Read more!
 Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 2

                                                                                 2
    తెల్లవారింది. ఎప్పటిలాగానే తెల్లవారింది. ఆరోజేం ప్రత్యేకతలేదు.
    సీత నిద్రలేచింది.
    సీత కుర్చీలోంచి లేచింది. బద్దకంగా ఒళ్లు విరుచుకుంది. ఆవులించింది. వెయిటింగ్ రూంలోనే ముఖం కడుక్కుంది. బైటకొచ్చింది. కేంటిన్ కెళ్ళి కాఫీ, రెండిడ్లీ తిన్నది.
    "ఇహ బైలుదేరుదామా సీతా?" అంది ఎవరినో అన్నట్లు తనని తానే అడిగింది.
    "నాదేం ఆలశ్యంలేదు. నీయిష్టం." అంది ఎవరినో అన్నట్లు తననితానే అడిగింది.
    "నాదేం ఆలశ్యంలేదు. నీయిష్టం." అంది సీత.
    సంచి చేతపట్టుకుని స్టేషన్ బైటకొచ్చింది సీత. ఓసారి వెనుతిరిగి చూసి "అబ్బో స్టేషన్ చాలా పెద్దది. ఊరూ పెద్దదేట. చూద్దాం.... చూద్దాం..." అనుకుంది.
    ఊరుముఖం తెలియని సీత తిన్నగా వూళ్ళోకి బైలుదేరింది.
    సీత నడుస్తూనే....
    రోడ్డుమీద పోతున్న రిక్షాలు, బస్సులు, లారీలు, సైకిళ్ళు, స్కూటర్లు, ఆటోలు, చూచింది.
    డ్రస్ వేసుకుని బుల్లి టిఫెన్ క్యారియర్ , బ్యాగ్ లు, అల్యూమినియం బాక్స్ తో  కాన్వంట్ కేలుతున్న పిల్లలని చూచింది.
    ఎవరిమానావారు....ఉరుకులు, పరుగులుమీద వెళుతున్న ఆడ, మగని చూచింది.
    తెల్లవారింతరువాత దినచర్యలో మొదటిభాగం అన్నట్లు బైలు దేరిన ముష్టివాళ్ళను చూచింది.
    "అరే, ఈవూళ్ళోనూ అడుక్కుంటారు" అనుకుంది, గుంపులుగా పోతున్న ముష్టివాళ్ళను చూచి.
    "ఇంతమంది అడుక్కునేవాళ్లు  ఈ అరగంటలోనే ఎదురయ్యారంటే వూరునిండా చాలామంది వుండివుంటారు. పనిలేకపోతే అడుక్కోవచ్చు. తేరగా పెట్టేవాళ్లుంటేసరి తప్పేంలేదు. పని కావాలంటే అడుక్కోవటంలా? ఉద్యోగం కావాలంటే అడుక్కోవటంలా, దేనికి? కడుపునింపుకోటానికి..బ్రతకటానికి....ఇప్పుడు నేనూ అడుక్కోవాలి....ఉద్యోగం.... ఏం ఉద్యోగం...? ఏమో...? ఏదోఒకటి చావకుండా బతకటానికి, చచ్చేం సాధిస్తాం?"
    "అమ్మ!" బిచ్చగత్తె అడ్డంతగిలింది.
    ఆలోచిస్తూ చకచకా ముందుకు  సాగుతున్న సీత సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయింది. ఏమిటన్నట్లు బిచ్చగత్తెవేపు చూసింది.
    భారతదేశంలో కూటికీ, గుడ్డకీతప్ప కొవ్వుకి కొరతలేనట్లు బిచ్చగత్తె పొట్టిగా లావుగా వుంది. పెద్దటవలంత చీరముక్క చుట్టుకుంది. పీలికల్లా వున్న జాకిట్టు వేసుకుంది. చేతిలోపిల్ల, పక్కనే ముగ్గురుపిల్లలు వున్నారు. వాళ్లు మాత్రం పిల్లల్లాలేరు పినుగుల్లా వున్నారు.
