Previous Page Next Page 
యమదూత పేజి 8

 

    ఆమెని రెచ్చగొట్టడానికన్నట్లు అన్నాడు దినకర్. "అయితే పోలీస్ ఇన్ స్పెక్టర్ చెప్పినట్లు మీరు నిజంగా దొంగేనన్నమాట!"
    
    చివుక్కున తల ఎత్తి చూసింది ఆ అమ్మాయి.
    
    "నిజం నిర్మొహమాటంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో దొంగలు కానిదెవ్వరు? దొరికిపోనంత కాలం అందరూ దొరలే! దొరికితేనే దొంగలు!" అంది అక్కసుగా.
    
    నవ్వి అన్నాడు దినకర్.
    
    "మీరు కేవలం దొంగే కావచ్చు. కానీ నేనెవరో తెలుసా?"
    
    ప్రశ్నార్ధకంగా చూసింది ఆమె.
    
    "నేనొక భయంకరమైన హంతకుడిని"
    
    సరిగ్గా తన నెత్తిమీదే పిడుగుపడినట్లు అదిరిపడింది ఆ అమ్మాయి.
    
    "వాట్?"
    
    "అవును నేనొక హంతకుడిని - అనుకుని పోలీసులు నన్ను తరుముతున్నారు."    

    "అంటే మీరు నిజంగా హంతకులుకారా?"
    
    "కాదు ముమ్మాటికి కాదు."
    
    అతన్ని అంచనా వేస్తున్నట్లు మౌనంగా చూస్తూ వుండిపోయింది ఆమె.
    
    మళ్ళీ అన్నాడు దినకర్. "మన యిద్దరం దాదాపు ఒకేరకమైన పరిస్థితులలో వున్నాం కాబట్టి, ఒకళ్ళకొకళ్ళం సాయం చేసుకోవచ్చేమో. యూ హెల్ప్ మీ! అండ్ ఐవిల్ హెల్ప్ యూ! నౌ టెల్ మీ! వాటీజ్ యువర్ ప్రాబ్లెం?"
    
    తటపటాయిస్తూ మౌనంగా వుండిపోయింది ఆమె.
    
    జేబులోనుంచి సిగరెట్ తీసి అంటించి ఆమె చెప్పబోయేది వినడం కోసం రెడీగా కూర్చున్నాడు దినకర్.
    
    ఉన్నట్లుండి అంది ఆమె.
    
    "మీకు ప్రేమాకపూర్ తెలుసా?"
    
    "నేనెవరో కూడా నాకు తెలియదు. ఇంక ప్రేమాకపూర్ ఏం తెలుస్తుంది?" అన్నాడు దినకర్ స్వగతంలాగా.
    
    అతని మొహంలో మెదులుతున్న భావాలని జాగ్రత్తగా గమనిస్తూ అంది వైశాలి, "ప్రేమాకపూర్ అంటే ఇండస్ట్రియలిస్టు విష్ణుకపూర్ భార్య. పెద్ద సోషలైట్. బాంబేలో ఆమె లేకుండా ఏ పెద్ద పార్టీకూడా జరగదు. ఫిల్తీ రిచ్! ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు ఉంది వాళ్ళకి. ఆ భారాన్ని నేను కొంత తగ్గించాలనుకుంటున్నాను.
    
    శ్రద్దగా వింటున్నాడు దినకర్!
    
    "మీకు ప్రెషస్ స్టోన్స్ మీద ఇంటరెస్ట్ ఉందా? డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్, లాపిస్ లాజులీ, జేడ్....?"
    
    "ఎందుకు?"
    
