Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 4


    తన భవిష్యత్తంతా రేపు రాబోయే పరీక్షా ఫలితాల మీదనే ఆధారపడి ఉంది. వదినకు తను పై చదువు చదవటం ఇష్టంలేదు. ఒక రకంగా అన్నయ్యకు కూడా ఇష్టంలేదు. అన్నయ్యకు తనను ఇప్పటినుంచే వ్యాపారంలో పెట్టటం ఇష్టం. తను పరీక్ష తప్పితే అన్నయ్య దగ్గిర పైచదువుకు వెళ్తానని పెట్టు పట్టలేడు. అన్నయ్య వదినను కాదనలేడు. తను చదువుకు స్వస్తి చెప్పక తప్పదు.  

 

    అయితే ఇక తనకు చదువుకొనే అదృష్టమే ఉండదా? అమ్మా, నాన్నా ఉంటే తను ఒకసారి పరీక్ష తప్పినంతమాత్రాన చదువు మాన్పించి ఇంట్లో కూర్చోపెట్టేవారా? తల్లిదండ్రులకు దూరమై ఈనాడు బాధపడుతున్నాడు. చదువుసంధ్యలకు దూరమైతే తను జీవితమంతా బాధ పడాల్సిందే.

 

    చదువులేని తనతో హేమ ఇప్పటిలాగే స్నేహంగా ఉంటుందా? తనను ప్రసాదరావుగారూ, హేమా ఎప్పటిలాగే గౌరవిస్తారా? హేమ రేపటినుంచీ కాలేజీకి వెళుతుంది. మరి తనో! అన్నయ్య పక్కన కూర్చోని లెక్కలు వ్రాయటం నేర్చుకుంటాడు. చంద్రానికి ఏడుపు పొర్లుకొస్తోంది.   

 

    లేదు! ఏది ఏమయినా తను తప్పక చదువుతాడు. ఇటు ప్రపంచం అటు అయినా తను హేమ దృష్టిలో చిన్న కావటాన్ని సహించలేడు. తను ఎటూ "గురుకుల్" వెళ్ళి చదవాలనుకుంటున్నాడు. ఆ చదువుకు ఈ పరీక్షతో నిమిత్తంలేదు.  

 

    "గురుకుల్" వెళ్ళి చదవాలని ఉన్నదని చెప్పినప్పుడు ప్రకాశం హేమా కూడా ఫక్కున నవ్వారు. చిన్నప్పుడు రామ మందిరంలో పురాణకాలక్షేపం చాలా శ్రద్ధగా వినేవాడు. ఆశ్రమాలలో ఋషుల దగ్గర శుశ్రూష చేసి విద్య నార్జించే బ్రహ్మచారుల కథలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించేవి. తనకు కూడా అలాంటి జీవితం గడపాలనిపించేది. "గురుకుల్" వాతావరణం కూడా అలాగే వుంటుందట. తనకు అందరిలా కాలేజీ డిగ్రీలమీద మోజు ఏనాడూ లేదు.   

 

    సంస్కృత సాహిత్యాన్ని క్షుణ్నంగా చదివి మన భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకోవాలనేదే తన కోరిక. తను తప్పక వెళ్ళి తీరుతాడు, చదువుతాడు. తను గొప్పవాడు కావాలి. ముఖ్యంగా హేమకోసం, హేమ సంతోషంకోసం తను గొప్పవాడు కావాలి.

 

    తెలతెలవారుతుండగా చంద్రం ఆలోచనలనుంచి నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాడు.  

 

    ముత్తయిదువు నొసటి కుంకుమలా తూర్పుదిక్కున సూర్యబింబం ఎర్రగా మిలమిలలాడుతూంది. దూరంగా ఫ్యాక్టరీ కూత కూలీలను ఆహ్వానిస్తున్నది. కృష్ణారావు కాఫీతాగి సిగరెట్టు వెలిగించాడు తాపీగా. ఇంతలో పేపరు కుర్రాడు పేపరు విసిరేసి వెళ్ళాడు.

 

    "ఇవ్వాళ చంద్రం పరీక్షలు పడతాయటగా?" అంది కాంతమ్మ, పేపరు తిరగేస్తున్న భర్త నుద్దేశించి.

 

    కృష్ణారావుకు ఆ విషయం గుర్తులేదు. తమ్ముడు తప్పక పాసవుతాడని అతని విశ్వాసం.

 

    అన్ని కథలు రాసి, అందరి మెప్పునూ, అభిమానాన్నీ చూరగొన్న చంద్రానికి ఈ పరీక్ష పాసుకావటం ఒక లెక్కా అనుకున్నాడు. నింపాదిగా, ఎలాంటి ఆదుర్దా లేకుండా పరీక్షా ఫలితాలు పడ్డ పేజీ తిప్పాడు.

