Next Page 
అందాల జాబిలి పేజి 1

                                 


                                                       అందాల జాబిలి

                                         - యామినీ సరస్వతి   


    ఆ వూళ్ళో లక్ష జనాభా వుంటుంది. ఇరవై వేల గడప వుంటుంది. అయిదారు ధియేటర్లున్నాయి. సుమారొక వేయి మేడలుంటాయి. ఆర్టీసీ డిపో వుంది. వీధివీధికీ సారా డిపో కూడా ఉంది. వయసొచ్చిన, దారి తప్పిన అబ్బాయిలని అలరించిందేకు మానినీగణం కూడా వుంది. వాళ్ళం రహస్యంగా చీకట్లో చేసే తప్పిదాలని బహిర్గతం చేసి, వాళ్ళ నేరాన్ని కోర్టుపాలు, వాళ్ళ బ్రతుకుల్ని వీధిపాలూ చేసే ప్రభుత్వ యంత్రాంగంలోని ఒక భాగమైన పోలీసు శాఖవారికి అటోకటీ, యిటోకటీ రెండు పోలీసు స్టేషన్లున్నాయ్. అన్నట్టు తాలూకా స్టేషన్ కూడా ఉంది. వీళ్ళని అజమాయిషీ చేసేందుకు డియస్పీ దొరగారు కూడా వున్నారు.
    ప్రపంచంలోని ప్రవహించే మురికి రోగాలన్నిటినీ తనలో ఇముడ్చుకుని రోగుల్ని తనద్వారా పైకీ, బయట ప్రపంచంలోకి పంపేసే "ధర్మాసుపత్రి" కూడా వుంది. అందులో ఆరోగ్యంగా వుండే "సిస్టర్స్" వున్నారు, డాక్టర్లున్నారు. వాళ్ళ ఫీజులున్నాయి. వాటిని ముట్టజెప్పేందుకు మార్గాలున్నాయి. అది ముట్టజెప్పేక వార్డుల్లో చోటు దొరుకుతుంది.
    ఇంట్లో అల్లరి భరించలేక తల్లిదండ్రుల్ని పిల్లల్ని తోలేందుకు మునిసిపల్ ఎలిమెంటరీ స్కూళ్ళు, ఉన్నత పాఠశాలలూ, ప్రయివేట్ రికగ్నయిజ్ డ్ అన్ రికగ్నయిజ్ డ్ బళ్ళూ, కాన్వెంటు స్కూళ్ళూ, ఆఖరికి జూనియర్ తో పాటు డిగ్రీ కళాశాల కూడా వుంది. దానికో ప్రిన్సిపాలూ వున్నాడు.
    కోర్టుంది. కాబట్టి లాయర్లున్నారు. జనం వున్నారు కాబట్టి ప్రయివేట్ నర్సింగ్ హోములూ వున్నాయ్. వారికి రోగుల్ని పకడ్బందీగా సరఫరా చేసేందుకు హోటల్సూ,  లాడ్జింగ్సూ వున్నయ్.
    ఆ ఊరికి శాసనసభ పుట్టినప్పటినుంచీ గెలుస్తోన్న ఎమ్మెల్యేగారు కూడా వున్నారు.
    ఇంకా మంత్రి కాలేదని ఆయన దుగ్ధ.
    ఇంత సర్వజన, సర్వసుఖ, సర్వరోగ సదుపాయంగా వున్నా ఆ వూళ్ళో ఎమ్మెల్యే యిల్లు, ప్రిన్సిపాల్ గారిల్లు, డియస్పీ బంగ్లా ఎక్కడ ఉన్నాయంటే అందరూ చెప్పలేరు కానీ---
    యువకవి కిశోరం రవీంద్ర యిల్లు ఎక్కడ అంటే ఎవర్నడిగినా చెబుతారు. అధికార, అనధికార వర్గాల్లోనే కాదు. విద్యార్ధుల్లో, అధ్యాపకుల్లో కూడా రవీంద్ర ఎడ్రస్ తెలీని వాళ్ళేలేరు.
    తెలియని వాళ్ళున్నారంటే వాళ్ళు నస్మరంతి గాళ్ళు. వాళ్ళని అతన్ని గురించే కాదు ఎవరినీ గురించీ ఆఖరికి అదే వీధిలో పాలు పోసుక బ్రతికే ముసలమ్మని గురించి కూడా అడగరు.
    బంగళాలతో, మేడలతో, సినిమా హాళ్ళతో, హోటళ్ళతో క్రిక్కిరిసి వున్న టౌన్లో లేదు రవీంద్ర ఇల్లు. ఆ టౌన్ కి దక్షిణంగా ఒక నది ఎప్పుడూ పారుతూ వుంటోంది. ఆ నదికి ఆవల ఒడ్డున కొన్ని యిళ్ళున్నాయి. ఆ యిళ్ళల్లో ఓ చివరగా తన శక్తి కొద్దీ వందేళ్ళ క్రితం రవీంద్ర ముత్తాత యిల్లు కట్టుకున్నాడు. ఆ యింటిని ఆయన కొడుకు కానీ, రవీంద్ర తండ్రిగారూ కానీ రిపేరు చేయించిన పుణ్యాన పోలేదు.
