Next Page 
ఆనంద నిలయం  పేజి 1

                                 


                                                   ఆనంద నిలయం

                                                        - సి. ఆనందారామం

                         
    వెంకట్రావుగారు వచ్చారంటే ఆ రెండతస్తుల నాలుగు వాటాల భవనంలో ఒక విధమైన సంచలనం బయలు దేరుతుంది. అందరిలోనూ ఒక విధమయిన ఉత్సాహం తలయెత్తుతుంది. ఆయన ఎప్పుడు వచ్చినా అక్కడ పార్టీ ఏర్పాటు చేయకుండా వెళ్ళడు. పార్టీ అంటే భారీ ఎత్తున ఏర్పాట్లు ఏమీ ఉండవు. అందరూ ఇంటిముందు ఆవరణలో సమావేశమవుతారు. ఎవరి ఇళ్ళలోంచి ఎవరి కుర్చీలు వాళ్ళు తెచ్చుకుంటారు. చిన్నా పెద్దా అందరూ చేరతారు. వెంకట్రావుగారు స్వీట్, హాట్, తెప్పిస్తారు - టీ తయారు చేయిస్తారు..  
    టిఫిన్ ప్లేట్స్, స్పూన్స్, - వగైరా కూడా అందరి ఇళ్ళలోంచీ వస్తాయి..
    ఆరోజూ అందరూ అలాగే సమావేశమయ్యారు.. చిరునవ్వులు చిందిస్తూ కూచున్నారు వెంకట్రావుగారు.. ఆయన నవ్వు చాలా తమాషాగా ఉంటుంది.. ఎవరినో వెక్కిరిస్తూ తనలో తను నవ్వుకొంటున్నట్లుగా ఉంటుంది..   
    ఎడంవైపు వాటాలో ఉన్న రిటైర్డ్ తహసీల్దారుగారు వెంకట్రావుగారి పక్కచేరి "ఈ మధ్య ఎక్కడ చూసినా ఇన్ కంటేక్స్ వాళ్ళ రెయ్ డ్స్ ఎక్కువగా ఉన్నాయి. మూలమూలలదాచిన నల్లధనమంతా బయట పడేస్తున్నారు.." అన్నాడు అదోలా భావగర్భితంగా నవ్వుతూ..  
    "అవును...."
    "మీలాంటి వాళ్ళకి భయం లేదనుకోండి - బ్లాక్ మనీ మీదగ్గిరుండదు గనుక...."
    "ఉంటేమాత్రం వాళ్ళకి దొరుకుతామేమిటండీ? వాళ్ళ రెయ్ డ్స్ వాళ్ళు చేస్తుంటారు- మా జాగ్రత్తలో మేముంటాము...."
    రిటైర్డ్ తహసీల్దారుగారు గతుక్కుమని, "అంటే మీదగ్గిర.... అహహ.... బాగానే పోగేశారన్నమాట.. లెక్కకు.... ఎంత మాత్రం?" అన్నాడు.. వెంకట్రావుగారు గట్టిగా నవ్వి "భలేవాడే: ఏదో మాట సామెతగా అన్నాను.. నా దగ్గిర బ్లాక్ మనీ ఎక్కడిదండీ: నేనేమైనా వ్యాపారస్థుణ్ణా: ఏదో, అటు ఇటు తిరుగుతుంటాను.." అన్నాడు..
    మాజీ తహసీల్దారుగారు అందుకు ఒప్పుకోక "అదేంమాట లెండి: మీరు తరచు బొంబాయి ఎందుకు వెళ్ళి వస్తున్నట్లు: ఏవో వ్యాపారాలు రహస్యంగా చేస్తుంటారు.... అవన్నీ మాకు తెలియనిస్తారా?" అన్నాడు ఈర్ష్యగా దెప్పుతున్నట్లుగా-   
    వెంకట్రావుగారి కళ్ళు మెరిశాయి. తనను చూసి ఈర్ష్యతో ఉడికిపోతున్న మాజీ తహసీల్దారుగారిని ఉల్లాసంగా చూసి చిలిపిగా నవ్వుకుంటూ "అబ్బే: అదేంలేదండీ: లేనిపోనివి పెట్టకండీ...." అన్నాడు-
