Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 2

 

    "ఆ గదిలోకి వెళ్ళకు. నా గదిలో పడుకో!" అన్నాడు ప్రభాకర్.
    "ఎందుకు?"
    "అడ్డు ప్రశ్నలు వెయ్యకు? చెప్పినట్లు విను!"
    ఆ స్థితిలో కూడా తండ్రి అజ్ఞా స్వరాన్ని ధిక్కరించ లేక పోయాడు వేణు. పిల్లిలా తండ్రి గదిలోకే వెళ్ళిపోయాడు.
    తన కొడుకును అదుపులో పెట్టగలిగే శక్తి వుండీ చేజేతులా పాడుచేసుకున్నాడు. నిజానికి ఈనాడు వేణు ఇలా తయారవటంలో తన బాధ్యత లేదా? అతని అంతరాత్మ అతని నెప్పుడూ వేధించే ప్రశ్న అది.
    డాక్టర్ బయటికి కొచ్చాడు.
    "ఎలా వుంది డాక్టర్?" అని అడిగాడు ప్రభాకర్. "గాయాలకు కట్లు కట్టాను. ఎన్టీ సెప్టిక్ ఇంజక్షన్స్ చేసాను. ఏదో బండ కత్తితో పోడిచినట్లుగా వుంది. రక్తం కూడా చాలా పోయింది. సెడిటివ్స్ ఇచ్చాను. ప్రస్తుతం విశ్రాంతి అవసరం.
    డాక్టర్ చేతిలో ఫీజు పెడుతూ "డాక్టర్! ఈ విషయం రహస్యంగా ఉంచండి." అన్నాడు ప్రభాకర్. డాక్టర్ బెదురుగా చూసాడు.
    "మీకేం భయం లేదు డాక్టర్! అన్ని విషయాలు నేను చూసుకొంటాను."
    "మీరా ధైర్యం ఇస్తే నాకేం భయం దేనికి? నాకు నిశ్చింత. రహస్యంగానే ఉంచుతాను."
    "థాంక్యూ డాక్టర్!"
    డాక్టర్ వెళ్ళిపోయాడు.
    మయూర బయటికి రాబోయింది.
    "నువ్వీ రాత్రికి ఆ గదిలోనే ఉండమ్మా! ఏ అవసరం వస్తుందో?" అన్నాడు ప్రభాకర్.
    "ఆ!" అని నోరు తెరిచింది కమల. మయూరకూ అంతే ఆశ్చర్యం కలిగింది. భయమూ కలిగింది.
    "పోనీ , మీరూ ఉండకూడదూ, అయన దగ్గిర?" అంది.
    "నువ్వు లోపల సపర్యలు చెయ్యగలవు. నేను బయట ఏదైనా హెచ్చుతగ్గులు వస్తే సర్ధగలను. ఈ రాత్రి మనమంతా జాగ్రత్తగా ఉండాలి. లోపలికి వెళ్ళమ్మా! ఎందుకైనా మంచిది తలుపులు లోపల గడియ వేసుకో!"
    రెండూ చేతులూ జోడించి మావగారికి నమస్కారం చేసి వణుకుతున్న చేతులతో తలుపులు లోపల గడియ వేసింది మయూర.
    అందరూ కళ్ళు మూసుకు పడుకున్నా, ఎవరికీ నిద్ర రావటం లేదు. ఎవరి ఆలోచనలలో వాళ్ళున్నారు. ఒక్క వేణు మాత్రమే నిశ్చింతగా గుర్రు పెడుతున్నాడు. ఈ లోకంలో రెండు రకాల వాళ్ళే అన్ని వేళలా నిశ్చింతగా వుండగలరు. పరమ మూర్ఖులు ! సంపూర్ణ జ్ఞానులు! చీమ చిటుక్కుమన్నా వినిపించే నీరవ నిశీధి! అంతరంగాలలో మాత్రం సముద్రపు హోరు! తలుపు తట్టిన చప్పుడు. కమల, ప్రభాకర్ మయూర , ముగ్గురూ తమ తమ మంచాల మీద నుంచి చటుక్కున లేచి కూర్చున్నారు. ఏదో అనబోతున్న కమల నోటి మీదకు అడ్డుగా వెళ్ళింది ప్రభాకర్ చెయ్యి. తలుపు రెండు మూడు సార్లు తట్టిన చప్పుడు. ఈసారి మరింత బిగ్గరిగా తట్టిన చప్పుడు.
    "ఆ! వస్తున్నా! అని నిద్రమత్తులో అంటున్నట్లు ముద్దా ముద్దగా అరిచి లేచివెళ్ళి, ఆవలిస్తూ తలుపు తీశాడు ప్రభాకర్. లాటీలతో లోపలికి వచ్చారు పోలీసులు . పాలిపోయిన కమలతో "లోపలికి వెళ్లి పడుకో," అని చెప్పి "ఏమిటి సార్ , ఇలా వచ్చారు?" అన్నాడు మరోసారి ఆవులిస్తూ.
    సారీ! మీమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం! యాదవ్ దేవ్ గారిని హత్య చెయ్యటానికి ప్రయత్నం జరిగింది. గుండాలు గుంపుగా వచ్చి పడ్డారు. అదృష్టవశాటత్తు అయన మనుష్యులు హెచ్చరికలోనే ఉన్నారు. వాళ్ళకూ, వీళ్ళకూ ఘర్షణ పెరిగింది. ఆ గుండాలలో ఒకడు ఇటుపారిపోయి వచ్చాడని ఆచూకీ తెలిసింది? ఈ సందులో అందరి ఇళ్ళు సోదా చేస్తున్నాం! మీ ఇల్లు కూడా...."
