వెంకట్రామయ్యగారి కొడుకు లిద్దరూ - చెల్లెళ్ళ పెళ్ళి కోసమని- తమ పెళ్ళిలో వచ్చిన కట్నం డబ్బును ఉమ్మడిగా బ్యాంకులో వేసి ఉంచారు. ఆ డబ్బును వెలికి తీసి ------ వెంకట్రామయ్య ఊళ్ళో ఉన్న అప్పులన్నీ తీర్చేశారు. మరెప్పుడు డబ్బవసరమైనా ఎవరి వద్దా అప్పు చేయవద్దనీ -- తమకే స్వయంగా ఉత్తరం వ్రాయమనీ తండ్రిని కోరారు. కొడుకుల వద్ద అయన ఎక్కువగా మాట్లాడడు. సరేనన్నట్లు తలాడించే డాయన.
కొడుకు లిద్దర్నీ బాధించినదేమిటంటే --డబ్బు పెద్ద ఎత్తున ఖర్చవుతున్నా - ఇంట్లో పిల్లల కేవరికీ సరైన గుడ్డ ముక్క లేదు. అవసరమైనప్పటికీ - ఇంటికీ మరమత్తు చేయించబడలేదు. అదేమని అడిగితె వెంకట్రామయ్య కళ్ళ నీళ్ళేట్టుకుంటాడు పార్వతమ్మ విరుచుకుపడిపోతుంది.
అందుకని ఆ కోడుకులిద్దరూ తండ్రికి చేసే ఆర్ధికసహాయం తగ్గించి చాలా వ్యవహారాలు తామే స్వయంగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఆవిధంగా తామే స్వయంగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇంటికి మరమత్తులు జరిగి ఒక రూపం వచ్చింది. ఇంట్లో పిల్లలకు కొత్త కళ వచ్చింది. తన బిడ్డల బాగోగులు చూడడం తనకు సహాయపడడంగా భావించి వెంకట్రామయ్యలో - తన పిల్లలు తనని సరిగ్గా చూడరన్న అభిప్రాయం బాగా బలపడిపోసాగింది.
అప్పటి కాయన మూడో కొడుకు బియ్యే పూర్తీ చేసి ఏడాదయింది. ఎమ్మే చదివే ఆలోచన అతను విరమించుకున్నాడు. వీలైనంత త్వరగా అన్నయలతో పాటు తనూ సంసార బాధ్యతలు స్వీకరించాలన్న అతని తొందరపాటు ఎమ్మే చదవకుండా ఆపింది. కానీ ఏడాది గడిచినా ఉద్యోగం దొరకలేదతనికి.
"రెండోవాడు చెప్పిన మాట వినుంటే --- ఈపాటికి ఏడాది చదువై పోయుండేది నీకు ----" అంటూ వెంకట్రామయ్యగారు మూడోవాణ్ణి తిట్టారు.
అందుకతను దురుసుగా ---- "చెల్లాయి లక్ష్మీ కప్పుడే పదహారేళ్ళు వచ్చాశాయి. నేను చదువుతానంటే -------దీనికీ దానికీ డబ్బెలా గొస్తుంది?" అన్నాడు.
"ఓస్ ------ఇంకా పదహారెళ్ళేగా ----ఈరోజుల్లో పాతికేళ్ళ దాకా పెళ్ళిళ్ళు కాని వారున్నారు ------" అన్నాడు వెంకట్రామయ్య.
దాన్ని వాయిదాలు వేసే మనస్తత్వమని అంతా అంటారు. నిదానమని వెంకట్రామయ్య అంటాడు.
2
"ఏమైనా ఉత్తరా లోచ్చేయా?" వసుంధర అడిగింది భర్తను.
రాజారావు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసుకు వెళ్ళి --- మధ్యాహ్నం పన్నెండున్నరకు తిరిగి వస్తాడు. భోం చేసి మళ్ళీ ఒంటి గంటన్నరకు ఆఫీసుకు వెళ్ళి ------ నాలుగున్నరకు తిరిగి వస్తాడు. అతని ఆఫీసు ఇంటికి మూడు నిముషాల నడక దూరంలో ఉంది. సాధారణంగా ఉత్తరాలు ఆఫీసుకు పన్నెండు గంటల ప్రాంతంలో వస్తాయి.
"ఆ వచ్చింది -----ఒక శుభలేక -----" అంది అందించాడు రాజారావు.
"కొంపదీసి మన లక్ష్మిది కాదు గదా ------' అంది అందుకుని వసుంధర.
రాజారావు నవ్వాడు. ఆ నవ్వులో కాస్త బాధ ఉంది ----"వసూ --------ఇదివరలో అయితే ఇదే ప్రశ్నకు జవాబుగా మనస్పూర్తిగా నవ్వేవాణ్ణి. ఇప్పుడలా నవ్వు రావడం లేదు. లక్ష్మీకి పద్దెనిమిదేళ్ళు నిండి నెల కావస్తోంది --------' అన్నాడు.
శుభలేఖ చదువుకున్నాక వసుంధర -------"ఎవరిదని అడగరేం. మా స్నేహితురాలిది -----" అంది.
"తెలుసు ------పోర్తుఫారంలో నీ క్లాసు మేటనుకుంటాను -----' అన్నాడు రాజారావు.
'అబ్బ ------నా స్నేహితురాళ్ళంతా మీ కెప్పుడూ గుర్తే ----" అంది వసుంధర అదోలా భర్త వంక చూస్తూ.
"ఏం చేయను. నీతో పెళ్ళి కాగానే నా స్నేహితురాళ్ళందర్నీ మరచిపోవాలన్నావు. అందోకని నీ స్నేహితురాళ్ళను గుర్తుంచుకున్నాను" అన్నాడు రాజారావు.
