Previous Page Next Page 
చిలకలు పేజి 2

 

    "వద్దండీ. నా స్నేహితురాలు చాలా ధనవంతురాలు నేను కర్చు చెయ్యనక్కర్లేదు అన్నది రాధ.
    "ఎంత స్నేహితురాలైనా దిగీదిగగానే ఆమె చేత ఖర్చు పెట్టించడం ఏం మర్యాదగా  ఉంటుంది? ఈ ఏభయ్ ఉంచు" అంటూ బలవంతంగా రాధారాణి చేయిలాగి ఆమె అరచేతిలో ఏభయ్ రూపాయల నోటు పెట్టాడు.
    రాధారాణికి ఆనోటు  కసిగా నలిపి అతడి ముఖం మీద కొట్టాలనిపించింది. కాని ఆ పని చెయ్యలేకపోయింది. అతడు తన అధికారి. ఆ పని చేస్తే రేపటినుంచి ఆఫీసులో తనకు నరకపు తెరలులేస్తాయి.
    "నా దగ్గర అంత సందేహం ఎందుకు? ఉంచు."
    "అవసరం లేదండి. నా దగ్గర డబ్బు ఉంది."
    "అదుగో! అలా చేస్తేనే నాకు కోపం వస్తుంది అంత అభిమానంగా ఉంటే రేపు జీతం వచ్చాక ఇద్దువుగానిలే. చూడమ్మాయ్ ఎయిర్  పోర్టుకు టాక్సీలో వెళ్ళు. అదే టాక్సీలో మీ స్నేహితురాల్ని తీసుకెళ్ళు. లేకపోతే తీరా అక్కడ టాక్సీ లేదనుకో. కష్టపడాల్సి ఉంటుంది."
    రెండు చేతులూ ఎత్తినమస్కరిస్తూ "ఇకనామానానికి నన్ను వదిలిపెట్టు" అని అరవాలని అనిపించింది రాధకు.
    "ఓ.కె. రాణీ! నేను వస్తాను."
    "అలాగేనండీ!" రాధ గుండెల నిండా గాలిపీల్చుకుంది.
    రెండడుగులు ముందుకు వేసి ఆగి వెనక్కు చూసేడు.
    "మళ్ళీ ఏ మొచ్చింది." పైకి విన్పించకుండా గొణుక్కుందిరాధ.
    "రేపునువ్వు ఆఫీసుకు రావుగా?"
    "ఎందుకు రానూ?"
    "ఎలా వస్తావమ్మా నీ ప్రాణ స్నేహితురాలు రాకరాక వస్తోందే? పర్వర్లేదు. రెండు రోజులు శెలవు తీసుకో. నాకు అర్జంటు పని ఉంది.వస్తానూ. విష్ యూ హాపీ టైం!: సోమసుందరం అంటూ గబగబా మెట్లుదిగివెళ్ళిపోయాడు.
    "ప్రాణ స్నేహితురాలు కాదు స్నేహితుడే!" పైకే నవ్వుకుంటూ అనేసింది రాధారాణి. అయితే ఆ మాటలు సోమ సుందరానికి విన్పించేయోలేదో కాని దిగుతున్న మెట్లమీద ఓ క్షణం  ఆగి, తిరిగి  చూడకుండానే దిగి వెళ్ళిపోయాడు.
    "వట్టి జిడ్డుగాడు" అన్నది అతడు వెళ్ళినవైపు చూస్తూ.
    "రాధారాణి టేబుల్ సొరుగులాగి ఉత్తరం బయటికి తీసి మళ్ళీ చదుకోసాగింది."
    "ఈ ఆశ్రమ వాసుల్లో ఏదో తెలుసుకోవాలనే  జ్ఞాన తృష్ణతో వచ్చినవాళ్ళు అరుదు. మోక్ష సాధన కొరకు వచ్చినవాళ్ళు నాకు కనింపించలేదు. జీవితం తన్నిన తన్నుల్ని భరించలేక పారిపోయివచ్చినవాళ్లు కొందరు ఈ ప్రపంచాన్ని ఎదుర్కోలేక పారిపోయివచ్చినవాళ్లు మరికొందరు వీళ్ళంతా భగవంతుడి పేరు చాటున తలదాచుకోవడానికి వచ్చ్సిన వాళ్ళే. వీళ్ళల్లో ఆవేశకావేశాలు ఎక్కువగానే ఉన్నాయి. నిష్కల్మషమైన ప్రేమ అంటే ఏమిటోకూడా తెలియని వాళ్ళే  ఎక్కువ....."
    "అమ్మగారూ!అందరూ వెళ్ళిపోయారు ." అన్నాడు నైట్ వాచ్ మాన గది తలుపులు ముయ్యడానికివచ్చి."
    "నేనూ వెళ్తాలేపదినిముషాల్లో."
    "అట్టాగేనమ్మా." వాచ్ మాన గది బయటికి వెళ్ళిపోయాడు.
