2. యజమానులు - ద్యులోకధారకులు, యజ్ఞస్థల ఆసీనులు నేతృ దేవతలను ఋత్విక్కులద్వారా పొందుదురు. ఆ యజమానులు యజ్ఞధారకుడు, సత్యస్వరూపుడగు అగ్నిని యజ్ఞమునకుగాను ఉత్తమ స్థానమగు వేదికమీద స్తుతుల ద్వారా ప్రతిష్ఠింతురు.
3. పముఖ అగ్నికి రాక్షసులకు దుష్ప్రాప్యమగు హవి స్వరూప అన్నమును ప్రదానము చేయు యజమాని పాప విముక్తుడు అగును. నవజాత అగ్ని సింహమువలె శత్రువుపై లంఘించును. శత్రువును దూరము చేయును. సర్వత్ర వసించుశత్రువు నన్ను వదిలి దూరము జరుగవలెను.
4. అగ్ని సర్వత్ర ప్రఖ్యాతుడు. తల్లివలె సమస్త జనులను దరి చేర్చుకొనును. తమను పోషించుమని దర్శనమిమ్మని జనులెల్లరు అగ్నిని ప్రార్థింతురు. అగ్ని ధరించువాడయినపుడు సకల అన్నములను జీర్ణము చేయును. అగ్ని నానారూపుడయి సర్వభూత జాతములందు చేరును.
5. అగ్ని ద్యుతిమంతుడు. బలమైన కోర్కెలు తీర్చగలవాడు. హవిర్లక్షణ అన్నము అతని సంపూర్ణ బలమును రక్షించవలెను. దొంగ, ఇంటి నడుమ దాగి, దొంగిలించిన సొమ్మును కాపాడినట్లు అగ్నీ ! నీవు అనంత ధనలాభమునకుగాను సన్మార్గమును ప్రకాశితము చేయుము. అత్రిమునిని ప్రీతుని చేయుము.
పదహారవ సూక్తము
ఋషి - ఆత్రేయ పురోరుడు, దేవత - అగ్ని ఛందస్సు చివరిది పంక్తి, మిగిలినవి అనుష్టుప్.
1. అగ్ని స్నేహ స్వరూపుడు. మానవులు విశిష్ట స్తుతుల ద్వారా అగ్నిని స్తుతింతురు. పురోభాగమున స్థాపింతురు. ద్యుతిమంతుడగు అగ్నికి హవిర్లక్షణ అన్నము సమర్పింతురు.
2. అగ్ని దేవతలకు హవ్యము వహించును. అతడు బాహుబల ద్యుతియుక్తుడు. అట్టి అగ్ని యజమానుల కొఱకు దేవతలను ఆహ్వానించును.
అగ్ని సూర్యునివలె నరులకు విశేషరూపమున వరణీయ ధనమున ప్రసాదించును.
3. ఋత్విక్కులు హవ్యము, స్తోత్రములద్వారా అగ్నిని చక్కగా పూజించి బలవర్ధకుని చేయుదురు. మేము అతనినే ప్రవృద్ధ తేజోవంతుని, ధనస్వామియగు అగ్నిని స్తుతింతుము. మేము అతని స్నేహము కోరుదుము.
4. అగ్నీ ! మేము యజమానులము. నీవు మాకు ఎల్లరు వాంఛించు బలమును ప్రసాదించుము. ద్యావాపృథ్వులు సూర్యునివలె శ్రవణీయ అగ్నిని పరిగ్రహించినారు.
5. అగ్నీ ! మేము యజమానులము. నిన్ను స్తుతించుచున్నాము. నీవు త్వరత్వరగా మా యజ్ఞమునకు విచ్చేయుము. మా కొఱకు వరణీయ ధనమును సముపార్జించుము. మమ్ము యుద్ధమున సమృద్ధియుక్తులను చేయుము.
పదిహేడవ సూక్తము
ఋషి-ఆత్రేయ పురోరుడు, దేవత-అగ్ని, ఛందస్సు-చివరిది పంక్తి. మిగిలినవి అనుష్టుప్.
1. అగ్ని స్వతేజమున ప్రవృద్ధుడు. ఋత్విక్కులు స్తోత్రములద్వార సంతృప్తుని చేయుటకు అగ్నిని ఆహ్వానింతురు. నరులగు స్తోతలు యజ్ఞకాలమున రక్షణకుగాను అగ్నిని స్తుతింతురు.