 

    చంద్రం నంబరు కనిపించలేదు. మళ్ళీ ఆదుర్దాగా పైనుంచి క్రిందకు వెతకసాగాడు. తమ్ముడు తప్పాడని నమ్మలేకుండా ఉన్నాడు కృష్ణారావు. ఫస్టుక్లాసులో హేమమాలిని ఒక్కతే పాసయింది.

 

    "ఏం, అంతసేపు చూస్తున్నారు, పాసయాడా?" అన్నది కాంతమ్మ. 'నాకు ముందే తెలుసు ఆ వాజమ్మ పాసుకాడని' అనే భావం స్ఫూరిస్తూంది. కాంతమ్మ స్వరంలో.

 

    కృష్ణారావుకు ఆమె ముఖంలోకి చూసే ధైర్యం లేదు.

 

    "చెప్పరేం?" రెట్టించింది కాంతమ్మ.

 

    "ప్యాసుకాలేదు." గొణిగాడు కృష్ణారావు.

 

    "హేమ పాసయిందా?"

 

    "ఆ - ఫస్టుక్లాసు వచ్చింది" అంటూ లేచి కృష్ణారావు చంద్రం గదివైపు నడిచాడు. కాంతమ్మ వెనకే బయలుదేరింది.

 

    చంద్రం మంచి నిద్రలో ఉన్నాడు. విసురుగా గదిలో ప్రవేశించిన కృష్ణారావు, నిద్రపోతూన్న చంద్రాన్ని చూసి మంచం దగ్గరే ఓ క్షణం నించున్నాడు. సాలోచనగా, చేతిలో ఉన్న పేపరు మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద పడేసి నీరసంగా బయటకు నడిచాడు కృష్ణారావు. పరీక్ష తప్పిన తమ్ముడిగదిలోకి ప్రవేశించిన కృష్ణారావుకు నిద్రపోతున్న చంద్రం ముఖం చూడగానే ఎదో అవ్యక్తమైన బాధ కలిగింది. ఆ బాధ జాలితో మిళితమైనది. చంద్రాన్ని నిద్రలో చూచినప్పుడల్లా కృష్ణారావుకు తల్లిదండ్రులు గుర్తొస్తారు. తల్లిదండ్రుల ఆదరణకు దూరమైన తమ్మునియెడల కృష్ణారావు హృదయంలో జాలి కట్టలు తెంచుకుంటుంది - ఇలాంటి సమయాలలో.   

 

    "సిగ్గు లేకపోతేసరి ముఖానికి! ఇంకా నిద్రపోతున్నాడు. ఆడపిల్ల ఫస్టునపాసయింది. ఇంట్లో వాళ్ళమీద కథలు రాయటం వచ్చిన వాడికి పరీక్ష వ్రాయటం రాదుకాబోలు-" కాంతమ్మ గొంతు నిద్రపోతూన్న చంద్రం చెవుల్లో గరగరలాడింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అప్పటికే కృష్ణారావు, కాంతమ్మ బయటకు వెళ్ళిపోయారు.  

 

    చంద్రానికి వళ్ళంతా విరగ్గొట్టినట్లుంది. రాత్రంతా నిద్రలేదు. తెలతెలవారుతూండగా నిద్రపట్టిందేమో మండిపోతున్నాయి - చాలని నిద్రతో బరువుగా వాలిపోతూ కళ్ళు.

 

    మండుతూన్న కళ్ళను బరువుగా, బద్ధకంగా తెరిచాడు. ఎదురుగా టేబులుమీద పత్రిక కనిపించింది. అంతా అర్థమయింది. అయినా ఏదో ఆశ! వణుకుతున్న చేతులలోకి పత్రిక అందుకున్నాడు.

 

    అనుకున్నంతా అయింది. ఇప్పుడు తను అన్నకు ముఖం ఎలా చూపించాలి?

 

    "తగిన శాస్తి జరిగింది - తమ్ముడి తెలివితేటలకు విరగపడ్డందుకు."

 

    కాంతమ్మ అంటున్న మాటలు చంద్రం విన్నాడు. అన్నయ్య ఏమంటున్నాడో వినాలని ప్రయత్నించాడు. కాని అన్నయ్య గొంతు వినిపించలేదు. అన్నయ్య ఏమీ అనలేదు. బహుశా తనలాగే బాధపడుతూ ఉండి ఉంటాడు. అన్నయ్యకు తనంటే ఎంతో ప్రేమ. కాని తను ఆ ప్రేమను నిలుపుకోలేకపోయాడు. తను కవిత్వమనీ, కథలనీ పెట్టుకోకుండా ఇంకొంచెం శ్రద్ధగా చదివి ఉంటే పరీక్ష తప్పక పాసయి ఉండేవాడు చంద్రానికి తను ఏదో తప్పుచేసినట్లనిపించింది.