    రాధారాణి టాయ్ లెట్ లోకి వెళ్ళింది. ముఖం కడుక్కుంది. కర్చీపుతో ముఖం తుడుచుకుంటూ అద్దంముందు నిలబడింది. హ్యండ్  బాగ్ లోనుంచి దువ్వెన తీసి తలదువ్వుకుంది. ముంగురులను చెత్తో చెవుల పక్కగా చంపాల మీదకూ, నుదురు మీదకూ పడేలా సర్దుకుంది.
    అద్దంలో ముఖం చూసుకుంది. చిరునవ్వు నవ్వుకుంది. తన అందానికి తనే  మురిసిపోయింది.
    అతను తనను చివరిసారి చూసి సంవత్సరం దాటిపోయింది. అప్పటికంటే తన బరువు ఐదు పౌనులు పెరిగింది. అందువల్ల తన సౌందర్యం తరగలేదు. నున్నగా కన్పడటం వల్ల అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ అందంగా ఉంది. తను ఆఫీసులోకి రాగానే మగవాళ్ళ కళ్ళన్నీ ఒక్కసారి తనకేసి తిరుగుతాయి.
    అప్పటికీ తన వేషంలో చాలా  మార్పు వచ్చింది. ఆనాడు  తను గుంటూరు ముతక నేత చీరెలు కట్టుకోనేది. జుట్టు ముడివేసుకొనేది. ఇప్పుడో? అతను తనను ఆ రూపంలో చూశాడు. ఇప్పుడు తనను నైలాన్  చీరలో, వాలుజడలో చూసి ఆశ్చర్యపోతాడు. అతను.... అతను  తన అందానికి ముగ్ధుడై తనను  ప్రేమించలేదు. మరి ఎందుకు.....? అతడు తనలో ఏం చూసి ఆశ్చర్యపోతాడు. అతను...అతను తన అందానికి ముగ్ధుడై తనను ప్రేమించలేదు. మరి ఎందుకు....?అతడు తనలో ఏం చూసి  ప్రేమించాడు. అతడు తనను ప్రేమిస్తున్నట్లు నోరు తెరిచి చెప్పలేదు. అయినా తనకు అనుకూలమైన మనసును మనసు ఇట్టే గుర్తిస్తుంది. అతడు చెప్పకపోయినా తనను ప్రేమిస్తున్నాడని తనకు అన్పించేది. అది ఇప్పుడు ఈ ఉత్తరంతో రుజువు అయింది.
    అతడు అంత ధనవంతుడని కూడా తనకు తెలియదు. ఆనాడు అంతకు ముందే పెళ్ళి అయిందనీ....
    రాధ చక్కగా అలంకరించుకుని టాయ్ లెట్ లో నుంచి బయటి వచ్చింది. ఆమెకు నేలమీద నడుస్తున్నట్టుగాలేదు. అలా అలా ఆకాశంలో ఎగిరిపోతున్నట్టుగా ఉంది. తనకోసం ఇంత సంతోషం, ఇంత ఆనందం, ఇంత అదృష్టం దాచిపెట్టి ఉందని కలలోకూడా భావించలేడు.
    "రాధమ్మగోరూ? ఏళుతున్నారా? తమరి గది ముయ్యమంటారా?" వాచ్ మెన్ అడిగాడు.
    "గది తాళం వేసియ్యి తాతా!"
    రాధ వాచ్ మెన్ ను తాతా అనిపిలుస్తుంది. ఆ పిలుపుకు అతడు పొంగిపోతాడు. రాధమ్మ అంటే అతడికి ఎంతో ఇష్టం.
    రాధ పర్సు తెరిచి రూపాయినోటు తీసి "తాతా! ఇది తీసుకో" అంటూ చెయ్యి ముందుకు చాచింది.
    "నూరేళ్ళు బతుకు తల్లీ" రూపాయి నోటు అందుకొని వాచ్ మెన్ దీవించాడు.
    "తాతా నీకు ఎంతమంది పిల్లలు?"
    "నలుగురు కొడుకులు, ఓక కూతురు. నలుగురు కొడుకుల్ని బాగా చదివించానమ్మా. అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నాకు మనమలూ, మనమరాళ్ళూ పదిహేను మంది ఉన్నారు."
    "బెంగుళూరులోఉంది తల్లీ. అల్లుడు ఇమానాశ్రయంలో గుమాస్తా పని చేస్తున్నాడు. వాళ్ళపనీ బాగానే ఉంది."
    "మరి ఈ వయసులో నువ్వు ఇంత కష్టపడటం ఎందుకూ?"
    "ఏం చెయ్యాలి తల్లీ అందరికీ రెక్కలు వచ్చినాయ్. ఎగిరి పోయారు. నా పెళ్ళాం చచ్చిపోయింది. నాకింకా చావురాలేదు తల్లీ" భుజంపైన ఉన్న తువ్వాలుతో కళ్ళు వత్తుకున్నాడు.
