Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 2


                                       స్వతంత్ర భారతదేశంలో స్త్రీ
    "మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ముప్పయ్ ఏళ్ళయింది. అనేక రంగాల్లో ప్రగతి సాధించాం. కాని చెప్పుకో తగిన మార్పు రాలేదు. ఒక ప్రముఖ పాత్రికేయునితో అన్నాను. 'ఎలాంటి మార్పూ రాలేదంటారా?' ఆశ్చర్యంగా నా ముఖంలోకి చూస్తూ ఎదురు ప్రశ్న వేశాడు ఆ మేధావి.   
    నేను కొంచెం తికమకపడ్డ మాట నిజమే. 'నాకేం కన్పించడం లేదు' అన్నాను.
    "ముప్పయ్ సంవత్సరాల క్రితం నాతో ఏ స్త్రీ ఇలా వాదనకి దిగలేదు. మరి ఈనాడు మీలా ఎందరో స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక విషయాల మీద పురుషులతో సమానంగా చర్చలు జరుపుతున్నారు కథలు రాస్తున్నారు. వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు. డాక్టర్సుగా, లాయర్స్ గా ప్రాక్టీసు చేస్తున్నారు. న్యాయవాదులు ఉన్నారు. మంత్రులుగా ఉన్నారు. కలెక్టర్లుగా ఉన్నారు. అత్యున్నత పదవుల్లో ఉన్నారు. మరి ముప్పయ్ సంవత్సరాల క్రితం ఎవరైనా ఒక స్త్రీని దేశ ప్రధానిగా వూహించగలిగారా?"  
    "అది నిజమే ననుకోండి. కాని అలాంటి వారి శాతం ఎంత? సాధారణ స్త్రీ జీవితంలో చెప్పుకోతగ్గ మార్పు వచ్చిందని నేను అనుకోవడం లేదు. స్వతంత్రంగా బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ నిజమైన స్వతంత్రం ఉందా?"    
    "ఒక ఉదాహరణ చెప్పండి."
    "ఒకటేమిటి? ఎన్నో చెప్పవచ్చును. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారనుకోండి. భర్త ఇంటికి వచ్చాక ఏ ఈజీ చెయిర్లోనో రెస్టు తీసుకుంటాడు. స్త్రీకి అలా కుదరదు. వస్తూనే ఇంటి పనిలో జొరబడి పోవాలి. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు పురుషుడు కూడా ఇంటి పనుల్లో భార్యకు సహాయం చెయ్యొచ్చుగా? అలా ఎందుకు జరగదు?"
    "దానికి కారణం మీ ఆడవాళ్ళే. విజ్ఞానవతి అయిన స్త్రీ కూడా మానసిక బానిసత్వం నుంచి బయటపడలేకుండా ఉన్నది. పురుషుడు అధికుడు అనే భావం అతనికంటె ఆమెలోనే ఎక్కువగా ఉంటున్నది. ఎంతో చదువుకున్న స్త్రీలు పాతవాసన నుంచి బయటపడలేకుండా ఉన్నారు. ఉదాహరణకు నా కుటుంబాన్నే తీసుకోండి. నా భార్య కూడా ఉద్యోగం చేస్తున్నది. నా కంటే ఎక్కువ సంపాదిస్తున్నది. పెద్ద ఆఫీసరే కావడానికి, నేను ఇంటికి వచ్చాక నా స్నేహితులు ఎవరైనా వస్తారనుకోండి. ఆమె విసుక్కోకుండా కాఫీలూ, టిఫినులూ చేస్తుంది. అందరికీ ఇస్తుంది. అదే ఆమె స్నేహితురాలు వచ్చారనుకోండి. ఆమె వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నది కదా అని నేను కాఫీ పెట్టాలని ప్రయత్నిస్తే ఆమె అడ్డుపడుతుంది. ఆమెకే నేను కాఫీపెట్టి ఇవ్వడం చిన్నతనంగా అనిపిస్తుంది. తన స్నేహితుల ముందు నన్ను చిన్నతనం చేసినట్లు బాధపడుతుంది, ఎందుకంటారు?"  
    నేను ఒక క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాను.
    "ఆ వచ్చిన స్నేహితులే ఆమె భర్త చేత పనిచేయిస్తుందని నవ్వుకుంటారు. పదిమందితో చెప్పుతారు. అదే ఆమె భయం విజ్ఞానవంతురాలైన నా భార్యకు అలా చెయ్యడంలో తప్పులేదని తెలుసు. అయినా అందుకు ఆమె అంగీకరించదు."   
