునే బల్ల ఒకకావడి పెట్టెలా వుంటుంది. నీకు తెలుసు కదా, ఆ కావడి పెట్టె మీద ఒక వంక సర్పాకృతులు చెక్కి వున్నాయి.
అవి పెనుబాములు!
ఆ సర్పాకృతులు పడగలు కలుసుకునే చోట ఒక రంద్రం వున్నది. ఎప్పుడయినా ఆపదలు చుట్టి ముట్టినప్పుడు ఆ రంద్రాన్ని వంచిన ఊచతో త్రిప్పాలి. అప్పుడు కూర్చునే బల్లలా కన్పించే కావడి పెట్టె తెరచుకుంటుంది. పెనబాములు చెక్కిన ఆ తలుపులు దూరం అవుతాయి. అందులో ఏదో నిధి వున్నదట.
ఆ నిధి ఎలాంటిదో నాకు తెలియదు. నా తండ్రి చనిపోతూ నాకు దాని గురించి వివరించాడు. కాని దాన్ని తెరువవలసిన అవసరం నా కెన్నడు రాలేదు. నీకయినా నీవు పరిష్కరించుకోలేని సమస్యలు ఎదురయినప్పుడే దాన్ని తెరచే ప్రయత్నం చెయ్యాలి.
నా తండ్రి సర్పాలను ఉపాసించేవాడు. అతడు ఆర్జించిన సంపదలేమీ లేవు. అందు నించి 'నిధి' అని పిలువబడే దానిలో ధనరాసులుంటాయని మాత్రం ఊహించకు.
అవసరమైన ఆసక్తి పెంచుకుని సమయం కాని సమయంలో దాన్ని తెరచి చూడాలని ప్రయత్నించకు. నా తండ్రి యిచ్చిన నియమాన్ని నేను జీవితకాలం పాటించాను. ఈ నియమాన్ని నీవు కూడా జీవితకాలం పాటించగలవని వాగ్దానం చెయ్యి తల్లీ" అంటూ చేయి ముందుకు చాచాడు.
తాను అప్పటికప్పుడు తండ్రి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసింది." "నాన్నా నీవు చెప్పినట్లే చేస్తాను" అన్నది . అంతటితో అతని హృదయం ఊరడిల్లింది.
మరి కొద్ది క్షణాలకే అతని శ్వాస ఆగిపోయింది.
2
చల్లని మృత్యువు కౌగిలిలో శాశ్వతంగా ఓదిగిపోయినాడు తండ్రి. అతని జ్ఞాపకాలతో పాటుగా చెప్పిన రహస్యం పదిలంగా మనసు లో నిలిచిపియింది. ఏటి మీది బ్రతుకు అటు పోటుల మధ్య సాగుతోంది. అటువంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ శ్రద్దాదేవి "నీవు నాతో వచ్చెయ్యి" అని పిలిచింది. అది కన్నతల్లి పసిబిడ్డ కోసం చేతులు చాచితే బిడ్డను ఆకర్షిన్చినంతగా తనను ఆకర్షిస్తోంది.
కాని తను ఎలా పోగలదు? సర్పకృతుల వెనుక దాగి వున్న విధి కోసమయినా తాను పడవ మీది బ్రతుకుని కొనసాగించాలి. నిరంతరమయిన యాత్రీకురాలిగానే ఉండిపోవాలి.
జ్యోతి ఆలోచనలు చాలించి క్రిందికి దిగి వెళ్ళింది. రమణ ఒళ్ళు మరచి నిద్రా ముద్రలో మునిగి వున్నాడు. సరంగులు విశ్రాంతి అవుసరమయినప్పుడు కూర్చునే బల్లకు దగ్గరగా వెళ్ళి దాని వంక చూచింది . తలుపుల మీది సర్పాకృతులు రెండూ ఒకదాన్ని ఒకటి కావలించుకున్నాయి. శరీరాలు పెనవేసుకున్నాయి. పడగలు పైకి విప్పార్చి ప్రేమగా ముద్దాడుతున్నట్టు అగుపించినాయి.
వాటివంక రెప్పవేయక చూచింది జ్యోతి.
అలల తాకిడికి అలవోకగా ఉయ్యాలలా ఊగుతోంది లాంచి. మనసులో మరొకమారు తండ్రి చెప్పిన మాటలు స్మరించి రమణ పడుకున్న బల్లకు ఎదురుగా మరొక బల్ల మీద పడుకుంది జ్యోతి.
