Read more!
Next Page 
అశోకవనంలో సీత పేజి 1

                                 


                   అశోకవనంలో సీత
                                       -కురుమద్దాలి విజయలక్ష్మి

 
    సర్కార్ ఎక్స్ ప్రెస్ వచ్చి స్టేషనులో ఆగింది.
    సీత మొదటిసారిగా విజయవాడ రైల్వేస్టేషను ప్లాజ్ ఫాం పై కాలుపెట్టింది.
    రైలు ఎక్కేవారితో, దిగేవారితో ఫ్లాట్ ఫాం కిటకిటలాడుతున్నది.
    సీత రైలు దిగొచ్చి- ప్లాట్ ఫాం చివరగా వున్న బెంచీ మీద కూర్చుంది. వెంట తెచ్చుకున్న చేతిసంచి ఒళ్ళో పెట్టుకుంది.
    కనకదుర్గమ్మ కొండపై లైట్లుదేదీప్యమానంగా వెలుగుతున్నాయి. సీత కొండమీద లైట్లవైపు  కన్నార్పకుండా చూస్తూ వుండిపోయింది. పరిసరాలు మరిచిపోయింది. మనసు ఎక్కడెక్కడో, తనువు ఇక్కడ అయి, చనరహితంగా అలా కూర్చుండిపోయింది.
    సర్కార్ ఎక్స్ ప్రెస్ వచ్చి అరగంట కావస్తున్నది. బయలుదేరటానికి సిద్దంగావుంది. రైలు ఎక్కే,  జనం, దిగే జనం యొక్క గోల సద్దు మణిగింది. పండ్లు, ఫలహారాలు, టీ, సిగరెట్టు, పాన్, బీడీ అమ్మేవారి అరుపులు, "కూలీ! కూలి!" అనే  లైసన్స్ కూలీల కేకలు - రైలువచ్చి అగినప్పటి ఉధృతం తగ్గి, క్రమేణా అవి వినీ వినపడనట్లు అయ్యాయి.
    పచ్చజెండా గాలిలో వూగింది. గార్డు గ్రీన్ లైట్ వూపాడు.
    సర్కార్ ఎక్స్ ప్రెస్ ముందు మూలిగి, చెవులు గింగిర్లెత్తేటట్లు కూతపెట్టి, ఆ తర్వాత దడదడ శబ్దంచేస్తూ ఫ్లాట్ ఫాం వదిలి, స్టేషను దాటి కనుమరుగయింది.
    సీత బండి వెళ్ళటం గమనించలేదు. అలా కళ్ళప్పగించి ఇంకా దుర్గ కొండవైపే చూస్తున్నది.
    "ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి?" సీతని ఆ ఒక్క ప్రశ్న తొలిచేస్తున్నది. ఏం చేయాలి? అని మాత్రం ఆలోచించటం లేదు. ఎక్కడి కయినా వెళ్ళిన తరువాతనే ఏం చేయాలన్నది ఆలోచించటం.. కాబట్టి ముందు ఎక్కడి కెళ్లాలన్నదే! ప్రశ్న, ఆలోచన, సమస్య.
    సీత కొన్ని అవసరాలకి రైళ్లు ఎక్కింది, ప్రయాణమ చేసింది ఊళ్లు చూసింది, కాని..... సీత సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కటం ఇదే మొదటి సారి. విజయవాడ రావటం ప్రప్రథమ పర్యాయం. ఎక్కడికి వెళ్ళాలి? అన్నది ఇప్పుడు అనుకుంటున్నమాట. ప్రస్తుతం కర్తవ్యం ఏమో?
    సీత చాలా అందంగా వుండదు, కానీ.... చాలా చాలా ఆకర్షణీయంగా వుంటుంది. సీత తెల్లని తెలుపూకాదు, నల్లని నలుపూ కాదు. రంగుగా వుంటుంది. పొడుగ్గా వుండదు, పొట్టిగా వుండదు- ఎత్తుకు తగినంతమాత్రం లావుగా వుంటుంది. నోరంతా తెరిచి నవ్వదు, పెదవులు నవ్వుతూ వుంటాయి. చూపులు చురుగ్గానూ, ముక్కు సూటిగాను వుండటం వల్ల మనిషిలో శాంతం కన్నా తీవ్రత ఎక్కువనిపిస్తుంది. ముఖమంతా కలిపిచూస్తే అమాయకత్వం వేరుగా చూస్తే వెయ్యర్థాలు. ఇదీ అని చెప్పేట్లు వుండదు.
