Previous Page Next Page 
శారదా అశోకవర్ధన్ కథలు  పేజి 3

                        

   

                                                         3. చీకటి ఊబి     
    చిక్కటి చీకటి! అమావాస్య చీకటి!
    కాటుకకన్నా నల్లగా పులుముకుపోయింది!
    గదే కాదు ఆమె మదినిండా చీకటే!
    కిటికీలోంచి అప్పుడప్పుడు  చారల్లా  అగుపిస్తూన్న వీధిలైటు వెలుగుకూడా  చూడటానికి భయపడుతున్న  ఆమె, కళ్ళు గట్టిగా మూసుకుంది. చేత్తో కిటికీ తలుపుల్ని దభాల్న మూసేసింది.
    గీతకి చీకటంటేనే బాగుంది. చీకట్లో  ఒక్కర్తే ఎవరి మొహాలు చూడకుండా, ఎవరికీ మొహం చూపించకుండా, ధైర్యంగా తనలో తను మాట్లాడుకుంటూ  వుంది. ఎంత హాయిగా వుంది, ప్రపంచం అంతా శూన్యంలా వుంది చీకట్లో!
    ఆమెకు కరుణాకర్, అబ్దుల్ రహమాన్ జ్ఞాపకం వచ్చారు. సబ్బునీటిని గొంతుతో పీల్చి గాలిబుడగలు చేసి ఆనందించే పిల్లల్లా, ఎంతో అలవోకగా రక్తాన్ని పీల్చి ఆనందించే జలగలు వీళ్ళు! బ్లెడ్ సక్కర్స్!!
    ప్రీతమ్ సింగ్ డొక్కుమొహం కళ్ళముందు కదిలింది. సన్నగా, పీలగా మలేరియా వచ్చి అప్పుడే తగ్గినట్టు కనిపిస్తాడు. ఎక్కడో నూతిలోనుంచో, గోతిలోనుంచో మాట్లాడుతున్నట్టుంటుంది అతని గొంతు కీచుగా! ఎప్పుడూ నవ్వుతూనే వుంటాడు - వెకిలినవ్వు.
    ఆ నవ్వుతోనే  పువ్వుల్లాంటి  ఆడపిల్లల్ని  బోల్తా కొట్టించి, తేనెటీగలా చుట్టుముట్టేసి పట్టేస్తాడు.
    బతుకుకోసం బావురుమనే వాళ్ళూ, కోర్కెల సంకెళ్ళలో చిక్కుకొని సతమతమయ్యేవాళ్ళూ, అవసరాలని సర్దుకోలేక చితికిపోయేవాళ్ళూ - వాళ్ళందరూ ఇతని గుప్పెట్లో బందీలు. అవసరానికి వాళ్ళని ఆదుకొనే ఆపద్భాంధవుడు.    
    చక్రవడ్డీకి అప్పులిచ్చి, ఆ అప్పుల వలయంలో  చిక్కుకున్నవారిని  తను చెప్పినట్టల్లా  ఆడించేందుకు  చక్రాన్ని తిప్పుతాడు ప్రీతమ్ సింగ్!
    అప్పు తీసుకున్న ఆడవాళ్ళంటే అతనికి మహాప్రీతి. ముందు ముందు అతని వ్యక్తిత్వం తెలియక చిక్కుకుపోయిన ఆడవాళ్ళు, ఆ తర్వాత అతని బలహీనత, కళాపోషణ తెలుసుకొని - దానికి దాసులు అయిపోతూ  వుంటారు.
    ఆడంబరాలకుపోయి, ఖర్చుల భారాన్ని  పెంచుకొని అప్పుల ఊబిలో  కూరుకుపోయే అతివల శీలాన్ని వడ్డీగా మార్చుకొనే మోసగాడు ప్రీతమ్ సింగ్!
    తన అవసరాలకు అనుకూలంగా మారిన అతివలను ఇతరుల అవసరాలకు కూడా ఉపయోగపడేలా చేసే విశాలహృదయుడు ప్రీతమ్ సింగ్.    
