Previous Page Next Page 
యమదూత పేజి 6

 

    "దింపి వచ్చాక చెప్పు" అన్నాడు జలీల్ గట్టిగా.
    
    "ఆ తర్వాత దొరసానిగారు సిన్మాకెళతారంట సార్!"
    
    "నాకు అర్జెంటుగా జీపు కావాలని చెప్పు!" అన్నాడు జలీల్ గట్టిగా.
    
    "ఎక్కడి కెళ్ళాలి సార్?"
    
    చెప్పాడు జలీల్.
    
    "మీరు అక్కడికెళ్ళలేరు సార్!" అన్నాడు కానిస్టేబుల్ తేలిగ్గా.
    
    "ఏం ఎందుకని?"
    
    "మొన్న వర్షం పడింది కద్సార్! మట్టిరోడ్డు కొట్టుకుపోయింది. జీపు వెళ్ళదు."
    
    అతను చెబుతుంది నిజమో కాదో అర్ధంకాలేదుగానీ ఒక విషయం మాత్రం అర్ధమైంది జలీల్ కి.
    
    తన డిపార్టుమెంట్ లోనే తనపట్ల సహాయ నిరాకరణ లాంటిది మొదలయింది. తను లంచగొండి కాకపోవడమే తను చేసిన మహాపరాధం!
    
    తలపంకించి నువ్వెళ్ళు అని కానిస్టేబుల్ ని పంపేశాడు జలీల్. తర్వాత వాచ్ చూసుకుని డాక్టర్ నిశాంతతో అన్నాడు.
    
    "ఇంకో ఇరవై నిమిషాల్లో ఆ లైన్ లో వెళ్ళే ట్రైన్ ఒకటి ఉంది. వెళ్లి మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చేయ్యొచ్చు మనం."
    
    "ఏం చేద్దాం?" అన్నట్లు దినకర్ వైపు చూసింది నిశాంత.
    
    అతను నిర్లిప్తంగా తల పంకించాడు.
    
    బయటకి వచ్చారు ముగ్గురూ. ఒక చేత్తో గన్ పట్టుకుని నిలబడి ఉన్న కానిస్టేబుల్ ఒకడు అయిష్టంగా సెల్యూట్ చేశాడు జలీల్ కి.
    
    ఆటో పిలిచాడు జలీల్. పావుగంటలో స్టేషన్ చేరుకున్నారు. టికెట్లు కొని, ఫ్లాట్ ఫారం మీదికి వెళ్ళేసరికి అప్పటికే ఫ్లాట్ ఫారం మీదికి వచ్చేస్తోంది రైలు.
    
    రైలు ఆగగానే ఎక్కెయ్యడానికి వీలుగా వాళ్ళు దాదాపు ఫ్లాట్ ఫారం అంచున నిలబడ్డారు. సెకండ్లలో వాళ్ళువున్న స్పాట్ ని సమీపించింది ట్రైన్. ఇంకా దాని వేగం పూర్తిగా తగ్గనేలేదు.
    
    అప్పుడు జరిగిందది!
    
    దినకర్ ని హఠాత్తుగా వెనకనుంచి ఎవరో తోసినట్లయింది. బాలెన్స్ తప్పి ముందుకు ఒరిగాడు అతను. మరుక్షణంలో రైలుకింద పడ్డాడు.
    
    దినకర్ రైలుకింద పడిపోయినా, రైలుమాత్రం ముందుకు పోతూనే వుంది. ఫ్లాట్ ఫారం మీద ఉన్న జనం అలజడిగా ఒకళ్ళని ఒకళ్ళు నెట్టుకుంటూ, ముందుకి ఒంగి తొంగిచూడాలని ప్రయత్నిస్తున్నారు. అంతేతప్ప ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచడంలేదు.
    
    అందరిలోకీ ముందు తేరుకున్నది జలీలే. వేగం తగ్గుతున్న రైలు తాలూకు ఇంజన్ వైపు ఉరికి, లోపలికి లంఘించాడు అతను. జరిగింది అంతా రెండు ముక్కల్లో డ్రైవరుకి చెప్పాడు. తక్షణం సడెన్ బ్రేకు అప్లయి చేశాడు డ్రైవర్. చక్రాలు దొర్లడం ఆగినా రైలు కదలిక ఆగలేదు. కీచుమంటూ శబ్దంతో కొన్ని అడుగులు జారి, తర్వాత ఆగింది రైలు.
    
    అప్పటికే స్టేషను అల్లకల్లోలంగా మారిపోయింది. రైల్వేఉద్యోగులు కొంతమంది ఫ్లాట్ ఫారం దిగి రైలు కిందికి వెళ్ళి పరీక్ష చేస్తున్నారు. వాళ్లతోబాటు తనుకూడా కిందికి దిగాడు ఇన్ స్పెక్టర్ జలీల్.
    
    ఇదంతా నిశ్చేష్టురాలైపోయి చూస్తోంది నిశాంత, ఏమయింది అసలు? ఏమయిపోయి ఉంటాడు దినకర్? చనిపోయి వుంటాడా?
    
    కొన్ని యుగాలు గడిచినట్లనిపించాక నిదానంగా పైకి వచ్చాడు ఇన్ స్పెక్టర్ జలీల్. అతని మొహంలో చెప్పలేనంత ఆశ్చర్యం కనబడుతోంది.
    
    "ఏమయింది?" అంది నిశాంత వణికిపోతున్న గొంతుని అదుపులోకి తెచ్చుకోవడానికి వృధాప్రయత్నం చేస్తూ.
    
    "అతను రైలుకింద పడలేదు" అన్నాడతను క్లుప్తంగా -
    
    "మరి?"
    