    వెంకట్రావుగారి దగ్గిర బోలెడు డబ్బుందని అందరికీ తెలుసు. ఆయన ఎక్కడకు వచ్చినా కారులోనే వస్తాడు - పార్టీ లిస్తాడూ దర్జాగా బ్రతుకుతాడు. అయితే, ఆ డబ్బంతా ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు ఎంత ఉందో మాత్రం ఎవరికీ తెలియదు - ఆ విషయం కూపీలాగాలని వెంకట్రావుగారి చుట్టూ చేరినవారు ఎప్పుడు శాయశక్తులా ప్రయత్నిస్తోనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నాలు ఏనాడూ ఫలించనివ్వరు వెంకట్రావుగారు - అల్లరి సమాధానాలు చెప్తూ - దొరక్కుండా తప్పించుకుంటూ ఉంటారు -
    ఎడంవైపు పైవాటాలో ఉన్న మచ్చల డాక్టరు "అందరూ వచ్చారు కాని, జ్యోత్స్న రాలేదు -" అన్నాడు - అతని పేరు ఏకాం బరనాథ్ - కానీ, పాపం, అతణ్ణి ఆ పేరుతో ఎవరూ పిలవరు. చిన్నతనంలోనే మశూచికం వచ్చి ముఖం నిండా గుండ్లు ఏర్పడ్డాయి. అతడు డిగ్రీ కోర్సులు చదువుకో లేదు. హోమియోపతి డిప్లామా తీసుకున్నాడు - అందులో కూడా రాణించలేక పోతున్నాడు - అతని దగ్గరకు మందుల కెవ్వరూ రారు. అతని మందులు పనిచేస్తాయని ఎవ్వరూ నమ్మరు - రూపమూ, డబ్బూ, హోదా, ఏదీలేని ఒక మెతక మనిషిని ఏడిపించాలంటే అందరికీ సరదాగానే ఉంటుంది.. మనను ఎవరైనా వెక్కిరిస్తే భరించలేం కాని - మరొకరిని వెక్కిరిస్తోంటే హాయిగా ఆనందించగలం.. అందుకే అతణ్ణి అందరూ ముఖం మీదే 'మచ్చల డాక్టర్' అని పిలుస్తారు.. అలా పిలిచేవాళ్ళందరిమీదా అతనికెంత కసిగా ఉన్నా, నిస్సహాయుడై ఏమీ చెయ్యలేకపోతున్నాడు- ఆ నాలుగు వాటాల భవనంలో తనను కూడా ఒక మనిషిగా మన్నించి సానుభూతితో మాట్లాడేది జ్యోత్స్న ఒకర్తే.... అందుకే అతడు ఏ క్షణంలోనూ జ్యోత్స్నని మరిచిపోలేడు.
    రిటైర్డ్ తహసీల్దారుగారి అమ్మాయి రేవతి లేచి "జ్యోత్స్నని నేను పిలుచుకొస్తాను.." అని కుడివైపు పైవాటాలోకి వెళ్ళింది.
    జ్యోత్స్న అంతగా చదువుకోలేదు. అసాధారణమైన అంగసౌష్ఠవంతో, చూసిన వాళ్లు కొన్ని క్షణాలపాటు తన మీద నుంచి చూపులు తిప్పుకోలేనంత అందంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది - ఒంటరిగానే ఉంటుంది.. తన వ్యక్తిగత విషయాల్లో మరొకరిని కల్పించుకోనివ్వదు. ఎవరినీ లెక్కచెయ్యదు.. ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికే ప్రయత్నిస్తుంది - జ్యోత్స్న అందం చూసి ఆడవాళ్ళందరూ అసూయపడతారు.. అసూయ పడటంలో అందరికంటే కాస్త పైచెయ్యి రేవతిది. బి.ఏ. మూడుసార్లు ఫెయిలయిన రేవతికి తను చదువుకున్న దానినని చాలా గర్వం.    
    "క్రింద పార్టీ జరుగుతోంటే రాకుండా ఇక్కడ కూచున్నారేం?" అంది రేవతి....

Next Page