2. గుండె తడిసిపోయింది
"టెలిగ్రాం" అన్న కేక విని ఇంటిల్లిపాదీ పరుగెత్తారు కంగారుగా!
"ఎక్కడ నుండి బాబూ టెలిగ్రాం?" మెల్లిగా మనవడి సాయంతో లేచి నుంచుంటే అడిగింది సుభద్రమ్మ మనవడు పవన్ ని.
టెలిగ్రాం పుచ్చుకోవడానికెళ్ళిన రాజుకేసి చూసి, "టెలిగ్రాం మీకు కాదు సార్, సుభద్రమ్మ గారికి. ఆమెని పిలవండి" అన్నాడు పోస్టతను.
"అమ్మకా? ఏది?" ఆశ్చర్యంగా అడిగాడు రాజు.
ఆ మాటలు వినగానే చెమటలు పట్టిపోయాయ్ సుభద్రమ్మకి. "బాబూ పవన్! టెలిగ్రాం ఎవరు పంపించారురా? మీ పెద్దనాన్నా? తాతగారు కులాసాగా వున్నారా? ఆయనకేమీ ప్రమాదం జరగలేదుకదా?" గుండె చేతుల్తో పట్టుకొని పవన్ సహాయంతో లేవబోతూ అడిగింది, కన్నీళ్ళు చెంపల మీదుగా వాగులా ప్రవహిస్తూ వుంటే.
"అమ్మా! అమ్మా! నీకు కలకత్తా భాషా కుటీరం వారి దగ్గర నుంచి ఇరవైవేలు బహుమతొచ్చింది. నువ్వేదో పుస్తకం రాశావటగా? వెరీగుడ్! ముందు ఇక్కడ సంతకంచేసి ఈ టెలిగ్రాం తీసుకో" అన్నాడు రాజు సంబరపడిపోతూ.
సుభద్రమ్మ నమ్మలేకపోతోంది. చేతులు వణికి పోతున్నాయ్. కన్నీరు గుడ్లనిండా నిండి ఏమీ కనబడకుండా చేస్తున్నాయ్! పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుని, సంతకం చేసింది సుభద్రమ్మ.
"ఒకటా, రెండా? ఇరవై వేలు బహుమతొస్తే ఎవరైనా సంతోషిస్తారుగానీ ఏడుస్తారా? అయినా ఏడు పెందుకు!" ఎంతో ప్రేమని వొలకబోస్తూ అంది సౌమ్య. ఆమె కళ్ళ ముందు క్రితం రోజు మహిళా మండలి ఫంక్షన్ లో రచన వేసుకున్న కెంపుల నెక్లెస్ తళతళా మెరిసింది. "అత్తయ్యా, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను" అంది ఆమెకి దగ్గరగా జరిగి టెలిగ్రాంని మరోసారి చదువుతూ.
"అమ్మా! నాన్నమ్మ ఏడవడం లేదే! అవి ఆనందభాష్పాలు. ఎక్కువ బాధ కలిగినప్పుడు కన్నీవాళ్ళెలా వస్తాయో, ఎక్కువ సంతోషం కలిగినప్పుడు కూడా కన్నీళ్ళు అలాగే వొస్తాయిట - నాన్నమ్మ చెప్పింది" అన్నాడు పవన్.
సుభద్రమ్మ పవన్ బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది.
రాజు కళ్ళలో ఇటీవలే తన కొలీగ్ కొనుక్కున్న హీరో హోండా కళ్ళ ముందు కనిపించింది. ఇరవైవేలు. 'కాస్తో కూస్తో తక్కువపడితే వేసుకోవచ్చులే' అనుకున్నాడు. డెబ్బయ్యో పడిలో పడి, ఎందుకూ పనికిరాదనుకున్న తల్లి, పైగా మందులూ మాకులతో తనకు భారంగా తయారైన తల్లి ఈరోజున ఉన్నట్టుండి లాటరీ కొట్టేసినట్టు యిరవైవేలు సంపాదించేసింది. అమ్మ ఇంకా ఇలాగే రాస్తూపోతే, ఇరవై + ఇరవై + మరో ఇరవై. త్వరలో తానొక ఇల్లు కూడా కట్టేయ్యొచ్చు. రాజు కలలలో తేలిపోతున్నాడు.
