"పరిశ్రమలా కాలుష్యాన్ని మించిన సమస్య వాహనాలది. వాహనాల నడకకు పెట్రోలు ఇంధనంగా వాడడంవల్ల అవాంఛిత వాయువులు వాతావరణంలోకి వస్తున్నాయి. పెట్రోలుకు బదులు హైడ్రోజన్ గ్యాసును ఇంధనంగా వాడితే వాతావరణ కాలుష్యం సమస్య సగానికి సగం తగ్గిపోతుంది.
నీరు హైడ్రోజన్, ఆక్సిజన్ ల సమ్మేళనమని అందరికీ తెలుసు. నీటిని విద్యుచ్చక్తి సహాయంతో హైడ్రోజన్, ఆక్సిజన్ లుగా విడగొట్టవచ్చు. నీటిలో సోడియం కోహాన్ని వేసినా హైడ్రోజన్ ఉద్భవిస్తుంది.
కానీ అందువల్ల నీరు క్షారంగా మారిపోతుంది. అయితే నీటిని విద్యుచ్చక్తి అవసరం లేకుండా, సోడియం లోహాన్ని వాడకుండా- ఇంధనంగా పని చేయించగల కొత్త గొడుతుంది. మిగిలిన నీరు పరిశుద్దంగా వుంటుంది. ఈ రసాయనం మీద మరికొన్ని పరిశోధనలు జరగాల్సివుంది." అన్నాడు అజేయ్.
సభ కరతాళ ధ్వనులతో మోగిపోయింది.
రాజు తనూ చప్పట్లు కొడుతూ పక్కకు చూస్తే అపరిచిత వ్యక్తి తలపట్టుకుని అదోలా కనిపించాడు.
* * *
సన్మానం వేడుకలు పూర్తయ్యాక- నాయుడమ్మ భవనంలో ఒక పెద్దగదిలో ప్రొఫెసర్ అజేయ్ సుమారు యాభైమంది నిరుద్యోగ యువకులు కలుసుకున్నాడు.
ఆయన వారితో- "మీ ముఖాల్లో సూర్యతేజముంది. సామాన్యులకు పిండిపదార్థన్నిచ్చేదదే" అన్నాడు.
నిరుద్యోగుల ముఖాలు వికసించాయి.
"ఒక కాగితంమీద మీమీ పేర్లు వ్రాయండి. బయోడేటా క్లుప్తంగా ఇవ్వండి. అవకాశం లభిస్తే భారత ప్రజలకు మీ ప్రతిభనెలా వినియోగించగలరో పది వాక్యాల్లో వివరించండి. మీలో కొందరికి నేను తప్పక సదవకాశం ఇస్తాను. అయితే ప్రతిభ అవకాశాలకోసం ఆగదని కూడా గుర్తుంచుకుని మీకైమీరుగా ఏదైనా చేయండి. విద్యాధికులు ఉద్యోగమే చేయాలనుకునే రోజులు మారిపోతున్నాయి" అని వారికి తన సందేశాన్నిచ్చాడు.
నిరుద్యోగ యువకులకీ ప్రక్రియ ముందునుంచీ తెలుసు. అందుకని వారు వెంటనే తమతమ కాగితాలను ఆయనకు అందజేశారు. వారిలో రాజు కూడా వున్నాడు.
అజేయ్ ఆ కాగితాలను తన సెక్రటరీకిచ్చాడు. తర్వాత ఆ యువకులను. "మీకు నా గురించి చాలా తెలిసేవుంటుంది. ఆ నేపథ్యంలో నాతో ప్రత్యేకంగా చెప్పల్సినదేమైనా వుందా?" అనడిగాడు.
ఒక యువకుడు ముందుకు వచ్చి, "మీరు నీటినుంచి ఖర్చులేకుండా హైడ్రోజన్ విడుదల చేయగలిగితే-హైడ్రోజన్ కారు ఇంజన్ డిజైన్ నేను చేయగలను . ఈ విషయమై నాదగ్గర కొత్త ఐడియాలున్నాయి" అన్నాడు.