    "వీటిమీద ఇంట్రెస్టు ఉన్నవాళ్ళకి కుతూహలం కలిగించే వార్తలు రెండు ఈ మధ్య పేపరులో వచ్చాయి. అందులో ఒక వార్త హైదరాబాద్ స్టేట్ ని ఏలిన ఏడవ నైజామ్, హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాలూకు కొన్ని నగల వేలం గురించి. మూడు దశాభ్దాలనుంచి ఒక ఇంటర్నేషనల్ బ్యాంకు తాలూకు నేల మాళిగలలో భద్రపరచబడిన ఈ నగలని ఇప్పుడు వేలం వేయబోతున్నారు. హీనపక్షం మూడువందల కోట్ల రూపాయల విలువచేసే ఈ నగలలో 414.25 కేరట్ల బరువు ఉన్న ఇరవైరెండు ఎమెరాల్డ్సు, నూట యాభై పెద్ద ముత్యాలతో చేసిన ఏడువరసల నెక్ లెస్, నలభయి నాలుగు వజ్రాలు, రెండొందల డెబ్బయి విల్లాండీ వజ్రాలు తాపడం చేసిన బంగారు కంకణాల జత ఒకటి, రాజు ధరించే పటకా, ఇవన్నీ కాక, 184.75 కేరట్ ల బరువు వుండే జాకబ్ వజ్రం. ఇది ప్రపంచంలో అతి పెద్ద వజ్రాల్లో మూడోదని ప్రతీతి."
    
    ఆ నగలని గురించి మాట్లాడుతూ వుంటే వైశాలి తన భయాలని మరచిపోయి పరవశమైపోతోందని గ్రహించాడు దినకర్.
    
    ఆమె చెబుతూనే వుంది.
    
    "కనీసం ఇరవై మిలియన్ ల డాలర్ లకి బ్యాంకు గ్యారంటీ చూపించగలిగిన వాళ్లకి మాత్రమే ఈ వేలంలో పాల్గొనే అర్హత ఉంటుంది. ఈ నగలు కొనడానికి ప్రపంచంలో అత్యంత ధనికుడిగా చెప్పబడుతున్న సుల్తాన్ ఆఫ్ బ్రూనే, ఆయుధాల వ్యాపారంలో అగ్రగణ్యుడు అద్ నాన్ ఖగోషి లాంటి అతిరథ మహారధులందరూ ఇంట్రెస్టు చూపిస్తున్నారు.
    
    1970లో రాజభరణాలు రద్దుచేసిన తర్వాత తన ఆసఫ్ జాహీ వంశస్తుల ఆర్ధిక భద్రత కోసం చివరి నైజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మూడు ట్రస్టులని ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్టు రూల్సు ప్రకారం, నైజాం పెద్ద కొడుకు అజంజా బహుదూర్ మరణం తర్వాత, ఆ వంశస్థులు ట్రస్టులో ఉంచబడిన నగలని అమ్ముకోవచ్చు. అజంతా మరణం తర్వాత ఆసఫ్ జాహీ వంశస్థులు ఆర్ధికపరమయిన చిక్కులవల్ల ఆ నగలని అమ్మడానికి పర్మిషన్ అడిగారు.
    
    1978లో ఇండియా గవర్నమెంటు ఈ ఎనభయి తొమ్మిది నగలలో ఇరవైమూడు నగలని అతి పురాతనమయిన జాతీయ సంపదగా గుర్తించి, అవి దేశం బయటికి పోకూడదని ఆంక్ష పెట్టింది. మిగతా వాటిని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
    
    ఇప్పుడా మిగిలిన నగలు అమ్మితే వచ్చే ధనాన్ని పంచుకునే వాళ్ళలో చివరి నైజాముగారి మనవరాలు ప్రిన్సెస్ ఫాతిమాఫౌజియా, ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయిన ఎనిమిదో నైజాము మీర్ బర్కత్ ఆలీఖాన్, ముఫక్కంజా బహదూర్, హాషిమ్ జా మొదలయినవారున్నారు."
    
    ఆ నగలలోదేనా ఈ వజ్రాలహారం?" అన్నాడు దినకర్ కుతూహలంగా.
    
    "కాదు అదే చెప్పబోతున్నాను. నైజాం నగల అమ్మకాన్ని గురించి ఎన్నో కోర్టు కేసులు నడిచాయి. ఈ విశేషాలన్నీ ప్రపంచంలోని పత్రికలలో సెన్సేషనల్ గా చోటు చేసుకున్నాయి. ఎంతోమంది దృష్టి ఈ నగలమీద వుంది. వాటికి ఇంతకుముంది కనీవినీ ఎరుగనంత భద్రతా ఏర్పాటు చేసారు.
    
