ఏదో పరధ్యానంలో వేగంగా డ్రైవ్ చేసున్న వ్యక్తి హఠాత్తుగా ఆ మలుపులో మనిషిని చూడగానే మతిపోయినట్లయి సడన్ బ్రేక్ వేశాడు.
ఎంత బ్రేక్ వేసినా కారు కొద్దిగా రాచుకునేపోయింది. ఆ విసురికి పడిపోయింది సత్య.
కారు ఆపుచేసి తలుపు తీసుకుని దిగి వచ్చేడా వ్యక్తి.
లేచి నిలుచుంది సత్య.
ఆమె ప్రక్కనే క్రిందపడి నేలపారయిన వెన్న, పాలు, పెరుగు చూసి నొచ్చుకున్నాడు అతను.
"అయాం సారీ! చూళ్ళేదు. అక్కడికీ బ్రేక్ వేశాను. అయినా నువ్వు తప్పుకోలేదు. పొరపాటయిపోయింది. అయాం వెరీ వెరీ సారీ!" అన్నాడు విచారంగా.
నిప్పులు చెరిగే కళ్ళతో చూసింది సత్య.
తను ఎంతో ప్రియంగా శ్రీచందనంకోసం రాత్రి తోడేసుకొని తెస్తోన్న గడ్డ పెరుగూ, తాజా వెన్న, పాలు అన్నీ నేలపాలు కావడం ఆమెకు ఎంతో బాధని కలిగించింది.
"కారుపై రాగానే కళ్ళు మూసుకుపోతాయి మీకు. దార్లో ఎవరొస్తున్నారో చూడక్కర్లా? టర్నింగ్ లో స్లో చేసుకోకూడదూ? చూడు ఎలా పాడయ్యాయో?" ఉక్రోషంగా అంది.
"సారీ! అయాం వెరీ సారీ! అన్నానుగా. ఏదో ధ్యాసలో వేగంగా వస్తున్నాను. ఆ వస్తువుల ఖరీదెంత అవుతుందో చెప్పు. యిచ్చేస్తాను" వాలెట్ తెరిచాడతను.
"ఖరీదు? ఖరీదిస్తావా? వీటి ఖరీదు వంద రూపాయలు" కోపంగా అనేసింది సత్య.
ఆ మాటలకు అతను ఆమె వేపు, ఆ వస్తువులవేపు వింతగా చూశాడు.
"వీటి ఖరీదు వందా?"
"ఆ! వందే? అట్టే మాటాడితే రెండొందలు."
"ఇంకా మాటాడితే?" కవ్వింపుగా అన్నాడు.
"మూడొందలు."
"ఇంకా...."
"అక్కడికి చాల్లే యిచ్చేయ్!"
ఆ వ్యక్తికి సత్య చాలా పెంకెగా కనిపించింది.
"అలాగే మూడొందలుకాదు, నాలుగొందలు యిస్తాను. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు. కారులో డ్రాప్ చేస్తాను.... అన్నట్టు నీ పేరేమిటి?" సిగరెట్టు ముట్టిస్తూ అడిగాడు.
చిరు చీకట్లు తొలగిపోతున్నాయ్.
తూర్పురేఖలు విచ్చుకుంటున్నాయ్.
ఆ లేలేత వెలుగుల్లో అతని కళ్ళకి సత్య మనోహరంగా కనిపిస్తోంది.
"హుఁ నీలాటి వాళ్ళా యిచ్చేది- వెధవ ఫోజూ నువ్వూనూ. అడ్డులే!" అని వెళ్ళబోయింది సత్య.
"ఆగాగు! నీ పాలముంతకీ, పెరుగుముంతకీ, వెన్న కుండకూ ఖరీదు కట్టేవుగా.... నీకూ నీ వాటికీ యిదిగో డబ్బు...."
ఆగి, అతనివేపు నిర్లక్ష్యంగా చూసి "వూఁ" అంది చేయిచాపి....
"అలారా దారికి! కారెక్కు.... నాలుగొందలు కాదు వెయ్యిస్తాను" కవ్వింపుగా అన్నాడతను.
అతనివేపు తీక్షణంగా చూసింది సత్య.
అతను తమాషాగా నవ్వుకున్నాడు.
చప్పున అతడి బుద్ధి అర్ధమైందామెకి.
"ఛీ" అంటూ కదలబోయింది.
"ఆగాగు! నా కంటపడ్డాక యింకెక్కడికి వెళతావు" హఠాత్తుగా ఆమె చేయి పట్టుకున్నాడు అతను.
నిదానంగా, శాంతంగా అతనివైపు చూసి "చెయ్యొదులు" అంది దృఢస్వరంతో.
"వూఁ వదలటానికి చెయ్యందుకున్నది? పద! పద! తెల్లవారుతుంది త్వరగా వెళదాం" కారువేపు నడవబోయాడు అలాగే.
విదిలించి కొట్టింది సత్య.
"ఎవరనుకుంటున్నావో నేను .... జాగ్రత్తగా మర్యాదగా వెళ్ళిపోలేదా...."
"ఏం చేస్తావ్?" మళ్ళీ చేయి పట్టుకుంటూ అన్నాడు.
"ఛీ!" విదిలించుకోబోయింది సత్య.
"వూఁ గట్టిదానివే!" ఇంకాస్త దగ్గిరిగా లాక్కున్నాడు.
తన శక్తినంత కూడ దీసుకుని విదిలించుకుని పరుగెత్తింది సత్య. ఆమెని తరిమేడతను....
కొద్ది దూరం పోయాక అందుకున్నాడు. కాలు మెలేశాడు క్రింద పడింది. వంగి ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని రాబోయాడు. హఠాత్తుగా ముఖంమీద బలంగా చరిచింది.
దిమ్మ తిరిగినట్టయింది.
వెల్లకిలబడి లేవబోయాడు.
అంతలో లేచిన సత్య మళ్ళీ చాచి కాలితో తన్నింది ఎదర్రొమ్ము మీద.
"ఓసి నీ యమ్మ...."
నోటిపై తన్నింది సత్య.
అతనటు తిరిగి మూతి తుడుచుకొని లేవపోయాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయ్. ఓ ఆడదాని చేతిలో కాలితో తన్నులు తినటం అతనికి అవమానంగా, బాధగా వుంది.
అతడి కళ్ళల్లో క్రూరత్వం చూసింది సత్య.
అప్రయత్నంగా ప్రక్కనే కనిపించిన బండరాయితీసుకుని తలపై వేసి కొట్టింది.