    "ఓయస్! నా అభ్యంతరం ఏం లేదు. చూసుకో! అయినా నా సంగతి తెలిసి తెలిసి గుండా మా ఇంటి కెందుకోస్తాడండీ!"
    "ఆఫ్ కోర్స్ " మేమూ అదే అనుకున్నాం లెండి. అయినా ఫార్మాలిటీస్ తప్పవు కదా!" చూపులతో చుట్టూ పరిశీలిస్తూనే అన్నాడు పోలీస్ ఆఫీసర్.
    "అవునవును ! కమాన్!" అంటూ తనే ముందు దారి తీశాడు ప్రభాకర్.
    ఆఫీసర్ మరోసారి చుట్టూ చూస్తూ "ఇల్లంతా కడిగినట్లుగా ఉందే!" అన్నాడు.
    ప్రభాకర్ జాలిగా ముఖం పెట్టి "మా కోడలు గర్భవతి. ఇవాళే వంటింటి దగ్గర జారిపడి గర్భ స్రావమయింది. అకారణం చేతా ఇల్లంతా కడగవలసి వచ్చింది. ఇంతకూ ముందే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాము. డాక్టర్ సెడేటిల్స్ ఇచ్చారు. ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. అందుకే మా అబ్బాయి కూడా ఈ గదిలో పడుకున్నాడు" అని మూసి ఉన్న గది తలుపులనూ, ఇంత గందరగోళంలోనూ పక్క గదిలో గుర్ర్టు పెడుతూ పడుకున్న వేణునీ చూపించాడు.
    ఆ తరువాత మూసి వున్న గది తలుపులను తెరవమని పోలీస్ ఆఫీసర్ అడగలేకపోయాడు. ప్రభాకర్ కీ పెద్ద పదవులేమీ  లేవు కానీ, సంఘంలో మంచి పలుకుబడి వుంది. ఈ నాటికీ, అతని నీతి నిజాయితీలను , సహసాలనూ జనం కధలుగా చెప్పుకుంటారు. ఒకనాడు అనేక నిందలకు గురయిన అతని సంఘ సంస్కరణ కార్యాలు కూడా ఈనాడు అతనికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. నీతికి, నిలబడే మనిషిగా అభ్యుదయ వాదిగా అతనికి ,మంచి పేరుంది.
    "థాంక్యూ సార్! సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ " అనేసి పోలీసులు వెళ్ళిపోయారు.
    వాళ్ళు వెళ్ళిపోయాక ప్రభాకర్ తలుపు బోల్టు పెట్టాడు. కమల గుండె మీద చెయ్యి వేసుకుని "హమ్మయ్య" అంది. ప్రభాకర్ నవ్వాడు.
    "పిచ్చిదానా! ఈ రోజుల్లో మిగిలిన అన్నీ  "కల్తీ అయిపోయినట్లుగానే పోలీసులు కూడా కల్తీ అయిపోయారు. వీళ్ళని లొంగదీసుకోవటానికి మొదటి రెండు ఉపాయలూ అంటే సామ దానాలు, ముఖ్యంగా దానం చాలు, మరేం భయం లేదు పడుకో!
    కమల వెంటనే పడుకోలేకపోయింది.
    "అసలిదంతా ఏమిటండీ! ముక్కూ మొహం తెలియని వాడి కోసం మీరెందుకింతగా అవస్థ పడుతున్నారూ! మన కోడల్ని అతణ్ణి ఒక గదిలో పెట్టి తలుపులు వెయ్యట మేమిటీ?"
    "మనకు అతడి ముక్కు మొహం తెలిసి ఉండక పోవచ్చు. కానీ అతడు మన కోడల్ని వెతుక్కుంటూ వచ్చాడంటే మయూరకు అతడు తెలిసిన వాడవ్వాలి!"
    కమల ముఖం అప్రసన్నంగా మారిపోయింది.
    "అయితే మాత్రం! ఇద్దరినీ ఒక గదిలో పెట్టి.....?"
    "ఊ! ఒక గదిలో ఉంటే? ఏమవుతుంది? కత్తి కట్లలతో నరకయాతన అనుభవిస్తున్న అతడితో నీ కోడలు కులుకుతుందనా? ఎంత జీవితం చూసినా, నీ అడబుద్ది పోనిచ్చుకున్నావు కాదు?" తీక్షణంగా పలికింది ప్రభాకర్ కంఠం. కమల ముఖం ముడుచుకుంది.
    తలుపులు తెరచుకొని , మయూర బయటికి వచ్చింది. భార్య భర్తల సంభాషణ అంటా మయూర విన్నదనటానికి సాక్ష్యంగా ఆవిడ ముఖం పాలిపోయివుంది. ప్రభాకర్ దగ్గిరకు వచ్చి అతని కాళ్ళకు తల ఆనించి నమస్కారం చేసింది.

 Previous Page Next Page