 

    చంద్రం దొంగలా అన్నా -వదినలను తప్పించుకొని బాత్ రూమ్ కు వెళ్ళి కాళ్ళూ, చేతులు కడుక్కొని వచ్చి, బట్టలు వేసుకున్నాడు. కాఫీ తాగటానికి వంటింట్లోకి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. చిన్నగా ఇంటినుండి బయటపడ్డాడు.

 

    ప్రసాదరావుగారి ఇంటిముందుకు వచ్చిన చంద్రం ఏదో ఆలోచించి వెంటనే గిరుక్కున తిరిగి, గబగబా పక్క సందులోకి వెళ్ళిపోయాడు. పరీక్ష తప్పిన తను ఏ ముఖం పెట్టుకుని వెళతాడు హేమ ఎదుటకు? తను పాసయివుంటే తెల్లవారేటప్పటికి హేమ పరుగెత్తుకుని వచ్చి ఉండేది. కాని తను పరీక్ష తప్పాడు. హేమగానీ, ప్రసాదరావుగారు కాని రాలేదు. బహుశా వారి దృష్టిలో తను ఈ రోజునుంచీ తెలివి తక్కువ వాడు కావచ్చును. ఛ! అలా ఎప్పటికీ కాదు. కేవలం తను చిన్నబుచ్చుకుని ఉంటాడు. తను బాధ పడడం చూడలేకనే హేమ వచ్చి ఉండదు.   

 

    ఏది ఏమయినా హేమ ఫస్టున వచ్చినందుకు అభినందించటానికి తను వెళ్ళి ఉండాల్సింది. తనకు ఆ గడపలో కాలు పెట్టటానికి ఎందుకు మనస్కరించలేదు? ఎందువల్ల? తనలో ఏ మూలన్నా హేమంటే ఈర్ష్యవుందా? అలా ఎన్నటికీ కాదు. హేమకు తను పరీక్ష తప్పటంవల్ల బాధ కలుగుతుందని తనకు తెలుసు. అందువల్లనే ఆమె ముందుకు వెళ్ళటానికి మొహం చెల్లడంలేదు తనకు.

 

    చంద్రం తిండీ, నీరు లేకుండా ఆనాడు ఎక్కడెక్కడో తిరిగాడు పిచ్చివాడిలాగ. ఊరంతా తిరిగి తిరిగి పబ్లిక్ పార్కుకెళ్ళి కూర్చున్నాడు.

 

    మంచు కురుస్తోంది. చలికాలం కావటంవల్ల ఏడు గంటలకే పార్కులో జనం పల్చబడ్డారు. రెండుచేతులూ మెలిక వేసుకొని భుజాలు పట్టుకొని పార్కు బెంచీమీద ఒక మూల ముడుచుకుని కూర్చుని ఉన్నాడు చంద్రం. ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. అన్నయ్య ఏమంటాడో, వదిన ఏమంటుందో! వాళ్ళు అన్నా అనకపోయినా తనకే వాళ్ళ ఎదటపడాలంటే సిగ్గుగా ఉంది.

 

    "చంద్రంలా ఉన్నాడు, చూడు నాన్నా!" అంటూ హేమ, చంద్రం కూర్చున్న బెంచీ దగ్గరకు వచ్చింది. చంద్రం ఉలిక్కిపడి హేమవైపు చూశాడు. హేమ వెనకనే ప్రసాదరావు చేతికర్రతో నిల్చొని ఉన్నారు. చంద్రం బెంచీ మీదనుంచి లేచి నిల్చున్నాడు. ఏం మాట్లాడాలో తోచలేదు.

 

    హేమ వదనం -చంద్రం ఊహించినట్లు వికసించి లేదు వాడిపోయి ఉంది. చంద్రానికి ఆశ్చర్యం కలిగింది. హేమ చంద్రం పరీక్ష తప్పినందుకు బాధపడుతూంది. తను ఫస్టున పాసయిన సంతోషం ఏ కోశానా కనిపించటంలేదు. అర్థం చేసుకొన్న చంద్రం తను వట్టి అసమర్థుడని అనుకొని కుంగిపోయాడు. హేమ తనకంటే వయస్సులో, ఉదారతలో ఎంతో పెద్దదయినట్లు కనిపించింది చంద్రానికి.

 

    "క్షమించు హేమా! నిన్ను కంగ్రాచ్యులేట్ చెయ్యటానికి రాలేకపోయాను" అన్నాడు చంద్రం సిగ్గుపడుతూ.

 Previous Page Next Page