"మాది ఈవూరు అయినా కాకపోయినా ప్రమాదం ఏమీలేదుకదా! ఇంట్లో అలిగివచ్చానో, ఇంట్లోంచి గెంటివేయబడి వచ్చానో? అది నా స్వ విషయం! ఏం జరిగినా బాధపడేది నేను."
సీత చెపుతుంటే సీతమెడలో మంగళసూత్రంలాంటిదేమయినా వుందేమో అని అంజమ్మ సీత మెడవేపు చూచింది, సీత మెడలో సన్నని ఒంటిపేట గోలుసుంది. అది బంగారపుదో, రోల్డ్ గోల్డ్ దో, చూడగానే తెలిసేట్టు లేదు, గొలుసుకి లాకెట్ వుంది-
అంజమ్మ మాట్లాడకముందే సీత మళ్ళీ అంది-
"చదువుకున్నా, చదువుకోకపోయినా, శరీరశ్రమతోకూడిన పనులకి ఫరవాలేదు. రాళ్లు మోయటమయినా, పిండి రుబ్బటమయినా, ఏదయినా పనే, నే అడిగేది పని, చేసేపని ఏదయినా గౌరవంకలదై వుండాలి. దొంగ తనం, రంకుతనం తప్ప! ఏపనిచేసినా తప్పులేదు. ఓ ఆడపిల్ల మగాడి వద్దకెళ్ళి అని అడిగితే పని ఇచ్చే సంగతి దేముడెరుగు. పనిబడతాడు! ఎందుకంటే వాడు మగాడు కాబట్టి." ఒక్క క్షణం ఆగింది సీత.
అంజమ్మ ఒక మాటకి రెండుమాటలు మాట్లాడే అంజమ్మ మాట్లాడటం మరిచిపోయి మాటలు వింటున్నది.
"నా మాటలవల్ల మీపని పాడవుతున్నదేమో! మీకు విసుక్కూడా కలిగిస్తున్ననేమో! చివరిగా ఒక్కమాట అడుగుతున్నాను. మీ స్వవిషయం నాకు తెలియదు, ఇందాకటినుంచి చూచి గ్రహించిందేమిటంటే మీరు స్వయంగా ఈ హొటల్ నడుపుతున్నారని....చాలా బాధలు అనుభవించి వుంటారని....బాధ అనుభవించిన హృదయానికే బాధ తెలుస్తుంది. కష్టపడే వాడికే తనుచేసే పనిలో కష్టం తెలుస్తుంది. అలాగే నన్ను మీరు అర్థం చేసుకోగలిగితే, మీ హొటల్లో ఆశ్రయం ఇవ్వండి."
అంజమ్మ ఓ నిర్ణయాని కొచ్చింది.
"చదువుకున్న పిల్లవి, హొటల్లో ఏం పనులుంటాయి? పిండి రుబ్బటం, వంట చేయటంలాంటివి తప్ప...! అవేం చేయగలవు?"
"రాళ్ళుమోసేవారు డిగ్రీ సంపాదించలేరని, డిగ్రీలు సంపాదించిన వారు రాళ్లు మోయలేరని, ఎక్కడాలేదు. పని చెప్పండి. చేయగలనో లేదో రెండురోజులు చూడండి! మీరు చెప్పింది చేయగలిగితే నిలబడగలుగుతాను! లేకపోతే పోమ్మందురుగాని.... ఉండమనటం, పోమ్మనటం మీచేతిలోపని.
సీత చెప్పిందాంట్లో సబబు కనిపించింది అంజమ్మకు.
అంజమ్మది కాఫీ, టిఫెన్ హొటల్ మాత్రమేకాదు. భోజనం హొటల్ కూడాను. కూరలు తరగటం, పచ్చళ్లు రుబ్బటం, కందిగుండ విసరటం, చపాతీ వత్తటం, వీటికి సుబ్బమ్మ వుండేది. సుబ్బమ్మకి కోపం వచ్చి ఇంకో హొటల్లో డబ్బు బాగా ఇస్తారని వెళ్ళిపోయింది. సుబ్బమ్మ వెళ్ళి రెండురోజులయింది మనిషి కుదరలేదు.
అంజమ్మకి సీత నచ్చింది! కానీ సీతని చూస్తుంటే నిండా ఇరవై ఏళ్ళు వున్నాయా? అనిపించింది. చదువుకున్న గొప్పింటిపిల్లలాకూడా తోచింది. ముక్కుసూటిగా న్యాయంగా మాట్లాడే పిల్లలావున్నా, పట్టుదల, ఆవేశంకూడా ఓ పాలు ఎక్కూవే అనిపిస్తున్నాయి. ఏంచేయాలో తోచలేదు.
