Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 3


    3.4  అగ్నీ ! నీవు మమ్ము గ్రహించుము. మా ఆహ్వానములను ఆలకించుము. సమస్త పాపాచారునుండి మమ్ము రక్షింపుము. స్వతేజమున ప్రకాశించు అగ్నీ ! మేము సుఖములకొఱకును, పుత్రుల కొఱకును నిన్ను యాచించుచున్నాము.

                                       ఇరువది అయిదవ సూక్తము

      ఋషి-ఆత్రేయ వసుయులు, దేవత-అగ్ని, ఛందస్సు-అనుష్టుప్.

    1. వసుయు ఋషులారా ! మీ రక్షణ కొఱకు అగ్నిని స్తుతించుడును అగ్నిహోత్రమునకుగాను యజమానుల ఇండ్లయందుండు అగ్ని మా కోరికలు తీర్చవలెను. ఋషి పుత్రుడు, సత్యవంతుడగు అగ్ని మమ్ము శత్రువులనుండి రక్షించవలెను.

    2. అగ్ని పూర్వపు ఋషులవలనను దేవతలవలనను సందీప్తుడయినాడు. ఆ అగ్ని మోదన జిహ్వుడు, శోభన దీప్తియుక్తుడు, అతిశయ ప్రభావానుడు, దేవతల ఆహ్వాత, సత్యప్రతిజ్ఞుడు అగును.

    3. అగ్నీ ! నీవు స్తుతుల ద్వారా స్తూయమానుడవు. మేము అతిశయ ప్రశస్తము, అత్యంత శ్రేష్ఠమగు పరిచర్యలు చేయుదుము. స్తుతింతుము. నీవు ప్రసన్నుడవగుము. మాకు ధన దానము చేయుము.

    4. అగ్ని దేవతల మధ్య దేవతా స్వరూపమున ప్రకాశించును. మానవుల మధ్య ఆహవనీయ రూపమున ప్రవేశించును. యజ్ఞములందు దేవతలకు హవ్యము వహించును. యజమానులారా ! స్తుతులద్వారా మీరు అట్టి అగ్నికి పరిచర్యలు చేయుడు.

    5. హవి సమర్పించు యజమానులకు - అగ్ని - పుత్రుని ప్రసాదించవలెను. ఆ పుత్రుడు బహువిధ అన్నయుక్తుడు, బహుస్తోత్రవంతుడు, ఉత్తముడు, శత్రువులద్వారా అహింసితుడు, తన కర్మలతో పితాప్రపితామహాదుల యశస్సును ప్రఖ్యాతము చేయువాడు కావలెను.

    6. అగ్నీ ! నీవు మాకు పుత్రుని ప్రసాదించుము. అతడు సత్యపాలకుడు. బంధుజనులను అభిమానించువాడు. యుద్ధమున శత్రువును పరాభవించగలవాడు కావలెను. అట్లే అగ్నీ ! వేగవంతము, శత్రుపరాజయకారకమగు అశ్వమును ప్రసాదించుము.

    7. శ్రేష్ఠతమ స్తోత్రములన్నియు అగ్నికొఱకే రచించబడును. తేజోధనుడవగు అగ్నీ ! మాకు బహుళ ధనమును ప్రదానము చేయుము. ఎందుకనగా నీ వద్ద నుండియే మహాధనములు ఉత్పన్నములయినవి. నిఖిల అన్నములు ఉత్పన్నములయినవి.

    8. అగ్నీ ! నీ శిఖలు దీప్తిమంతములు. నీవు సోమలతా పోషక శిలవలె మహామహుడవనబడుచున్నావు. నీవు ద్యుతిమంతుడవు. నీ శబ్దము మేఘ గర్జనవలె ద్యుతిమంతమయి వ్యాపించును.

    9. మేము వసుయు గణములము. బలశాలియగు అగ్నిని స్తుతించుచున్నాము. పడవద్వారా నదిని దాటించినట్లు శోభనకర్ముడగు అగ్ని మమ్ము సకల శత్రువుల నుండి ఉత్తీర్ణులను చేయవలెను.

                                      ఇరువది ఆరవ సూక్తము

        ఋషి-ఆత్రేయ వసుయులు, దేవత-అగ్ని, ఛందస్సు-గాయత్రి.

    1. అగ్నీ ! నీవు శోధకుడవు. ద్యుతిమంతుడవు. నీ దీప్తిచేతను, దేవతలను ప్రహృష్టము చేయు జిహ్వచేతను యజ్ఞమునకు దేవతలను ఆహ్వానించుము. పూజించుము.

