సత్యతోపాటే ఎసెస్సీ చదివిన శ్రీ చందన బి.ఏ. పూర్తిజేసింది.
స్నేహితురాళ్ళమధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతూనే ఉన్నాయి. శ్రీ చందన నాన్న డాక్టరు. ఆయన బదిలీలపై తిరిగి ఆ ఊరు దగ్గరే వున్న టౌన్ కి వచ్చేడు.
ఆ ఊరికి టౌన్ గట్టిగా అయిదు మైళ్ళు ఉంటుంది.
స్నేహితురాల్ని చూట్టానికి వచ్చి నాలుగురోజులుండి వెళుతూ సత్యనూ ఓ పూటరమ్మని ఆహ్వానించి వెళ్ళింది శ్రీ చందన.
"అమ్మమ్మోయ్! నువ్వు ఆలోచనల్లో పడిపోయావు. అయినా వెన్న తీస్తూనే ఉన్నావు. నాకటు తెల్లవారిపోతుంది. పుల్లమ్మా, లక్ష్మమ్మా, బాలమ్మా వెళ్ళిపోతారు. నాగమ్మ కేకేసి వెళ్ళింది."
అమ్మమ్మని హెచ్చరించింది సత్య.
"సరే వెళ్ళిరా తల్లీ! చెపితే వినే మనుషులా మీరు. ఈ కాలం పిల్లల పట్టుదలే పట్టుదల! మాట వచ్చింది
మొదలుకుని తమ పంతాలే నెగ్గించుకుంటారు? పోనీలే ఈ వేడివేడి తాజా వెన్నా ఆవకాయా వేసుకుని చద్దన్నం తినిపో" అంది.
"ఊఁవూఁ ఆలీసమౌతుంది. కలుపుకోవటం.... తినటం."
"భడవా! నాకు తెలుసులే నీ ఎత్తు. క్షణమాగు కలిపి ముద్దలు పెడతా?"
సత్య కళలు తెలిసిన అమ్మమ్మ క్షణాలమీద ఆవకాయ కలిపి వెన్న ముద్ద తీసుకుని ముద్దముద్దకు కొద్దికొద్దిగా వెన్న, ఓ చిన్ని మిరపకాయ అందించసాగింది.
ఆవకాయతో మిరపకాయ కొరుక్కోవటం సత్యకిష్టం.
అమ్మమ్మ చేతి ముద్దలు తినేసి, గ్లాసెడు మజ్జిగ తాగేసి "ఇక సెలవా అమ్మమ్మా" అంది సత్య.
"క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లీ!"
"శ్రీ చందన మరీ పిసినిగొట్టు. బొట్టుపెట్టి రవిక బట్ట కూడా యివ్వదు. ఏం లాభంలేదు అమ్మమ్మా!"
"చాల్లే చిత్రాలు! వెళ్ళిరా! వెళ్ళిరా! వాళ్ళు వెళ్ళిపోతారు" అంది శివకామమ్మ.
చేత్తో హేండ్ బాగ్ ఊపుకుంటూ, తాజాగా ఆ సాయంకాలం కోసుకొచ్చిన అలసందకాయలు పోసిన బేగ్ భుజానికి తగిలించుకుని "టా! టా!" అంటూ రివ్వున పరిగెత్తింది.
ఆ చిరు చీకట్లు విచ్చేవేళలో సత్య వెళ్ళేవైపే చూస్తూ "పిచ్చిపిల్ల! ఎలా బ్రతుకుతుందో!" ఆనుకుని కళ్ళొత్తుకుంది శివకామమ్మ.
* * *
గబగబా ఇంటినుంచి బయటికివచ్చి చూసింది సత్య ఊరంతా గలగలమంటోంది.
ఏ ఇంట్లో చూసినా పాడిచేస్తున్న సవ్వడి, వెన్న తీస్తున్న శబ్దం. ఇంటిపని చేసుకుంటున్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయ్. రైతులు పశువులకి మేతవేసి, వ్యవసాయప్పనులకి తయారయి పోతున్నారు.
చదువుకునే పిల్లల పాఠాలు కంఠతా పట్టటానికి గబగబా వల్లే వేస్తున్నారు.
చెరువునుంచి స్నానం చేసి మడి నీళ్ళు తెస్తూ ఏవేవో మంత్రాలు లోకంఠంలో చదువుకుంటున్న శాస్త్రిగారు పలుకరించారు సత్యని "ఎక్కడికే పిల్లా!" అంటూ.
"టౌన్ కి వెళ్ళొస్తాను తాతగారూ!" అంది సత్య.
ఆయనకి తాతగారూ అని పిలిస్తే వళ్ళుమంట. శాస్త్రిగారు అనాలని ఆయన ఆంక్ష.
కానీ సత్యనేమీ అనలేదు. ఎందుకంటే మాటకి మాట సమాధానం చెబుతుంది సత్య. "ఏం తాతగారూ! అంటే తప్పా" నువ్వేం మామయ్య లాగున్నావా? ఇంక పదేళ్ళు, అయిదేళ్ళు. అంతే! ఆ తర్వాత శాస్త్రి అనే పేరే వినపడదు అంటుంది నవ్వుతూ. అందుకని సత్య జోలికి రాడతను.
"జాగ్రత్తనే అమ్మాయ్. టవునులో పోకిరి వెధవలుంటారు జాగ్రత్త. నవ్వుతూ చురక అంటించాడు.
"మరేం ఫర్వాలేదు! ఒంటి బ్రాహ్మడువి నీ శకునం అయ్యిందే తప్ప, మరేం భయంలేదు" అంది.
"నా శకునం మంచిదేలే! మాంచి మొగుడొస్తాడు."
"ఛీ! పో! నీ కెప్పుడూ మొగుడూ పెళ్ళాం. అంతకు మించి ఆలోచన రాదు" అని కదిలిపోయింది.
"నా వయసు వాళ్ళకి నీ వయస్సువాళ్ళతో మాటలు రాక ఇంకేముందే?" అని ముందుకు సాగిపోయాడు శాస్త్రి తిరిగి మంత్రాలు ఎత్తుకుంటూ.
సత్య ముందుకి కదిలింది.
తెల్లవారుజాము అయినా మింట చుక్కలూ, చంద్రుడూ వెలుగుతున్నారు. వెలుతురిని కాస్తో కూస్తో ఇస్తున్నారు. కనుచూపు మేరలో ఎవ్వరూ కానరాలేదు.
"అప్పుడే వెళ్ళిపోయారా? లేకపోతే ఇంకా వెనక వున్నారా?" తనలో తను అనుకున్నట్టుగా ఆనుకుని ఒకసారి వెనుతిరిగి చూసింది. దరిదాపుల్లో ఎవరూ లేరు.
గబగబా నడవసాగింది.
సిమెంట్ రోడ్ చేరుకునేవరకూ ఎవరూ కనిపించలేదు.
పరుగులాంటి నడకతో ముందుకు చూస్తూ నడవసాగింది సత్య.
* * *
మలుపు తిరిగేసింది సత్య.
సరిగ్గా ఆ సమయంలో వేగంగా వస్తూ, మలుపు తిరిగిన కారు సర్రున దూసుకుని వచ్చింది.