    తను చేసిన పొరపాటు తెలుసుకొనేసరికే అంతా కోల్పోయింది. కోరికల గుర్రాలకు కళ్ళేలు వేయలేకపోయింది. ఊహల సౌధాలు కూలిపోతే  తట్టుకోలేకపోయింది. మధ్యతరగతి స్త్రీననే విషయం మర్చిపోయి  ఆకాశమంత ఎత్తుకి ఆశగా చూసింది. అందుకే ఆడంబరాలకోసం ప్రీతమ్ సింగ్ దగ్గర తన ఆడతనాన్ని తాకట్టు పెట్టింది గీత.
    ఒక్కసారి తన ఒంటికేసి  చూసుకొని నవ్వుకుంది గీత. 'రక్తం - రక్తంగానే వుందా? నీళ్ళలా పలచబడిపోయిందా?' బ్లేడుతో కోసి చూసుకోవాలనుకుంది. తన పిచ్చి ఆలోచనకు తనే నవ్వుకుంది.
    చీకట్లో తననెవరైనా చూస్తున్నారనే భయంలేదు. తనని చూసి ఎవరైనా నవ్వుతున్నారేమోనన్న  దిగులు లేదు. ఎంత హాయి చీకటి!
                                                                         *    *    *
    గీత బట్టల మిల్లులో పనిచేస్తోంది. పొట్టిగా, నల్లగా, లావుగా  వుంటుంది. చీపికళ్ళు, చట్టిముక్కూ, చిన్న నోరూ - తనకేసి ఎవ్వరూ కన్నెత్తి అయినా చూడకపోగా, చూసినవాళ్ళు వెంటనే తలతిప్పుకోవడం బాధగా వుండేది.
    అందుకే తన అందాన్ని ద్విగుణీకృతం చేసుకొనేందుకు  తాపత్రయపడేది. అలంకరణకీ, షోకులకీ ఖర్చు పెట్టేది. తనను మనసారా ఆరాధించి షికార్లకు, సినిమాలకు తిప్పే మొగుడు రావాలని కలలు కంది.
    మొదటిసారిగా గీత తన అందాన్ని పొగిడినా ప్రీతమ్ సింగ్ గుప్పెట్లో చిక్కుకుపోయింది. ఆ ఊబిలోంచి బైటపడే ప్రయత్నంలో ఒక శుభముహూర్తాన కాళిదాసుకి పెళ్ళామయింది. అయితే భర్త కౌగిట్లో కరిగిపోవాలన్న కవుల మాటలూ. భర్తతో డ్యూయెట్లు పాడాలన్న సినిమా హీరోయిన్ లాంటి కోరికలూ  అలాగే మిగిలిపోయాయి.
    కాళిదాసు గీతకి ఒక బాబును ప్రసాదించగలిగాడు కానీ, ఆమె ఇతర గొంతెమ్మ కోర్కెలని తీర్చలేకపోయాడు. గొర్రెతోక జీతంతో ఆమెను తృప్తిపరచలేకపోయాడు. గీతదాటి ప్రవర్తించే గీత అలవాట్లను మాన్పించలేకపోయాడు. అనాకారిగా వున్నా ఆమె మానసిక సౌందర్యాన్ని అభిమానించాలని ఆశపడ్డ కాళిదాసుకి గీత అవకాశం ఇవ్వలేదు.
    ప్రీతమ్ సింగ్ కీ - అవసరం  ఊబిలో  కూరుకున్న ఆడవాళ్ళకీ  మధ్య దళారీగా వుండే భ్రమరాంబ ప్రభావం నుంచి గీతని బైటికి  గీసుకురావడం  కష్టమని గ్రహించిన కాళిదాసు, అసమర్ధ భర్తగా ముద్రపడిన కాళిదాసు, గీతను తన దారిలోకి మళ్ళించుకోలేకపోయిన కాళిదాసు - గీత్నీం బాబునీ వదిలేసి  వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే గీతకు  తారసపడ్డాడు మన్మధకుమార్.