    2. అగ్నీ ! నీవు ఘృతోత్పన్నుడవు. బహువిధ కిరణవంతుడవు. సర్వద్రష్టవు. హవ్యభక్షణకుగాను దేవతలను తీసికొని రావలసినదిగా నిన్ను యాచించుచున్నాము.

    3. అగ్నీ ! నీవు క్రాంతదర్శివి. హవ్యభక్షణశీలుడవు. దీప్తిమంతుడవు. మహామహుడవు. మేము నిన్ను యజ్ఞ స్థలమున ప్రజ్వలింప చేసెదము.

    4. అగ్నీ ! నీవు దేవతల ఆహ్వాతవు. హవ్యదాత యజమాని యజ్ఞమునకు దేవతలందరి సహితుడవయి విచ్చేయుమని నిన్ను ప్రార్థించుచున్నాము.

    5. అగ్నీ ! యజ్ఞము చేయు యజమానికి నీవు శోభన బలమును ప్రసాదించుము. దేవతలతో కూడ కుశలమీద ఆసీనుడవగుము.

    6. వేలమందిని గెలువగల అగ్నీ! హవిద్వారా ప్రజ్వలితుడవయి, ప్రశస్తమానుడవయి, దేవదూతమయి మా యజ్ఞకర్మమును పోషించుము.

    7. అగ్ని భూతజాతములను తెలిసినవాడు. యజ్ఞప్రాపకుడు. యువతముడు. ఋత్విక్కు యజమానులారా! మీరు అట్టి అగ్నిని స్థాపించుడు.

    8. ప్రకాశమానులగు స్తోతల సమర్పించిన హవిరన్నము నేడు నిరంతరము దేవతలకు అందవలెను. ఋత్విక్కులారా ! కుశలు పరచుడు. అగ్నిని ఆసీనుని చేయుడు.

    9. మరుద్గణములు, దేవవైద్యులు అశ్వినులు, సూర్యుడు, వరుణాది దేవతలు తమ తమ పరిజన సహితులయి కుశలమీద ఆసీనులు కావలెను.

                                      ఇరువది ఏడవ సూక్తము

    ఋషి - త్రివృష్ణ పుత్రుడు త్రయారుణుడు, పురుకుత్సుని సుతుడు త్రపదస్యుడు, భారత పుత్రుడు     అశ్వమేధుడు, వీరు రాజులు కావచ్చును. దేవత- ఇంద్రాగ్నులు  ఛందస్సు-1-3 త్రిష్టుప్, 4-6 అనుష్టుప్.

    1. అగ్నీ ! నీవు మానవులనేతవు. సాధువుల పాలకుడవు. జ్ఞానసంపన్నుడవు. ధనవంతుడవు. బలవంతుడవు. త్రివృష్ణపుత్రుడగు త్రియారుణుడను రాజర్షి నాకు రెండెద్దులబండి పదివేల సువర్ణములు దానముచేసి ప్రఖ్యాతుడు అయినాడు. 

    2. త్రయారుణుడు నాకు నూరు సువర్ణములు. ఇరువది గోవులు, రథము వాటి భారము వహించుటకు రెండు అశ్వములు ఇచ్చినాడు.

    వైశ్వానరాగ్నీ! మా స్తుతులు హవితో వర్తమానుడవయి త్రయారుణునకు సుఖములు ప్రసాదించుము.

    3. అగ్నీ ! మేము బహుసంతానవంతులము. మా స్తుతులకు ప్రసన్నుడవగుము. త్రయారుణుడు మాతో "ఇది గ్రహించుము. అది గ్రహించుము" అన్నాడు. అట్లే నీ స్తుతులను నిత్యముకోరు త్రసదస్యుడు కూడా మమ్ము "ఇది గ్రహించుము అది గ్రహించుము" అని ప్రార్థించినాడు.

    4. అగ్నీ ! ఎవడేని యాచకుడు నిన్ను స్తుతించి ధనదాత రాజర్షి 'అశ్వమేధుని' వద్ద కేగి ధనము ఇమ్మని యాచించిన ఆ రాజర్షి యాచకునకు ధనము దానము చేయును. యజ్ఞేచ్చగల అశ్వమేధునకు నీవు యజ్ఞము చేయు బుద్ధిని ప్రసాదింపుము.

    5. రాజర్షి అశ్వమేధుడు కోరికలు తీర్చువాడు. అతడు దానము చేసిన నూరు ఎద్దులు మమ్ము ఎంతో సంతోషపరచినవి. అగ్నీ ! పెరుగు, సత్తు, పాలు కలిసిన సోమమువలె ఆ ఎద్దులు నిన్ను ప్రీతుని చేయవలెను.

