"చంద్రం, చంద్రం!" అంటూ పరుగెత్తుకుంటూ వచ్చిన హేమ, హాల్లో కృష్ణారావునూ కాంతమ్మనూ చూసి చటుక్కున ఆగిపోయింది.
"రామ్మా రా! నాన్నగారేం చేస్తున్నారు?" కృష్ణారావు ఉత్సాహంగా అడిగాడు, అప్పటికి భార్యతో పడుతున్న ఘర్షణ ఆగిపోయినందుకు సంతోషిస్తూ.
"ఇప్పుడే భోజనంచేసి ఏదో చదువుకుంటున్నారు. చంద్రం లేడండీ?" అన్నది హేమ.
"ఉన్నాడమ్మా! చంద్రం!" అంటూ కేకవేశాడు కృష్ణారావు.
"చూశారా! పత్రికలో చంద్రం రాసినకథ పడింది. మొదటిబహుమతికూడా వచ్చింది" అంటూ హేమ తన చేతిలోని పత్రికను కృష్ణారావుకు అందించింది. కృష్ణారావు చేతిలోకి తీసుకున్నాడో లేదో కాంతమ్మ వచ్చి లాక్కుంది. హేమ కాంతమ్మవైపు గర్వంగా చూసింది. ఈ దెబ్బతో కాంతమ్మ చంద్రాన్ని ఎలా చులకనగా చూడగలదో చూస్తాగా అనుకుంది.
"నిజంగా?" కృష్ణారావు ప్రశ్నించాడు. కంఠంలో ఆశ్చర్యం, ఆనందం మిళితమైనాయి. చంద్రం రజనిని ఎత్తుకొనివచ్చి అన్న దగ్గరగా నిలబడ్డాడు. హేమవేపు చూసి చిరునవ్వుతోనే పలకరించాడు.
"చంద్రం! నీ కథకు మొదటి బహుమతి వచ్చిందట. హేమ ఎంత మంచివార్త తెచ్చిందో చూడు. నిన్ను చూసుకుని నిజంగా గర్విస్తున్నాను చంద్రం! నీకు ఇష్టమొచ్చినంతకాలం చదువుకో. వెధవ వ్యాపారం.... వెధవ లెక్కలు... నువ్వే రాయాలా ఏం? అవసరమైతే ఇంకో మేనేజర్ను పెడతాను." కృష్ణారావు సంతోషాన్ని వెలిబుచ్చేడు.
చంద్రం కోర్కెలకు రెక్కలు తొడిగినట్లయింది. ఆనందంతో తేలిపోతూ, వంగి అన్న పాదాలకు నమస్కరించాడు. అలా వంగిన తమ్ముణ్ణి రెండు చేతుల్తో పైకి లేవనెత్తాడు. కృష్ణారావు కళ్ళలో నీరు తిరిగింది. అవి ఆనందబాష్పాలో లేక ఇంతవరకు తమ్ముడి యెడల చూపిన నిరాదరణను తలచుకొన్నందువల్ల వచ్చిన దుఃఖాశ్రువులో చెప్పడం కష్టమే.
ఆ దృశ్యాన్ని చూస్తున్న హేమ ఆనందానికి అంతం లేదు.
కాంతమ్మకు వళ్ళు మండిపోయింది.
"ఓ యబ్బో! ఇంకేమో అనుకున్నా! ముష్టి యాభయ్ రూపాయల బహుమతికేనా అన్నదమ్ములిద్దరూ అంత మురిసిపోతున్నారు?" కాంతమ్మ మూతి తిప్పింది.
"ఎంతడబ్బు వచ్చిందనేది కాదు, మొదటి బహుమతి రావటం గొప్ప. దాని ఖరీదును డబ్బుతో కట్టలేం" అన్నాడు కృష్ణారావు.
అప్పటికే కథ చదవటం మొదలుపెట్టిన కాంతమ్మ కృష్ణారావు మాట వినిపించుకోలేదు. చంద్రం ఉత్సాహం నీరు కారిపోయింది. హేమ ముఖంలో నిరుత్సాహం కనిపిస్తోంది.
అందరూ మౌనంగా ఆలోచిస్తున్నారు. అంత ఉత్సాహం ఇంతలో చల్లబడటం చూసిన కృష్ణారావు మనస్సు చివుక్కుమంది.