ఇంకో యువకుడు ముందుకు వచ్చి, "మధ్యతరగతి కుటుంబాలు బడ్జెట్ తయారుచేసుకునే కంప్యూటర్ సాప్ట్ వేర్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఫెసిలిటీస్ కావాలి" అన్నాడు.
"ఇవి మీరు మీ బయోడేటా కాగితంమీద రాస్తే సరిపోతుంది. ఇవికాక ఏమైనా వుంటే చెప్పండి" అన్నాడు అజేయ్
యువకులాలోచనలో పడ్డారు.
అప్పుడు రాజు ముందుకు వచ్చి. "ప్రొఫెసర్! నిస్సందేహంగా మీరు చాలా చాలా గొప్పవారు" అన్నాడు.
"ఇతరుల్లో గొప్పతనాన్ని చూడ్డం జీవితంలో పైకి రావడానికి పనికొచ్చే మార్గాల్లో ఒకటి. అంతకంటే మంచిమార్గం నేను చెబుతాను. నీలో నువ్వే గొప్పతనాన్ని చూడ్డం అలవర్చుకో. యూ కెన్ డూ వండర్స్ " అన్నాడు అజేయ్ .
కొందరామాటలు విని నవ్వారు.
"సర్!" నా ఉద్దేశ్యం వేరు. ,ఈ గొప్పతనం మీకు ప్రమాదకారి కావచ్చు- అని హెచ్చరిస్తున్నాను" అన్నాడు రాజు తటపటాయిస్తూ.
"వాడ్డూ యూమీన్" అన్నాడు అజేయ్ తెల్లబోయి.
"సర్! మీకు బాగా దగ్గరవారిక్కూడా ఈ విషయం తెలుసు. అయినా చెప్పడానికి భయపడుతున్నారు. మీ పరిశోధనాఫలితాలు సామాన్యమైనవి కావు...."
"అయితే?"
"సర్! యూ మే బి కిడ్నాప్డ్"
"ఆ మాటకు అక్కడున్న వారందరూ ఉలిక్కిపడ్డారు.
ఆ మాట మర్నాడు పేపర్లో బాక్స్ కట్టిన వార్తగా కూడా వచ్చింది.
* * *
నిస్సందేహంగా రాజు బ్రిలియంట్ స్టూడెంట్!
అతడు ఏమ్మెస్సీలో తన సబ్జక్టు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో యూనిర్సిటీ ఫస్టు వచ్చాడు. ఆ వెంటనే ఉద్యోగంలో చేరాలనుకున్నాడు. రాలేదు.
అప్పుడు రాజు పిహెచ్ డికి చేరాడు ప్రొఫెసర్ రావు వద్ద.
ప్రొఫెసర్ రావుకి రికమండేషన్ మీద వచ్చిందా ఉద్యోగం. అయన పిల్లలకు చదువు చెప్పడు. ఆయనకు రీసెర్చిమీద ఆసక్తి లేదు. యూనివర్సిటీలో వున్నంతసేపూ ఆయన దినపత్రికలు శ్రద్దగా చదువుతాడు. రాజకీయాల గాలి ఎటు మళ్ళుతున్నదీ చూస్తాడు. షేర్ల కదలికలను గుర్తిస్తాడు. బంగారం ధరలను ఆకళింపు చేసుకుంటాడు. వాటిని-తన ఆదాయంలో నిల్వలతో బేరీజు వేసి పెట్టుబడులు అంచనా వేస్తాడు. యూనివర్సిటిలో అదీ ఆయన కాలక్షేపం.
రాజుకి స్కాలర్ షిప్ రాగానే ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు అతడిపట్ల ఆసక్తి చూపారు. అయితే వాళ్లు మూడేండ్లదాకా ఎ ఉద్యోగానికీ అప్లై చేయరాదని షరతు పెట్టారు.
రాజుకు పిహెచ్ డి చేయాలని ఆశవుంది. కానీ అతడికి ఉద్యోగం ఎంతో అవసరం. పిహెచ్ డి కోసం ఉద్యోగం వదులుకునే ఉద్దేశ్యమతడికి లేదు. ఎప్పుడు ఉద్యోగం వస్తే అప్పుడు స్కాలర్ షిప్ విడిచిపెట్టి ఉద్యోగానికి వెళ్ళిపోదామని అతడి ఆశయం. అలాంటప్పుడు అసలు పిహెచ్ డిలో చేరడమెందుకూ అంటే-పిహెచ్ డి లో చేరితేనే స్కాలర్ షిప్ వస్తుంది మరి!