    6. ఇంద్రాగ్నులారా ! యాచకులకు అపరిమిత ధనమున దానముచేయు రాజర్షి అశ్వమేధునకు అంతరిక్ష స్థిత సూర్యునివలె శోభనబలము, జరారహిత ధనమును ప్రసాదించుడు.

                                      ఇరువది ఎనిమిదవ సూక్తము

             ఋషి-ఆత్రేయీ విశ్వవారా ఋషికి మహిళ, దేవత-అగ్ని ఛందస్సు 
                      1-3 త్రిష్టుప్, 2 జగతి - 4 అనుష్టుప్ - 5-6 గాయత్రి.

    1. చక్కగా వెలుగొందునట్టి అగ్ని ద్యుతిమంతమగు అంతరిక్షమున వెలుగులు వెదజల్లును. అగ్ని ఉష ఎదుట విస్తరించి శోభాన్వితుడగును. 'విశ్వవారా' ఇంద్రాది దేవతలను స్తుతించుచు, పురోడాశాది యుక్త స్రుక్కును గ్రహించి పూర్వదిశా ముఖియయి అగ్నికి అభిముఖముగ సాగును.

    2. అగ్నీ ! నీవు చక్కగా ప్రజ్వరిల్లుదువు. జలములపై ప్రభుత్వము సాగింతువు. హవ్యదాత యజమాని తనకు శుభములు కలుగుటకు నిన్ను స్తుతించును. ఏ యజమాని వద్దకు నీవు చేరుదువో, అతడు పశువులు మున్నగు సమస్త ధనములు కలవాడగును.

    3. అగ్నీ ! మాకు ప్రభూత ఐశ్వర్యము. శోభన ధనము కలుగుటకుగాను శత్రువులను పరిమార్చుము. నీ ధన తేజములు ఉత్కృష్టములు.

    అగ్నీ ! నీవు దాంపత్య కార్యమును చక్కగా నియమితము చేయుము. శత్రువులను నీ తేజమును ఆక్రమింపుము.

    4. అగ్నీ ! నీవు కోరికలు తీర్చువాడవు. ధనవంతుడవు. యజ్ఞస్థలమున దీప్తుడవు. నీవు ప్రజ్వలితుడవయి, దీప్తివంతుడవయినపుడు యజమానులమగు మేము నీ దీప్తిని స్తుతింతుము.

    5. అగ్నీ ! నీవు హవ్యవాహకుడవు. యజమానుల ఆహుతుడవు. శోభన యజ్ఞవంతుడవు. నీవు చక్కగా ప్రజ్వరిల్లి ఇంద్రాది దేవతలను యజింపుము.

    6. ఋత్విక్కులారా ! మీరు యజ్ఞమున ఉపస్థితులుకండు. హవ్యవాహక అగ్నిలో హవనము చేయుడు. అగ్నికి పరిచర్యలు చేయుడు. భజించుడు. దేవతలకు హవ్యము వహించుటకు అగ్నిని వరించుడు.

                                  ఇరువది తొమ్మిదవ సూక్తము

       ఋషి-శక్తిగోత్ర గౌరవీతి, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-త్రిష్టుప్.

    1. మను సంబంధ యజ్ఞమున ఉన్న మూడు తేజములను అంతరిక్షమున ఉన్న రోచమానమగు వాయు, అగ్ని, సూర్యాత్మక తేజములను మరుత్తులు ధరింతురు.

    ఇంద్రా ! మంచి బలముగల మరుద్గణములు నిన్ను స్తుతించును. నీవు బుద్ధిమంతుడవు. మరుత్తులను కనిపెట్టియుండుము.

    2. ఇంద్రుడు అభిషుత సోమరసమును తృప్తిగా పానము చేసినాడు. అప్పుడు మరుత్తులు ఇంద్రుని స్తుతించినారు. ఇంద్రుడు వారి స్తుతులు విన్నాడు. వజ్రము ధరించినాడు. వృత్రుని పరిమార్చినాడు. వృత్రుడు నిరోధించిన మహాజలరాశిని విముక్తము చేసినాడు. స్వేచ్చ ఇచ్చినాడు.

    3. మహా మరుత్తులారా ! మీరు ఇంద్ర సహితులయి విచ్చేయండి. మేము సిద్ధము చేసిన అభిషుత సోమమును స్వీకరించండి. మీరు సోమాత్మక హవ్యము. స్వీకరించినందున యజమానికి గోలాభము కలుగును. ఈ సోమరసమును పానము చేసియే ఇంద్రుడు వృత్రుని వధించినాడు.

