"అతను చాలా స్మార్టు క్రూక్! ఆ రైలెక్కేసి పారిపోయి వుంటాడు" అన్నాడు తనమీద తనకే కలిగిన చిరాకుని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ.
* * *
తను ఎక్కింది ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంట్ అని అర్ధమయింది దినకర్ కి. ఒక సీట్లో కూర్చుని గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాడు.
అప్పుడనిపించింది అతనికి.
తనయితే తప్పించుకు వచ్చేసాడుగానీ, నిశాంత ఇంకా ఇన్ స్పెక్టర్ దగ్గరే వుండిపోయింది.
అఫ్ కోర్స్! నిశాంత ఏ నేరమూ చేయలేదు. అది తనకి తెలుసు!
కానీ తనమీది కోపాన్ని ఆమె మీదికి మళ్ళించి చెయ్యని నేరాన్ని ఏమైనా ఆమె మీద రుద్ది, వేధిస్తాడా ఇన్ స్పెక్టర్?
ఆందోళనతో నిండిపోయింది దినకర్ మనసు.
డాక్టర్ నిశాంత అంటే భూమిమీద నడిచే దేవతలాంటిది. ఆమెకి ఎలాంటి కష్టం వచ్చినా తను భరించలేడు.
అంపశయ్యమీద భీష్ముడిలా వళ్ళంతా గాయాలతో తను ఆ ముళ్ళపొదలమీద పడి ఉంటే, చూసి తన నర్సింగ్ హోమ్ లో చేర్చింది నిశాంత. మందులకంటే ఎక్కువగా ఆమె చేతి స్పర్శే తనకు బాధా నివారిణిగా, ఆమె పలుకులే అమృత గుళికలుగా పని చేశాయని నమ్ముతాడు తను.
తనే కాదు.
ఆమె దగ్గర ట్రీట్ మెంట్ తీసుకున్న ప్రతి పేషంటూ అలాగే అనుకుంటాడని కూడా తన నమ్మకం!
అలాంటి నిశాంతని ఇన్ స్పెక్టర్ దగ్గర వదిలేసి వచ్చాడు తను. వదిలేసి వచ్చి తప్పుచేశాడా?
తను పోలీసులబారినుంచి తప్పించుకు పోయినందుకు నిశాంత సంతోషిస్తుందా?
లేకపోతే తనని ఒక పిరికిపందగా జమకట్టి అసహ్యించుకుంటుందా? జరగబోయేదానికి భయపడకుండా అలారం చెయిన్ లాగి, రైలుని ఆపి కిందకు దూకేసి మళ్ళీ నిశాంత దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోవాలని తీవ్రంగా అనిపించింది అతనికి. అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసి, గొలుసు లాగడానికి లేవబోయాడు కూడా.
అప్పుడు గమనానికొచ్చింది అతనికి.
గొలుసు లాగడానికి వీల్లేకుండా తనకి ఎదురుగా కిటికీ దగ్గర నిలబడి వుంది ఒక అమ్మాయి. బాగా పొడుగ్గా వుంది. అద్భుతమయిన శిల్పం లాంటి వంపులు వెనకనుంచి కూడా తెలిసిపోతూనే వున్నాయి. కొత్త కరెన్సీ నోటులా క్రిస్ప్ గా వున్న ఆర్గండీ జరీచీరె కట్టుకుని వుంది. లావుగా నడుం కిందిదాకా వేళ్ళాడుతున్న జడ. ఏదో దివ్యలోకాలని గుర్తుకు తెచ్చే పరిమళం అలుముకుని వుంది ఆమె చుట్టూ.
అప్పర్ బెర్తుమీద సూట్ కేసుని ఒక మూలగా పెట్టి అతనివైపు తిరిగింది ఆ అమ్మాయి. అప్పుడు చూశాడు ఆ అమ్మాయి కళ్ళని.
కళ్ళా అవి? కావు.
ఈ ప్రపంచం అంటే తనకి ఎంత తిరస్కారం, నిర్లక్ష్యం వుందో చాటి చెప్పే చూపులకి సాధనాలుగా మాత్రమే వున్నాయి ఆమె కళ్ళు.
