Next Page 
బ్లాక్ టైగర్ పేజి 1

                                 

   
                          బ్లాక్ టైగర్

                                                          లల్లాదేవి.

                  

    ఆకాశం చిల్లులు పడింది. ఫెళ ఫెళ ఫెళ!!
    దిక్కులు పగిలిపోతున్నాయి. ధన్ ధనా ధన్!!
    నూరు పిడుగులు ఒకేసారి పడుతున్నట్లుగా అనిపించింది. భూకంపం వచ్చిందా ? భూమి బ్రద్దలవుతోందా? అన్నట్లు ప్రక్కలున్న భవనాలన్నీ గజగజ వణికాయి.
    క్షణకాలం ప్రకృతి నిర్ఘాంతపడి నిలచిపోయింది. పరిసరాలు దట్టమైన మేఘాలు క్రమ్మినట్టు నల్లని పొగతో అవరించినాయి.
    కనివిని ఎరుగని విప్సోటం! జనమంతా రాతి బొమ్మల్లా నిలిచి పోయినారు. మరుక్షణం చైతన్యం తెచ్చుకుని కాలికి దొరికిన దారుల వెంట పరుగు తీస్తున్నారు. "యహా సే నికల్ జావ్!భాగో ......భాగో!!" ఒక అరుస్తూ వీధుల వెంట పరుగు తీస్తున్నాడు.
    ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచాయి. ఆకాశంలోకి లేచిన  ముక్కలు, యినుప ఊచలూ, సిమెంటు పెచ్చులూ క్రిందికి వచ్చి పడుతున్నాయి.   
    "బాంబు! బాంబు! బాబోయ్ బాంబు ప్రేలింది ! పరుగెత్తండి ! పరుగెత్తండి!" జనం రద్దీగా ఉండే ఆవీధిలో అలజడి చెలరేగింది సముద్రంలో పిడుగు పడినట్లుగా అయింది.
    సాయికృప కాంప్లెక్స్ పేలిపోయింది. ఆ విస్పోటానికి విభ్రాంతులై పరుగులు తీస్తున్నారు జనం!
    ఆవురావురామని ఏడుస్తున్నారు కొందరు!
    భవనం పునాదులు కూడా బీటలు వారాయి.
    "అయ్యో! అయ్యో! పాపకి గుండాగిపోయింది. ఆ రాకాసి మోత వింటూనే ఉలికిపడి కళ్ళు పెద్దవి చేసింది. అంతే! ప్రాణం పోయిందిరో దేముడోయ్!" ప్రేగులు త్రెంచి పోసి జన్య యిచ్చిన తల్లి గుండె లవిసేలా ఏడుస్తోంది.
    ఆ క్రితం రాత్రే తొలిరాత్రి జరుపుకున్న ఓ క్రొత్త జంట బయటకు రావటానికి సిగ్గుపడి గదిలోనే ఓ మూల ప్రాణ భయంతో బిగుసుకు పోయారు.
    పిల్లలు, ఆడవాళ్ళు ఏడుస్తూ సాయికృప పరిసరాలోంచి గుంపులు కట్టి వీధిలోకి వస్తున్నారు. భవనమంతా మంటలు అలుముకున్నాయి. పెనుమంటలు గగనానికి లేస్తున్నాయి.
    విస్పోటం జరిగి అయిదు నిముషాలయింది. ఎక్కడెక్కడ జనమూ పరుగుల మీద ఆ వీధిలోకి వస్తున్నారు.
    సైకిళ్ళు, రిక్షాలు, ఆటోలు, కార్లు త్రోక్కిసలాట అవుతోంది. ఆ కొద్ది నిముషాల్లో కొన్ని వేల మంది వచ్చారు.
    కొంతమంది యువకులు సాహసంతో నడుం కట్టారు.
    భవన శిధిలాల్లోంచి పెనుమంటల్లోంచి ముందు మనుషుల్ని ప్రాణాలతో బయటకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు దూరంగా ఉండి సలహాలు యిస్తున్నారు.
    క్షణం క్షణం మంటలు పెద్దవై మింటికి లేస్తున్నాయి.
    ఆ వీధిలో షాపులన్నింటిలో బల్బులు, ట్యూబులు పగులుతున్నాయి మంటలు చుట్టూ అంటుకున్నాయి.
    టప్! టప్! ఫట్! ఫట్!! మోతలు విన్పిస్తున్నాయి. మరికొద్ది నిముషాలకి ఎస్.ఎస్. లో ఫీజులు మాడి కరెంట్ ఆఫ్ అయిపొయింది. ఆ చుట్టూ పక్కల ఇళ్ళు తగలబడుతున్నాయి.
    ప్రక్క షాపుల వాళ్ళు హాయిగా గాల్చి పీల్చి వదిలారు.