"చంద్రం! ఇవ్వాళ మనమందరం కలసి సినిమాకు వెళదాం. హేమా! మీ నాన్నగారిని కూడా రమ్మను" అన్నాడు కృష్ణారావు.
చంద్రం కళ్ళలో కాంతిరేఖలు కదిలాయి. వదినవైపు చూశాడు. కృష్ణారావు, హేమా కూడా ఆమెవైపు చూశారు. కాంతమ్మ కథ చదువుతూంది. ఆమె కనుబొమలు ముడిపడ్డాయి. కోపం ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.
"చూశారా! చూశారా! ఎంతపని చేశాడో మీ ముద్దుల తమ్ముడు" అంది కాంతమ్మ. ఆమె గొంతులో కోపం, దుఃఖం నేను ముందంటే నేను ముందని పోటీ పడుతున్నట్లనిపించింది.
"ఏం చేశాడేమిటి! విసుగ్గా అన్నాడు కృష్ణారావు. ఇలాంటి సంతోష సమయంలో కూడా భార్య ధోరణికి అసహ్యించుకుంటూ.
"ఇంకా ఏం చెయ్యాలి! ఈ కథ నామీదే రాశాడు -" కాంతమ్మ గొంతు బొంగురుపోయింది.
చంద్రం ఉలిక్కిపడి వదిన ముఖంలోకి చూశాడు. హేమ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ చూచింది చంద్రం ముఖంలోకి. కృష్ణారావు పకపక నవ్వాడు.
"నా బతుకు చూస్తే మీ అందరికీ నవ్వుగా ఉంది. అంత తేలికయిపోయాను" కాంతమ్మ గొంతులో మాటలు ఉంగిడి చుట్టుకుపోయాయి.
"ఛ! ఏమిటి కాంతం! నీ ధోరణీ నువ్వూ! ఇవ్వాళ మనందరంకలసి చంద్రంతో సినిమాకు వెళ్ళాలి" అన్నాడు కృష్ణారావు, భార్యను బతిమాలుకుంటున్న ధోరణిలో.
"నా బతుక్కి ఆ సినిమా ఒక్కటే తక్కువ." చీత్కారం చేసింది కాంతమ్మ.
"ఇప్పుడు నీ బతుక్కి వచ్చిన లోపం ఏమిటో?"
"ఇంకా ఏం కావాలి? నా బతుకు బజార్లోకి ఎక్కింది. నిండా పద్దానుగేళ్ళు లేని రాలుగాయి నన్ను పత్రికలలోకి ఎక్కించటమూ, కట్టుకున్న మొగుడు అది చూసి ఆనందించటం. ఇంతకంటే ఇంకేం కావాలి?"
"చంద్రానికి నువ్వంటే ఎంతో గౌరవం, ప్రేమా.... నువ్వే వాణ్ణి...."
"అవును, నేనే వాణ్ణి కాల్చుకు తింటున్నాను. వాడు రాసింది కూడా అదే. వదినకు బదులు సవతితల్లి అని పెట్టాడు అంతే." కాంతమ్మ పమిటచెంగుతో కళ్ళు అద్దుకుంది.
చంద్రం తన భుజాలమీద నిద్రపోతున్న రజనితో లోపలకు వెళ్ళిపోయాడు. హేమ తలవంచుకొని చిన్నగా బయటకు వెళ్ళిపోయింది. ఇది చూసిన కృష్ణారావు గుండెలలో కోపం సుళ్ళు తిరిగింది.
"ఛీ రాక్షసీ! పిల్లల్ని బాధపెట్టటానికి కూడా వెనకాడవు."
"అవును, నేను రాక్షసినే, నీ తమ్ముడు కూడా అలాగే రాశాడు. నేను పిల్లల్ని పీక్కుతినే రాక్షసిని. నేను మనిషిని గాను" అంటూ శోకాలు మొదలుపెట్టింది కాంతమ్మ.
కృష్ణారావుకు ఏం చెయ్యాలో తోచలేదు. కండువాతీసి భుజంమీద వేసుకొని మండే ఎండలో ఎటో నడచి పోయాడు. కాంతమ్మ మీద కోపం వస్తే కృష్ణారావు చెయ్యగలిగిన పనల్లా ఇదొక్కటే - నాలుగయిదు గంటలపాటు ఆమె కళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవటం.