"అమ్మా! ఏం రాశావమ్మా? నీకింత పెద్ద బహుమతి వొచ్చింది? నాతో ఇలా అని ఒక్కమాట చెబితే తెల్లకాగితాల కట్ట తెచ్చి నీ ముందు పడేసే వాణ్ణిగా!" తల్లి పక్కన కూర్చుంటూ అన్నాడు రాజు. సుభద్రమ్మ గుండె కరిగిపోతోంది. కన్నీరు ఉప్పెనలా పొంగిపోతోంది. ఎన్నాళ్ళకి రాజు అలా తన పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు! పసివాడి దగ్గర నుంచి పెళ్ళి కానంత వరకు ఇలాగ కూర్చునేవాడు. కాలేజీలో చదువుతూన్నా అన్నం ముద్దలు కలిపి పెట్టమనేవాడు. పెద్దవాడు వాసు మాత్రం పసిపిల్లాడిలా వొచ్చి పక్కన పడుకునేవాడు, ఏదో కబుర్లు చెబుతూ గోముగా. ఆఁ! పెద్దాడంటే జ్ఞాపకమొచ్చింది. ఆయనెలా వున్నారో ఏమో! పెద్దాడు ఆయనకీ సరిగ్గా మందులు కొంటున్నాడో లేదో? ఆయనకి ఏది అడగాలన్నా మొహమాటమే. ఏం తింటున్నారో ఏమో? ఆయనకి చేగోడీలంటే చాలా ఇష్టం. కోడలుకి అంత ఓపికుందా? 'ఇవన్నీ ఎవరు చేసుకుంటారు? డబ్బు పడేస్తే అవే బజార్లో దొరుకుతాయ్' అంటుంది నీలిమ. 'బజార్లో చేసినవి బాగుండవే సుభద్రా! చక్కగా ఇంగువేసి, నువ్వులువేసి నువ్వు చేస్తావే - అవి ఎంత బాగుంటాయో' అనేవారు ఆయన. మనసు మరి ఆలోచించలేకపోతోంది. తనకే రెక్కలుంటే గబుక్కున ఎగిరి ఆయన గుండెల మీద వాలిపోయేది. బోలెడన్ని చేగోడీలు చేసిపెట్టేది. తన ఆశక్తతకి దుఃఖం పొర్లుకొచ్చింది. సుభద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది.
"ఎంత ఆనందబాష్పాలయితే మాత్రం ఇంత ఇదా? ఊరుకోండత్తయ్యా!" ఊరడించింది, ఎన్నడూ లేనిది సౌమ్య.
"అయినా అమ్మా! నువ్వు కథలూ, నవలలూ రాస్తావని మాకు తెలీదే! ఇంత మంచి నవల ఎప్పుడు రాశావమ్మా?" రాజు ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు.
వారిద్దరూ తన దగ్గర అలా కూర్చోవడం, మాట్లాడడం....ఆమె మనసు ఉప్పొంగిపోతోంది. నోట మాట రావడం లేదు.
"నేను చెబుతాను నాన్నా! నీతో రామకోటి రాసుకుంటాను, కాగితాలు తెచ్చి పెట్టమని నాన్నమ్మ అడిగితే నువ్వు తేనేలేదు. నేనే నా నోటుబుక్స్ యిచ్చేవాణ్ణి. దాన్లో నానమ్మ రామకోటి రాయలేదు. 'బండబారిన గుండె డైరీ' అని, నవల రాసింది. నాయనమ్మకి కాయితాలన్నీ నేనే ఫెయిర్ చేసి పెట్టేవాణ్ణి! రామకృష్ణ తాతయ్య లేడూ, అతను ప్రింటుచేసి పెడతానన్నాడు. అతనే నానమ్మకి కూడా తెలీకుండా ఆ పుస్తకాన్ని పోటీకి పంపాట్ట!" పవన్ మాటలు రాజూ, సౌమ్యలు ఆశ్చర్యంగా విన్నారు.