    వీటి విషయంలో ఇంత హంగామా జరుగుతూనేవుంటే మరోవైపు మధ్యప్రదేశ్ లో ఉన్న ఒక సంస్థానం, రత్నగిరి తాలూకు మహారాజాకి చెందిన కొన్ని అపురూపమయిన నగలు కూడా వేలం వేయబడ్డాయి. చాలా కూల్ గా ఎక్కువ పబ్లిసిటీ లేకుండా జరిగిపోయింది ఈ వ్యవహారం. అందులో ఈ వజ్రాలహారాన్ని మిసెస్ ప్రేమాకపూర్ తన బ్లాక్ మనీతో కొనేసింది."
    
    "ఎంతకు?"
    
    "ఇరవై కోట్ల రూపాయలకి."
    
    ఒక్కసారిగా శ్వాస లోపలికి తీసుకున్నాడు దినకర్.
    
    "మై గుడ్ నెస్ గ్రేషియస్!"
    
    "ప్రేమాకపూర్ ఇల్లే కోటలాగా వుంటుంది. ఈ హారం కొన్న తర్వాత దానికి సెక్యూరిటీ ఎక్కువ చేసింది ప్రేమాకపూర్. ఈ హారమే కాక ఆమె దగ్గర అనేకమయిన ఆభరణాలున్నాయ్! వాటన్నిటినీ ఒక స్ట్రాంగురూములో ఉంచింది. దానికి బర్ గ్లర్ అలారం పెట్టించింది. కొత్తవాళ్ళెవరయినా ఆ గదిలో అడుగుపెడితే, తక్షణం సెక్యూరిటీ రూమ్ లో అలారం మోగుతుందన్నమాట" ఆసక్తిగా వింటున్నాడు దినకర్.
    
    "ఆ కోటలో పాగా వేసాను నేను."
    
    "ఎలా?"
    
    "అంతకుముందు కొన్నాళ్ళపాటు నేను ఒక బ్యూటీ క్లినిక్ నడిపాను. అప్పట్లో ప్రేమాకపూర్ నా కస్టమర్. ఆ పరిచయంతో నన్ను తన పర్సనల్ బ్యూటీషియన్ గా పెట్టుకుంది ప్రేమా. బ్యూటీ సెలూన్ లో ఉండాల్సినవన్నీ తనే స్వయంగా కొని ఇంట్లో పెట్టుకుంది. మూడు రోజులకోసారి నేను వెళ్ళి తనకి బ్యూటీ ట్రీట్ మెంట్ ఇచ్చేదాన్ని.....మసాజ్, మడ్ పాక్, ఫేసియల్, ఆయిల్ బాత్.... ది వర్క్స్!"
    
    "ఓహ్ ఐసీ!"
    
    "మసాజ్ చెయ్యడంలో కొన్ని మెళకువలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కరకం ప్రెజర్ ఉపయోగించి కండరాలని సేదదీర్చవచ్చు. ఒక్కోచోట నొక్కి మనిషికి స్పృహ తప్పేటట్లు కూడా చేయవచ్చు."
    
    ఛక్ మని మెరిసినట్లు స్ఫురించింది దినకర్ కి. కొరియన్ విద్యలలో ఇలాంటివి కూడా ఒక భాగం.
    
    "దాని ప్రకారం స్త్రీని రతి పారవశ్యపు అంచులకి తీసుకెళ్ళడానికి ముఫ్ఫయ్ స్టెప్స్ ఉన్నాయి.
    
    అందులో ఒకటి!
    
    స్త్రీ కుడిచేతిని పట్టుకుని, నాడిని స్పృశిస్తూ, నాడి కొట్టుకోవడంతో లయ, కలిపి, చూపుడు వేలుతో మెల్లిగా మణికట్టుమీద కొడుతూ...
    
    ఆ తర్వాత?
    
    ఆ తర్వాత హఠాత్తుగా అంతా బ్లాంక్! చీకటి! శూన్యం!
    
    నిస్సహాయత ఆవరించింది అతడిని.
    
    తనతో దోబూచులాడే ఈ జ్ఞాపకాలు ఎప్పటివి? ఎక్కడివి?
    
    ఎవరు తను?
    
    ఆలోచనల తీవ్రతకి అతని మెదడు ప్రషర్ కుక్కర్ లోని కాలీఫ్లవర్ లా వుడికిపోతున్నట్లు అనిపించింది.
    
    మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది వైశాలి.

 Previous Page Next Page