మిస్ మార్లిన్ ఫ్రాన్సుదేశంలో పుట్టిన అందమయిన యువతి ఆమెకు యీ మధ్య భారతదేశం గురించి కలలు రావటంనించి భారత దేశాన్ని చూసి తీరాలన్న పిచ్చి పట్టుకుంది.
ఆ కలలకీ, పిచ్చికీకూడా కారణం లేకపోలేదు.
ఆ కారణం ఏమిటంటే రెండువందల సంవత్సరాల క్రితం ఆంద్ర దేశంలో ఒక ముఖ్యమయిన యుద్దానికి కారణమయిన బుస్సీదొర తాలూకు కొన్ని కాగితాల్ని, ఆమె తాతగారు సంపాదించైనా పాత కాగితాలలో చూచి చదవటం.
అదీకాక ఆ క్షణంనించీ మార్లిన్ కి తాను కొంతసేపు మార్లిన్ ని అని అనిపిస్తుంది. మరికొంతసేపు మల్లమ్మదేవిని అనిపిస్తుంది. మల్లమ్మదేవి అద్బ్జుత స్త్రీమూర్తి-బొబ్బిలిరాణి.
మార్లిన్ ఫ్రెంచి యూనివర్శిటీలో పారా సైకాలజీలోని ఒక విభాగ మయిన ఐ.ఎస్.పి. మీద రీసెర్చి చేస్తోంది. బహుశా ఆ కారణం వల్లనే తన కిలాంటి కలలు కాబోలు అనుకుంది చాలాకాలం. అలాగే అని సరిపెట్టుకుంది.
కాని క్షణ క్షణం బొబ్బిలిమంటలు. మల్లమ్మ అరుపులు, భారత దేశం! అందునా ఆంధ్రదేశం! అందునా కళింగదేశం! అందునా ఆడవాళ్ళ ఆర్తనాదాలు! యివేమీ పారాసైకాలజీకి సంబంధించినవి కావు. నిజంగానే వాటికి, తనకూ యేదో సంబంధం వున్నదనే నిశ్చయానికి వచ్చి ఫ్రాన్సులో వుంటున్న ఒక తెలుగు రాణిగారి దగ్గరకు వెళ్ళి తన బాధని ఫ్రెంచిలో చెప్పుకుంది.
అప్పుడు ఆ రాణిగారికి కొన్ని తెలుగుపదాలు విన్పించినాయి. రాణి మిస్ మార్లిన్ నోటివెంట విన్పించే ఆ తెలుగుపదాలు విని ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది. ఆ పదాలు యేమిటంటే....
"హర హర మహదేవ, నారాయణా! నారాయణా, జై పరమేశ్వరా, జై శాంభవీ, చంపు, కొట్టు, కాల్చు, చీల్చు" యివికాక ఘోర మయిన స్త్రీల ఏడ్పులు.
ఇవి విన్న తెలుగురాణి రాటలా అయిపోయింది.
ఆమె జన్మస్థలం పిఠాపురం. పేరు సీతాదేవి.
అందువల్ల ఆమె మార్లిన్ వంక అబ్బురంగా చూస్తూ "వాటీజ్ యువర్ ఇండియన్ నేమ్ యిన్ యువర్ డ్రీమ్స్?" అని యింగ్లీషులో అడిగింది.
"మలామ, మల్లామ, మల్లామ్మ, మల్లమ్మ" అన్నది మార్లిన్ ఫ్రెంచి యానను తెలుగు పదానికి ఖచ్చితంగా సరిచేసుకుంటూ.
అప్పుడు ఆ రాణిగారు "చిత్రంగానే వున్నది. యిది నిజంగా రెండు వందల సంవత్సరాల క్రితం మా తెలుగుదేశంలో జరిగిన కధ. అయితే జన్మలూ, జన్మాంతరాలూ వున్నాయన్నమాట" అన్నది చూపుల్ని శూన్యం లోకి గ్రుచ్చుకుంటూ.
"యస్ మిసెస్ సీతాదేవి! నేను పారా సైకాలజీ స్టూడెంట్ ని అయినా చాలారోజుల వరకూ యీ విషయాన్ని నమ్మలేదు. యిప్పుడు నమ్మటం అనివార్యం అనిపించుతోంది. దయచేసి ఆ మలామ కథ యేమిటో నాకు చెప్పండి" అన్నది మార్లిన్.