    "దయగల అమ్మ, పొద్దుటే ఎదురయ్యావు. దయతలచండమ్మా." అంది బిచ్చగత్తె.
    "పొద్దుటే ఎదురయితే మొదటిబోణీ నాదా! అడుక్కోటానికి కూడా శకునాలుగామాలి." అనుకుందిసీత.
    "ఏం దయతలచాలి?"
    "మీకు తోచింది వెయ్యండమ్మా, అయిదుపైసలో, పదిపైసలో, మీదయ."
    "ఈ పిల్లలు నీ పిల్లలేనా?"
    "అవున్నమ్మా."
    "నలుగురు పిల్లలా?"
    "ఇంకా ఇద్దరున్నారు. ఆళ్లు బాబుతో అడుక్కోటానికి పోయారు."
    "ఇలా ముష్టికి బైలు దేరకపోతే, ఏదో ఒకపని చేసుకోగూడదూ?"
    పైసా రాల్చేబాపతు కాదనుకుంది బిచ్చగత్తె. "ఎందుకమ్మా ఈ ప్రశ్నలు? తోచింది వేసి పంపండి." అంది తోందరపడుతూ.
    సంచిలో చెయ్యి పెట్టింది సీత.
    బిచ్చగత్తె కళ్లు మెరిశాయి. సీత చేతివేపు ఆశగా చూచింది.
    సీత రెండుపైసల బిళ్ళతీసి ఇచ్చింది.
    బిచ్చగత్తె ముఖం ముడుచుకుని రెండుపైసలు అందుకుంది.
    "నాకు కొన్ని విషయాలుకావాలి చెపుతావా?" అంది సీత.
    "బస్సు స్టాండింగుకి తొందరగా చేరకపోతే నాచోటు ఇంకోళ్లు చూచుకుంటారు. నేనేం చెపుతాను, పదండిరా." అంది పిల్లలతో.
    వెళుతున్న బిచ్చగత్తెవేపు చూచింది "దీనికో ఉద్యోగం వుంది. ఆరుగురు పిల్లలున్నారు. అడుక్కోటానికి చోటువుంది. మొగుడున్నాడు. బాగుంది." అనుకుంది. నిట్టూర్పు విడిచి బైలుదేరటానికి పక్కకు తిరిగింది.
    ఎవడో డాష్ ఇచ్చాడు సీతని. "సారీ! చూడలేదు." అన్నాడు.
    కావాలని డాష్ ఇచ్చాడని గ్రహించింది సీత "ఎందుకు చూడలేదు?" అంది.
    పరువంలోవున్న ఈ జామకాయ గడ్డుదికూడా అనుకున్నాడు వాడు.
    "ఎందుకు చూడలేదంటే ఏం చెపుతాను? సారీ అన్నాగా! కాదంటే ఇది నా అలవాటని చెప్పల్సివస్తుంది." అన్నాడు గీరగా.
    "నాకూ వుంది అలవాటు....నా ఎడంకాలి చెప్పుకి వూరికే దురద."
    "ఏయ్ నేనెవరో తెలుసా?"
    సీత తలతిప్పి చూచింది, చిన్న హొటల్ పక్కనే కనిపించింది.
    "చూడు మిష్టర్ నీ పేరు నాకు తెలియదు, నీ ముఖంకూడా ఇదే మొదటిసారి చూడటం నేను; అదిగో ఆ హొటలుంది చూచావా? అది మా అన్నది, నాతోరా మా అన్నవి పరిచయం చేస్తాను, మా అన్నకి పది చేతులు లేవుగాని అచ్చం రావణాసురుడు, హొటల్లో పిండిరుబ్బేవాడున్నాడు వాడిపేరు భీముడు కాదుగాని భీముడికున్నంత బలంవుంది, సర్వర్లున్నారు ఏం లాభం , చెప్పినమాటల్లా వింటారు, ఉత్త ఎలుగుబంట్లు, వంటపనిచేసే వాళ్లున్నారంటే, వాళ్ళో కోతిమూక రామ....రామ...రా......."