రాజుకి స్కాలర్ షిప్ వచ్చింది. ఏ ఇబ్బందీ లేని ప్రొఫెసర్ రావు వద్ద అతడు పిహెచ్ డికి చేరాడు. ప్రొఫెసర్ రావువద్ద చేరితే ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదుకానీ పిహెచ్ డి మాత్రం రాదు-గ్యారంటీగా!
ఆ విషయంలో రాజుకేమైనా అనుమానముంటే ప్రొఫెసర్ వద్ద చేరిన ఆర్నెల్లకు స్పష్టంగా తీరిపోయింది. అందుకని అక్కణ్ణించి మారిపోవాలని అతడికి తొందర పుట్టింది. అప్పుడే అతడికెవరో డిస్కవరీ హౌస్ గురించి చెప్పారు.
రాజమండ్రి రాజు స్వంత ఊరు. ప్రొఫెసర్ అజేయ్ ను ఆయన పనిచేసే సంస్థలో కంటే నాయుడమ్మ భవనంలో కలుసుకోవడంలోనే ఎక్కువ ప్రయోజనమని అతడా నోటా ఈ నోటా విని అక్కడికి వెళ్ళాడు. అజేయ్ ని మీటయ్యాక తిరిగి విశాఖపట్నం వచ్చాడు. ప్రొఫెసర్ అజేయ్ కు అతడు తన బయోడేటాలో విశాఖపట్నం చిరునామాయే ఇచ్చాడు. ఆ చిరునామాలో కూడా ప్రత్యేకత వుంది. అది పవన్ కుమార్ ది. పవన్ కుమార్ రాజు అన్నకు చిన్ననాటి స్నేహితుడే కాదు- ప్రముఖ పాత్రికేయుడు కూడా!
పేరున్నవారికి పాత్రికేయులంటే అంతో ఇంతో బలహీనత వుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు విధిగా తన చిరునామా ఇవ్వమని పవన్ కూడా అతడికి మరీ మరీ చెప్పాడు.
నాయుడమ్మ భవనంలో ప్రొఫెసర్ అజేయ్ ని కలసినప్పట్నుంచీ రాజుకు ఆయనంటే ఆరాధనాభావం మొదలైంది. ఆయన వద్ద పిహెచ్ డి చేయగలిగితే తన జన్మధన్యమైందనే అనుకున్నాడు. నిజానికిప్పుడు ఆయనవద్ద చేరడం కష్టం కాదు. డిస్కవరీ హౌస్ వారు తనకు స్కాలర్ షిప్ కూడా ఇవ్వక్కర్లేదు. తనది ట్రాన్స్ ఫరబుల్ స్కాలర్ షిప్. ప్రొఫెసర్ రావు ఏ క్షణంలో అడిగినా తనని విడిచిపెట్టడానికి సిద్దంగా వున్నాడు ఎటొచ్చీ అజేయ్ అనుమతించాలి- అంతే!
ఒకసారి అజేయ్ అనుమతిస్తే డిస్కవరీ హౌస్ లోనే తనకుద్యోగం దొరకొచ్చు. అజేయ్ మరీ ఎక్కువగా తననభిమనిస్తే విదేశాలు కూడా వెళ్ళవచ్చు. ఆ విధంగా తను జీవితంలో స్థిరపడతాడు. లా స్థిరపడితే రాణిని పెళ్ళిచేసుకుందుకు అడ్డుండదు.
రాణి పవన్ కుమార్ అన్న కూతురు. ఇంటర్ ఫస్టియర్లో వుండగా రాజు ఆమెకు ట్యూషన్ ప్రారంభించాడు. ఇప్పుడామె బీయస్సీ కంప్యూటర్స్ ఫస్టియర్లో వుంది.