ఒంటరి ఆడదానిపాట్లు అన్నిరకాలుగా అంజమ్మ అనుభవించింది! అనుభవం పండి రాటుదేలింది ఈనాటికి.
"సుబ్బమ్మ చేసేపని సీత చేయగలదా? సీతని పొమ్మంటే పాపం బైటకెళ్ళి ఏం బాధలుపడుతుందో?" అంజమ్మ అయిదు నిముషాలు ఆలోచించి ఓ నిర్ణయాని కొచ్చింది.
"సరే, నిన్నుచూస్తే జాలేస్తుంది! ఎక్కడికిపోతావ్? ఇక్కడే వుందువుగాని." అంది అంజమ్మ.
"చాలా సంతోషం! నన్నర్థం చేసుకున్నారు. కానీ జాలిపడకండి! ఒకరు నన్నుచూచి జాలిపడే స్థితిలో నే లేను." అంది సీత.
"జాలిపడనులే" అంది అంజమ్మ నవ్వుతూ.
"తను చాలా కష్టపడాల్సివస్తుంది. తప్పదు ఎటువంటి కష్టమయినా పడాల్సిందే. చేతిలో అయిదు రూపాయలు, స్థానం నడిరోడ్డుమీద, తోడు తన నీడమాత్రమే! వాడెవడోగానీ డాష్ ఇచ్చి సారీ చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. వాడు డాష్ ఇవ్వబట్టే ఈ హొటల్ గురించి కోతలుకోసింది. రోజులుకాదుకదా, గంటకూడా కష్టపడకుండానే హొటల్లో చోటు సంపాదించుకుంది! ఫరవాలేదు! దురదృష్టవంతురాలీనికాదు." అనుకుంది సీత.
"సీత పేరుపెట్టుకున్నవాళ్ళు కష్టపడతారు." అంది అంజమ్మ.
"గోపాలకృష్ణుడి పేరు పెట్టుకున్నవాళ్లు చాలామందిఏకపత్నీ వ్రతులే!" తడుముకోకుండా అంది సీత!
"ఔరా!" అని ఆశ్చర్యపోయింది మరోసారి అంజమ్మ.
సీత తనలోతాను నవ్వుకుంది!
3
"సీతా!" అంజమ్మ కేకవేసింది.
అంజమ్మ పిలిచిందే తడవుగా సీత వచ్చింది.
"ఇవాళ నువ్వు బేరంచూసుకో, మళ్ళీ చలికుదుపు వచ్చింది, కాసేపు పడుకుంటాను." అంది అంజమ్మ కుర్చీలోంచిలేస్తూ.
"అలాగే." అంది సీత.
అంజమ్మ లోపలికి వెళ్ళగానే సీత, అంజమ్మ కుర్చీలో మొదటి సారిగా కూర్చుంది. కాఫి, టిఫెన్ తినివెళ్ళేవారివద్ద బిల్లుతీసుకుని బిల్లు కాగితం చెక్కముక్కకున్న మేకుకిగుచ్చి డబ్బులు తీసుకుని డస్కుకున్న అరలో పడేస్తున్నది.
అంజమ్మకి రెండురోజులబట్టి జ్వరం. ఉత్తజ్వరమయితే తను కూర్చునే కుర్చీ వదిలి లేచేదికాదు. విపరీతంగా చలి. అంతకన్నా విపరీతంగా వళ్ళు నొప్పులు. సీతమీద నమ్మకం. అందువల్లనే తన సీటు తాత్కాలికంగా సీతకప్పగించింది.
సీత విజయవాడ వచ్చింది హొటల్లో పనిచేయటానికికాదు. ముందు రక్షణ చూసుకుంటే తర్వాత సంగతి చూడొచ్చనుకుంది. ఆ రక్షణనేది ఏమంత కష్టపడకుండానే అంజమ్మ హొటల్లో లభించింది. సీత స్థానం అదికాదు, సీత ఆలోచన వేరు అయినా, సీత వుంది, అవసరం.
సీత పుట్టుపూర్వోత్తరాలు లాగాలనే అంజమ్మ మాటల్లోపెట్టి పలురకాలుగా చూచింది. సీత ఏమాత్రం సందివ్వలేదు. ఈ పిల్ల నోట్లోంచి యదార్థం లాగాలంటే ఏళ్లు పట్టేటట్లు వుంది. లాభంలేదు, సమయం రావాలి నిజం తెలియాలి." అనుకుంది. అంజమ్మే వెనక్కు తగ్గింది.