    రాధ గతుక్కుమంది. తన ఆనందంలో ఏవేవో ప్రశ్నలు వేసింది.
    "తాతా బాధపడకు."
    వాచ్ మెన్ రాధ ముఖంలోకి చూస్తూ "రాధమ్మగారూ! ఇయ్యాల తమరు చాలా సంతోషంగా ఉన్నారు. నేను నా గొడవలు చెప్పి.....
    "అవును తాతా! నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇవ్వాల్టితో నా జీవితమే మారిపోతుంది తాతా! రేపు ఆఫీసుకు రావడంలేదు." అని  చెంగుచెంగుణ మెట్లు దిగుతూ వెళుతున్న రాధను ఆశ్చర్యంగా చూస్తూ నిలజడిపోయాడు వాచ్ మెన్.
    "ఎంత  హాయి ఈరేయి నిండెనో"
    మల్లీశ్వరిలోని పాటను "హం" చేసుకుంటూ ఆఫీసునుంచి బయటికి వచ్చింది.
    పేవ్ మెంటు మీద మల్లెపూలు అమ్ముతున్న పిల్లదగ్గరకు వెళ్ళినిలబడింది మల్లెపూల మరిమళం ఆమె మనడులో తియ్యటి తలపులను రేకెత్తించింది. రెండు మూరల మాలకొని జడలో తురుముకుంది.
    ఖాళీగా వెళ్తున్న ఆటో ఆపి కూర్చుంది ఆటో కదలడంలేదు.
    "పోనియ్" అన్నది మధుర ఊహలలో తేలిపోతూ.
    "కహాజానా!"
    "ఎయిర్ పోర్టుకు"
    ఆటో వేగంగా పోతోంది. ఆమె మనసు అంతకన్నా వేగంగా పరుగులు తీస్తోంది.
    రాధ రేడియం డైల్ వాచీ చూసుకుంది.
    ఏడు అయింది.
    మరో గంటన్నర! తన జీవితమే మారిపోయే క్షణం....తను ఎంతోకాలంగా ఎదురుచూసిన ఆ క్షణం, మరో గంటన్నరలో....
    ఆటో ఆగింది. ఆరో దిగి పర్సు తెరిచి డబ్బు లెక్క చూసి ఇస్తుండగా "హల్లో రాణీ!" అని విన్పించింది. గిర్రున  వెనక్కి  తిరిగి చూసింది. అలా అతడ్ని  చూస్తూనే ఉండిపోయింది.
    "జల్దీ దేదో!" ఆటోరిక్షావాడు హెచ్చరించాడు.
    ఆటోరిక్షావాడికి డబ్బు ఇచ్చింది.
    "ఏమిటి అలా చూస్తావ్ నన్ను ఎప్పుడూ చూడనట్టు?"
    రాధ సమాధానం చెప్పలేదు.
    "ఏమిటిలా వచ్చావ్?"
    "ఒక స్నేహితురాలు ఢిల్లీనుంచి వస్తోంది."
    "నేను ఢిల్లీ ప్లైట్ లో వచ్చే నామిత్రుడ్ని రిసీవ్ చేసుకోవడానికే వచ్చాను. ప్లైట్  రెండుగంటలు లెట్- అంటే వదిన్నరగాని రాదు. ఈ ఢిల్లీ ప్లైత్స్ ఈమధ్య సమయానికి రావడంలేదు. నిన్ననైతే రాత్రి రెండున్నర గంటలకు వచ్చింది" అన్నాడు అతడు.
    రాధకు ఏం మాట్లాడాలో తోచడం లేదు.
    "ఇప్పట్నుంచే ఇక్కడ కూర్చుని ఏం చేస్తావ్? పద! అలా కార్లో చల్లగాలికి తిరిగి వద్దాం."
    "నో థ్యాంక్స్!"
    "ఏం రాణీ! నేను అంత పాపం ఏంచేశాను? ఆ మాత్రం  నాతో  నా కార్లో  కూర్చోకూడదా? అంతలోనే నీ పాతివ్రత్యం పోతుందా? బాధగా అన్నాడు.
    "అబ్బే అది కాదండీ!" బలవంతంగా పెదవులమీదకు నవ్వు తెచ్చి పెట్టుకుంది రాధ.
    "ఇంకేం చెప్పకు. ఇక్కడే నిల్చో. కారు తీసుకొస్తాను." అంటూ కార్లో పార్కింగ్ వైపు నడిచాడు.
    పానకంలో పుడకలా వీడు దాపరించాడు తన ప్రాణానికి. ఓక పట్టాన వదిలే  ఘటం కాదు. సున్నితంగా చెబితే  అర్థం చేసుకోగల సంస్కారం లేదు. దాదాపు పది నెలల నుంచే తన ప్రాణం  తోడేస్తున్నాడు.

 Previous Page Next Page