భాస్కర్ తండ్రి కోయిలలో అర్చకుడు - కొద్దో గొప్పో భూ వసతి ఉంది - అదిగాక వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు - ఒక్కనయాపైస ఖర్చు పెట్టాలన్నా అతనికి ప్రాణం పోయినట్లే ఉంటుంది. తను తినడు - ఇంట్లో వాళ్ళను తిననివ్వడు - శుభ్రంగా బట్టలు కూడా కట్టుకోడు. ఎప్పుడూ మాసిపోయిన పడ్డు పంచెతో, పిలికతో, యజ్ఞోపవీతం వీపు మీద రాసుకుంటూ కనిపిస్తాడు. ఆ డబ్బు అలా ఇనప్పెట్టెలో పెట్టి చూసుకోవటమే అతనికి సంతృప్తి - 'డబ్బుకోసం డబ్బు' అతనికి - ఆ డబ్బుతో ఏదీ, ఏవిధంగానూ అనుభవించడు.
స్కూల్ పైనల్ పాసయ్యాక భాస్కర్ ఎంతో ఉత్సాహంతో "నాన్నా: నేను ఫస్ట్ క్లాసులో పాసయ్యాను - కాలేజీలో చేరతాను.." అన్నాడు.
మరే తండ్రి అయినా సంతోషంతో పొంగిపోయి కొడుకుని కాలేజీలో చేర్పించేవాడు.. కానీ ఆ తండ్రికి వడ్డీ లెక్కలు తప్ప జీవితంలో మరొకటి తెలియదు - వడ్డీకున్న ప్రాధాన్యం తప్ప మరొక దాని ప్రాధాన్యమూ అర్థం కాదు.
"ఇంకా పై చదువులా . నేను చదివించలేను. దోసిళ్ళ కొద్దీ డబ్బు గుమ్మరించాలి." అన్నాడు..
అవాక్కయిపోయాడు భాస్కర్.. అంత చిన్నతనంలో సహితం డబ్బయి పోతుందని తనను చదివించనంటోన్న తండ్రి పరమ మూర్ఖంగా కనిపించాడు.. కానీ ఆ మూర్ఖత్వాన్ని కరిగించగలిగే శక్తి అతనికి లేకపోయింది - పడ్డాడు - మొత్తుకున్నాడు - అన్నం తిననన్నాడు.
చివరకు తండ్రి మెత్తబడి ఎంతో ఔదార్యం ప్రకటిస్తూ ఒక సలహా ఇచ్చాడు- "నీకు పై చదువులు చెప్పించే షరతుమీద ఉన్న వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకో: నీ కట్నం డబ్బు నాకు వద్దులే:" అన్నాడు..
ఎలాగైనా చదువుకోవాలని పరితపించిపోతున్న భాస్కర్ ఈ సూచనకి సంతోషంగా ఒప్పుకున్నాడు.. తండ్రి తనే సంబంధం చూసి అన్నీ కచ్చితంగా మాట్లాడి వెంకట్రావుగారి అమ్మాయి సుశీలతో పెళ్లి జరిపించాడు.. పెళ్ళి చాలా వైభవంగా జరిగింది.
ఆనాడు తను ఏం చేస్తున్నాడో తెలియకుండా పెళ్ళి చేసుకున్నాడు.. ఈనాడు, అది జన్మలో తను వదిలించుకోలేని - తన మెడకు బిగుసుకున్న 'ఉచ్చు' అని గ్రహించుకున్నాడు.
భాస్కర్ ని చూడగానే "రా: రా: భాస్కర్: నీకోసమే ఎదురు చూస్తున్నాం."అని ఆహ్వనించాడు వెంకట్రావు.
తన మావగారి పిసినారితనానికి కష్టంగా ఉన్నా, ఆయన సౌహార్ద స్వభావమంటే చాలా గౌరవం భాస్కర్ కి.
"వస్తున్నానండీ:" అని సైకిల్ ఇంట్లో పెట్టేసి, ముఖం కడుక్కుని, బట్టలు మార్చుకుని వచ్చేశాడు.
రాగానే అతని చూపులు జ్యోత్స్న మీద పడ్డాయి. మతిపోయి అలాగే చూస్తూ నిలబడిపోయాడు.
