14. ఇంద్రా ! నిన్ను శత్రువులు ఎదిరించజాలరు. నీవు నీ ప్రకృతి సిద్ధ బలమున ప్రత్యక్ష దృశ్యమానములగు అనేక భువనజాతములను సృష్టించినావు.
వజ్రధరా ! శత్రువును శీఘ్రముగా నష్టపరచుటకు నీవు చేయు కార్యమును, నీ అసమాన బలమును ఎంతటివాడును నివారింపజాలడు.
15. ఇంద్రా ! నీవు అతిశయ బలవంతుడవు. మేము నేడు నీ కొఱకు నవస్తోత్రములను రచించినాము. మేము సమర్పించు ఆ నూతన స్తోత్రములను నీవు పరిగ్రహింపుము. మేము ధీమంతులము. శోభన కర్మవంతులము ధనాభిలాషులము. ఈ సుందర స్తోత్రములను రథమువలెను, వస్త్రమువలెను మేము నీకు అర్పింతుము.
ముప్పదవ సూక్తము
ఋషి-బభ్రుడు, దేవత- ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. వజ్రధరుడు అనేకుల ద్వారా ఆహ్వానించబడు ఇంద్రుడు. అతడు దానయోగ్య ధనముతో సాగును. సోమాభిషవము చేయు యజమానిని వాంఛించును. యజమానిని రక్షించుటకు అతని ఇంటికి చేరును. అటువంటి పరాక్రమవంతుడగు ఇంద్రుడు ఎచట ఉండును? తన అశ్వద్వయము లాగునట్టి సుఖకరమగు రథముపై వెళ్లు ఇంద్రుని ఎవడు చూచినాడు?
2. మేము ఇంద్రుని అంతరంగమును, బహిరంగమును చూచినాము. అన్వేషించుచు ఆధారభూతుడగు ఇంద్రుని స్థానమునకు వెళ్లినాము. ఇతర విద్వాంసులను కూడ ఇంద్రుని విషయమున అడిగినాము. యజ్ఞనేతలు, జ్ఞానాభిలాషులు వారికి ఇంద్రప్రాప్తి కలిగినదని చెప్పినారు.
3. ఇంద్రా ! నీవు ఎన్నో గొప్ప కార్యములు చేసినావు. మేము స్తోతలము. సోమాభిషవ సమయమున వానిని వర్జింతుము. నీవు మా కొఱకు అనేక కార్యములు చేసినావు. వానిని గురించి తెలియనివారు తెలిసికొనవలెను. తెలిసినవారు తెలియనివారికి తెలియచెప్పవలెను. సమస్త సేవా సమేతుడయి, ధనవంతుడగు ఇంద్రుడు అశ్వమున ఆరోహించి తెలిసినవారి వద్దకును వినువారి వద్దకును వెళ్లవలెను.
4. ఇంద్రా ! నీవు జన్మించగనే సకల శత్రువులను జయించుటకు దృఢముగా సంకల్పించినావు. నీవు వంటరిగానే అనేకమంది రాక్షసులమీదికి యుద్ధమునకు పోయినావు. గోవులను ఆవరించిన పర్వతమును స్వబలమున బద్దలు కొట్టినావు. క్షీరదాయినులగు గోసమూహములను నీవే పొందినావు.
5. ఇంద్రా ! నీవు సర్వప్రధానుడవు. ఉత్కృష్టతముడవు. నీవు దూరమునుంచి శ్రవణీయమగు నామమును ధరించి జన్మించినపుడు అగ్ని మున్నగు దేవతలు భయభీతులయినారు. వృత్రుడు పాలించిన సకల ఉదకములను ఇంద్రుడు వశపరచుకున్నాడు.
6. మరుద్గణములు స్తోత్రపాఠముచేయు సుఖవంతులు. వారు స్తోత్రముల ద్వారా సుఖములు కలిగింతురు. ఇంద్రా ! వారు నిన్నే స్తుతింతురు. సోమలక్షణ అన్నమును సమర్పింతురు. వృత్రుడు సమస్త జలరాశిని ఆక్రమించుకొని నిద్రించినాడు. ఇంద్రుడు స్వశక్తితో కపటి, దేవతలకు బాధలు కలిగించు వృత్రుని ఓడించినాడు.
7. ఇంద్రా ! నీవు ధనికుడవు. మేము నిన్ను స్తుతింతుము. దేవతలను పీడించు వృత్రుని నీవు వజ్రమున పీడించుము. నీవు జన్మతోనే శత్రుసంహారము చేసినావు. ఈ యుద్ధమున నీవు మా సుఖమునకుగాను దాసుడగు నముచి తలను పిండిచేయుము.
