రాగవాహిని
--- యామినీ సరస్వతి
గుమ్మడేడే గోపిదేవీ, గుమ్మడేడే శ్రీ యశోదా, గుమ్మడేడే ఓ దేవికా! గుమ్మడేడమ్మా,
ఉషోదయానికి పూర్వకాలం....
ఇంకా చలి విచ్చలేదు, చీకట్లు వీడలేదు.... మింట చుక్కలు మినుకు మినుకు మంటున్నాయ్....
చలిగాలులు వీస్తున్నాయ్....
మధురాతి మధురంగా మజ్జీగ కవ్వం లయకి అనుబద్ధంగా పాడుతోంది శివకామమ్మ.
ఆమెకి అరవై సంవత్సరాలు ఇందిరాగాంధీ పరిపాలనలోకి వచ్చినపుడే నిండేయి. అయినా ఇంకా దృఢంగా, ఆరోగ్యంగా ఉంది. ఇంటిపని చకచకా చేసుకోవటమే కాదు వేకువనే లేచి కాగుకింద మంటవేసి మజ్జీగచిలికి, వెన్నతీసి వంటిల్లు శుభ్రంచేసి తెలతెల వారే సరికల్లా పై పనులు ముగించి వంటచేసి పాడి చూసుకుని అటు సూర్యుడు తూర్పుకొండ ఎక్కేసరికల్లా పొలంలో ఉంటుంది--
"అమ్మమ్మా!"
సత్య పిలుపుకి కవ్వం ఆపి "ఏమ్మా!" అంది.
"మరి నేను బయలుదేరనా?"
మనవరాలివేపు ఆప్యాయంగా చూసింది శివకామమ్మ.
ఆమె కళ్ళు ఆనందంతో మిలమిలలాడేయ్.
"ఎంత అందంగా వుంది!" అనుకుంది తనలో. మళ్ళీ వెంటనే "దిష్టి తగిలేను!" అనుకుంది.
"వాళ్ళంతా వెళ్ళిపోతారేమో!" అంది మళ్ళీ సత్య.
"వాళ్ళంటే - ఆ ఊరినుండి రోజూ పట్నానికి వెళ్ళి పాలూ పెరుగూ వెన్నా నెయ్యీ అమ్ముకునేవాళ్ళు. తెలుగుదేశంలో పల్లెల్లో పాడి-పశువులపై సామాన్య గృహిణిజీవితం ఆధారపడి ఉంది. నూటికి తొంభై మంది తెలుగు ఇల్లాళ్ళు పాడి చేస్తారు.
డెయిరీ డెవలప్ మెంట్ వాళ్ళ ధర్మమా! అని పాలరేటు నెయ్యిరేటు పెరిగి ఆకాశం అందుకున్నాయ్. ఆ రెంటిపైనా బ్రతికే బీదకుటుంబాలకి జీవనాధారాలయ్యేయి.
కొందరు పాలకేంద్రాలకి అమ్ముతున్నారు. పట్నాలకి మరీ దగ్గరలో వుండేవాళ్ళు నేరుగా టౌన్లకి వెళ్ళి పాలతోపాటు పెరుగూ, మజ్జిగా కూడా అమ్ముకుంటున్నారు. కొందరయితే టౌన్ చేరి పశుసంపదపై జీవిస్తున్నారు.
"వెళ్ళి తీరాలమ్మా?" మళ్ళీ ప్రశ్నించింది శివకామమ్మా.
"మళ్ళీ మొదటకొచ్చావా? రాత్రంతా నేను చెప్పింది మరిచిపోయావా? ఏమిటమ్మమ్మా! హాయిగా వెళ్ళి నాలుగురోజులుండి వస్తానంటే వినవు?"
దానితో గతరాత్రి విషయమంతా గుర్తుకొచ్చింది ఆమెకు.
అమ్మమ్మ పక్కలో దూరి ఆమె కడుపుమీద చేయివేసి "అమ్మమ్మా!" అంటూ పిలిచింది సత్య.
మనవరాలి తల మృదువుగా నిమిరింది శివకామమ్మ.
ఆమెకి అస్తమానమూ మనవరాలి చింతే!
ఉన్న ఒకే ఒక కూతురు విశాలాక్షిని ఆస్తితోపాటు శేషయ్యకిచ్చి చేసింది. పెళ్ళయిన ఏడాదికే సత్య పుట్టింది. పురిటిలో కాన్పు కష్టమై గర్భసంచి తీసివేయాల్సొచ్చింది. దాంతో యిక మళ్ళీ పిల్లలు పుట్టే ఆశపోయింది.
విశాలాక్షి భర్తని అప్పుడప్పుడూ వేధించేది. మళ్ళీ పెళ్ళి చేసుకోండి. కొడుకు పుట్టింది లాభంలేదు. వంశం నిలవాలి అనేది.
ఆ మాట అన్నప్పుడల్లా శేషయ్య కస్సుమనేవాడు.
"కూతురైనా, కొడుకైనా అదే! నా కన్నతల్లిని బాగా చదివిస్తాను. జాన్సీరాణి అంతదాన్ని చేస్తాను. కనీసం ఇందిరాగాంధీ అంతయినా చేస్తాను" అనేవాడు కూతుర్ని ముద్దులాడుతూ.
అన్నట్టుగానే అయిదేళ్ళొచ్చేసరికే అక్షరాభ్యాసం చేసి బళ్ళోవేశాడు. ఆ సరికే ఆమెకి సుమతి, వేమన, దాశరధి, భాస్కర శతకాలు, అమరం, ఆంధ్రనామ సంగ్రహం కొంతకొంత నేర్పించాడు.
విశాలాక్షి కూడా సత్యని చూసి తృప్తిపడేది.
కొడుకు లేని కొరత తీర్చుకోవాలని అప్పుడప్పుడు నిక్కర్, చొక్కా వేసేది.
ఆనందంగా సాగిపోయే సంసారంలో విధి విపరీతం చేసింది. ఊరిలో విలయతాండవం చేసిన కలరా ఇద్దర్నీ పొట్టన పెట్టుకుంది.
ఒంటరైన మనవరాల్ని తన ఊరు తీసికెళ్ళింది శివకామమ్మ.
అల్లుడి ఇల్లు, ఆస్థి అమ్మివేసి బంగారం కొంది. నగలు చేయించింది. బ్యాంక్ లో వేయి లేదా అప్పుకి ఇవ్వు అని ఎవరు సలహా ఇచ్చినా వినలేదు. అంతా బంగారుమయం చేసింది.
తనకున్న రెండెకరాల పల్లపు భూమిలో వచ్చే ఐదువేలూ. మూడంకణాల యిల్లు పాడిపంటతో మనవరాల్ని దినదినాభివృద్ధిగా పెంచింది.
ఆ ఊళ్ళో వున్న హైస్కూలు చదువు పూర్తి చేయించింది.
పై చదువులు చదవాలని సత్య అన్నా ఆమె వినలేదు.
"పద్దెనిమిదేళ్ళు నిండాక పెళ్ళి చేస్తాను. అంతదాకా హాయిగా తిని తిరిగి ఒళ్ళు పెంచుకో. రూపురేఖ లేర్పడితేనే ఆడదానికి అందం" అంది.
దాంతో ఆమె చదువు గట్టెక్కింది.