'మాగృదః కస్యచిద్ధనం" మరొకసారి ధనాన్ని హరించకు. లోకంలో ఉన్న తగాదాలన్నీ ధనం చుట్టే పరిభ్రమిస్తున్నాయి. ధనం అంటే చిరస్థిర ఆస్తులు. ఎవని ధనమూ ఎవడూ అపహరించడు. అలాంటప్పుడు రాజ్యాలు, యుద్ధాలు, హింస, మారణ హోమాలు ఉండవు. శాంతి పరిమళాలు వెల్లి విరుస్తాయి. స్వర్గం అనేది నేలకు దిగివస్తుంది.
ధనం, మానవ సంబంధాలే అశాంతికి కల్లోలాలకు కారణాలు. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలు జగడాలకు కారణాలు అవుతాయి. సాహిత్యం ఆస్తిని గురించి అనేక సంప్రదాయాలు, ఆచారాలు స్థిరపరిచింది. చాలావరకు ద్వేషకావేశాలను నివారించగలిగింది. ఇప్పుడున్న ఆస్తి విషయక వ్యాజ్యాలు ఒక శాంతం కూడా కావు. సామాజిక నేతలు, సాహిత్యం, తొంబదితొమ్మిది శాతం మందికి శాంతి ప్రసాదించగలిగారు!
వాస్తవ విజయం సాధించింది లైంగిక సంబంధాల్లో! ఎంతటి నీచుడైనా తల్లీ- అక్కా చెల్లెళ్ళ పొందు కోరడు!! ఒక భార్య - ఒక భర్త ఇది అనంత విజయం. 'అనన్యారాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథా' అంటుంది సీత. రాముడూ నేను అన్యులంకాం - అనన్యులం. సూర్యుడూ వెలుగు వలె కలిసిపోయినవాళ్ళం. ఇలాంటి బాంధవ్యం కలిగించడం ఎంత కష్టం? నేటి సమాజంలో సహితం అత్యధిక శాతం దంపతులు దీన్ని పాటిస్తున్నారు.
పూర్తి స్వేచ్ఛ ఎక్కడా, ఏనాడూ ఉండదు. స్వేచ్ఛకు శృంఖలాలుంటాయి. ఆ పరిధిలోనే స్వేచ్ఛ. అది దాటితే నేరం. నేటి సమస్త సమస్యలకూ, రుగ్మతలకు కారణం 'విశృంఖల స్వేచ్ఛ.' ఇది నరుని జంతుదశ నాటిది! దీన్ని నాగరికత అనడంలోనే ఉన్మాదం ఉంది. ఉన్మాదానికి కార్యకారణ సంబంధం ఉండదు. అది వెర్రివాని చేతిరాయి.
నరునికి సభ్యత, సంస్కారం నేర్పడానికి సాహిత్యం అనేక అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. సంగ్రహంగా అవి ఇలా ఉంటాయి.
1. ప్రభు సంహిత.
సమాజానికి, విశ్వానికి హితం కూర్చేది సంహిత. 'హితం' అంటే రానున్న మేలు. 'ప్రియం' అంటే అప్పటి మేలు. అప్పటికి కటువైనా దీర్ఘకాలపు ప్రయోజనం కలిగించేది 'హితం' మందులు తత్కాలకటువు. తరువాత ఆరోగ్యం, ఆయుష్యం కలిగిస్తాయి.
"సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః
ఇది రామాయణంలోని శ్లోకం. విభీషుణుడు రావణునితో అన్న మాటలివి.
రాజా! నిత్యం ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా లభిస్తారు. కాని అప్రియం అయినా హితం చెప్పేవారు, వినేవారూ దుర్లభులు.
తొలుత సాహిత్యం ప్రభుసంహిత అయింది. అది ప్రభువు వలె శాసించింది. మనిషికి నాగరికత, సంస్కారం నేర్పింది. వేదం ప్రభుసంహిత. వేదానికి తిరుగులేదు. వేదం చెప్పింది ఆచరించాల్సిందే. గత్యంతరం లేదు వేదం శాసిస్తుంది. శాసనానికి అంతా లొంగాల్సిందే!
"దంతాన్ ధావయేత్ ప్రాతః" ఉదయం దంత ధావనం చేసుకోవాలి. అది విధి, శాసనం.
"కర్తా స్వయం పాదౌ ప్రక్షాళ్య" కర్త స్వయంగా తన కాళ్లు కడుక్కోవాలి. అంతే మరొకణ్ణి కడగమనరాదు.
2. మిత్ర సంహిత
ఈ నరుడున్నాడే - వాడు విచిత్రాతి విచిత్రుడు. అతడు ఎల్లప్పుడూ ఒకదానికే కట్టుబడి వుండడు. అతనికి కట్లు బాట్లు ఇష్టం ఉండవు. స్వేచ్ఛాచారి కావాలనుకుంటాడు. అడ్డు లేని ఆకాశంలో విహరించాలనుకుంటాడు!