సీతాదేవి చిరునవ్వు నవ్వుకుంటూ "ఆమె పేరు మలామ కాదు మల్లమ్మ మల్లమ్మదేవి" అంటూ సరిచేసింది.
రాణిగారు పెదవులమీది చిరునవ్వు చెరిగిపోకుండా ఆ కధ అంతా మార్లిన్ కి విన్పించింది. కధ అంతా విన్న తరువాత మార్లిన్ అన్నది.
"మల్లమ్మదేవి చావటం అన్యాయం. ఘోరం! అందుకే కాబోలు నాకు నిప్పు అన్నా, మంటలన్నా భయం. ఒళ్ళు జలదరిస్తుంది. చివరకు సిగరెట్ లైటరు అన్నాకూడ భయమే! నేను సిగరెట్లు కాల్చను తెలుసా సీతాదేవీ! ప్లీజ్ నాకు తెలుగు నేర్పరూ!" అంటూ ప్రాధేయపడింది మిస్ మార్లిన్.
సీతాదేవి అదే చెరగని చిరునవ్వుతో తన ఒప్పుదలను ఆమెకు తెలియ చెప్పింది. మిస్ మారిన్ కి సంతోషమయింది.
ఆ విషంగా తెలుగు నేర్చుకోవటంతో ప్రారంభమయిన మార్లిన్ కధ అనంతరం భారతదేశ పర్యటనగా పరిణమించింది బాంబేలో విమానం దిగిన తక్షణం విశాఖపట్నం బయలుదేరి రావటం జరిగింది. విశాఖనించి రాయపూర్ పాసింజర్ లో కళింగదేశాన్ని చుట్టుకుని మళ్ళీ ఫ్రాన్స్ వెళ్ళాలనే యిప్పటికి ఆమె వుద్దేశం.
ఎన్ని నిదర్శనాలు యెన్ని విధాలుగా కనపడ్డా ఆమె హేతువాదం ఆమె పారా సైకాలజీని మించిపోయింది కనుక మార్లిన్ ఇంకా మోడరన్ యువతిగానే మిగిలిపోయింది.
ఆయితే రైలు యెక్కింది మొదలు రైలు చక్రాల మ్రోతలోంచి ఆమెకొక వింతధ్వని వినిపించటం మొదలుపెట్టింది ఆ శబ్ధాలు వింటూ వుంటే వుద్రేకం అధికం అయింది. కళ్ళు ఎర్రబడినాయి వుచ్చ్వాస నిశ్వాసాలు వేగిరం అయినాయి. శరీరం వణుకుతోంది.
ఫ్రెంచి వైన్ తాగినంత మత్తు ఆవరించింది. ఆ మత్తులో, ఆ వుద్రేకంలోనే ఆ శబ్దాలని జాగ్రత్తగా వినటం మొదలుపెట్టింది మార్లిన్. ఫుల్ .... ఫుల్ .... పులి .... పులి ..... పులి, పులి, పులి, బెబ్బులిపులి ......దిగ్ దిగ్ దిగు ...... దిగు దిగు దిగు ........ రారారా ..... . బెబ్బులిపులి ....... దిగు దిగ్ దిగ్ ..... రారారా ...... రారారా ....... బెబ్బులి ...... . బెబ్బులి ........ బెబ్బులి పులి ..... ...... మల్లమ్ మ ...... మల్లమ్ మ....... మల్లమ్ మ...... రారారా ....... రారారా ....... . దిగు దిగు దిగు ....... దిగ్ దిగు దిగ్ .....
ఆ శబ్ధాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. చెవుల్లో హోరు యెత్తి చినాయి. రెండు వందల సంవత్సరాల క్రితం తన బ్రతుకు, తన అంతర్యం, ఆంతర్యంలోని అగ్నిజ్వాలలు, తన రాణీతనం, తన తల్లి తనం, అన్నీ కలిసి.......ఓహ్.......రంగారావు.......అవును రంగారావు. ఎస్. రంగారావు..... ఎస్ దట్ బౌబ్బిలి కింగ్ రంగారావు.