విమల్: అమల్ - నువ్వు యూత్ బర్నల్ ఫిలిం ఏమయినా చూశావా?___
అమల్ : దాదాపు అన్నీ చూశాను. బ్రహ్మాండంగా వుంటాయి. యూత్ బర్నర్ ముందు - మార్లేన్ బ్రాండో ఎందుకూ పనికిరాడనుకో ఇంద్ర నీవు చూశావా?__
ఇంద్ర : చూశాను.
కమల్: ఏడ్చినట్టుంటాడు - వాడి గుండూ వాడూను!
అమల్ : గుండే! అయితేనేం? వాడి బుర్రకాయ అలాంటిది. గుండు కొట్టించుకొనే సాహసం -అందుకే, అతనికుంది.
విమల్ : బుర్రకాయ అలాంటిది అంటే మరో అర్ధం వస్తుంది బ్రదర్!
కమల్: అంటే ఆయిన్ స్టాయిన్ బుర్రలాగ!
ఇంద్ర: ఆయిన్ స్టాయిన్ పుస్తకం ఒకటి చదివాను. అసలు అర్ధం అయితేనా?-
అమల్: డైమన్ షన్సు నాలుగు అన్నాడు. ఆయిన్స్టాన్.
విమల్ : నాలుగో డైమెన్ షన్ టైం అన్నాడు కదూ!
కమల్: కాలేజీలో ఫిజిక్సు మింగుడు పడటంలేదు. పైగా నాలుగో డైమెన్ షన్ ఒకటి మన ప్రాణానికి. అమల్ - నీ ప్రాక్టికల్ బుక్ తయరయిందా?
అమల్ - మా అన్నయ్య బుక్ చూసి కాపీ చేసేస్తాను. ఆఁ - ఎప్పుడు సబ్ మిట్ చెయ్యాలి ?
విమల్ : పదమూడో తారీఖులోపల. యింతవరకూ నేను మొదలుపెట్టనేలేదు. ఇంద్రా - నీ రథం ఎంతదూరం కదిలింది?
ఇంద్ర : నిన్ననే ప్రారంభించాను. ఒక మంచిపుస్తకం దొరికింది. కోర్సు పుస్తకాలు రెండు రోజులనుంచి ముట్టలేదు.
కమల్ : ఏం పుస్తకం?
ఇంద్ర: బెర్నార్డ్ షా ! కంప్లీట్ ప్లేస్ !
అమల్ : బెర్నార్డుషా ! ఆహ! ఏం దంచేస్తున్నాడు. నువ్వు- మాన్ - అండ్ - సూపర్ మాన్ - చదివావా?
విమల్ : నేను ప్లేస్ అండ్ ప్లే లెట్సు మాత్రం చదివాను.
కమల్: మన ప్రధమ్ బీసీకూడా ఇలాంటి ప్లేసే రాశాడు.
అమల్ : తగ్గు! ఎక్కడ జి. బిసి - ఎక్కడ ప్రధమ బీ సీ !
విమల్: ప్రథం. బీ సి - పాలిటిక్సు ఇరికిస్తాడు.
కమల్ : అయితే ఏం? సాహిత్యంలో పాలిటిక్సు వుంటూనే వుంటాయి. ఆ మాటకొస్తే అవుసరం కూడా!
అమల్: నేను ఒప్పుకొను. సాహిత్యం, - 'సత్యం - శివం సుందరం'కు ప్రతీక. చెత్త పాలిటిక్సు అందులోస్తావంలేదు.
విమల్ : చెత్త ! అంటూ తోసేయడానికి నేను అంగీకరించను. చెత్తకూడా సత్యమే. సత్యంనుంచి పారిపోవటాన్ని ఎస్ జేపిజం అంటాను. సాహిత్యం జీవిత ప్రతిబింబం. రియాలిస్టిక్ ఇంద్ర నీ అబిప్రాయం. ఏమిటి?-
ఇం : నాకంతగా తెలియదు. కాని _ ఒకటి - సాహిత్య రియలిస్టిక్ గా, వుండాలనేది నిజమే కానీ నగ్నసత్యాన్ని ప్రతిబింబించేదిగా......
కమల్: (వెంటనే అందుకోవలెను) అరె, అప్పుడే, ఏడున్నరయిందే!
అమల్ : మైగాడ్ ! ప్రాక్టికల్ బుక్కు తయారుచేయాలి. పదండి -పదండి!
విమల్ : మాత్రోన వేరు-
కమల్ : వెళ్దాం పద అమల్-
(అమల్ - కమల్ - నిష్ర్కమిస్తారు.)
విమల్ : ఇంద్ర! ఇంటికి వెళ్ళవా?
ఇం: నాకు వేరే పనివుంది.
విమల్ : ఎక్కడి కెళ్ళాలి?
ఇం : అటు !
విమల్ : అటయితే వాళ్ళతో ఎందుకెళ్ళలేదు.
ఇం : అప్పడనుకోలేను.
విమల్ : తస్సాదియ్యా! నేను ఒక్కణ్ణే వెళ్ళాలి.
(విమల్ నిష్ర్కమణ - ఇంతవరకు మందంగా మ్రోగుతున్న, తబలా వాద్యం ధ్వని పెద్దదవుతుంది.)