వయసులో వుండే అందరాడపిల్లల్లాగే రాణి అందంగా వుంటుంది. అందంతోపాటు తెలివి, వివేకం కూడా వున్నాయామెలో. అందువల్ల రాజుతో ప్రేమలో పడినప్పటికీ ఆ ప్రేమను కబుర్లకే పరిమితం చేస్తూ వచ్చింది.
రాజుకూడా ఆమెను ప్రేమిస్తున్నప్పటికీ సంకోచం. మొహమాటల కారణంగా అతడు కబుర్లలో కూడా ఆ ప్రేమను పరిమితంగానే ప్రకటించేవాడు.
అయితే ఇద్దరికీ-పెళ్ళిచేసుకోవాలన్న కోరిక మాత్రం బలంగా వుంది.
అందుకు ముందు కులం అడ్డువస్తుంది. దాన్నధిగమించడానికి పెద్దల స్నేహం అడ్డువస్తుంది. ఎన్ని అడ్డంకులైనా ఆ ప్రేమ ఎదుర్కొవాలంటే ముందు రాజుకు ఉద్యోగం కావాలి. అదీ రాజు తపన.
ఆర్నెల్ల క్రితం రాణి రాజుతో మాట్లాడుతూ-"ఉద్యోగమే నీ పెళ్ళికి ప్రతిబంధకమవుతుందని ఒక జ్యోతిష్కుడన్నాడు" అంది ఆమె వద్ద రాజు జాతక చక్రముంది. ఆమె అడగ్గా రాజు స్వయంగా ఆమె కిచ్చాడది!
అప్పుడు రాజు నవ్వి-"ఆ విషయం నాకూ తెలుసు" అన్నాడు.
అందుకు రాణి కూడా నవ్వి, "నీకు తెలుసని నాకూ తెలుసు. కానీ నీవనుకునేది ఒకటి. ఆయన చెబుతున్నది రావడం గురించి చెబుతున్నాడు" అంది.
రాజుకు కొంత అర్థమైంది. కొంత కాలేదు. ఎటొచ్చీతన పెళ్లికీ ఉద్యోగానికీ ముడి వుందని మాత్రం అతడు నమ్మాడు. అందుకే దానికోసం అదేపనిగా ఎదురుచూస్తున్నాడు.
అతడి ఎదురుచూపు ఫలించిందో ఏమో-ప్రొఫెసర్ అజేయ్ ని కలుసుకున్నంతర్వాత సరిగ్గా ఆరురోజులకు పవన్ ఇంటి చిరునామాకు ఓ కవరు వచ్చింది రాజుకి. ఫ్రమ్ అడ్రస్ దగ్గర అజేయ్ పేరు లేదుగానీ, డిస్కవరీ హౌస్ చిరునామా వుంది.
రాజు కవరు చింపాడు. అందులోంచి ఉత్తరం తీశాడు.
ఇంపోర్టెడ్ పేపరు. దానిపై కంప్యూటర్ అక్షరాలు. ఆంగ్లభాష. ఆ రోజుకు సరిగ్గా వారం రోజుల తర్వాత డిస్కవరీ హౌస్ రాజుకు వచ్చి అజేయ్ ని కలుసుకోమని ఆహ్వానం. క్రింద పర్సనల్ సెక్రటరీ సంతకం.
రాజుకు తనువు పులకరించింది. తర్వాత మనసు పరవశించింది.
అతడి కలలో డిస్కవరీ హౌస్ ప్రేమమందిరంలా ఆలంకరించబడివుంది. అక్కడి సైంటిస్టులందరూ తెల్లని సూట్లతో నృత్యం చేయడానికి సిద్దంగా వున్నారు.
రాజు,రాణి ప్రేమగీతం ప్రారంభించారు. సైంటిస్టులు ఆడుతున్నారు.
దూరంగా ప్రొఫెసర్ అజేయ్ పుల్ సూట్లో నిలబడివున్నాడు. ఆయన రెండు చేతుల్లోనూ రెండు పూలమాలలున్నాయి. ఆయన రాజును, రాణిని చూసి నవ్వుతున్నాడు. ఆయన నవ్వులో ఆహ్వానముంది. చూపులో ఆప్యాయత వుంది.