నరుడు ప్రభుసంహితమగు వేదాన్ని ప్రశ్నించాడు. అందులోని గతినే ప్రవర్తించాలానే నియమమేం? అన్నాడు ధిక్కరించాడు.
బిడ్డ తల్లి రొమ్మును తంతుంది. తొక్కుతుంది. తల్లి కోపించడు. ముద్దులు కురిపిస్తుంది. సాహిత్యం వ్యక్తికీ, సమాజానికీ తల్లి లాంటిది. బిడ్డలు వేదం చెప్పింది వినలేదు. అందుకు వేదం కోపగించలేదు. నరుని సక్రమ మార్గాన నడిపించాలనుకుంది. అన్వేషణ - పరిశీలన - తపస్సు కొనసాగించింది. ఆ తపస్సు లోంచి ఆవిష్కరించిన అమృతమే 'కథ' కథ వినడానికి సొంపుగా ఉంటుంది. ఆ కథలో సందేశాన్ని చేర్చడం ఈ టెక్నిక్కు.
మిత్రుడు చెపుతే నరుడు వింటాడు. కాబట్టి సాహిత్యం సమాజానికి మిత్రం అయింది. ఆవిధంగా సమాజం కోసం తన స్వరూపాన్ని మార్చుకుంది. పేరు మార్చుకుంది. కాని గుణం మార్చుకోలేదు. "విశ్వశ్రేయః కావ్యం"
రామాయణ - భారత - భాగవత - పురాణాదులు మిత్రసంహితులు.
దశరథుడు ముసలితనంలో వయసు పెళ్లాం కైకను తెచ్చుకున్నాడు. కైక మాట జవదాటలేకపోయాడు. కుటుంబం విచ్ఛిన్నం అయింది. దశరథుడు నశించాడు. ఈ సందేశం కోసం అద్భుతం అయిన కథ అల్లారు వాల్మీకి. కథ బోనసులాంటిది. సందేశం సరుకు లాంటిది. సరుకుల అమ్మకం కోసం బోనస్ ఇస్తాడు. మనం బోనసు కోసం సరుకు కొంటాం. మిత్ర సంహిత బోనస్ చూపి సందేశం అందించడం లాంటిది.
నాటి నుంచి నేటి వరకు కథ జనులకు అత్యంత ప్రియం అయింది. నేడు వ్యాపార సంస్థలు కూడా దీన్ని వాడుకుంటున్నాయి.
3. కాంతాసంహిత
మిత్రవాక్యం తు కర్తవ్యం. మిత్రుడు ఎలాంటి వాడు? కర్ణుని వంటివాడు. సుగ్రీవుని వంటివాడు. పోగాలము దాపురించినవాడు దీప నిర్వాణ గంధమును, అరుంధతిని, మిత్ర వాక్యమును మూర్కొనరు, కనరు, వినరు అని చిన్నయసూరి నీతిచంద్రిక. అట్లయినా కావ్య ఇతి హాస పురాణాదులు జనం వినోదం కోసం విన్నారు. సందేశం పట్టించుకోలేదు.
సాహిత్యం, సాహిత్యకారులు సమాజానికి పితృతుల్యులు. తప్పుదోవ పట్టిన బిడ్డను వదులుకొనరు. సాహిత్యం మళ్లీ ఆలోచనలో పడింది. విన్నదానికన్న చూచి, విన్నదాని ప్రభావం అధికం అవుతుందని కనిపెట్టారు!
మిత్రుని మాట వినడు. ప్రియురాలి మాట వినకుండా ఉండలేదు. ప్రియుడు మేను వాలుస్తాడు. ప్రియురాలు పడకమీద కూర్చుంటుంది. ఆకులు, పోకలు అందిస్తూ చెపుతుంది. అతడు తన చేతి వేళ్లు ఆమె ముంగురుల్లో దూరుస్తాడు. వింటాడు. వినకుండలేడు! అది మనసుకు పడ్తుంది. తప్పక ఆచరిస్తాడు.
అలాంటిది నాటకం. అది కాంతా సంహిత. ప్రేక్షకుడు నాటక ప్రదర్శనలో లీనం అవుతాడు. చూచినంతసేపు అతనిని మాయకప్పుతుంది. పాత్రధారులను మరుస్తాడు. పాత్రలను నిజమైనవిగా భావిస్తాడు. అందులో లీనం అవుతాడు.
"నాటకాంతం హి సాహిత్యం" అన్నారు.
"కావ్యేషు నాటకం రమ్యం" అన్నారు.
కాళిదాసు 'అభిజ్ఞానశాకుంతలం' నాటకాల్లో రమ్యం అయింది.
శకుంతల 'అనాఘ్రాతం పుష్పం' వాసన చూడని పూవు. దుష్యంతుని వ్యామోహామ్లో పడింది. కాలు జారింది. గర్భవతి అయింది. ఇది తల్లిదండ్రుల అనుమతి లేకుండా పురుష సమాగమపు పరిణామం. అందుకు ఫలితంగా శకుంతల నానాపాట్లు పడింది. ఇది ఆవివాహితులకు హెచ్చరిక!