    బ్రతుకే బరువై, నిత్యభోజనమే సమస్య అయిపోయిన రోజుల్లో యింటి విషయం పట్టించుకునే స్తోమత ఎక్కడిది?
    ఇంటి నుంచి ఇరవై గజాలు నడిస్తే ఓ చిన్నరోడ్డు వస్తుంది. ఆ రోడ్డుకి ఆవలి వైపున దిగటం ప్రారంభిస్తే నదిలాటి ఆ ఏరు దర్శనం యిస్తుంది. ఉభయ సంధ్యల్లో రవీంద్ర ఆ గట్టున ఓ తుమ్మచెట్టు క్రింద దర్శనం యిస్తూ వుంటాడు.
    వర్షరుతువులో ఉద్ధృతంగా, వేసవిలో బలహీనురాలిలా ప్రవహిస్తూ వుంటోంది ఆ ఏరు. దాన్ని దాటగానే హైవే రోడ్డు. రోడ్డు వెంట నడిస్తే సినిమా హాళ్ళు, హోటళ్ళు, హాస్పిటళ్ళు, పోలీస్ స్టేషన్ లు కనిపిస్తాయి.
    ఒచ్చిక చిక్కల్లా ఆ రోడ్డుపై నడిచే వాళ్ళకి, వాహనాలపై వెళ్ళేవారికి ఈ ఏటి యివతలి వాళ్ళు ఎప్పుడో గుర్తుకివస్తారు.
    కానీ రవీంద్ర అప్పుడూ గుర్తుకి రాడు జనానికి. అతని గుర్తొచ్చేదల్లా ఒక విషయంలోనే---
    వరదల్లాంటి ఎలక్షన్లో, వర్షాల్లాంటి మంత్రిపుంగవుల రాకో, చినుకుల్లాటి ఉత్సవాలో రావాలి?
    అదిగో అప్పుడూ యువకవి కిశోరం గుర్తుకొచ్చేది.
    మరి ఆ వూళ్ళో కవులు యింకెవరూ లేరా?
    లేకేం గండెపెండేరాలూ, గజారోహణలూ, స్వర్ణకంకణాలూ అందుకున్నవారున్నారు. దేశానికి చాలినంత కీర్తి చేపట్టిన వాళ్ళూ వున్నారు.
    అయితే వాళ్ళెవరూ రవీంద్ర అంతటి సులభులు కారు! అదీ కారణం.
    వేసవి వెచ్చదనం గంట గంటకి సన్నగిల్లి నిమిష నిమిషానికీ చల్లగిల్లి పోతోంది.
    రవీంద్ర తుమ్మచెట్టు క్రింద కూర్చుని బాలగంగాధర తిలక్ కవితా సంపుటి అమృతం కురిసిన రాత్రి చదువుకుంటున్నాడు. అతను దాన్ని చదవటం ఎన్నోసార్లో! కనీసం యాభయి పర్యాయాలయినా చదివి వుంటాడు.
    అతనికి మనస్సు గాబరాకి లోనయినప్పుడల్లా ఆ పుస్తకం చేతికి తీసుకుంటాడు. అందమైన అమృతమయిన అమ్మాయి ఓదార్పులాగా అతనికా కవితా పంక్తులు వినిపిస్తాయి. తనలో తనే చదువుకుంటున్నా తిలక్ అమృతవాణి వీనుల విందుగా వినిపిస్తోన్నట్టుగా వుంటుంది.
    అతనా పూట తాలూకా ఆఫీసుకి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాడు. ఉద్యోగం పెద్దదేం కాదు! అచ్చవుతున్న ఎలక్ట్రోల్స్ ని సరిచూడటం! నిజానికి సరిచూడటం --- ప్రూఫ్ రీడింగ్ --- అని పేరే కానీ వీళ్ళెంత దిద్దినా వాళ్ళు వాటిని సరిచేయరు. అతి సులువుగా, అతి త్వరగా, అతి తక్కువ శ్రమతో అత్యధికంగా ప్రెస్సువాళ్ళు డబ్బు సంపాదించే ఏకైక మార్గం ఎలక్ట్రోల్ ప్రింటింగ్.
    కంపోజిటర్సూ అంతే! పాత కూలీకి యిబ్బడి ముబ్బడిగా సంపాదిస్తారు.
    రవీంద్రకి రోజుకి అయిదు రూపాయలపై ఆ కాంట్రాక్ట్ ఉద్యోగంపై ఆశ పుట్టి వెళ్ళేడు కానీ తహసీల్ దారు రాజా పిళ్ళేగారికి ఆసరికే ఎమ్మెల్సీ సిఫారసు, పి.ఏటు కలెక్టర్ ఫోన్ కాలూ, మాజీ సమితి ప్రెసిడెంటూ, మునిసిపల్ ఎక్స్ ఛెయిర్మన్ ఫోన్ కాలూ వచ్చాయి. ఖాళీలన్నీ ఎసెస్సీ పాసయినవారికి, ఇంటర్ తప్పిన వారికే సరిపోయాయి.
    ఇక బి.ఏ. డబుల్ లిట్ లో పాసయిన రవికి ఖాళీ ఎక్కడిది?
    ఆ చికాకులో మనస్సుపాడైన రవి తన జన్మహక్కుగా భావిస్తోన్న ఆ కంపచెట్టుక్రింద కూర్చుని తిలక్ ని చదువుకుంటున్నాడు.

Next Page