* * *
సుభద్ర రాసిన ఉత్తరం, పేపర్లో వార్తా చదివి పొంగిపోయాడు సుబ్బారావుగారు. వెంటనే ఉత్తరం రాశారు - తను బయల్దేరి వస్తున్నానని, ఇద్దరం కలిసి కలకత్తా వెళ్ళి బహుమతిని తీసుకుందామని. కలకత్తా వెళ్ళాలంటే డబ్బు కావాలి. తన చెవి దుద్దులూ, ముక్కు పుడకా అమ్మేద్దామనుకుంది సుభద్రమ్మ. అక్కడ సుబ్బారావుగారు తన పెళ్ళిలో అత్తవారు పెట్టిన తులం బంగారం ఉంగరాన్ని ఏనాడూ అతను ఎటువంటి కష్టాల్లోనూ తాకట్టు పెట్టడానికయినా తియ్యలేదు. ఈ రోజున దాన్ని అమ్మేసి కలకత్తా ప్రయాణానికి సిద్ధపడ్డారు.
"మీరెందుకు ఉంగరాన్ని అమ్మేశారు మామగారూ? మేము లేమూ టిక్కెట్లు కొనడానికి?" అంది కుసుమ. "మమ్మల్ని అడగడం నామోషీయా? మేము పరాయివాళ్ళమా నాన్నగారూ?" అన్నాడు వాసు. వాళ్ళిద్దరూ తననలా పలకరించి ఎన్నాళ్ళయింది? కాదు....ఎన్నేళ్ళయింది? 'నాన్నగారూ!....' అని నోరారా పిలిచి ఎంతకాలమయింది? మందులయిపోయాయని చెప్పినా, ఒంట్లో బాగులేదని చెప్పినా, బట్టలు చిరిగిపోయాయని చెప్పినా చిర్రు బుర్రులాడే ఆ ఇద్దరూ ఆ రోజు అలా పలకరించడంతో అతడికి మతి పోయింది. అతడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వాసు, కుసుమల కళ్ళల్లో మొన్నెవరో అమ్ముతామన్న ఊరి చివరన వున్న ద్రాక్షతోట కళ్ళల్లో కలిసి మెరిసింది!
దగ్గరుండి వాసు, కుసుమలు సుబ్బారావుగారిని కలకత్తా తీసుకొచ్చారు, కానీ ఖర్చు పెట్టనీయకుండా! రాజు, సౌమ్యలు పువ్వుల్లో పెట్టి సుభద్రమ్మను కలకత్తా తీసుకెళ్ళారు!
"సుభద్రా! ఏమో అనుకున్నాం గానీ, మన పిల్లలెంత మంచివాళ్ళే! వాళ్ళిద్దరూ నన్నూ, వీళ్ళిద్దరూ నిన్నూ ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో ఇక్కడికి! నాకు చాలా సంతోషంగా వుంది. నువ్వు ప్రైజు తీసుకుంటూ వుంటే స్వయంగా దగ్గరుండి చూడాలనిపించి రాగలనో లేదోనని భయపడిపోయాను పిల్లల్ని డబ్భులడగడమెందుకని నా ఉంగరాన్ని అమ్మేశాను అయిదు వేలొచ్చాయి. ఇదుగో, ఇవి నీ దగ్గరుంచు. ఏనాడు ఇంతమొత్తాన్ని నీకివ్వలేకపోయాను. కొద్దో గొప్పో యిచ్చినా అది పిల్లల కోసమే ఖర్చు పెట్టేదానివి. కాని నీకోసమంటూ ఏమీ చేసుకోలేదు. అన్నట్టు నీ చెవుల దుద్దులూ ముక్కు పుడకా ఏవీ?" బోసి నోటితో సుభద్రమ్మను ముద్దు పెట్టుకుంటూ అన్నారు సుబ్బారావుగారు. సుభద్రమ్మ సిగ్గుపడిపోతూ అతని కౌగిట్లో కుంచించుకుపోయింది.