రాసాజు, రాణి ప్రేమనృత్యం చేస్తూ ఆయన్ను సమీపిస్తున్నారు. దగ్గరకు వచ్చేసరికి మాయమై ఆయన దూరంగా మరోచోట ప్రత్యక్షమావుతున్నాడు.
అది కలైనా కూడా రాజుకు తెలుసు, తనింకా డిస్కవరీ హౌస్ చేరలేదని!
అందుకే అతడు ఉత్తరం వచ్చిన సంతోషాన్ని రాణితో కూడా పంచుకోకుండా, ఎవరికీ చెప్పకుండా డిస్కవరీ హౌస్ కు బయల్దేరాడు.
* * *
డిస్కవరీ హౌస్ వుండే పల్లెటూరి పాతపేరు ఎప్పుడో మరుగునపడిపోయింది. ఉత్తరాల చిరునామాకు డిస్కవరీ హౌస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పి.ఓ. అని రాయాల్సివస్తోంది. అది అఫీషియల్ అడ్రస్ అయితే వ్యావహారికంలో-ఆ ఊరు దియానగర్ అయింది. గ్రామీణులు దియానగరం అంటారు. అంతే తేడా!
విశాఖపట్నంనుంచి దియానగర్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో వుంది. అక్కడికి బ్రహ్మాండమైన రాచబాట పడిందంటే ప్రొఫెసర్ అజేయ్ ప్రభావమేనని చెప్పాలి. అక్కడికి వెళ్లడానికి విశాఖపట్నం నుంచి సిటీబస్సులు,ఆటోలు. టాక్సీలు వున్నాయి.
రాజు బస్ స్టాండుకే వెళ్ళాడుకానీ అక్కడ పదిరూపాయలకే టాక్సీ దొరికింది ఆరుగురితో షేరింగ్. అతడు బట్టలు నలక్కుండా రియానగర్ లో డిస్కవరీ హౌస్ లో కాలనీ గేటు ముందు దిగాడు.
అక్కడ పెద్ద బోర్డు వుంది. బోర్డుమీద సంస్థ పేరుంది. ఆ పేరు చదువుతూంటే రాజుకు రామనామానికి చలించే పోతన, రామదాసు , త్యాగయ్యల అనుభూతి కలిగింది.
బోర్డు దాటి ముందుకు వెడితే పెద్ద గేటు. ఆ గేటుదగ్గర ఓ పెద్దమనిషి.
పెద్దమనిషి అంటే జంటిల్మన్ అని కాదు. ఆకారంలో పెద్ద-మనిషి నిలువెత్తు వున్నాడు. కోరమీసాలు. చురుకైన చూపులు. కాకీ యూనిఫామ్.
అతడు రాజును ఆపి, "సాబ్! కాగితాలేమైనా వున్నాయా?" అనడిగాడు.
అంత పెద్దమనిషీ తనను సాబ్ అన్నందుకు రాజు సంతోషించాడు కానీ అది క్షణంలోనే మాయమైంది. అతణ్ణి దాటుకుని ఇద్దరు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు లోపలకు వెళ్ళిపోయారు. ఆ పెద్దమనిషి వారిని ఎ కాగితాలూ అడుగలేదు. అసలు వారిని ఆపడానికే ప్రయత్నించలేదు.
"కాగితాలెందుకు? వాళ్ళు వెళ్ళినట్లే నేనూ లోపలకు వెళ్ళకూడదా?" అన్నాడు రాజు పెద్దమనిషి ఆకారానికి కాక యూనిఫామ్ కు స్పందిస్తూ.
"వాళ్ళిక్కడి ఉద్యోగస్థులు సాబ్! వాళ్ళకు ఐడెంటిటీ కార్డులున్నాయి" అన్నాడు. పెద్దమనిషి మర్యాదగానే రాజుకు సంజాయిషీ ఇచ్చుకుంటూ.
'ఓహ్! వాళ్ళూ ఉద్యోగస్థులన్నమాట. మరి తెల్ల సూట్లలో ఎందుకు లేరో' అనుకున్నాడు రాజు. అయితే వాళ్లు తెల్ల సూట్లు వేసుకోనందుకు రాజు సంతోషించాడు. రేపు తనకూ ఇక్కడ ఉద్యోగం వస్తే తనూ తెల్లసూటు వేసుకోనవసరంలేదు. తొందరగా మాసిపోతాయని ముదురురంగు దుస్తులనే ధరిస్తాడు రాజు.