అలాంటి చూపు ఒకటి దినకర్ వైపు సారించి తర్వాత కిటికీ పక్కన కూర్చుని, కాసేపు బయటికి చూసి తర్వాత తన దృష్టిని పైన వున్న సూట్ కేసు దిశలోకి పోనిచ్చింది.
విమానం టికెట్టు దొరక్కపోతేనో, లేకపోతే విమానాలు వెళ్ళని చోటుకి వెళ్ళవలసి వస్తేనో తప్ప రైలు ఎక్కరు కొంతమంది.
ఆ తరహాకు చెందిన మనిషిలా వుంది ఆ అమ్మాయి. మానవమాత్రుడొకడు తనకి ఎదురుగా కూర్చోవడంవల్ల అక్కడ వాతావరణం అంతా కలుషితం అయిపోయినట్లు ఫీలవుతోందేమో అనిపిస్తోంది ఆమె మొహంలో కనబడుతున్న ఎక్స్ ప్రెషన్ ని చూస్తుంటే.
"ఈ రైల్లోనుంచి కిందకి దూకేసి ఈ ప్రపంచాన్ని నీ నిష్క్రమణతో వుద్దరించరాదూ?" అన్నట్లు ఓసారి దినకర్ వైపు చిరాగ్గా చూసి తర్వాత తన వజ్రపు టుంగరంవైపు చూసుకుని, ఆ తర్వాత ఏ ఫైవ్ స్టార్ హోటల్ తఃలూకు బ్యూటీ సెలూన్ లోనో మానిక్యూర్ చేసినట్లు కనపడుతున్న తన గోళ్ళవైపు పరీక్షగా చూసుకోవడం మొదలెట్టింది.
ఇబ్బందిగా సీట్లో కొద్దిగా కదిలి, కర్చీఫ్ తో మొహం తుడుచుకున్నాడు దినకర్.
అప్రసన్నంగా వున్న ఆ వాతావరణంలోనే పావుగంట గడిచిపోయింది.
మళ్ళీ ఆలోచనలో పడ్డాడు దినకర్.
ఒక విధంగా చూస్తే తను తప్పించుకు పారిపోయి రావడమే సరైన పనేమో! ఒకవైపు తనమీద ఎందుకో ఎవరోగానీ కచ్చ పెట్టుకున్నట్లు దాడులు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో, అసలు తనెవరో కూడా తనకు తెలియదు. తెలుసుకోవాలి తను! తక్షణం! ఇలాంటి పరిస్థితుల్లో తను హత్యానేరంలో కూడా ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తే చిక్కుముడులన్నీ విప్పలేడు. పైగా తనే హంతకుడినని ఈ ఇన్ స్పెక్టర్ గనక రుజువు చేయగలిగితే, తనకి ఉరిశిక్ష ఖాయం!
అందుకని -
తనెవరో తను తెలుసుకునేదాకా, తన మీద పగబట్టిన వాళ్ళెవరో తెలుసుకునే దాకా, అసలు జరుగుతున్నదేమిటో పూర్తిగా ఆకళింపు అయ్యేదాకా తను పోలీసులకి దొరకకూడదు. నిశాంతతో కలిసి తను పంచుకోవాల్సిన జీవితం ముందు ఎంతో వుంది. దాన్ని చూస్తూ చూస్తూ పాడుచేసుకోలేడు తను. ష్యూర్!
అతను అలా అనుకొనీ అనుకోకముందే -
హఠాత్తుగా పక్క కంపార్టుమెంటులో నుంచి నలుగురు పోలీసులు ఆ కంపార్టుమెంట్ లోకి ప్రవేశించారు.
గుండె ఆగిపోయినట్లయింది దినకర్ కి.
ఈ ఇన్ స్పెక్టర్ జలీల్ అసాధ్యుడు! అప్పుడే తనను వెంటాడుతూ వచ్చెయ్యగలిగాడా?
దినకర్ ని సమీపించారు పోలీసులు.