    మన్మధకుమార్ గీతని  పార్కులకి తీసుకెళ్ళాడు. హోటళ్ళకి తీసుకెళ్ళాడు. కౌగిట్లో కరిగించేశాడు. తన్మయత్వంలో  ముంచెత్తాడు.
    మన్మధకుమార్ తో  చెట్టాపట్టాలేసుకు తిరగడానికి ప్రీతమ్ సింగ్ అభ్యంతర పెట్టడంతో కరుణాకర్ దగ్గర అప్పుచేసి, ప్రీతంసింగ్ దగ్గరి అప్పు మొత్తం తీర్చేసింది. అలా  చేయడంవల్ల పెనంమీద నుంచి  పొయ్యిలో  పడ్డాననే  సత్యాన్ని తెలుసుకోవడానికి  గీతకి  చాలా కాలం పట్టింది.
    గీత మన్మధకుమార్ పట్ల  అపేక్ష పెంచుకుంది. ఆమె సంతోషానికి అవధుల్లేవు. పబ్లిగ్గా  తన కొంగు పుచ్చుకుని పార్కుల్లో  కూర్చుని కబుర్లు  చెప్పే మన్మధకుమార్ అంటే ప్రాణం గీతకి! తాళికట్టిన  మొగుడు కాళిదాసు కూడా భయపడేవాడు అలా కూర్చోడానికి. వాళ్ళిద్దరి  బంధం అలా బిగుసుకుపోయింది.
    మొదట్లో  సినిమాలకు, షికార్లకు  వెళ్ళినప్పుడు  మన్మధకుమార్ తనే ఖర్చు పెట్టేవాడు. గీత కూడా అప్పుడప్పుడు తనూ ఖర్చుపెట్టేది. అవసరమైనప్పుడల్లా  కరుణాకర్ దగ్గర చక్రవడ్డీకి డబ్బు తెచ్చేది. మన్మధకుమార్ కి పెళ్ళయింది. అతనికి ఒక కొడుకు, ఒక కూతురూ వున్నారు. అతని భార్య  జబ్బు మనిషి. అక్కడ తనకు  లభించని సుఖాన్ని  గీత దగ్గర పొందుతూన్న  మన్మధకుమార్ తన అవసరాలకు గీతని డబ్బు అడుగుతూ వుండేవాడు. గీత తన ఆనందంకోసం అతనికి ఎంతంటే అంత డబ్బు ఇస్తుండేది. గీతలో తరిగిపోయే అందాన్ని బేరీజు వేసుకుంటూ, తనకూ, తన కష్టమర్లకూ గీత ఎంతవరకు ఉపయోగపడుతుందో, ఆమె అందాన్ని తన అప్పుకి  సరిపడా ఎంతవరకు సొమ్ము చేసుకోవచ్చునో బేరీజు వేసుకుంటూ  గీతకి డబ్బు ఇస్తుండేవాడు కరుణాకర్.
    మన్మధకుమార్  తనకు అందుబాటులో వున్న అవకాశాల్ని  చక్కగా ఉపయోగించుకుంటూ  వుండేవాడు. ఒక్క గీత మాత్రమేకాదు. గీతలా ప్రవర్తించే ప్రతి ఆడపిల్లా మన్మధకుమార్ కి ఆపద్భంధువు. వాళ్ళతో చనువుగా తిరుగుతూ, వాళ్ళ దగ్గర డబ్బులు  పుచ్చుకుంటూ, జల్సాలు చేస్తూ మీసాలు మెలేస్తుంటాడు. అది తాత్కాలికమేనని  అతడెప్పుడూ  ఆలోచించలేదు. ఆ మత్తులో వున్న గీతలాంటివాళ్ళు కూడా ఆలోచించరు.
    ఉన్నట్టుండి  ఒకరోజు 'పదివేలు అర్జంటుగా కావా'లన్నాడు మన్మధకుమార్. అతడి వ్యామోహంలో వున్న గీత కరుణాకర్ దగ్గర డబ్బు తెచ్చి ఇచ్చింది. ఇక పై డబ్బడిగితే ఇవ్వనని హెచ్చరించాడు కరుణాకర్.