ఇప్పుడు వెళ్ళినవాళ్ళిద్దరూ కూడా ముదురురంగు దుస్తుల్లోనే వున్నారు.
రాజు తన జేబులోని ఉత్తరాన్ని పెద్దమనిషికి చూపించాడు. అప్పుడు పెద్దమనిషి అతణ్ణి పక్కనే వున్న కేబిన్లోకి పంపించాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు. రెండు ఫోన్లున్నాయి. వారిలో ఒకరు రాజుదగ్గర కాగితం తీసుకుని పుస్తకంలో ఏదో నోట్ చేసుకుని అతడికో స్లిప్ ఇచ్చి-"ఆపీసులో మీరు ఎవరిని కలుసుకుంటే వారి సంతకం దీనిమీద పెట్టించుకుని రావాలి. లేకుంటే బయటకు వెళ్ళలేరు" అన్నాడు.
అక్కడి ఏర్పాట్లు చాలా పకడ్బందీగా వున్నందుకు రాజు ఎంతో సంతోషించాడు. ఇలాంటి చోటనుంచి ప్రొఫెసర్ అజేయ్ ను కిడ్నాప్ చేయడం అంత సులభంకాదనీ, ఇంకా చెప్పాలంటే ఇంచుమించు అసాధ్యమేననీ తోచి రాజు మనసు తేలికపడింది.
రాజు పర్మిషన్ స్లిప్ నీ, అంతకుముందు ఉత్తరానీ భద్రంగా జేబులోకి తోసేశాడు. ముఖ్యంగా పర్మషన్ స్లిప్ గురించి అతడికి రవంత కలవరంగా వుంది. అది పోతే శాశ్వత్వం తను ఈ ప్రాంగణంలోనే వుండిపోవలసిరావచ్చు. లోపలివారు తనని ఆదరించరు. బయటకు పోనివ్వరు. ఇక్కడే....ఇలా....కృశించి....కృశించి....రష్యన్ క్యాంపుల్లోలా....
రష్యన్ క్యాంపుల్లోలా అనుకోగానే రాజు మనసు తేలికపడింది. అక్కడి నియంతృత్వం యాభై ఏళ్ళు కూడా నిలబడలేదేమో! ఇండియాలో అయితే అంతకాలం కూడా పట్టదు. ఇందిర ఎమర్జన్సీ పెడితే రెండేళ్ళు కూడా లేదట- అప్పుడు తను చిన్నకుర్రాడు.....
రెండేళ్ళు మాత్రం జైల్లో కష్టమవుతుందేమో-కానీ నెల్సన్ మండేలా ఇరవై ఏడేళ్ళు జైల్లో వుండివచ్చి దాక్షిణాఫ్రికాకు అధ్యక్షుడై- మరోసారి పెళ్లికూడా చేసుకున్నాడు.
పెళ్ళితలపు రాగానే రాజు ఆలోచనల్లోంచి విరసం పోయి సరసం వచ్చింది. అతడుత్సాహంగా అక్కడి బోర్డులను చూసుకుంటూ దారిని తెలుసుకుంటూ సుమారు ముప్పాతిక కిలోమీటరు దూరం నడిచి ఆఫీసు భవనం చేరుకున్నాడు.
ఆ భవనం చూడ్డానికి రమ్యహర్మ్యంలా వుంది. దానిమీదా పెద్దపెద్ద అక్షరాలతో సంస్థ పేరు. అది చదువుతూంటే రాజుకు పోతనాదుల రామనామం అనుభూతి.
రాజు ఆ భవనంలో అడుగుపెట్టాడు.
అక్కడో రిసెప్షనిస్టు వుంది. ఆమె చాలా అందంగా వుంది. రాణి కంటే ఎంతో ఎంతో అందంగా వున్న ఆమె చీరకట్టిన ప్రపంచసుందరిలా వుంది. పూజాబాత్రా తరహాలో పళ్లు కనపడేవిధంగా ఉండుండీ నవ్వుతోంది.