"రాజునీ. సౌమ్యనీ ఇబ్బంది పెట్టడడమెందుకని మన రామకృష్ణ ద్వారా అవి అమ్మేశానండి. రెండూ కలిపి పదివేలొచ్చాయి. ఇప్పుడు మనిద్దరి దగ్గరా మొత్తం పదిహేనువేలున్నాయి. బహుమతి డబ్బు యిరవై వేలు. ముప్పై అయిదు వేలూ బ్యాంకులో వేస్తే...." ఏదో చెప్పబోయేలోపల కొడుకులూ, కోడళ్ళూ రావడంతో చెప్పడం ఆపేసి వారందరికేసి ఆప్యాయంగా చూసింది.
"ఎన్నాళ్ళకి కుటుంబం అంతా ఒక్కచోట ఉందండీ! ఈ సంతోషం నేను పట్టలేపోతున్నాను" అంది సుభద్రమ్మ భర్త వంక చూస్తూ.
"అవును సుభద్రా! నాకూ అలాగే వుంది. ఈ కాలం ఇలాగే నిలిచిపోతే. అందరూ ఇలాగే కలిసి వుండిపోమూ? ఒరేయ్ పెద్దాడా? నువ్వెలాగూ డాక్టర్ వి కదరా! ఈ ప్రాక్టీసేదో రాజమండ్రిలోనే పెట్టుకోకూడదూ? నువ్వూ, చిన్నాడూ అందరం కలిసి పెద్ద ఇల్లు తీసుకుని వుందాం. చిన్న వాడికి ఇప్పుడు రాజమండ్రి నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం లేదు కదా!' అన్నారు సుబ్బారావుగారు.
ఆ మాటలు కొడుకులకీ, కోడళ్ళకీ ఎవ్వరికీ నచ్చలేదు కాబోలు మొహమొహాలు చూసుకున్నారు సుభద్రమ్మ సుబ్బారావుగారి కేసి చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఎన్ని అర్ధాలో, ఎంత బాధో ఒక్క ఆమెకే తెలుసు!
"ఇక ముందు మీరు మా దగ్గర, అత్తగారు మరిదిగారి దగ్గరా వుండడం ఎందుకు? ఇద్దరూ మా దగ్గరే వుండండి. మా పిల్లలిద్దరూ సుజీత, స్మితలని ఊటీ స్కూల్లో వెయ్యాలనుకుంటున్నాము. నాకూ ఇంక వేరే పన్లేమీ వుండవు కాబట్టి, ఊరి చివర ఒక ద్రాక్షతోట కొని దాన్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను. మీరిద్దరూ వుంటే మాకు ఇల్లు తాళం పెట్టవలసిన అవసరమూ వుండదు; మీరూ ఒకరికొకరు తోడుగా వుంటారు" అంది కుసుమ.
"అవును నాన్నగారూ, కుసుమ చెప్పింది నిజం" అన్నాడు వాసు.
"బాగుంది మీ వరస. మా పవన్ కి అత్తగారంటే పంచప్రాణాలూనూ! ఆవిడ లేనిదే వాడుండలేడు. ఆవిడతోపాటే మామగారూనూ! ఇద్దరూ మా దగ్గరే వుంటారు. నేనీమధ్య మహిళాభివృద్ధి కార్యక్రమాల్లో తలమునకలై తిరుగుతున్నాను. నేను ఇంట్లో వుండని లోటు పవన్ వల్ల వాళ్ళకి తీరుతుంది. పైగా, వాళ్ళకి బోరు కొట్టదు. మీ దగ్గరుంటే వాళ్ళకి కాలక్షేపమేమిటి? పిల్లలు ఊటీకి వెళ్ళిపోతారుగా!" అంది సౌమ్య.
వారి వాదనలని ముద్దాయిల్లా విన్నారు సుభద్రమ్మగారూ, సుబ్బారావుగారూ!
అమ్మా, నాన్నా ఎవరి దగ్గర వుంటామని చెబుతారా అని ఆదుర్దాగా ఎదురు చూస్తున్నవాళ్ళు - ఆ రోజు ఫంక్షన్ తాలూకూ ఆర్గనైజర్లు లాంఛనంగా పలకరించి పిలవడానికి రావడంతో ఆలోచనలకి కళ్ళెం వెయ్యడం జరిగింది.