8. ఇంద్రా ! శబ్దించుచు భ్రమణశీలమగు మేఘమువలె అసుర నముచి శిరమును చూర్ణము చేసినావు. మాతో స్నేహము చేసినావు. అప్పుడు మరుత్తుల ప్రభావమున ద్యావా పృథ్వులు చక్రమువలె తిరిగినవి.
9. నముచి స్త్రీలను యుద్ధసాధనములగు సేనను చేసినాడు. అసురుల ఆ స్త్రీ సేన నన్నేమి చేయగలదు అనుకున్న ఇంద్రుడు సేనా మధ్యమునుండి అసురుని ఇద్దరు ప్రేయసీ స్త్రీలను పట్టి తన ఇంట ఉంచుకున్నాడు. నముచితో యుద్ధమునకు సాగినాడు.
(అసుర నముచి, స్త్రీ సేనను ఏర్పరచినాడట నేటి అత్యంత ఆధునిక యుగమునకు స్త్రీ సేన లేదు)
10. దూడలు ఆవులకు దూరమయినవి. అప్పుడు నముచి అపహరించిన గోవులు చెల్లాచెదరయినవి. బభ్రుఋషి సమర్పించిన అభిషుత సోమమును సేవించి హృష్టుడయి ఇంద్రుడు సమర్థులగు మరుత్తుల సహితుడయి బభ్రుని గోవులను దూడలతో కలిపినాడు.
11. ఇంద్రుడు కోరికలు తీర్చువాడు. బభ్రుడు అభిషవించిన సోమముచే ఇంద్రుడు ప్రహృష్టుడు అయినాడు. సంగ్రామమున మహా శబ్దము చేసినాడు. పురందర ఇంద్రుడు సోమపానము చేసినాడు. బభ్రుని గోవులను మరల పాలిచ్చువానినిగా చేసినాడు.
12. అగ్నీ ! ఋణంచయ రాజు కింకరులు రుష్మదేశవాసులు నాకు నాలుగువేల గోవులనిచ్చి శుభంకర కార్యము చేసినారు. నేతలందు శ్రేష్ఠనేత ఋణంచయ రాజు ఇచ్చిన గోరూప రత్నములను నేను స్వీకరించినాను.
13. అగ్నీ ! ఋణంచయ రాజు కింకరులు రుష్మ దేశవాసులు నాకు అలంకార, ఆచ్చానాదులతో కూడిన గృహమును, వేల గోవులను దానము చేసినారు.
ఉషఃకాలమున సరససోమము ఇంద్రుని ప్రసన్నుని చేసినది.
(ఇంద్రుడు గోవులను విడిపించినంతనే బభ్రుడు సోమరసము అందించినాడని)
14. రుశ్మ దేశపు రాజు ఋణంచయుని వద్దనే సర్వత్ర వ్యాపించిన రాత్రి గడచిపోయినది. రాజు పిలువగా బభ్రుడు - వేగవంతమగు అశ్వమువలె వెళ్లినాడు. నాలుగువేల శీఘ్రగామిని గోవులను అందుకున్నాడు.
15. అగ్నీ ! మేము మేధావులము. రుశ్మదేశ వాసులు మాకు నాలుగు వేల గోవులను దానము చేసినారు. వారు మాకు పాలు పితుకుటకుగాను బంగారు కలశమును దానము చేసినారు. అది యజ్ఞము కొఱకు అగును.
ముప్పది ఒకటవ సూక్తము
ఋషి-ఆత్రేయ అవస్యుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-త్రిష్టుప్.
1. ఇంద్రుడు ధనవంతుడు. అతడు ఎక్కిన రథమును అతడే నడుపును. గోపాలురు పశు సమూహములను ప్రేరేపించినట్లు - ఇంద్రుడు శత్రు సేనలను పురికొల్పును. శత్రువులద్వారా అహింసితుడు, దేవశ్రేష్ఠుడగు ఇంద్రుడు శత్రువుల ధనమును కోరి సాగును.
2. హర్యశ్వవంతా ! ఇంద్రా ! నీవు మాకు అభిముఖముగా విచ్చేయుము. మా విషయమున హీన మనోరథుడవు, ఉదాసీనుడవుకారాదు.
బహువిధ ధనములుగల ఇంద్రా ! నీవు మమ్ము ఆదుకొనుము. నిన్ను మించి శ్రేష్ఠమయినది మరొకటి లేదు. అపత్నీకులకు నీవు స్త్రీని ప్రదానము చేతువు.
3. ఉష తేజమును సూర్యుని తేజము అతిక్రమించినపుడు ఇంద్రుడు యజమానులకు అఖిల ధనమును ప్రసాదించును అతడు నివారక పర్వత మధ్యమున బంధించి ఉంచిన పాడి ఆవులను విడిపించినాడు. సర్వత్ర వ్యాప్త స్వతేజమున ఇంద్రుడు అంధకారమును దూరము చేసినాడు.