    సారీ చెప్పిన మిష్టర్ తిరిగి చూడకుండా వేగంగా ఎవరో తరుముతున్నట్లు వెళ్ళిపొయ్యాడు.
    సీత నవ్వుకుని అదే హొటల్లోకి నడిచింది.
    హొటలు చిన్నదయినా బెంచీలు, కుర్చీలు, సర్వర్లు, వచ్చేపోయే వారు, ఈగలు, వ్యాపారం బాగానే సాగుతున్నట్లు తెలుస్తున్నది.
    సీత కౌంటర్ లావున్న కౌంటర్ వద్ద కెళ్ళింది. కౌంటర్ లో లావుపాటి కాయం కూర్చునివుంది. అయితే కూర్చున్నది మగాడుకాదు ఆడది ఆ.... ఆడదానిపేరు అంజమ్మ.
    అంజమ్మకి మొగుడులేడు. అంటే చచ్చిపోలేదు, అంజమ్మనిడిచి వేరేదానితోలేచిపొయ్యాడు. ఆడాళ్ళే కాదు, మగాళ్ళూకూడా లేచిపోతారనే దానికి నిదర్శనం అంజమ్మ మొగుడు.
    అంజమ్మ మొగుడుపోతే ఏడ్వలేదు "పెళ్ళాన్ని ఏలుకోలేనిచవట." అని తిట్టుకుని సుబ్బరంగా పేవ్ మెంటుమీద ఇడ్లీ, దోసె, అమ్మి మెల్ల మెల్లగా  పేవ్ మెంట్ కి కాస్తంత వెడంగా హొటల్ లేపింది.
    సీతను చూచిన అంజమ్మ "బిల్లేది?" అంది.
    "నేనింకా ఏం తినందే?" అంది సీత.
    "ఏంటీ?" అంది అంజమ్మ తెల్లబోయి "ఈ పిల్లకి కాస్త గీర వున్నట్లుందే?" అనికూడా అనుకుంది.
    "మీతో మాట్లాడాలి రెండునిమిషాలు." వినయంగా అంది సీత.
    "ఏంటీ! ఇప్పుడా వచ్చేపోయేవాళ్ళు, డబ్బు చూసుకోవాలి." అని బిల్లిచ్చినవాడివైపు తిరిగి "ఏంటయ్యా అరవై పైసలివ్వాల్సింది, పది రూపాయల నోటిచ్చావ్, ఏంటీ, చిల్లరలేదూ? సరే, పది వుంచిపో. తర్వతరా చిల్లరిస్తాను." అని డస్కులో పదిరూపాయాలనొఇ\టు పడేయబోయింది.
    "చిల్లరున్నట్లుంది, పదికి చిల్లరుందేమో అని ఇచ్చాను." అని లాల్చీజేబులోంచి అరవైపైసలు తీసి ఇచ్చి, పదిరూపాయలనోటు తీసుకుని వెళ్ళిపోయాడు.
    వాడటు వెళ్ళగానే...."ఉడకని పప్పుకి సోడావుప్పు తగిలించాలి, నా దగ్గర నీ ఆటలు?" అని...."చూడమ్మాయ్! నాతో రెండునిమిషాలు మాట్లాడాలన్నావు. రెండునిమిషాలాగు, అలా కూర్చో." అంది అంజమ్మ.
    సీత పక్కనే వున్న బెంచీమీద కూర్చుంది.
    రెండునిమిషాలుకాదు. సరిగ్గా ఇరవై రెండు నిమిషాల తర్వాత అంజమ్మకి కాస్త తీరుబడయింది.