2. ధర్మవిశిష్టస్తోతా ! నీ యశస్సు సర్వశ్రేష్ఠము కావలెను. నీవు వర్ధమానుడవయి దుఃఖము ఎరుగని, తేజోవిశిష్టుడగు అగ్నిని, స్తుతియోగ్యుని సద్వచనముల స్తుతింతువు.
3. అగ్ని జగద్రక్షక బలయుక్తుడు. స్తుతియుక్తుడు. సూర్యునివలె ద్యుతిమంతుడు. అతని కాంతి జగత్ వ్యాప్తము. అతనివలననే సకలదీప్తులు ప్రకాశవంతములగును. అట్టి మహాగ్ని ప్రభాజ్యోతులతోనే ఆదిత్యుడు వెలుగుచున్నాడు.
4. చక్కని మతిగల ఋత్విక్కులు దర్శనీయ అగ్నిని యజించి ధనమును, రథమును పొందుదురు. యజ్ఞార్థము ఆహూతుడగు అగ్ని పుట్టగానే సమస్తజనులచే స్తుతించబడును.
5. అగ్నీ ! స్తోతలు నిన్ను స్తుతించి పొందునట్టి వరణీయ ధనమును ఆలస్యము చేయక మాకు ప్రదానము చేయుము. మాకు అభిలషిత అన్నము అందించుము. మమ్ము రక్షింపుము. మేము మంగళకరములగు పశ్వాదులను యాచించుచున్నాము. సంగ్రామమునందు మా సమృద్ధికిగాను అగ్నీ ! నీవు ఉపస్థితుడవగుము.
పద్దెనిమిదవ సూక్తము
ఋషి-ఆత్రేయ ద్వితుడు, దేవత-అగ్ని ఛందస్సు-చివరిది పంక్తి. మిగిలినవి అనుష్టుప్.
1. అగ్ని బహుప్రియుడు. యజమానులకు ధనదాత. వారి ఇండ్లయందు ఉండువాడు. అగ్ని ప్రాతఃకాలమున స్తుతుడగును. అమరుడగు అగ్ని యజమానుల మధ్యనున్న సకల హవ్యములను వాంఛించును.
2. అగ్నీ ! అత్రిపుత్రుడు ద్వితుడు సర్వకాలములందు నీకొఱకు సోమము సిద్ధపరచును. నిన్ను స్తుతించును. విశుద్ధ హవ్యముల వహించును. అందువలన అతనికి నీ బలమును ప్రదానము చేయుము.
3. అగ్నీ ! నీవు అశ్వదాతవు. దీర్ఘగమనుడవు. దీప్తిమంతుడవు. ధనికుల కొఱకుగాను మేము స్తోత్రముల ద్వారా నిన్ను ఆహ్వానించుచున్నాము. అందువలన ధనికుల రథము శత్రువుల ద్వారా అహింసితమయి యుద్ధమునకు సాగవలెను.
4. ఋత్విక్కులద్వారా యజ్ఞవిషయక నానావిధ యజ్ఞకార్యము సముపార్జించబడును. వారు ఉచ్ఛారణల ద్వారా స్తోత్రములను రక్షింతురు. అట్టి ఋత్విక్కులు యజమానులకు స్వర్గ ప్రాపకమగు యజ్ఞమున విశాల కుశాసనమున అన్నమును స్థాపింతురు.
5. అమర అగ్నీ ! నిన్ను స్తుతించినంత నాకు ఏబది అశ్వములు దానము చేసిన ధనికునకు దీప్త శీల పరిచారకయుక్త మహాన్నమును ప్రసాదించుము.
పందొమ్మిదవ సూక్తము
ఋషి-ఆత్రేయ వర్వి, దేవత-అగ్ని ఛందస్సు 1-2 గాయత్రి, 3-4 అనుష్టుప్ 5 విరాట్.
1. భూమాత వద్ద నిలిచి పదార్థజాతములను చూచునట్టి అగ్ని వర్వి ఋషి అశోభన దశను ఎరుగవలెను. అతని హవ్యమును గ్రహించి, అతనిని ఉద్ధరించవలెను.