    4. ఇంద్రుడు సోమపానము చేసి ద్యావాపృథ్వులను నిశ్చలము చేసినాడు. ఇంద్రుడు గమనశీలుడు అయినాడు. వృత్రుడు భయభీతుడయి పారిపోయినాడు. వృత్రుడు దాగినాడు. అతనికి ఊపిరి ఆడలేదు. అట్టి వృత్రుని ఇంద్రుడు ఆచ్చాదన విహీనుని చేసి కూల్చినాడు.

    5. ఇంద్రా ! నీవు ధనశాలివి. నీవు అద్భుత కార్యము చేసినావు. అందుకుగాను అగ్ని మున్నగు దేవతలు ఒక్కొక్కరు నీకు సోమరసము అందించినారు. నీవు 'ఏతశు' ని కొఱకు సూర్యుని అశ్వములను నిలిపినావు.

    6. ధనవంతుడగు ఇంద్రుడు శంబరుని తొంబది నగరములను ఏకకాలమున ధ్వంసము చేసినాడు. అప్పుడు యుద్ధభూమియందే మరుత్తులు త్రిష్టుప్ ఛందమున ఇంద్రుని స్తుతించినారు. అట్లు మరుత్తుల మంత్రములద్వారా స్తుతుడయి, దీప్తుడయిన ఇంద్రుడు శంబరుని పీడించినాడు.

    7. అగ్ని ఇంద్రునకు మిత్రుడు. మిత్రుడగు ఇంద్రుని కార్యమునకుగాను అగ్ని మూడు వందల మహిషములను అతి త్వరగా వండినాడు.

    ఇంద్రుడు పరమైశ్వర్యయుక్తుడు. వృత్రుని వధించుటకుగాను మనుసంబంధమగు మూడు పాత్రలలో ఉన్న సోమమును ఒకేసారి త్రాగినాడు.

    8. ఇంద్రా ! నీవు మూడువందల మహిషముల మాంసమును భక్షించినావు. మూడు పాత్రలలో ఉన్న సోమరసము త్రావినావు. అప్పుడు నీవు వృత్రుని వధించినావు. అంతట దాసులు స్వామిని ఆహ్వానించినట్లు దేవతలందరు యుద్ధమునకుగాను సోమపాన పూర్ణుడగు ఇంద్రుని ఆహ్వానించినారు.

    9. ఇంద్రా ! నీవు, కవి వేగవంతములగు అశ్వములమీద కుత్సుని గృహమునకు చేరినపుడు శత్రువులను హింసించినావు. అప్పుడు నీవు ఇతర దేవతల సహితముగా ఒకే రధము మీద ఎక్కినావు. ఇంద్రా ! శుష్ణాసురుని నీవు వధించినావు.

    10. ఇంద్రా ! నీవు ముందే సూర్యుని రెండు చక్రములలో ఒకదానిని వేరు చేసినావు. మరొక చక్రమును ధనలాభమునకుగాను కుత్సునికి ఇచ్చినావు. నీవు శబ్ద రహిత అసురులను హతబుద్ధులను చేసినావు. వజ్రముతో సంగ్రామమున వారిని హతమార్చినావు.

    11. ఇంద్రా ! గౌరివీత ఋషి స్తోత్రము నిన్ను వర్థిల్ల చేయును. విదథి పుత్రుడు రుఖశ్వుని కొఱకు పిప్రనామక అసురుని వశీభూతుని చేసుకున్నావు. ఋజశ్వృషి నీతో స్నేహము చేయుటకుగాను పురోడాశాదులను వండి నీకు సమర్పించినాడు. నీవు ఋజశ్యుని సోమరసమును పావము చేసినావు.

    12. తొమ్మిది నెలలకు పూర్తిఅగునదియు, పదినెలలకు పూర్తిఅగునదియునగు యజ్ఞములనుచేయు అంగిరులు సోమాభిషవముచేసి, అర్చనీయ స్తోత్రముల ద్వారా ఇంద్రుని స్తుతించినారు. ఇంద్రుని స్తుతించు అంగిరులు అసురులు దాచి ఉంచిన గోసమూహములను విడిపించినారు.

    13. ధనవంతుడవగు ఇంద్రా ! నీవు చేసిన పరాక్రమ కార్యములన్నియు మాకు తెలియును. కాని దానిని ఎట్లు ప్రకటించవలెనో, ఎట్లు స్తుతించవలెనో తెలియకున్నది.

    బలవంతుడవగు ఇంద్రా ! నీవు కొత్తగా పరాక్రమమును ప్రదర్శించినపుడు యజ్ఞమున నీ అట్టి పరాక్రమమును కీర్తింతుము.

 Previous Page Next Page