    "అందుకే స్త్రీకి పూర్తి స్వేచ్చరాలేదంటున్నాను."
    "హక్కులూ, స్వాతంత్ర్యం ఒకరు ఇచ్చేవికావు. అవి సంపాదించవలసినవి. ఇప్పుడు మహిళా దశాబ్దంలో ఉన్నారు. రాక్షస నామ సంవత్సరాన్ని మహిళా సంవత్సరంగా డిక్లేర్ చేశారు" అన్నాడు ఆ పెద్దమనిషి.   
    "అవును అంతర్జాతీయ మహిళా సంవత్సరం జరుపుతున్నాం. ఇప్పుడు మహిళా దశాబ్దంలో ఉన్నాం. అందువల్ల ప్రత్యేకంగా లభించింది ఏమిటి? ఇప్పుడు ఆడపిల్లల పెళ్ళిళ్ళు కట్నం లేకుండా జరుగుతున్నాయా? కట్నం తేలేదని కోడల్ని కాల్చి చంపిన ఉదంతం ఆ మధ్య పేపర్లో చదవలేదా? ఇంకా భ్రూణహత్యలూ, శిశు హత్యలూ కోకొల్లలుగా ఉన్నాయి. భర్త చేత నిత్యం తన్నులు తింటూ సీతనూ, సావిత్రినీ తలచుకుంటూ ఎందరు స్త్రీలు ఇంకా బతకడం లేదు. సక్కుబాయి కష్టాలను తలచుకుంటూ ఎంతమంది కోడళ్ళు అత్తల ఆరళ్ళుపడటం లేదు? ఎన్నో సేవా సదనాలు ఉన్నాయి, ఆ సదనాలకు నిస్సహాయులైన ఆడవాళ్ళు రోజూ ఆశ్రయం కోసం వస్తూనే ఉన్నారు.
    కట్నం ఇవ్వలేక కన్నబిడ్డల్నే శత్రువులుగా భావించే తల్లిదండ్రులు ఉన్నారు. అన్ని అనర్థాలకూ కారణం స్త్రీకి ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవటమే. అంతర్జాతీయ మహిళా సంవత్సరంలోనైనా కూతురికి కూడా కొడుకుతో సమానంగా ఆస్తిలో హక్కు ఏర్పాటు చేస్తూ కాన్ స్టిట్యూషన్ లలో ఎమెండ్ మెంట్ ఎందుకు తీసుకురాలేదు? కట్నాల బెడద పోవాలంటే కూతురికి కూడా కొడుకుతో పాటు ఆస్తిలో హక్కు ఉండాలి" ఆవేశంగా అన్నారు.   
    "అందుకోసం విజ్ఞానవంతులైన స్త్రీలు ఏం కృషి చేస్తున్నారు? చదువుకుంటున్నారు. కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, కొందరు పెళ్ళికాగానే డాక్టరీ ముఖ్యంగా లా చదివిన స్త్రీలు కూడా ప్రాక్టీసు చెయ్యకుండా ఇళ్ళల్లో కూర్చుంటున్నారు. ఎం.బి.బి.యస్. చదువుతున్న అమ్మాయిని అదే క్లాసు చదువుతున్న అబ్బాయికి లక్ష కట్నం ఇచ్చి పెళ్ళి చేస్తే కిక్కురుమనకుండా , తలవంచుకొని, సిగ్గుపడుతూ, మెళ్ళో తాళి కట్టించుకుంటున్నది. అంత చదువుకున్న అమ్మాయి పెళ్ళి గురించి కూడా తల్లిదండ్రులు దిగులుపడిపోతారు. వారికి ఆ అమ్మాయి రొమ్ముల మీద కుంపటిగానే కనిపిస్తుంది. ఎందుచేత? ఆ అమ్మాయికి ఆత్మ విశ్వాసం లేదు.  
    తల్లిదండ్రులకు అంత పెద్ద చదువుకుంటున్న ఆ అమ్మాయి అబలగానే కనిపిస్తుంది. వివాహం అనేది స్త్రీకి ఎంత అవసరమో పురుషుడికి అంతే అవసరం అనీ ఎదురు డబ్బు ఇచ్చి వరుణ్ణి కొనుక్కోవటం తనకు ఇష్టం లేదనీ, తన చదువు పూర్తి అయాక తన కాళ్ళ మీద తాను నిలబడి, తనకు ఇష్టం అయిన వాడిని చేసుకుంటాననీ ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పదు. చెప్పలేదు. చదువుకున్న యువతుల్లోనే మార్పు రావాలి. ఆత్మవిశ్వాసం పెంపొందాలి. అన్యాయాన్ని ఎదుర్కొనే సాహసం ఉండాలి. స్త్రీల సమస్యలకు పరిష్కారం స్త్రీలే ఆలోచించాలి." పాత్రికేయుని సమాధానం.   