    సీత చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నది.
    'ఇది రాత్రి. ఊరు పెద్దది, దారులు చాలావుంటాయి. ఏ దారిన బయలుదేరితే ఎటు చేరతానో! ఊళ్ళో బందుమిత్రులెవరున్నా దారి అన్వేషిస్తూ అర్థరాత్రి అయినా అవరాత్రి అయినా  వెళ్ళొచ్చు. ఇంతపెద్ద విజయవాడలో ణా అనేవారు నాకెవ్వరూ లేరే? ణా అనేవారు వుండి  నన్నాదుకున్నారు కాబట్టి "నా" గురించి దేనికి? నా గురించి ఆలోచిస్తే చాలు!
    "అమ్మా!" అన్నాడు లైసన్న్ కూలీ, అతను చాలాసేపటి నుంచి సీతని గమనించి దగ్గరకొచ్చి పిలిచాడు.
    "నన్నేనా?" అంది సీత.
    "అవునమ్మా!"
    "ఎందుకు?"
    "కూలీ వుంటే చెప్పండమ్మా! సామాను బయటచేరేస్తాను. రిక్షాకుదిర్చిపెడతను."
    సీత ఎక్కువసేపు ఆలోచించలేదు.
    "ఊఁ.... సామనుంది, బరువుకూడా ఎక్కువే. స్టేషను బయటి దాకా మోసుకురావటానికి ఎంతకూలీ అడుగుతావో, అడుగు, ఇదిగో- ఇదే నా సామాను! చూశావుగా? బరువాట్టే వుండదు."
    లైసన్స్ కూలీ తెల్లెబోయాడు.
    ఒడిలోవున్న సంచి ఎత్తి చూపించింది సీత.
    "మాట్లాడవేంటి?"
    "సామానంటే ఇదా అమ్మా?"
    "ఏం, కాదా? తట్టా, వుండాలా? సంచి సామానుకింద రాదా?"
    లైసన్స్ కూలీ నెత్తి గోక్కున్నాడు.
    "సంచులున్నా సామానుకిందే లెక్క. మరి.... ఇది చిన్న సంచి, పైగా దీంట్లో సగానికి కూడా గుడ్డలు లేవు. ఇదయితే మీరయినా తీసుకెళతారు. మేం మోసే బరువేముంది?"
    సీత తల పంకించింది, అర్థమయింది అన్నట్లు.
    "నేను రైలు దిగుతుంటే చూశావా?" నిదానంగా అడిగింది.
    "ఓ....చూశానమ్మా! సంచిపుచ్చుకు మీరుదిగారు. కూలీ అడుగు దామని మీ దగ్గరగా వచ్చి-  సామనేమీ లేకపోవటం వల్ల అడగలేదు!" మిమ్మల్ని గమనించానన్నట్లు హుషారుగా చెప్పాడు కూలీ.
    "ఊఁ....నన్ను చూశావు, నా చేతిలో ఈ చిన్నసంచీ చూశావు' నావల్ల ఉపయోగం లేదు- పెట్టె, బెడ్డింగు లేదని గ్రహించావు, అవునా? ఇప్పుడొచ్చి సామానుంటే చెప్పండి బయట చేరేస్తాను అని అడుగుతున్నావు, అవునా? లైసన్స్ కూలీ అవసరం లేదని తెలిసి, సామానులేదని తెలిసి, నా వద్ద కెందుకొచ్చావు? ఎందుకు అడుగుతున్నావు?" సీత ఒక్కో మాట నిదానంగా అన్నా మాటలో తీవ్రత వుంది.
    అన్నిటికీ తల తిప్పుతున్న లైసన్స్ కూలీ ఠక్కున తల తిప్పటం ఆపేశాడు.
    "మరి, మరి...."
    "సరి, సరి__ అర్థమయింది! ఇక నువ్వెళ్ళొచ్చు!"