    "హాయ్ ఈజ్ నాట్ టూ బీ సీన్ ఎనీవేర్! ఎక్కడా కనబడటంలేదు దినకర్!" ఆ మాటలు చెవిన బడగానే, సంతోషం, సంభ్రమం ఒక్కసరిగా కనబడ్డాయి డాక్టర్ నిశాంత విశాల నయనాలలో.
    
    "మరి ఏమయి వుంటాడు అతను?" అంది.
    
    భుజాలు ఎగరేసి సాలోచనగా రైలు ట్రాక్ వైపు చూస్తూ వుండిపోయాడు జలీల్.
    
                                                                  * * *
    
    తనని వెనక నుంచి ఎవరో బలంగా తోయగానే ముందుకు విరుచుకుపడిపోయాడు దినకర్.
    
    నేలని తాకేలోగా, ఆ క్షణంలో సగం వ్యవధిలోనే, అతనికి రెండు ప్రశ్నలు తట్టాయి.
    
    ఒకటి.
    
    ఎవరు తనని తోశారు? ఎందుకు?
    
    రెండు
    
    ఇప్పుడు తాను చావబోతున్నాడా?
    
    ఆ క్షణం తాలూకు రెండో సగంలోనే అతని రెండో ప్రశ్నకి జవాబు దొరికింది. తను చావబోవడంలేదు. చావడు తను. తనని తాను రక్షించుకోబోతున్నాడు. తప్పదు.
    
    మెరుపు వేగంతో మెదడులో మేల్కొన్న రిఫ్లెక్సెస్ కండరాలకి ఆదేశాలు ఇవ్వగా, శరీరం మొత్తం అత్యద్భుతమైన కో ఆర్డినేషన్ తో గురిపెట్టబడిన బుల్లెట్ లా మారి తన దిశని నిర్ణయించుకుని, రైలు పట్టాలకీ, ఫ్లాట్ ఫారంకీ మధ్య వున్న ఖాళీలో పడింది. మరుక్షణంలో చక్రాల మధ్య వున్న ఖాళీలోనుంచి పట్టాల మధ్యకు దొర్లాడు దినకర్.
    
    అతను ప్రయత్నపూర్వకంగా, అంగుళాల దూరం తేడాతో మాత్రమే అంతిమయాత్రని తప్పించుకున్నాడని చెప్పినా కూడా నమ్మడం కష్టం - అలాంటిది సాధ్యమేనని తెలిసిన వాళ్ళకి తప్ప!
    
    రైలు కాలసర్పంలా తనమీద నుంచి వెళ్ళిపోతుంటే దినకర్ కే అనిపించింది.
    
    ఇలాంటి మెరుపులాంటి రిఫ్లెక్సెన్ తన మెదడుకి స్వతహాగానే వున్నాయా?
    
    లేకపోతే, అంకుఠితమయిన దీక్షతో, కఠోరమయిన తపస్సులాగా ఏ కొరియన్ మార్షల్ ఆర్ట్సో నేర్చుకుంటేనో అలవడిన రిఫ్లెక్సెసా ఇవి? ఎక్కడో, ఏదో సందర్భంలో విన్నాడతను. శత్రువు నీ మీద తుపాకి గురిపెట్టి కాలిస్తే ఆ తుపాకీ పేలకముందే శత్రువు వేళ్ళ తాలూకు ఎముకలు కదిలిన శబ్దం విని, బుల్లెట్ ఎప్పుడు ఏ దిశలో రాబోతుందో అరక్షణం ముందే గ్రహించి, పక్కకి తప్పుకుని, ప్రాణాపాయం తప్పించుకోవడం కొరియన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారికి సాధ్యమేనని! అంత అలర్ట్ గా తయారవుతుంది బ్రెయిన్, ఆ విద్యలు నేర్చుకుంటే! ఆ విద్యలు తను నేర్చుకున్నాడా?
    
    ఎప్పుడు?
    
    ఎందుకు?
    
    ఇంతకీ తనెవరు?
    
    "ఏం చేసేవాడు తను?
    
    ఎందుకు తనమీద ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి?
    
    దేవుడా!
    
    చెప్పు! చెప్పు!! చెప్పు!!!
    
    కొద్దిక్షణాల తర్వాత రైలు ఆగింది.
    
    రైలు ఆగీ ఆగగానే, చక్రాల సందులోనుంచి రైలు ట్రాక్ అవతలి వైపుకి దొర్లాడు దినకర్. స్ప్రింగులాగా నిలబడ్డాడు.
    
    ఆ ప్రక్కనే మరో రైలు ట్రాక్ వుంది.
    
    కదలడానికి సిద్దంగా వున్న రైలు ఒకటి ఆ ట్రాక్ మీద నిలబడి వుంది.
    
    చటుక్కున దాన్లోకి ఎక్కేసాడు.
    
    మరుక్షణంలో ఆ రైలు కదిలింది. వేగం అందుకుంది.
    
    ఒక మనిషి రైలు క్రింద పడిపోయాడన్న హడావుడిలో వున్న జనం, ప్రక్క ట్రాక్ మీద మరో రైలు కదిలి వెళ్ళిపోవడం గమనించలేదు.
    
    అంత గందరగోళంలోనూ ఆ విషయాన్ని గమనించింది ఇన్ స్పెక్టర్ జలీల్ ఒక్కడే.
    
    "దినకర్ ఏమయిపోయి వుంటాడు?" అంది డాక్టర్ నిశాంత స్వగతంలా అప్పటికి పదోసారి.
    
    హఠాత్తుగా ఏదో స్ఫురించినట్లు అప్పటికే కనుమరుగైపోతున్న రెండో ట్రాక్ మీద రైలువైపు చూపించాడు  ఇన్ స్పెక్టర్ జలీల్.

 Previous Page Next Page