* * *
ముదురు నీలంరంగు పట్టుచీరకి మెరూన్ కలర్, తోపు కుంకుమరంగు అంచు చీర! అది పెళ్ళినాటి చీరే అయినా ఎప్పుడో అప్పుడప్పుడు కట్టుకోవడం వల్ల బాగానే వుంది. ఆ చీరలో ఆరోజు ఆమెను "పార్వతీ!" అన్నారు ప్రేమగా సుబ్బారావుగారు. ఆశ్చర్యంగా అతనికేసి చూసి, " నా పేరు మర్చిపోయారా? ఈ పేరేమిటి?" అంది సుభద్రమ్మ.
"నువ్వు సాక్షాత్తూ పార్వతీదేవిలా, అందంగా, ఆదిశక్తిలా, శక్తివంతంగా కనిపిస్తున్నావు సుభద్రా! పదో తరగతి తరవాత, ఆడపిల్లకి పై చదువెందుకూ అని మీ పుట్టింటివాళ్ళు చదివించలేదు. బడి పంతులు ఉద్యోగం చేస్తూ ఎందరికో విద్యాదానం చేసిన నేను కూడా నిన్ను కేవలం భార్యగానే చూశాను కానీ, నీ కోరిక తెలిసి కూడా చదివించడానికి ప్రయత్నం చెయ్యలేదు. కాని, ఇలా ఇంత గొప్ప బహుమతి పొందిన గ్రంథాన్ని నువ్వు రచించావంటే నాకు చాలా ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ వుంది. అంత భాషా, భావం ఎక్కడ సంపాదించావు సుభద్రా?" అడిగారు సుబ్బారావుగారు.
"ఏ బడీ, ఏ గురువూ చెప్పలేని పాఠాలు నాకు జీవితం నేర్పించిందండీ! నేనది కథ కింద రాయలేదు. నా ఆవేదనను అక్షరరూపంలో డైరీలా రాసుకున్నాను. ఒక్కొక్క పుటా, ఒక్కొక్క రోజు సంఘటన! అవన్నీ ఒక రోజు మన రామకృష్ణ చూసి నాకు తెలీకుండానే అచ్చువేయించి తీసుకొచ్చాడు. అతనే ఈ పుస్తకాన్ని బహుమతి పోటీకి కూడా పంపించాడు. అందులోని పాత్రలు మీరు, నేను, మన సంసారం, మన పిల్లలూ అవేనండి" అంది కళ్ళు తుడుచుకుంటూ.
ఆ సాయంత్రం వేదిక మీద "వాస్తవాన్ని కళ్ళకి కట్టినట్లు రచించిన ఈ రచయిత్రి మహానుభావురాలు. వీరి కలం నుండి వెలువడ్డ ఈ రచన మణిపూస. వీరు ఇదే తన తొలి రచన అని చెప్పుకున్నారు. చాలా ఆశ్చర్యం! తొలి రచనలోనే ఇంత సిద్ధహస్తులయిన వీరు, మునుముందు ఇంకా ఎన్నో మంచి రచనలు చేస్తారని ఆశిస్తూ, ఈ బహుమతిని అందుకోవలసిందిగా కోరుతున్నాం. వారు శ్రీవారు కూడా ఇక్కడ వున్నట్టు తెలిసింది. వారిని కూడా వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాం" అన్నారు.
వాసు తండ్రి చెయ్యి పట్టి నడిపించి వేదిక పైకి తీసుకెళ్ళాడు. రాజు తల్లి చెయ్యి పట్టుకుని వేదిక మీద కూర్చోబెట్టాడు.
ఇద్దరికీ శాలువాలు కప్పి, గౌరవించారు ఆర్గనైజర్లు. సభ ఎంతో వేడుకగా పూర్తయ్యింది. ఆ రాత్రి భోజనాలయ్యాక, "అమ్మా, ఆ చెక్కేది? రేపే మన ప్రయాణం. నువ్వు మాతోనే వచ్చేస్తున్నావ్!" అన్నాడు వాసు.
"చెక్కు ఎక్కడ పెట్టేవమ్మా? జాగ్రత్త! నాన్నగారిని మనతోనే తీసుకుపోతున్నాం" అన్నాడు రాజు.