    "నా మొగుడు గదిలోనే వుండిపోయాడు . మంటల మధ్య చిక్కుకు పోయాడు! బాబోయ్ రక్షించండి, రక్షించండి"
    "మా పాప పరుగెడుతూ రెండో అంతస్థులోంచి క్రింద పడిపోయింది ! హెల్ప్ హర్! సేవ్ మై బేబీ!" తన చీరకు నిప్పుంటూకున్నా చుట్టూ మంటలు పూల్కరిస్తున్నా లెక్క చేయకుండా పాప కోసం పరితపిస్తోంది ఓ మాత్రు హృదయం!
    "అమ్మ ఆ గదిలో ఉండిపోయింది. వెళ్ళి తీసుకొస్తాను" జనం లోంచి మంటల్లోకి దూకాలని ప్రయత్నిస్తున్నాడో యువకుడు.
    "అత్త కోసం మంటల్లోకి పోకండి! మీరు కూడ నాకు దక్కరు. నా మాటలు వినండి! నా మాంగల్యం! నా పసుపు కుంకాలు !" అంటూ భర్తని ఉడుం పట్టు పట్టి నిలువరించింది ఓ యిల్లాలు!!
    మంటలు మరింత పైకి లేచినాయి.
    వస్తువులతో పాటుగా మనుషులు కూడ తగలబడి పోతున్న పొగ వాసన వ్యాపించింది. వీధి అంతా కమురు కంపు! ఎందరు వచ్చారో? ఎందరు పోయారో!?
    అగ్నిజ్వాలలు భీకరమయిన స్థాయికి వచ్చాయి. పోయినవాడు పోగా మిగిలిన వారు ఆశలు వదులుకున్నారు. ఒకరిద్దరు సాహసించాలని ప్రయత్నించినా , చూచేవారు వద్దంటున్నారు. కదలకుండా పట్టుకుంటున్నారు ఆపేందుకు.
    "మంటలు అన్ని గదుల్లోకి వచ్చాయి. పోకండి! ఆ మంటల్లోకి పొతే మరెన్నటికీ తిరిగి రాలేరు"
    ఆ జ్వాలవైపు చేతులు జాపుతూ విలపిస్తున్నారు.
    తల్లుల్ని కోల్పోయిన పిల్లలు!
    పిల్లల్ని కోల్పోయిన తల్లులు!
    భర్తల్ని కోల్పోయిన భార్యలు!! పసుపుకుంకాలు తడుచుకుపోయి అ ఆపైన గర్భశోకం కూడ కలిగిన వంచితులు! దీనులు! అరుపులు! ఆక్రందనలు!!
    "గణగణగణ! గంటలు విన్పించినాయి. అమితమైన వేగంతో జన సముద్రాన్ని చీల్చుకు వచ్చాయి పైరింజన్ లు!
    ఫైర్ స్టేషన్ సూపరింటెండెంట్ క్రిందికి దూకాడు. ఫైర్ మాన్ లు పుల్ డ్రస్ లో సింహాల్లా దిగి వచ్చారు.
    "అయ్యా రక్షించండి"
    "బాబూ కాపాడండి" దేవుడా మమ్మల్ని దయచూడు!"
    ఇంకా తమవాళ్ళు. తమ ఆస్తులు మిగిలి ఉంటాయన్న ఆశతో శోకిస్తున్న జనం వెంట పడ్డారు.
    "హాటావ్ ! హటావ్! భాగో ! దూర్ చలో !! హమారా కామ్ కర్నేదో! అరె బాబా!! హఠ్ ! హఠ్" చుట్టు ముడుతున్న అర్తుల్ని ఒత్తిగించుకుని కర్తవ్యమ్ వైపుగా దూసుకు పోతున్నారు ఫైర్ మెన్.
    గందర గోళ పడుతున్న జనం లోంచి ఫైరింజన్ సాయికృప క్లాంప్లేక్సు ఆవరణలోకి చొచ్చుకు పోయింది. పొజిషన్ చూచి సుపరింటెండెంట్ నిర్ణయించాడు. ముందుగా క్రింది నించే మంటలమీద దాడి చెయ్యాలి!
    ప్రక్క వాటాల్లో మనుషులు కాపురాలుంటున్నారు. పై అంతస్తుల్లో అన్నీ అఫీసులే!
    "ప్రొసీడ్! అటాక్!" ఆర్డరిచ్చాడు. సుదీర్ఘమయిన వాటర్ పైపుల్ని యిడ్చుకుంటూ పైర్ మెన్ భవనం నాలుగు దిక్కులకీ దూసుకు పోయాడు.
    క్రేన్ చివర తగిలించిన హుక్ వ్రేలాడుతోంది. ఉక్కు తీగలతో అల్లిన వల! దాన్లో పైపులు పుచ్చుకుని ఇద్దరు కూర్చున్నారు. క్రేన్ పైపైకి లేచింది. పైపులు నీరు చిమ్మాయి. మొదటి అంతస్థులో అగ్నికీలలు తగ్గుముఖం పట్టాయి. గ్రౌండు ఫ్లోర్ లో మంటలు పూర్తిగా చల్లారాయి. నల్లగా కన్పిస్తోంది. యింకా పొగ వస్తోంది. 

Next Page