వసుంధర ముఖంలో చిరుకోపాన్ని ప్రదర్శించింది---- "స్నేహితురాళ్ళనే ఎందుకు ---స్నేహితుల్ని గుర్తుంచుకోవచ్చు . గదా------"
"ఓహ్ ----నీకు స్నేహితులు కూడా ఉన్నారన్న మాట ---------- అయితే తక్షణం చెప్పు ..." రాజారావింకా ఏదో అనబోతుండగా వసుంధర చిరాగ్గా ------" మాటకారినన్న గర్వం మీ ముఖంలో దాచుకుండామన్న దాగడం లేదు కానీ ---నే ననేది మీ స్నేహితుల మాట ---" అంది.
'చంపావ్ . నాకు స్నేహితురాళ్ళే కానీ స్నేహితులు లేరే ---" అన్నాడు రాజారావు బాధ నభినయిస్తూ.
వసుంధర సీరియస్ గా ముఖం పెట్టి --- "ఇదే డైలాగు--" రేపు మీ బావగారు లక్ష్మీతో అంటుంటే మీ ముఖం ఎలాగుందో చూడాలనుంది ?" అంది.
రాజారావు చటుక్కున భార్య చేయి పట్టుకుని ---" వసూ --- నాకో బావగారు వస్తాడంటావా? - లక్ష్మీతో మాట్లాడుతాడంటావా?" అన్నాడు.
వసుంధర నవ్వి --- "ఏమిటండీ మీ అర్ధం లేని ప్రశ్నలు --- లక్ష్మీ కింకా పద్దెనిమిడేళ్ళు కదా ---" అంది.
"మరి నీకేన్నో ఏట పెళ్ళయిందట?"
"చెబితే -----నన్నూ మిమ్మల్నీ కూడా పోలీసులు పట్టుకు పోతారు-----"
అప్పుడే ఎవరో తలుపు తట్టగా ------" పోలీసులేమో -----" అన్నాడు రాజారావు. కాదని చెప్పడాని'కన్నట్లుగా -----"సార్ ------టెలిగ్రాం ------' అన్న కేక వినిపించింది.
"మామయ్య వెంకట్రామయ్య ఇచ్చుంటారు. బహుశా లక్ష్మీకి పెళ్ళి కుదిరి ఉంటుంది ----" అంది వసుంధర నవ్వుతూ. రాజారావు నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసి టెలిగ్రాం అందుకున్నాడు.
వెంకట్రామయ్య ప్రతిపనీ చేస్తాడు కానీ ఆలశ్యంగా మాత్రమే చేస్తాడు. అయన బంధు వర్గంలో చాలామందికి ఆయనంటే ఇష్టం .అందులో చాలామంది అయన ఉండే గ్రామానికి దగ్గర్లో ఉన్న రాజమండ్రి వచ్చి వెడుతుంటారు. వాళ్ళు రాగానే రాజమండ్రి నుంచి గ్రామానికి కబురు వెడుతుంది. తామెప్పుడు వచ్చినదీ, మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్ళేదీ స్పష్టంగా తెలియబరుస్తారు. వెంకట్రామయ్యగారికి వాళ్ళను చూడాలనే ఉంటుంది కాని వాళ్ళు వెళ్ళే తేదీ ఆయనకు తెలియడం ఒక దురదృష్టం. చివరి తేదీ వరకూ అయన అలా అలా వాయిదా వేసుకుంటూ వెడతాడు. ఆఖరి రోజున గ్రామం నుంచి బయల్దేరి ఆ బంధువుల నింట్లో కలుసుకునేందుకు వ్యవధి చాలక -- స్టేషన్లో కలుసుకోవాలనుకుంటాడు. అయితే ట్రయిన్ కో అరగంట టైమింకా మిగిలి ఉందని తెలిస్తే --కాసేపు ఏదైనా హోటల్లో కాలక్షేపం చేసి---- చివర హడావుడై పోగా -----సిటిబస్ లో వెళ్ళవలసినదానికి రిక్షాలో వెళ్ళి --- ఉరకలు పరుగులు మీద ప్లాట్ ఫారం మీదకు వెడతాడు. సాధారణంగా అప్పటికి ట్రయిన్ కదుల్తూంటుంది. బంధువులను లోకేట్ చేసి ---- పరుగు పెడతాడు. వాళ్ళూ ---ఈయనా ఒకరి నొకరు చూసుకుని గుర్తించుకుని చేతు లూపుకుంటారు. వాళ్ళను చూడగలిగానన్న తృప్తి వెంకట్రామయ్యగారి కళ్ళలో కనబడుతుంది. ఇంకా ఈయన మారలేదన్న భావం వారి కళ్ళలో మేదుల్తూంటుంది.
మోడ్రన్ అర్టులో ఆసక్తి ఉన్న వెంకట్రామయ్యగారి మేనల్లుడోకతను ------కదుల్తూన్న ట్రయిన్ వైపు వీడ్కోలిచ్చే చేతులను బొమ్మగా వేసి -------చిత్రానికి "మామయ్య వెంకట్రామయ్య " అని టైటిల్ ఇచ్చాడు. ఆ చిత్రం చూసేక మోడ్రన్ అర్టులో టైటిల్ కీ చిత్రానికీ సంబంధముండదని భావించే రాజారావు తన అభిప్రాయాన్ని మార్చుకోవడం మాత్రమే కాక ---మోడ్రన్ ఆర్టు వల్ల గౌరవాన్ని కూడా పెంచుకున్నాడు.