"అరె! చెక్కు కనబడ్డం లేదే!" కంగారుగా వెతికింది సుభద్రమ్మ. అందరూ మరింత కంగారుగా ఆ గదిని, సభ జరిగిన ప్రాంగణాన్ని అంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఆర్గనైజర్లకు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పాలో తెలీక "మీరొక ఉత్తరం రాసివ్వండి చెక్కు పోయినట్టు. మేము ఎంక్వయిరీ చేసి మీకు సమాధానం రాస్తాము. డూప్లికేట్ చెక్ ఇస్తాం" అన్నారు. సుభద్రమ్మ గారు, వారు చెప్పిన విధంగానే రాసిచ్చింది.
కుసుమ విసుక్కుంది.
సౌమ్య గొణుక్కుంది.
వాసు చిటపట లాడాడు.
రాజు చిరాకు పడుతున్నాడు.
"బాబూ మమ్మల్ని, ఎవరు తీసుకెళ్తున్నారు?" అడిగింది సుభద్రమ్మ వాసునీ, రాజునీ చూస్తూ.
"మీ చెక్కు రాగానే ద్రాక్షతోట కొనాలనుకున్నాను. ఇప్పుడెలా? మీరు మరిదిగారింటికే వెళ్ళండి?" అంది కుసుమ.
"ఎంతో మోజు పడ్డాను - మహిళామండలిలోని శ్యామల మెళ్ళో లాంటి కెంపుల నెక్లెస్ కొనొచ్చని ఇరవై వేలతో! ఊ....అంతా నిరాశే అయింది. మీరు బావగారింటికే వెళ్ళండి" అంది సౌమ్య.
వాసూ, రాజూ మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నారు.
సుబ్బారావుగారు అయోమయంగా చూశారు అందరివైపు, కర్తవ్యం అర్ధం కానట్టుగా! కలలన్నీ పేక మేడల్లా కూలిపోయినట్టయింది.
"సుభద్రా! ఏం చేద్దాం?" అన్నారు తడబడుతూ.
సుభద్రా పకపకా నవ్వింది! పార్వతీదేవిలా నవ్వింది గంభీరంగా!
గల గలా నవ్వింది ప్రవహించే గంగానదిలా!
భద్రంగా జాకెట్టు మడతలో దాచిన చెక్కును పైకి తీసింది. సుబ్బారావుగారి చేతిలో పెట్టింది.
"పదండీ! ఇది నా స్వంత సంపాదన! ఇరవైవేలు. మన దగ్గర బంగారం అమ్మగా వొచ్చినవి పదిహేను వేలు. బ్యాంకులో వేస్తే ముప్పై అయిదు వేలు. ఆ వడ్డీ మీద మనం హాయిగా ఒక్క గది అద్దెకు తీసుకుని బతకొచ్చు! డబ్బు మనుషులు మనకొద్దు! నాకు మీరూ, మీకు నేనూ తోడు. మనకి భగవంతుడు తోడు - పదండి!" అంది ఆవేశంగా.
అందరూ తెల్లబోయి ఆమెకేసి చూశారు.
ఆమెలో ఆనందం! కళ్ళు చెమ్మగిల్లాయి.
ఆమెలో ఆత్మస్థయిర్యం! కళ్ళు మెరిశాయి.
ఆమెలో ధైర్యం! చూపులు సూదుల్లా వున్నాయి.
ఆమె సాక్షాత్తూ ఆదిశక్తిలా కనిపించింది అందరికి!
ఆలోచనల్లోంచి, షాకులోంచి అందరూ తేరుకొనేలోగా, ఆమె సుబ్బారావుగారి చెయ్యి పట్టుకుని, మరొక చేతిలో సూటుకేసు పట్టుకుని, అడుగు బయటకు వేసింది.
ఆమెలో భార్య మాత్రమే కాదు - ఒక చెల్లి, ఒక తల్లి కనిపించారు సుబ్బారావుగారికి. 'ఆడది అబల కాదు - శక్తి! ఆదిశక్తి!!' తనలోతనే గొణుక్కున్నట్టుగా అన్నారు.
(రచన మాసపత్రిక - మే 1994)