(రచయిత ప్రవేశిస్తాడు.)
రచ: ఇంద్ర ! నువ్వింకా ఇక్కడే వున్నావా?
ఇం: ఊ! (ఆలోచనలో వుండును.)
రచ: ఏమిటాలోచిస్తున్నావు?
ఇం:ఏమిలేదు.
రచ: వాళ్ళివాళ రాలేదా?
ఇం: వచ్చి వెళ్ళాను.
రచ: ఎవరెవరు?
ఇం: అమల్ - విమల్ - కమల్.
రచ: ఏం చేశారు? మీరంతా చేరి?
ఇం: కబుర్లు చెప్పకున్నాము.
రచ: ఏం కబుర్లు?
ఇం: ఆ - ఏదో ఆ సంగతీ - ఈ సంగతీ!
రచ: క్రికెట్ - సినిమా - ఫిజిక్సు - రాజనీతి - సాహిత్యం - అవునా?
ఇం: అరె! క్రికెట్ -సినిమా- ఫిజిక్సు- రాజనీతి-సాహిత్యం- ఇవన్నీ నీకెలా తెలుసు?
(రచయిత జవాబు ఇవ్వదు. జేబులోనుంచి వేరుశనగకాయలు తీసి ఇస్తాడు.)
రచ:ఇంద! తిను!
ఇం: ఏం చెయ్యమంటావో చెప్పు?
రచ: ఏ విషయం?
ఇం : అదే! ఈ చదువు నా వల్ల కావటం లేదు.
రచ: మరి ఇంకేం, చేస్తావు?
ఇం: అదే తెలియటంలేదు. అన్నీ వదిలేసి, ఎక్కడకైనా పారిపోవాలని అనిపిస్తుంది.
రచ: ఎక్కడికి పారిపోవాలని?
ఇం : అదీ తెలియదు. ఎక్కడుకో - దూరంగా బహు దూరగా - అక్కడ ఏముంటుందో కూడా తెలియని స్ధలానికి - అరణ్యం -ఎడారి - మంచుకొండలు- పక్షులు- ఆస్ట్రిన్ - జంతువులు- కంగారు - మనుష్యులు.
రచ: ఇంతేగదా! ఇదేమంత పెద్ద విషయం సరళభూగోళశాస్త్రం - డి.పి.ఐ. ద్వారా ఆరోక్లాసుకు పెట్టిన పుస్తకం-
ఇం : భూగోళానికి అవతలగూడా, మరో ప్రపంచం వుంది. ఆ ప్రపంచం ఇక్కడెక్కదాలేదు- దూరంగా - సుదూరంగా - ఈ ప్రపంచానికి అవతల __
రచ: క్రికెట్ - సినిమా - ఫిజిక్సు - రాజనీతి - సాహిత్యం - వీటన్నిటికీ, దూరంగానా!
ఇం : అవును! వీటన్నిటికీ, దూరంగా!
రచ: అయితే పద!
ఇం: ఎక్కడికి?
రచ: అన్నీ వదలి పారిపోతావన్నావుగా?
ఇం: ఇప్పుడా ?
రచ: ఇంకెప్పుడు?
ఇం: నీతో చెప్పడం అంత బుద్దితక్కువ మరొకటిలేదు.
రచ: నీ జేబులో డబ్బు ఎంతుంది?
ఇం: ఎనిమిదణాలు ఏం, ఎందుకు?
రచ: ణా జేబులో రూపాయి పావలా వుంది. రూపాయి పన్నెండణాలతో, హైదరాబాదు స్టేషన్ నుంచి, పోగలిగినంత దూరం వెళదాం. ఆ తరువాత పాదయాత్ర వుండనే వుంది!
ఇం: ఇలా ఎగతాళి చేస్తాననుకొంటే, నీతో మాట్లాడకపోదును.
రచ: నేను చాలా సీరియస్ గానే, మాట్లాడుతున్నాను.
(ఇంద్ర- రచయిత ముఖంలోకి చూస్తాడు. అతను నిజంగానే -సీరియస్ గానే కనిపిస్తాడు. ఇంద్రజిత్ సందిగ్దంలో పడిపోతాడు.)
ఇం: కాని-అమ్మ....
రచ:నిజమే, అమ్మ....
ఇం : పరిక్షలుగూడా దగ్గరకొచ్చాయి.
రచ:పరీక్షల తర్వాత మాట్లాడుదాంతే! ఇవిగో తీసుకో.
(అంటూ జేబులో నుంచి వేరు శనక్కాయలు తీసి యిచ్చి, వెళ్ళిపోతాడు.)
(నేపద్యంలో పిన్ని కంఠం వినిపిస్తుంది)
"ఇంద్ర!"
ఇం: ఆఁ వస్తున్నా!
(ఇంద్ర కదలడు నిలుచునే వుంటాడు. పిన్ని ప్రవేశం)
పిన్ని: ఏరా! తిండి తినవా ఏమిటి? ఎంతసేపు వంటింట్లో కూర్చోమంటావు?
ఇం : అమ్మా !మరే....
రచ: ఆఁ, ఏమిటి?