4. బహుజన ఆహూత ఇంద్రా ! ఋభువులు నీ రథమును అశ్వ సంయుక్త యోగ్యము చేసినారు. త్వష్ట నీ వజ్రమును ద్యుతిమంతము చేసినాడు. ఇంద్రుని పూజించు అంగిరులు వృత్రవధకుగాను ఇంద్రుని తమ స్తోత్రములతో సంవర్థితుని చేసినారు.
5. ఇంద్రా ! నీవు కోరికలు తీర్చువాడవు. సేచన సమర్థులగు మరుత్తులు నిన్ను కొనియాడినప్పుడు సోమాభిషవ శిలలు సహితము ప్రసన్నములయి - సంగతములయినవి. ఇంద్రుడు పంపగా అశ్వహీన, రథహీన మరుత్తులు దండెత్తి శత్రువులను ఓడించినారు.
6. ఇంద్రా ! నీ యొక్క పురాతనములు, నీ వనములగు కార్యములను మేము స్తుతింతుము. నీవు చేసిన కార్యములను మేము తెలియపరతుము. నీవు ద్యావా పృథ్వులను వశపరచుకున్నావు. నరులకు విచిత్రములగు జలములను ప్రసాదించినావు.
7. ఇంద్రా ! నీవు దర్శనీయుడవు. బుద్ధిమంతుడవు. వృత్రుని వధించి ఈ లోకమున నీ బలమును ప్రదర్శించినావు. అది నీకు మాత్రమే తగును. నీవు "శుష్ణ" అసురుని యువతిని గ్రహించినావు. యుద్ధస్థలమునకు చేరి నీవు అసురులను నష్టపరచినావు.
8. ఇంద్రా ! యదు, తుర్వశ రాజులు నదీతీరములందు ఉండువారు. వనస్పతులను పెంచుటకుగాను వారికి నీవు జలమును ప్రసాదించినావు. కుత్సునిపై ఆక్రమణ జరిపిన శుష్ణుని వధించి కుత్సుని అతని ఇంటికి చేర్చినావు. అప్పుడు అశన మఱియు దేవతలు ఉభయులు నిన్ను భజించినారు.
9. ఇంద్ర-కుత్సులు ఒకే రథమున ఎక్కవలెను. అశ్వగణములు వారిని యజమానివద్దకు తీసికొనిరావలెను. మీరు ఉభయులు శుష్ణుని అతని నివాసమగు జలమునుండి దూరము చేసినారు. ధనవంతులగు యజమానుల హృదయములనుండి అజ్ఞానాంధకారమును దూరము చేసినారు.
10. విద్వాంసుడగు అవస్యుఋషి వాయువేగము గలవి - రథమునకు పూన్చదగినవి అయిన అశ్వములను పొందినాడు.
ఇంద్రా ! అవస్యుని మిత్రులగు సకల స్తోతలు, స్తోత్రములతో - నీ బలమును వర్థిల్లచేయుదురు.
11. పూర్వము ఏతశ ఋషికి సూర్యునితో సంగ్రామము జరిగినది. అప్పుడు ఇంద్రుడు సూర్యుని వేగవంతమగు రథపు నడకను నిలిపివేసినాడు. ఇంద్రుడు సూర్యుని ద్విచక్ర రథము నుండి ఒక చక్రమును ఊడ పెరికినాడు. ఆ చక్రముతోనే ఇంద్రుడు శత్రువులను నష్టపరచినాడు. ఇంద్రుడు మాకు బహుమతులనిచ్చి మా యజ్ఞమునకు విచ్చేయవలెను.
12. ఇంద్రా ! నీవు అమరుడవు. నిన్ను అభిలషించి పూజించు మరణశీల నరునకు ఎవడును అనర్థము చేయజాలడు. నీవు యజమానులను కరుణింపుము. వారి విషయమున ప్రసన్నుడవగుము. మానవుల మధ్యనున్న మేము - స్తోతల మందరము నీవారము కావలెను. నీవు అట్టి మానవులకు బలమును ప్రసాదించుము.
ముప్పది రెండవ సూక్తము
ఋషి-ఆత్రేయ గాతుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-త్రిష్టుప్.
1. ఇంద్రా ! నీవు వర్షించు మేఘమును విదీర్ణము చేసినావు. మేఘస్థ జల నిర్గమన ద్వారమును ఏర్పరచినావు. విశాల మేఘముతో వర్షము కురిపించినావు. ధనుపుత్రుడు వృత్ర సంహరించినావు.