2. అగ్నీ ! నీ ప్రభావమును ఎరిగిన జనులు యజ్ఞము కొఱకుగాను నిన్ను సదా ఆహ్వానింతురు. హవియు, స్తుతులద్వారా నీ బలమును కాపాడుదురు. అట్టివారు శత్రువునకు అగమ్యములగు పురములందు ప్రవేశింతురు.
3. మహా స్తుతులు చేయువారు అన్నాభిలాషులు స్వర్ణాలంకార భూషణలు ఉత్పన్నశీలురగు ఋత్విక్కులు స్తోత్రములద్వారా అంతరిక్షవర్తి వైద్యుతాగ్నియొక్క దీప్తిమంతమగు బలమును వర్థిల్ల చేయుదురు.
4. పాలు కలిపిన హవ్యమువలె ఏ అగ్ని జఠరమున అన్నము ఉన్నది. ఎవడు స్వయం శత్రువుల ద్వారా అహింసకుడయి శత్రువులను హింసించునో ద్యావాపృథ్వులకు సహాయభూతుడగు ఆ అగ్నియే కమనీయుడు, నిర్దోషియయి మా స్తోత్రమును ఆలకించవలెను.
5. ప్రదీప్తుడవగు అగ్నీ ! నీవు వనములను భస్మము చేసిక్రీడింతువు. వాయు ప్రేరకుడవయి మనోహరుడవయి మా ముందునకు విచ్చేయుము. శత్రునాశకములగు నీయొక్క తీవ్రజ్వాలలు మా వద్ద సుకోమలములు కావలెను.
ఇరువదవ సూక్తము
ఋషి-ఆత్రేయ ప్రయస్వతుడు, దేవత-అగ్ని ఛందస్సు - చివరిది పంక్తీ. మిగిలినవి అనుష్టుప్.
1. అగ్నీ ! నీవు అత్యంత అన్న ప్రదుడవు. మేము నీకు హవిరూప అన్నము సమర్పింతుము. అది నీకు ఇష్టమగును. మా స్తుతుల సహితముగా ఆ హవ్యధనమును దేవతలకు చేర్చుము.
2. అగ్నీ ! పశువులు మున్నగు ధనముగలవాడై నీకు హవ్యప్రదానము చేయునట్టి వ్యక్తి అన్నహీనుడు, బలహీనుడు అగును. వేదభిన్నములగు అన్యకార్యములు చేయువాడు అసురుడు అగును. అతనిని నీవు హింసింతువు.
3. అగ్నీ ! నీవు దేవతల ఆహ్వాతవు. బలముల సాధకుడవు. అన్నవంతులమగు మేము నిన్ను కోరుకుందుము. యజ్ఞమునందు శ్రేష్ఠ అగ్నిని స్తుతిరూప వచనములతో భజింతుము.
4. బలశాలివగు అగ్నీ ! నిత్యము నీ రక్షణలు కలుగునట్లు చేయుము. మాకు ధనలాభము కలుగునట్లును, మేము యజ్ఞము చేయగలుగునట్లును చేయుము. మాకు ఆవులు కలుగునట్లును, పుత్రులు కలిగి సుఖించునట్లును సేయుము.
ఇరువది ఒకటవ సూక్తము
ఋషి-ఆత్రేయ పసుసు, దేవత-అగ్ని ,ఛందస్సు అనుష్టుప్. చివరిది ఫంక్తి.
1. అగ్నీ ! మనువువలె మేము నిన్ను స్థాపింతుము. జ్వలింపచేతుము. అంగిరాత్మక అగ్నీ ! దేవాభిలాషులగు మానవ యజమానులకొఱకు నీవు దేవతలను యజింపుము.
2. అగ్నీ ! నీవు స్తోత్రముల ద్వారా సుప్రీతుడవు అగుదువు. నరుల కొఱకు ప్రదీప్తుడవగుదువు. ఘృతయుక్తాన్న హవ్యవిశిష్టపాత్ర నీకు నిత్యము లభించుచుండును.
3. క్రాన్తదర్శివగు అగ్నీ ! ప్రసన్నులయిన సకల దేవతలు నిన్ను వారి దూతను చేసినారు. అందువలననే పరిచర్య చేయు యజమానులు యజ్ఞములందు దేవతలను ఆహ్వానించుటకు నిన్ను యజింతురు.