సీత హొటల్లో వుండటం నచ్చలేదు.
అంజమ్మ హొటల్లో ఆరుగురు పనివాళ్లున్నారు. కాఫీ, టిఫెన్లు సప్లయి చేయటానికి ముగ్గురు, వంటకి ఒకడు, వాడికి సాయం ఇంకొకడు, గ్లాసులు ప్లేట్లు కడగటానికి మరో కుర్రనాగన్న, ఈ ఆరుగురు మగాళ్ళతో పాటు సుబ్బమ్మ వుండేది. జీతం తక్కువని వెళ్ళిపోయింది.
ఆరుగురు మగాళ్ళల్లో సూరిబాబు ఒక్కడికే పెళ్ళాం బిడ్డలున్నారు. మిగతా అయిదుగురు, చాటుమాటు ఆడదాని వద్దకి పోయొచ్చే బ్రహ్మచారులే.
సీతమీద వాళ్ళకన్ను పడింది. చదువుకున్న గొప్పింటిపిల్లలా అనిపించి సమయం రాకపోతుందా! అన్నట్లు వెనక్కు తగ్గివున్నారు.
అయిదుగురిలో ఒకడయిన పుల్లారావు ఓ అడుగు ముందుకేశాడు. సీత వేంటనే గట్టి వార్నింగ్ ఇచ్చి పుల్లారావు ప్రవర్తన గురించి అంజమ్మతో చెప్పింది.
"మగముండాకొడుకులు- వాళ్ళబుద్దే అంత, నే కోప్పడతాలే పుల్లారావుని." అంది అంజమ్మ, ఇది మామూలు విషయమే అన్నట్లు ముఖంపెట్టి.
సృతిమించితే చూద్దాం అనుకుంది సీత.
బిల్లు, రెండురూపాయలనోటు ఇచ్చాడు ఒకతను.
డెభైఅయిదు పైసలు తీసుకుని రూపాయినోటు, పావలాబిళ్ళ ఇచ్చింది సీత. అతను కదల్లేదు.
"ఏంకావాలి?" అంది సీత.
"నీపేరేంటి?" అన్నాడు వాడు.
"రూపాయిపావలా ఇందాకతీసుకుంది అక్కడపెట్టు." అంది సీత.
"ఎందుకు?" అన్నాడు వాడు అర్థంకాక.
"నాపేరు అడిగావుగా! అందుకు కాఫీ టిఫెన్ ఖరీదు డెభైపైసలు ణా పేరు ఖరీదు రూపాయిపావలా!" అంది సీత.
"మరి నీ ఖరీదు?" అన్నాడు వాడు.
సీత ముఖం లిప్తపాటులో నల్లబడి మళ్ళీ మామూలయింది. "నా పేరుతో ఏంపని వెళ్ళు." అనాల్సింది. అనవసరంగా మాట మిగిలాను అనుకుంది. తగ్గకూడదు అనుకుని..."హొటల్ కి వచ్చింది కాఫీ, టిఫెన్ తింటానికి- తిన్నావ్, బిల్లిచ్చి, వెళ్ళిపోవాలి. అనవసరం మాటలేంటి? నా పేరుతో నీకేంపని? పేరు అడిగిందేగాక, నీ ఖరీదెంత అంటావా? ఆడపిల్లని చూస్తే హేళన! మనిషికి ఖరీదు కట్టిన నీవు మనిషివికాదు. ఇక్కడే ఓ మగాడు కూర్చొనివుంటే నీ పేరేంటి? నీయసేంటి? అడుగుతావా? అడగవు. ఊ....నీ తిండయింది వెళ్లు." వేలితో వాకిలి చూపించి నిప్పులు కక్కుతూ అందిసీత.
టిఫెన్ తింటున్నవాళ్లు తలలు పైకిలేచి సీతని చూచాయి.
"ఓయిబ్బో అరుస్తున్నావే? నేనేమన్నాను?" అన్నాడు వాడు అక్కడనుంచి కదలకుండా.
"అరవటమేం ఖర్మ అవసరమయితే కరుస్తానుకూడా! అంతదాకా రానీయకు." అని ఇడ్లీ ప్లేట్లు పట్టుకోస్తున్న పుల్లారావుని కేకేసింది. "చూడు. అర్జంటుగా ఓబయ్యను పిలువు" అంది సీత.