    ఏం మాట్లాడాలో తెలియని కూలీ తలొంచుకుని రెండడుగులు వేశాడు. "ఇదిగో..." అన్న సీత పిలుపు విని, ఆగి- వెనక్కుతిరిగి సీతవైపు చూశాడు.
    "చూడు, నీ పేరేంటో నాకు తెలియదు! అయినా నీ పేరుతో నాకు పనిలేదు! నే చెప్పేది విని వెళ్లు! సామానున్న ప్రయాణీకులు వాళ్ళవసరానికి నిన్ను కేకేస్తారు! నీ బ్రతుకుతెరువు ఈ ఉగ్యోగం కాబట్టి సామానున్న ప్రయాణీకుడ్ని "కూలీ కావాలా?" అని అడుగు. ఆఁఅంతే! నువ్వెళ్ళొచ్చు." అని సీత ముఖం తిప్పుకుంది. ఏమీ జరగనట్లు చూపులు దుర్గమ్మకొండపైకి మరల్చింది.
    లైసన్స్ కూలీ ముందు ఖంగుతిన్నట్టయి, వెంటనే తెప్పరిల్లి గొణుగుతూ వెళ్ళిపోయాడు.
    'పాపం!' అనుకుంది సీత. వెంటనే- 'ఎందుకు పాపం?' అని మరోసారి అనుకుంది. విరగబడి నవ్వాలనుకుంది. కానీ నవ్వింది అతి నెమ్మదిగా.
    'రాత్రికి, పగలుకి బేధం ఏమిటి? తనని తానే ప్రశ్నించుకుంది.
    "చాలా బేధంవుంది! రాత్రి వేరు, పగలు వేరు! రక్షణ, విశ్రాంతి రాత్రి సమయం! కార్యానుకూలత, కర్తవ్యం పగటి సమయం!' తనకితానే జవాబు చెప్పుకుంది.
    ఒడిలోవున్న సంచి చేతిలోకి తీసుకుని బెంచి పై నుంచి లేచింది. అడుగులోఅడుగు వేస్తూ నెమ్మదిగా వెయిటింగ్ రూం చేరింది సీత.
    వెయిటింగ్ రూంలో నలుగు రాడవాళ్లున్నారు. వాళ్ళ నలుగురికి సామాను, పిల్లలూవున్నారు. నలుగురిది నాలుగు ధృవాలన్నట్లు- ముస్లిం యువతి, సింది యువతి, అరవ ఆవిడ, తెలుగు ఆడబడుచూ వున్నారు.
    నలుగురూ ఆడవాళ్ళే! భాషమార్పు, ముఖముఖాలు చూసుకుంటూ కూర్చున్నారు.
    సీత వెయిటింగ్ రూంలో కాలుపెట్టింది. భిన్న ధృవాలులా వున్న ఆ నలుగురిని చూసింది. ఖాళీగా వున్న కుర్చీచూసింది, కుర్చీ పడుకోటానికి వీలుగావుంది. 'అమ్మయ్య!' అనుకుని కుర్చీలో సంచిపెట్టి రెండుక్షణాల్లో బాత్ రూం కెళ్లొపెట్టుకుని కుర్చీలో కూర్చుంది.
    గంటనుంచి తోడులేని ఆడబడుచు సీతను పలకరిద్దామని పెదవి విప్పింది, సీత తనని గమనించకపోవటం చూసి నోరు మూసుకుంది.
    కుర్చీలో కూర్చున్న సీత వెంటనే వెనక్కి జారగిలబడి ఒడిలో సంచి తలకింద దిండులా పెట్టుకుని, ఓ చెయ్యి కళ్ళకడ్డంగా పెట్టుకుని కళ్లుమూసుకుంది.
    'ఆలోచిస్తే బుర్ర వేడెక్కుతుంది! తెల్లారుతుంది....! అప్పుడు చూసుకోవచ్చు!' అనుకుంది సీత.
    వెయిటింగ్ రూంలోవున్న నలుగురూ ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ తర్వాత సీతవైపు చూశారు.
    సీతమటుకు నిశ్చింతగా నిద్రపోతున్నది.

Next Page