4. దీప్తిశాలివగు అగ్నీ ! మానవులు దేవ యజ్ఞమునకుగాను నిన్ను స్తుతింతురు. హవిద్వారా ప్రవృద్దుడవయి ప్రజ్వరిల్లుము. నీవు సత్యభూత ససఋషియొక్క యజ్ఞ, సాధన స్థలమున దేవరూపమున నిలువుము.
ఇరువది రెండవ సూక్తము
ఋషి-ఆత్రేయ విశ్వపాముడు, దేవత-అగ్ని ఛందస్సు-అనుష్టుప్ చివరిది పంక్తి.
1. అగ్ని ! యజ్ఞమున సకల ఋత్విక్కులకు స్తోతవ్యుడు. దేవతల ఆహ్వాత. అత్యంత స్తవనీయుడు. విశ్వసామ ఋషీ ! నీవు అత్రివలె దీప్తివంతుడగు అగ్నిని అర్చింపుము.
2. అగ్ని జాతవేది. ద్యుతిమంతుడు. యజ్ఞకారకుడు. యజమానులారా ! అట్టి అగ్నిని వహించుడు స్థాపించుడు. దేవతలకు ప్రియమయినది. యజ్ఞసాధకమగు మేము అందించు హవ్యము అగ్నికి అందవలెను.
3. అగ్నీ ! నీవు దీప్తిశాలివి. నీ హృదయము జ్ఞానసంపన్నము. మా రక్షణకుగాను మేము నీ దరికి చేరినాము. మేము మానవులము. అగ్ని మాకు అర్చనీయుడు. అగ్నికి తృప్తిపరచుటకు మేము అతనిని స్తుతింతుము.
4. అగ్నీ ! నీవు బలపుత్రుడవు. సుందర హను నాసికలు గలవాడవు. గృహపతివి. నీవు మా ఈ పరిచారకస్తవమును గ్రహించుము. అత్రిపుత్రులు స్తోత్రమున నిన్ను వర్థిల్లచేయుదురు. వచనములతో అలంకరింతురు.
ఇరువది మూడవ సూక్తము
ఋషి - ద్యుమ్నుడు, దేవత-అగ్ని, ఛందస్సు-అనుష్టుప్, చివరిది పంక్తి
1. అగ్నీ ! నేను ద్యుమ్న ఋషిని. బలవంతుడగు శత్రువును జయించు పుత్రుని నాకు ప్రసాదింపుము. ఆ పుత్రుడు స్తోత్రయుక్తుడయి సంగ్రామమున సమస్త శత్రువులను పరాభూతులను చేయవలెను.
2. అగ్నీ ! నీవు బలశాలివి. సత్యభూతుడవు. అద్భుతుడవు. గోయుక్తుడవు. అన్నదాతవు. నీవు మాకు ఒక పుత్రుని ప్రసాదించుము. అతడు సేనలను పరాభూతులను చేయు సమర్థుడు కావలెను.
3. అగ్నీ ! నీవు దేవతల ఆహ్వాతవు. సకల జనులకు ప్రియంకరుడవు. సమాన ప్రీతిగలవారు. కుశచ్చేదులగు అఖిల ఋత్విగ్గణములు యజ్ఞగృహమున నిన్ను బహువిధ వరణీయ ధనమును యాచింతురు.
4. అగ్నీ ! లోక ప్రసిద్ధ విశ్వచర్వణ ఋషికి శత్రువులను హింసించు బలము కలుగవలెను. ద్యుతిమాస్ ! నీవు మా ఇంట ద్యుతిమంతుడవయి ప్రకాశించుము. పాపపరిహారక అగ్నీ ! నీవు ద్యుతియుక్తుడవు, యశోయుక్తుడవగుము. దేదీప్యమానుడవగుము.
ఇరువది నాలుగవ సూక్తము
ఋషి - బంధు, శుబంధు, శ్రుతబంధు, విప్రబంధులను నలుగురు ఋషులు; లేదా గౌపాయన తాపాయనులు, దేవత-అగ్ని, ఛందస్సు-ద్విపద విరాట్
1.2 అగ్నీ ! నీవు పూజనీయుడవు. రక్షకుడవు. సుఖంకరుడవు. గృహదాతవు. అన్నదాతవు. నీవు మాకు దగ్గరివాడవగుము. అనుకూలుడవగుము. అతిశయదీప్తిశీల పశుస్వరూపధనమును ప్రసాదించుము.