"ఏం పార్టీ? అకేషన్ ఏమిటి?"
"ఏం లేదు.. ఆయన ఎప్పుడొచ్చినా ఇలా సరదాగా పార్టీ యిస్తోనే ఉంటారు.."
"ఇలాంటి పార్టీలలో నాకు సరదా ఏం లేదు.. నేను రాను.."
"అదేమిటి? వెంకట్రావుగారి పార్టీకిరారూ:" అత్యంతాశ్చర్యంగా అడిగింది రేవతి..
"వెంకట్రావుగారు పార్టీ ఇస్తున్నంత మాత్రాన నేనెందుకు రావాలి?"
అంతకంటే ఆశ్చర్యంగా అడిగింది జ్యోత్స్న - రేవతి కళ్ళు పెద్దవి చేసి "ఆయన లక్షాధికారి -" అంది.
జ్యోత్స్న రేవతి ముఖంలోకి చూసి అదొకమాదిరిగా నవ్వింది.
మనం తెలివి తక్కువగా మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియదు కాని, ఆ మాటలు విని మరొకరు నవ్వినప్పుడు మాత్రం మన మూర్ఖత్వమంతా మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అప్పుడు భరించటం చాలా కష్టం - అందుకే రేవతికి చాలాకోపం వచ్చేసింది.
"నీలాంటి వాళ్ళని పిలవటానికి రావటం నాదే బుద్ధితక్కువలే:" అనేసింది. 'నీలాంటి వాళ్ళని' అనే మాటలో కావలసినన్ని అర్థాలు సాయశక్తులా పలికిస్తూ....
తనముందు ఆడవాళ్ళు ఇలా ఉడుక్కోవటం, ఏదో ఒకటి తనను నొప్పిస్తూ అనటం జ్యోత్స్నకు బాగా అలవాటై పోయింది. ఈ ఆటలో ప్రత్యర్థిని మొండిగా ఎదుర్కోగలిగే నేర్పు కూడా ఆ అమ్మాయికి వచ్చేసింది. అల్లరిగా నవ్వుతూ "పోనీ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో: ఇకముందు పిలవకు" అంది.
రేవతి రుసరుసలాడుతూ వచ్చేసింది.
వచ్చి "అబోడి వెంకట్రావుగారి పార్టీకి, నేను రానని చెప్పింది." అంది.
అందరూ "ఆ:" అని నోరుతెరిచి ఆశ్చర్యపోయారు.
వెంకట్రావుగారు నవ్వుతూ "ఆ అమ్మాయి ఎవరో నేనే వెళ్ళి పిలుచుకొస్తాను -" అని తనే జ్యోత్స్న వాటాలోకి వచ్చాడు.
జ్యోత్స్నను చూసి చేష్టలుడిగిన వాడిలా ఒక్కక్షణం నిలబడిపోయాడు.
తనను చూసిన మొగాళ్ళందరూ అలా అయిపోవటం జ్యోత్స్న కు బాగా అలవాటే: అంచేత ఆయన చూపులకు ఇబ్బంది పడకుండా నిర్లక్ష్యంగా చూస్తూ "ఎవరు మీరు - ఏం కావాలి?" అంది.
అన్నివేళలా నవ్వుతూ ఉండగలగటం వెంకట్రావులో ప్రత్యేకత - తనకు కలిగిన విభ్రాంతిలోంచి రెప్పపాటులో తేరుకుని "బోడి వెంకట్రావు పార్టీకి రావన్నారట: నేనే ఆ బోడి వెంకట్రావుని - సరిగ్గా చూడండి: నన్ను బోడి అనటం అన్యాయం కదూ:" అన్నాడు.
అతని మాటల ధోరణికి నవ్వు వచ్చింది జ్యోత్స్నకి - అతడి కలుపుగోలుతనాన్ని మెచ్చుకుంది.
"నేను 'బోడి వెంకట్రావు' గారని అనలేదు - పార్టీకి రానని మాత్రమే అన్నాను-"
"అయితే ఇది ఆ రేవతి 'సృజనాత్మక ప్రతిభ' అన్నమాట: మీ ఆడవాళ్ళలో చాలామందికి ఈ ప్రతిభ చాలా గొప్పగా ఉంటుంది. మరి, మీరు రండి క్రిందకి-"
"నేను రానని చెప్పానుగా:"
"అదేం? నలుగురిలోకీ రావటానికి మీకు భయమా?"
జ్యోత్స్న గతుక్కుమని "భయమా? భయం దేనికి?" అంది -
వెంకట్రావు అది వినిపించుకోకుండానే "మనం నలుగురిలోంచీ తప్పించుకు పారిపోవాలని ప్రయత్నిస్తూన్న కొద్దీ వాళ్ళకి మనను వెంటబడి తరమాలనిపిస్తుంది. అందరితో కలిసి తిరుగుతున్నప్పుడే ఆత్మరక్షణకు ఉపాయాలు అనుకోకుండా తెలిసిపోతాయి" అన్నాడు.
తెల్లబోయి చూసింది జ్యోత్స్న -
"రండీ:" అన్నాడు వెంకట్రావు మళ్ళీ....
వెంకట్రావు వయసులో పెద్దవాడు - నలభై అయిదు పైగా ఉంటాయి. దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాడు.. పెద్దమనిషి తరహాగా ఉంటాడు.. మామూలుగా యువకులను విదలించినట్లు వెంకట్రావును విదలించలేకపోయింది జ్యోత్స్న-
తను వస్తే గాని కదలనన్నట్లు అతడు అక్కడే నిలబడ్డాడు.
ఉన్నది ఉన్నట్లుగా లేచి తలుపుతాళంపెట్టి అతని వెనకాతల వచ్చేసింది జ్యోత్స్న-
2
ఇంటిముందు సైకిల్ దిగి ఆ ఇంటిమీద అందంగా "ఆనంద నిలయం" అని వ్రాసి ఉన్న అక్షరాలను ఒక్కసారి చూశాడు భాస్కర్ - ఆ ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు, ఆ ఇంట్లోకి వస్తున్నప్పుడూ, ఆ అక్షరాలను చూసి తనలో తను నవ్వుకోవటం భాస్కర్ కొక అలవాటయి పోయింది. ఈ ఇంటికి 'ఆనందనిలయం' అని పేరు ఎవరు పెట్టారో కాని, నాలుగు వాటాలలో ఉన్న కుటుంబాల్లో ఏ ఒక్కదానిలోనూ, కంచుకాగడాపెట్టి వెతికినా 'ఆనందం' అనేది కనిపించదు-
ఇంటి ఆవరణలోకి వచ్చిన భాస్కర్ పార్టీ హడావుడి చూసి తన మావగారు వచ్చారని అర్థం చేసుకున్నాడు.
ఈయనకు ఇదొక పిచ్చి - ఎంతో పిసినారి - నయా పైస ఖర్చు పెట్టడానికి పదిసార్లు ఆలోచిస్తాడు - అలాంటివాడు ఈ పార్టీ లెందుకిస్తాడో తెలీదు - బోలెడు డబ్బుందంటారు. ఆ పిసినారి తనమేమిటో మరి: ఆ మాటకొస్తే డబ్బు ఉండటానికీ పిసినారితనానికీ సంబంధం లేదేమో:
తన తండ్రిలేడూ: తండ్రి సంగతి తలుచుకోగానే మనసంతా అదొకమాదిరిగా అయిపోయింది భాస్కర్ కి....