2. వజ్రవాన్ ఇంద్రా ! బంధించిన మేఘములను నీవు వర్షకాలమున బంధవిముక్తులను చేయుము. జలమున శయనించిన వృత్రుని నీవు వధించినావు. అప్పుడు నీ బలము లోక విఖ్యాతమయినది.
3. అప్రతిద్వంద్వి, ఏకమాత్ర ఇంద్రుడు మృగమువలె శీఘ్రగామియయిన వృత్రుని ఆయుధములను స్వబలమున నష్టపరచినాడు. అప్పుడు వృత్రుని దేహమునుండి మరొక అతిశయ బలశాలి అసురుడు పుట్టినాడు.
4. వర్షించు మేఘములను ప్రహరించు వజ్రధర ఇంద్రుడు వజ్రమున బలవంతుడగు శుష్ణుని కూల్చినాడు. శుష్ణుడు వృత్రుని క్రోధమున జనించినాడు. అంధకారమున వసించినాడు. కురువనున్న మేఘమును కట్టిపెట్టి కాపున్నాడు. అతడు సంపూర్ణ ప్రాణజాలపు అన్నమును తానొక్కడే తిని మురిసినాడు.
5. ఇంద్రా ! నీవు బలవంతుడవు. మాదక సోమరస పానమున హృష్టుడవు అయినావు. అంధకార నిమగ్నుడు, యుద్దాభిలాషి వృత్రుని కనుగొన్నావు. తనను అవధ్యునిగా భావించు వృత్రుని ప్రాణస్థానమును - వాని చర్యలవలననే తెలిసికున్నావు.
6. వృత్రుడు సుఖకర ఉదక సహిత జలమున శయనించినాడు. అంధకారమున వర్థిల్లినాడు. అభిషుత సోమపానము హృష్టుడయిన-అభిలాషపూరక ఇంద్రుడు వజ్రమును ఎత్తి వృత్రుని కొట్టినాడు.
7. ఇంద్రుడు ఆ విరాట్ దానవ వృత్రునిమీద విజయ వజ్రమును ఎత్తినపుడు వజ్రముతో వృత్రుని ప్రహారము చేసినపుడు అందరి ప్రాణులలో వృత్రుని నీచుని చేసినాడు - ఇంద్రుడు.
8. వృత్రుడు గమనశీల మహా మేఘములను ఆక్రమించి శయనించినవాడు. సంహారకుడు. అందరిని ఆచ్చాదించినవాడు. ఉగ్ర ఇంద్రుడు అట్టి వృత్రుని పట్టినాడు. యుద్ధమున పాదరహితుని పరిమాణ రహితుని చేసినాడు. తన విరాట్ వజ్రమున వృత్రుని కూల్చినాడు.
9. ఇంద్రుని యొక్క ఇతరులను శోషింప చేయు బలమును ఎవడు నివారింప గలడు? ఇంద్రుడు అప్రతి ద్వంద్వి. ఒక్కడే శత్రువుల ధనమును హరించును. ద్యుతిమంతములగు ద్యావాపృథ్వులు వేగవంతుడగు ఇంద్రుని బలమునకు భయపడి వెంటనే కదలినవి.
10. స్వయముగా భరించగల ద్యుతిమంత ద్యులోకము ఇంద్రునిముందు కొంచమై సాగును. అభిలాషగల స్త్రీవలె భూమి ఇంద్రునకు ఆత్మార్పణము చేయును. ఇంద్రుడు తన సమస్త బలమును ప్రజల మధ్య స్థాపించినపుడు మానవులు బలశాలియగు ఇంద్రునకు నమస్కరింతురు.
11. ఇంద్రా ! నీవు మానవులలో ముఖ్యుడవని సజ్జనపాలకుడవని పంచజనుల హితముకొఱకు జన్మించినావని మాకు ఋషులు చెప్పగా విన్నాము. నీవు యశోవంతుడవు. రాత్రింబవళ్లు స్తుతించునట్టి - తమ కోర్కెలను వ్యక్తపరచగలట్టి మా సంతానము స్తుతి యోగ్య ఇంద్రుని అనుగ్రహమునకు పాత్రము కావలెను.
12. ఇంద్రా ! నీవు సమయానుసారము జంతువులను ప్రేరేపింతువని స్తోతలకు ధనదానము చేతువని విన్నాము. అది నిజము కానట్లున్నది.
ఇంద్రా ! తమ ఆశలన్ని నీ మీద పెట్టుకొని, నీకు మిత్రులయిన స్తోతలకు ఏమి దొరికినది?
(ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగవ అష్టకము ఐదవ మండలమున మొదటి అధ్యాయమున రెండవ అనువాకము సమాప్తము)