    మర్నాడు  సాయంత్రం  తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకొని  మన్మధకుమార్ కోసం ఎదురుచూసింది గీత. వాకిటి తలుపులు తెరిచి అతని రాకకోసం ఎదురుచూసింది.
    వెన్నెలంతా వెళ్ళిపోయింది. మంచి గంధం సెంటు ఇంకిపోయింది. మల్లెలన్నీ  వాడిపోయాయి. ఆమె కళ్ళు కన్నీటి కుండలయ్యాయి.
    మర్నాడు తెలిసింది గీతకి, మన్మధకుమార్ ఆ ఊరు నుంచి ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోయాడని!
    మతిపోయింది ఆమెకి. పిచ్చెక్కినట్టయింది.
    ప్రీతమ్ సింగ్ ను మించిన కరుణాకర్, రామనాధం, రంగదాసులు బారులుతీరి తమ అప్పు తీర్చమని పీక్కుతింటున్నట్టు  అనిపించింది. అప్పుడు కనువిప్పు కలిగింది - తను ఎంత విచ్చలవిడిగా అప్పులు చేసిందో తెలిసి వచ్చింది.
    ఆ రోజూ తనను ఏనాడూ ఏమీ అడగని ఏడేళ్ళ కొడుకు ఒక్కమాట అడిగాడు.
    ఆ మాట తనను తూలనాడేది కాదు. తనను కించపరిచేదికాదు. తనను సిగ్గుపడేలా చేసేదీకాదు.
    "అమ్మా! రేపు బళ్లో ఎక్స్ కర్షన్ కి తీసుకెళ్తున్నారు. అయిదు వందలు కట్టాలి ఇవ్వవూ?" అని.
    గీత గుండెలో గుండుసూదులు గుచ్చుకున్నాయి.
    తన కడుపుచించుకు పుట్టిన కన్నబిడ్డకి పైసా ఇవ్వలేని  పరిస్థితిలో వుంది. కట్టుకున్నవాణ్ణి  చేతకానివాడిలా భావించి, తనని విడిచి వెళ్ళిపోయేలా చేసింది. తను అనాకారినని తెలిసికూడా, మన్మధకుమార్ పొగడ్తలకి పొంగిపోయి భ్రమల్లో బ్రతికింది. భ్రమరాంబ వెళ్ళేదారి మంచిదికాదని తెలిసినా ఆమె దారిలోనే నడిచి తాను పతనమైపోయింది. డబ్బు కోసం, ఆడంబరాలకోసం, అప్పు కోసం  ప్రీతమ్ సింగ్, కరుణాకర్ లాంటి వారి చేతుల్లో చిక్కి తన శరీరాన్ని ఫణంగా పెట్టింది. ఛీ! ఛీ! తను ఆడదేనా?
    మమతకీ, మాతృత్వానికీ మారు పేరైన ఆడజాతికే అవమానం కలిగేలా ప్రవర్తించింది. ఎన్నడూ నోరు తెరిచి ఏదీ అడగని బుజ్జిబాబు డబ్బు అడిగితే జవాబు చెప్పలేకపోయింది.
    ఏం చేయాలిప్పుడు? ఎవరిస్తారు డబ్బు?
    భర్త కాళిదాసు ఎక్కడున్నాడో? అసలు ఉన్నాడో, లేక ఈ అవమానాలను భరించలేక ఏదైనా....అఘాయిత్యం చేసుకున్నాడో?
    గీత కళ్ళు కుండపోతగా వర్షించాయి. చెంపల మీదుగా జారిన కన్నీళ్ళు గుండెని తడిపేశాయి.
    చాలా కాలానికి కాళిదాసు గుర్తొచ్చాడు. తన బిడ్డకి తండ్రి! అంతే. బాబుని గుండెలకి గట్టిగా హత్తుకొని పడుకుంది.
    ఆ పుత్రగాత్ర పరిష్వంగంలో ఏదో తన్మయత్వం. ఏదో తీయని అనుభూతి. ఇంతకాలం ఎంత పోగొట్టుకుంది తను! తన లోకం తనదే అనుకుంది. తనకు ఒక కొడుకున్నాడనే ధ్యాసకూడా లేకుండా బతుకును వెళ్ళదీసింది. ఎంత దౌర్భాగ్యం?