ఛీ! తన బ్రతుకెందుకు! ఈనాడుకూడా తమ్ముణ్ని సంతోషపెట్టలేకపోయాను. బీదతనంవల్ల మానవుడు కుంగిపోతాడు. బాధలకు గురి అవుతాడు కానీ బీదవాడు కూడా అనుకూలవతియైన భార్య ప్రేమలో క్షణకాలంపాటు తన కష్టాలను మరిచి స్వర్గవిహారం చెయ్యగలడు. ఇంట్లో ఆడవాళ్ళు తెలివితక్కువగా, గయ్యాళిగా , మొండిగా ఉంటే ఎంత ధనం ఉన్నా మానవుడు సుఖించలేడు.
ఊరంతా కాలుకాలిన పిల్లిలా అశాంతిగా తిరిగి కృష్ణారావు రాత్రి పదిగంటలకు ఇంటికి చేరాడు. వస్తూనే చంద్రం గదివైపు నడిచాడు.
చంద్రం వళ్ళుమరచి నిద్రపోతున్నాడు. చంద్రం పక్కనే నిద్రపోతున్న రజని బోసినవ్వులు విరజిమ్ముతోంది. రజని చంద్రాన్ని ఒక్క నిముషం విడిచి ఉండదు. "నువ్వన్నా త్వరగా పెద్దదానివయి మీ అమ్మకు బుద్ధి చెప్పమ్మా!" అనుకున్నాడు కృష్ణారావు.
బయటకువస్తున్న కృష్ణారావు ఉలిక్కిపడి గడపలోనే ఆగిపోయాడు.
"కొట్టొద్దు! అన్నయ్యా, నన్ను కొట్టకు - నేను ఆ కథ వదినమీద రాయలేదు. రజనితోడు! అమ్మతోడు! నీమీద రాయలేదు వదినా!" కలవరిస్తున్నాడు చంద్రం.
'నన్ను కొట్టకు అన్నయ్యా! నేను తప్పు చెయ్యలేదు. ఇక నేను ఎప్పుడూ కథలు రాయను.'
కృష్ణారావులోని చైతన్యం గడ్డకట్టిపోయింది. రాయిలా బిగుసుకుపోయాడు.
ఎంతోసేపటికికాని కృష్ణారావు తేరుకోలేదు. నిద్రపోతున్న తమ్ముడిమీదకు వంగి నొసటిని ముద్దుపెట్టుకున్నాడు. కృష్ణారావు రెండు కళ్ళనుండి జారిన కన్నీరు చంద్రం ముఖాన్ని తడిపింది.
3
తెల్లవారితే పరీక్షా ఫలితాలు తెలుస్తాయి. ఆ రాత్రి చంద్రానికి నిద్ర పట్టలేదు. పక్కమీద ఇటూ అటూ పొర్లుతున్నాడు. నిద్ర పట్టందే? ఏమయినా కథ రాసుకుంటే! గబుక్కున లేచి కూర్చున్నాడు. కాగితాలూ కలం తీసుకున్నాడు. పరీక్ష ఏమౌతుందో! ఒకవేళ తను తప్పితే! లెక్కలు బాగా చెయ్యలేదు. ఎందువల్లనో ఎంత ప్రయత్నించినా తనకు లెక్కలు సరిగ్గా రావు! పరీక్ష రాసి తప్పక పాసవుతాను అనుకున్నాడు. కాని రోజులు గడిచినకొద్దీ పరీక్ష పోతుందేమోననే భయం పెరగసాగింది. తీరా పరీక్షా ఫలితాలు తెలిసేరోజు దగ్గరకు వచ్చింది. తనకు పరీక్ష పాసవుతాననే నమ్మకం పూర్తిగా పోయింది.
చేతిలోని కాగితాలూ, కలం బల్లమీద పెట్టి పుస్తకాల బీరువా దగ్గరకు వెళ్ళాడు. డిటెక్టివ్ నవల అయితే బుర్రకు పూర్తిగా పని కల్పించవచ్చునుకొని "పీపాలో శవం" బయటకు తీశాడు ఊఁహుఁ, వాక్యం ముందుకు జరిగితేనా? అక్షరాలు అంకెల్లా కనిపిస్తున్నాయి. అందులో తన నంబరు కనిపించటంలేదు.