తమ పై వాటాలో ఎవరో అమ్మాయి వచ్చి దిగిందని విన్నాడే కాని, అంతవరకూ చూడలేదు. ఈ అమ్మాయిలో చూడగానే చూపరులను ఆకట్టుకోగలిగే అయస్కాంత శక్తి ఏదో ఉంది.
వెంకట్రావు భాస్కర్ ని నెమ్మదిగా గిల్లి "ఒకసారి సుశీల వైపు కూడా చూడు - అప్పుడే చూపులతో నిన్ను నమిలి మింగేస్తోంది" అన్నాడు గుసగుసగా నవ్వుతూ.
అదిరిపడి సుశీలవైపు చూశాడు భాస్కర్.
నల్లని సుశీల ముఖం మరింత నల్లబడింది - లావుపాటి కళ్ళద్దాల్లోంచి ఆ చూపులు నిప్పులు కక్కుతున్నాయి. లోలోపల పళ్ళు నూరుకుంటున్నట్లు ఆ పెదవులు ముందుకూ పక్కలకూ కదులుతున్నాయి.
ఆ మూర్తిని చూసి గభాలున తల తిప్పేసుకున్నాడు భాస్కర్. ఆ వ్యక్తి తన భార్య.. ఆవిడతోనే తను 'సంసారం' చేస్తున్నాడు.
మాజీ తహసీల్దారుగారి భార్య. రేవతి తల్లి ఐరావతి ఎప్పుడు చేరిందో సుశీల పక్క చేరింది.
"సుశీలా: ఎవరో అన్నారు, మీనాన్నకి స్మగ్లింగ్ వ్యాపారస్థులతో లావాదేవీలు ఉన్నాయిటగా:"
సుశీల మండిపడుతూ "ఎవరు చెప్పారు? మా నాన్న అలాంటి వెధవ పనులు ఎప్పుడూ చెయ్యడు" అంది.
"ఏమోలే: చీటికీ, మాటికీ బొంబాయి వెళ్ళి వస్తూ ఉంటాడుగా...."
"వెళ్తే లక్ష పనులమీద వెళ్తూ ఉంటాడు. మీకీ లేనిపోని మాటలన్నీ ఎవరు చెప్పారు?"
"ఆ మధ్య ఎవరో అన్నారులే:" అనేసి ఐరావతి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. అనవలసిన మాట ఏదో అనేసి, అవతలి వాళ్ళు రెచ్చిపోయి, మండి పడి, ప్రతి సమాధానం చెప్పబోతుంటే ఏదో పని ఉన్నట్లు గభాలున వెళ్ళిపోవటంలో ఐరావతి చాలా ప్రవీణురాలు....
జ్యోత్స్న వచ్చినప్పటి నుండీ చూపులతో ఆరాధిస్తోన్న మచ్చల డాక్టరు "మీరు రాకపోతే వంట్లో బాగుండలేదేమో అనుకున్నాను" అన్నాడు.
అతణ్ణి గట్టిగా విదిలించ లేక, అతడి బారి నుంచి తప్పించుకో లేక సతమతమయ్యే జ్యోత్స్న "అవును.. తలనొప్పిగా ఉంది" అనేసింది.
"అరె: తలనొప్పా: ఉండండి: మందు తెచ్చి పెడతాను" అని లేవబోయాడు మచ్చల డాక్టర్.
ఐరావతమ్మ అక్కడేదో పిడుగు పడినంతగా కంగారు పడుతూ "జ్యోత్స్నా: ఆ మందు వేసుకోకు:" అంది.
అవమానంతో ముఖం రగులుకు పోతుండగా "ఏం? ఎందుకు వేసుకోకూడదూ:" అన్నాడు మచ్చల డాక్టర్.
"ఆ మధ్య ఎవరో అన్నారు - 'ఆ మచ్చల డాక్టర్ కి డిప్లొమా ఎలా వచ్చిందో, ఏమో కాని, అతనికి అసలు వైద్యం తెలియదు. అతని మందులు ఏనాడూ గుణం ఇవ్వవు. పైగా వికటిస్తాయి' అన్నారు...."