    ఆమె గుండెలకి గుచ్చుకున్నాయి మంగళసూత్రాలు. తీసి తదేకంగా చూసింది. పెదవులమీద చిరునవ్వు వెలిసింది. తప్పకుండా వాటికి అయిదు వందలకు తగ్గకుండా వస్తాయి. తృప్తిగా నిట్టూర్చింది.
    ఎప్పుడు తెల్లవారుతుందా? వాటిని డబ్బుగా మార్చి బుజ్జిగాడుకి ఎప్పుడు ఇవ్వాలా అని ఆత్రంగా వుంది.
    మొట్టమొదటిసారి ఆ రాత్రి ఆమెకు కాళరాత్రిలా అనిపించింది. వెలుగు కోసం  తపించిపోతూ, చీకటిని ద్వేషిస్తూ. ఏ నడిరాత్రికో నిద్రలోకి జారిపోయింది. చీకటి ఊహలకి స్వస్తి చెపుతూ గీత.
    గీతకి దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు ఆమె పరిస్థితులను గమనిస్తున్న కాళిదాసు తెల్లవారేటప్పటికి తిరిగొచ్చాడు.
    "గీతా! నీ కోసం, బాబుకోసం వచ్చేశాను. నీ బలహీనతలకు కారణాలు తెలుసుకున్నాను. నిన్ను ఆ ఊబిలోంచి తప్పించటానికి నా స్కూటర్, ఉంగరాలు అమ్మేశాను. కరుణాకర్, రంగదాసు, రామనాధంల దగ్గర నీవు చేసిన అప్పులు తీర్చేశాను. నీవు ఇప్పుడు స్వేచ్చాజీవివి. నీ బతుకు నా చేతుల్లోనే వుంది. గీతా! అందం మనసుకుండాలి; శరీరానికి కాదు. శక్తికి మించిన కోర్కెలకి మనిషి బానిస కాకూడదు. నువ్వు వాస్తవాన్ని విస్మరించి ఊహల్లో బతికావు. ఇప్పటికైనా తెలుసుకో" అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ.  
    ఆమె భోరున ఏడ్చింది. అతని కాళ్ళమీద పడి "నన్ను క్షమించండి! ఏ భార్యా, ఏ భర్తకి చేయని తీరని ద్రోహం మీకు చేశాను. నేను చెడిపోయిన దాన్ని" అంటూ  కన్నీళ్ళతో  అతని పాదాలు కడిగేసింది.
    "గీతా! నీ మనసుకి పట్టిన చీకటిబూజు వదిలిపోయింది. అదే నాకు కావలసింది. మన బుజ్జిగాడు కోసం ఇక పైన పవిత్రంగా బతకటం అలవాటు చేసుకోవాలి. లేకపోతే వాడూ ఇంకొక మన్మధకుమార్ లా, ప్రీతమ్ సింగ్ లా, కరుణాకర్ లా తయారవుతాడు. ఎందరో గీతల్ని మార్చేస్తాడు. గతాన్ని ఇద్దరం మర్చిపోదాం, లే!" అంటూ ఆమె రెండు భుజాలు పట్టుకొని లేవనెత్తాడు.
    ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది ఆనందంతో తేలిపోయింది. అందం, ఆనందం, అనుభూతి మనసుకు సంబంధించినవి కానీ, శరీరానికి సంబంధించినవి కావనీ తెలుసుకొని, తన్మయత్వంలో తేలిపోయింది. చీకటి ఊహలు దూది పింజల్లా పటాపంచలైపోయాయి. ఆమెకిప్పుడు చంద్రుడు అందంగా కనిపిస్తున్నాడు. వెన్నెల  హాయిగా పన్నీటిజల్లులా అనిపిస్తోంది.
                                                                                                            (స్వాతి వారపత్రిక 20-5-1994)

 Previous Page Next Page