నిశ్చలంగా కూర్చుని నిర్నిమేషంగా చూస్తున్నాడు అతను కానీ పోలీసులు అతన్ని పట్టించుకోలేదు. ముందుకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి దగ్గర ఆగారు వాళ్ళు. పోలీసులని చూడగానే ఆ అమ్మాయి మొహం పాలిపోయింది.
"ఏదీ ఆ వజ్రాల హారం?" అన్నాడు పోలీస్ ఇన్ స్పెక్టర్, ఆ అమ్మాయితో వుపోద్ఘాతమేమీ లేకుండా.
అప్పుడు గమనించాడు దినకర్, అతను జలీల్ కాదనీ, వేరే ఇన్ స్పెక్టరనీ.
"వజ్రాల హారమా? ఏ వజ్రాల హారం?" అంది ఆ అమ్మాయి తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో.
కానీ అప్పటికే ఆ అమ్మాయి ధైర్యం దిగజారినట్లనిపించింది చూస్తున్న దినకర్ కి.
"షటప్! దొంగవేషాలు వెయ్యడం మానేసి దొంగ సొత్తు బయటకి తియ్!" అన్నాడు ఇన్స్ పెక్టర్ పరుషంగా.
ఒక్కసారిగా వంట్లో వున్న శక్తి అంతా ఉడిగిపోయినట్లు ఫీలవుతూ, నిస్సత్తువగా లేచి సూట్ కేసు తెరిచింది ఆ అమ్మాయి.
సూట్ కేస్ లో చిన్న జువెల్ బాక్సు వుంది. అది ఇన్ స్పెక్టర్ కి అందించింది ఆ అమ్మాయి. తెరిచి చూసాడు ఇన్ స్పెక్టర్,
ఎండ పొడ పడి జిగేల్మని మెరిసింది అందులో వున్న వజ్రాల నెక్ లెస్.
దానివైపు చూసి తలపంకించి పెట్టె మూసేసాడు ఇన్ స్పెక్టర్ "ఎక్కువ వేదించకుండా వజ్రాల హారం అప్పగించేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను వైశాలీ!" అన్నాడు.
నిస్పృహా, ఉక్రోషం కలిసిన చూపు చూసింది వైశాలి.
ఆ చూపుకి ఇన్ స్పెక్టర్ కే జాలి కలిగినట్లుంది.
"హారాన్ని తేలిగ్గా అప్పగించేసావు గనక నీకు సాధ్యమైనంత తక్కువ శిక్షపడేటట్లు చూడడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వచ్చే స్టేషన్ లో దిగి పోతున్నాం మనం. వెర్రి వేషాలు వెయ్యకుండా మా వెంట రావాలి! జాగ్రత్త!" అని చెప్పి దినకర్ వైపు ఒకసారి యథాలాపంగా చూసాడు ఇన్ స్పెక్టర్.
తర్వాత కానిస్టేబుల్స్ ని తనతో రమ్మని సైగచేసి ముందుకు నడిచాడు. వాళ్ళు కంపార్టుమెంట్ తాలూకు ద్వారాలన్నిటి దగ్గరా, ముందు జాగ్రత్తగా కాపలా వుంటారని ఊహించాడు దినకర్.
పోలీస్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్స్ అక్కడనుంచి వెళ్ళిపోయాక ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వుబికాయి వైశాలికి. అవి ఎదుటి వాళ్ళకి కనబడడం ఇష్టం లేనట్లు తల దించేసుకుంది. ఇందాకటి దర్పం తాలూకు ఛాయలు ఆమెలో ఇప్పుడు ఏ మాత్రం కనబడటం లేదు.
ఆ అమ్మాయిని చూస్తుంటే దినకర్ కి ఎంత సానుభూతి కలిగిందంటే, తను ఆ అమ్మాయి కంటే కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నానని మర్చిపోయాడు తాత్కాలికంగా.
"మిస్! ఏమయింది? నేను తెలుసుకోవచ్చా?" అన్నాడు ఆదరంగా.
మాట్లాడకుండా మొహం తిప్పుకుంది ఆమె.