    అతని ఆర్గ్యుమెంటులో బలం లేకపోలేదు. కాని స్త్రీ చదువుకున్న స్త్రీ కూడా ఆలోచించలేకపోవడానికి కారణం ఏమిటి? తరతరాలుగా స్త్రీలకోసం పురుషులే ఆలోచించారు." ఇది చెయ్యాలి. అది చెయ్యకూడదు" అంటూ నియమాలు ఏర్పరచారు.  
    సాంప్రదాయాల పేరుతో కట్టుబాట్లు నిర్ణయించారు.
    పెద్దలు గీచిన గిరుల మధ్య నేతను గిరుల మధ్య ఉన్నదనే అవగాహన కూడాలేని స్థితిలో స్త్రీ యుగాలుగా జీవించింది. ఆమెకు కావలసిన భద్రత చిన్నతనంలో తండ్రి నుంచీ, యవ్వనంలో భర్తనుంచీ, వృద్ధాప్యంలో కొడుకు నుంచీ ఏర్పాటు చేశారు. ఆమెకు ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది కాదు..... అవకాశం ఇవ్వబడలేదు.   
    ఉగ్గుపాలతో రంగరించి పోసిన మూఢనమ్మకాల తాలూకు సంస్కారం, ఈ జాతి అణువణువులో జీర్ణించుకుని ఉన్నది. అప్రభావం నుంచి పూర్తిగా బయట పడాలంటే సమయం పడుతుంది. ఎంతో సంఘర్షణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయాన్నే 'సంధియుగం' అంటారు.   
    ఈ సంధియుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉండగా, వంటలూ-- పిండివంటలూ, గృహ అలంకరణలూ, పిల్లలతోపాటు కోళ్ళ పెంపకం, వూరగాయలు పెట్టడం మొదలైన విషయాల మీద చర్చలు జరపడం, వ్యాసాలు రాయడం విరివిగా జరుగుతోంది. అడపాదడపా, ఉద్యోగినుల సమస్యల మీద వ్యాసాలు వస్తుంటాయి అని అవి ఇంట్లో కూర్చున్న స్త్రీలు. ఆఫీసు వాతావరణం ఎలా ఉంటుందో కూడా తెలియనివారు వూహించి వాస్తున్నవే. పల్లెల్లో నివసించే స్త్రీలు ఈ సంధియుగపు ప్రభావానికి దూరంగా ఉన్నారనుకోవడం కేవలం భ్రమ మాత్రమే.
    వారిలోనూ కొంతవరకు చైతన్యం వచ్చింది. వారూ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వారి సమస్యల గురించి వారే ఆలోచించగల జాగృతిని వారిలో కలిగించడం అవసరం.  
                        ఈ పవిత్ర భారతదేశంలో స్త్రీగా జన్మించడం....?
    "ఈ పవిత్ర భారతదేశంలో స్త్రీగా జన్మించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ పుణ్యభూమిలో స్త్రీగా జన్మించినందుకు గర్విస్తున్నాను. మాతృదేవతగా, గృహలక్ష్మిగా, కోడలిగా, కూతురిగా స్త్రీని గౌరవించిన దేశం మనదేశం."   
    అబ్బో ఎన్ని స్థానాలు లభించాయో ఈ పుణ్యభూమిలో స్త్రీకి?
    "రెండు పిల్లుల ముందు ఒక పిల్లి, రెండు పిల్లుల వెనుక ఒకపిల్లి రెండు పిల్లుల మధ్య ఒకపిల్లి:" ఎన్ని పిల్లులో? (మూడు మాత్రమే)     
    "ఒక తల్లీ కూతురు. మరో తల్లీ కూతురు. ఒక అమ్మమ్మా ఒక మనవరాలు." ఎంత మందో చెప్పుకోండి చూద్దాం: (ముగ్గురు) చాలామంది (బాగా చదువుకున్న వారు కూడా) స్త్రీల గురించి వ్యాసం వ్రాసినా, ఉపన్యాసం ఇచ్చినా మొదట ఉదాహరించిన మాటలతో ప్రారంభిస్తున్నారు. ముప్పయి కోట్ల ఆడవాళ్ళలో ఒక ఆడదిగా జన్మించడమే గర్వ కారణమా? లేక మనం గర్వించదగిన పని ఏదైనా చేశామా? అని ఆలోచించడం లేదు.

 Previous Page Next Page