    అంజమ్మ మగాళ్ళతో మాట్లాడేతీరు, బిల్లు తీసుకోవటం, చిల్లరుండి, చిల్లరమాత్రమే ఇస్తే తీసుకోటం నోట్లు యిచ్చేవాళ్ళని కోప్పడటం, తప్పనిసరి అయితేమాత్రం నోటు అందుకుని చిల్లరివ్వటం, లాలనగా మాట్లాడేవారితో లాలనగా మాట్లాడటం, గదమాయించేచోట గదమాయించటం - అంతా గమనించి సీత "ఆడదానికి నోరుండాలి. లేకపోతే ఈ లోకంలో బ్రతకలేడు." అనుకుంది.
    "ఊ....ఇప్పుడు చెప్పు, ఏంటమ్మాయ్! నీ కధాకమామిషు." అంది అంజమ్మ.
    "ఓహొ! నాకో కదుందనీ దానికో మిష వుందనీ గ్రహించింది. గట్టిదే." అనుకుంది సీత.
    "నాపేరు సీత."
    "అహా!"
    "నాకు పనికావాలి."
    "ఎంటీ?"
    "పనికావాలి. ఏ పనయినాసరే చేస్తాను. కష్టపడగలను. తోచింది ఇవ్వండి, కష్టానికితగిన ప్రతిఫలం- నా కాళ్ళమీద నే నిలబడగలిగితేచాలు పెద్దాశాలేంలేవు." ముక్కుసూటిగా చెప్పవలసింది చకచకా చెప్పింది సీత.
    అంజమ్మకి నానుడుబేరం ఇష్టంలేదు. కటాబిటి వ్యవహారం అంటే ముచ్చటపడుతుంది. సీత నచ్చింది అంజమ్మకి. అలా అని సీతని నమ్మలేదు. విజయవాడ అంటే మోసాలకి నిలయం అని అంజమ్మ అభిప్రాయం.
    "ఏం పని చేయగలవ్?" అంది అంజమ్మ.
    "ఏం పనంటే...ఏం చెపుతాను! హొటల్లో ఏపని అయినాసరే."
    "చదువుకున్నావా?"
    "ఇంతకూ ఎక్కడైనా ఏదయినా పనిచేశావా?"
    "లేదు! ఆ...అవసరం రాలేదు."
    సీతను ఎగాదిగా చూసింది అంజమ్మ-తల పంకించింది.
    "చూడమ్మాయ్, సీతా! నువుచూడబోతే గొప్పింటి పిల్లలాగున్నావ్! చదువుకున్నావ్! అలా అన్నానని ఏమీ అనుకోకు. ఇంట్లోవాళ్ళమీద కోపమొచ్చి ఇల్లొదిలి వచ్చావనుకుంటున్నాను. ఈవూరుకూడా కాదని అనుకుంటున్నాను. ఈవూరివాళ్ళ సంగతి తెలిస్తే ఇలారావు. ఇక్కడంతా తోడేళ్ళు, పులులు అదీగాక...."
    సీతకి కోపం వచ్చింది, బిగబట్టుకుంది.
    "తోడేళ్లు, పులులు, ఈవూళ్లోనేకాదు. అన్ని వూళ్ళల్లోనూ వుంటాయి! అంతేకాదు. ఇళ్ళల్లోనే వుంటాయి. మేకని తింటుందిగాని సింహాన్ని పులి తినదుకదా?" అంది సీత.
    "ఔరా!" అని ఆశ్చర్యపోయింది అంజమ్మ. చాకుల్లాంటి, బాకుల్లాంటి పిల్లలవి చూసిందికాని, సీతలాంటి పిల్లను చూడలేదు అంజమ్మ. "ఇది పిల్లా! పిడుగా? ఉత్త తెలివితేటలుమాత్రమేనా? దొంగటక్కరా?" అనుకుంది.
    సీత, అంజమ్మ ముఖ కవళికలు గమనించింది!

 Previous Page Next Page