విండోస్ అన్నీ మూసి వున్నాయి. కొబ్బరి పీచుతో ముతకబట్టతో తయారయిన దిండు తల క్రింద ఎత్తు పెట్టుకుంది. రవ్వంత సేపు అయ్యాక తండ్రి గురించి శ్రద్దాదేవి గురించి కలగలపు అయిన ఆలోచనలతో నిద్రలోకి జారిపోయింది.
చందమామ మబ్బులచాటుకి తప్పుకున్నాడు. ఏటి మీద నీలి నీలి జలాలపై చీకటి నీడలు పరచుకుంటున్నాయి. చీకటి గుంపులు రాక్షసుల్లా దూరదూరాల నుంచి తరలి వస్తున్నాయి.
హైదరాబాద్ వెళ్ళే రోడ్డు మీద నియాన్ దీపాలు పట్టపగలులా మిరుమిట్లు గొలిపే కాంతుల్ని చిమ్ముతున్నాయి. రోడ్డు మీద వొచ్చే పోయే కార్లు, లారీలు, పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. కాని అద్దాల కిటికీలు మూసి వుండటం నించి ఆ శబ్దాలు లాంచి లోపలకు రావట్లేదు.
రమణ గాడంగా నిద్రపోయినాడు. జ్యోతి పగలంతా అలసిపోయి ఉండటం వల్ల గడతరంగా నిద్రను కౌగలించుకుంది.
అర్ధరాత్రి అవుతూ వుండగా నిద్రపోతూ ఆదమరచిన జ్యోతి మనసు పొరలలో కదలికలు ప్రారంభమయినాయి.
మనుషులకే కాదు ఏ ప్రాణికయినా రెండు జీవితాలు. మొదటిది బాహిరమయిన ప్రాపంచిక జీవితం. రెండవది మనో మయమయిన జీవితం. జాగృతిలో ఉండగా చేసే ఆలోచనలు మనోమయ జీవితం కాదు. అవి కేవలం ప్రాపంచికమయిన స్పృహతో చేసే ఆలోచనలు.
ప్రాపంచిక మయిన స్పర్శను మరచి, బహిరమయిన ఒత్తిడులూ స్ప్రుహాలు లేకుండా సహజమయిన మనోమయ ప్రపంచం తాలుకూ కదలికలు నిద్రలోనే ప్రారంభమవుతాయి. వాటిలో కొన్ని కలలుగా కనిపిస్తాయి.
జ్యోతిలో ఆ కదలికలు ప్రారంభమయినాయి. సుప్త చైతన్యం నిద్రలేచింది. ఆంతరంగిక మయిన లోకం వాకిలి తెరుచుకుంది. ఆ కదలికలన్నీ కలలాగ ఆమె మనోనేత్రం ముందు ప్రత్యక్షం కాసాగినాయి.
అదొక తెల్లని ఆకృతి. దూరాన మినుకుమినుకు మంటూ చుక్కలా కన్పించి క్రమేపి దగ్గర అయింది. బాగా దగ్గర అయాక దవళవర్ణం ఒక ఆకృతిని సంతరించుకోసాగింది.
ఆ ఆకృతి క్రమంగా తండ్రి రూపాన్ని సంతరించుకుంది.
జ్యోతి తానెమో ఆదమరచి నిద్రాముద్రలో వుంది. మనోపటలం మీద ప్రత్యక్షమవుతున్న దృశ్యంలో ఆమె తనకు తానె ఒక చిన్న పాపలా కంపించసాగింది.
ఆ చిన్నారి జ్యోతి తన వంక దూసుకువచ్చి తండ్రిలా ఆకృతి మార్చుకుంటున్న కాంతి పుంజాల వంక రెప్ప వేయక చూస్తోంది. దవళకాంతులు పూర్తిగా మారి తండ్రి అయినాయి.
తండ్రి ప్రేమ నిండారంగా చిక్కని నవ్వు నవ్వాడు. నిద్రలో వున్న జ్యోతి మనో పటలం మీద ప్రత్యక్షమయింది చిన్నారి జ్యోతి తండ్రి నవ్వుకు బదులుగా తాను కూడా నవ్వింది.