"మంగళాదీని, మంగళమధ్యాని, మంగళాంతాని కావ్యాని" కావ్యం శుభారంభం కావాలి. కావ్య మధ్యంలో శుభం జరగాలి. కావ్యం సుఖాంతం కావాలి.
శకుంతల పరితపిస్తుంది. నాటకం సుఖాంతం అవుతుంది.
సినిమా ముగియగానే 'శుభం' వేస్తారు. అది మన సంప్రదాయ సిద్ధం అయిన మంగళాంతం.
గ్రంథాన్వేషణ
నా రచన శ్రీమహాభారతము 2,000 పేజీలది. అది మూడు సంపుటాల్లో అచ్చయింది. సిద్ధం అయింది. భవ నామ సంవత్సరం ఉగాది 11- 04 -94 ఆవిష్కరణ జరిగింది. నాటి నుంచి నాకు వేదాన్ని గురించిన ధ్యాస వెన్నంటింది. వదలలేదు. వేదం జంతు దశ నుంచి నరుణ్ణి మానవునిగా సిద్ధం చేసింది. అంతటి గ్రంథం మానవ జాతికి మరొకటి లేదు. వేదం భారత దేశంలో అవతరించింది. అంత మాత్రాన భారతజాతికీ - అందునా ఏదో ఒక మతానికి చెందింది మాత్రం కాదు. సూర్యుడు ఉదయించడం మాత్రమే తూర్పుదిశన. అతడు సకల దిశలకూ ప్రకాశం ప్రసాదిస్తాడు. వేదం సూర్యుడు. వేద ప్రకాశం సకల ప్రపంచానికి వ్యాపించింది. ఆధునిక యుగంలో పాశ్చాత్యులే వేదాన్ని ఎక్కువ అధ్యయనం చేశారు. పరిశీలన - పరిశోధన చేశారు.
భారత దేశానికి వేదం పవిత్రం. చరిత్ర - కాలం - కారణాలు ఏమైనా వేదం కొన్ని వర్గాలకే పరిమితం అయింది. ఆ వర్గాలు సహితం వేదార్థం గ్రహించలేదు. వేదంలో కొన్ని భాగాల పఠనం చేశారు. ద్వివేది - త్రివేది - చతుర్వేది అనే వంశనామాలు ఇందుకు ఉదాహరణలు. ఆ వర్గాల వారు వేదం తమ 'గుత్తసొమ్ము' అన్నట్లుగా వ్యవహరించారు. ఆ వర్గంలో 'స్త్రీలకు సహితం వేదాన్ని ముట్టుకునే అర్హత లేదు' అన్నారు. మిగతా వర్ణ, వర్గాల వారికి వేదం స్మరించే అర్హత లేదని నిషేధించారు!
ఈ విధి, నిషేధ కారణంగానే పూర్వ కవులు వేదాలను, ఉపనినిషత్తులను అనువదించడానికి పూనుకోలేదు. అందువల్ల సాధారణ మానవులకు వేదం చదివే అవకాశం లభించలేదు. ఒక వర్గం చేత బహుజనులు వంచితులు అయినారు. జ్ఞాన విజ్ఞానాలు సూర్యచంద్ర కాంతులవంటివి. జ్ఞానం ఏ ఒక్కరి అధికారి పరిధిలోనిది కాదు. ప్రకృతి ప్రకాశాన్ని మూట గట్టి, ఇనప్పెట్టెలో దాచి పెట్టడం అసాధ్యం. తృష్ణ గలవారు సాధించి తీర్తారు. ఆంగ్లేయులు, మహమ్మదీయులు కూడా వాటిని అధ్యయనం చేశారు.
బయట వారికి వేదం అందుతున్నది, మనవారు ఎందుకు వంచితులు కావాలి? ఈ ఆలోచన నన్ను వెన్నాడింది. నిద్ర లేకుండా చేసింది. ఇది ఆశయం మాత్రమే. కొన్ని ఆశయాల సాధన ఒక జన్మతో సాధ్యపడదు. వేదం విస్తృతిలోనూ, గంభీరతలోనూ మహామహాగ్రంథం. అది మనకు అర్థం అవుతుందా? అర్థం చేసుకోవడం వేరు - ఇతరులకు అర్థం చేయించడం వేరు. అది కష్టతరం. సాధించగలమా? అనే సంశయం కొన్నాళ్ళు కొనసాగింది.
మనిషి సాధిద్దాం అనుకుంటాడు. అడ్డుకునేవాళ్లు అనేకులుంటారు. నాకూ అడ్డంకులు ఎదురైనాయి. శక్తిస్తోమతలు అర్హతానర్హతల పేర అనేకమంది అడ్డుకట్టవేశారు "నీకిది క్షేమం కాదు" అని హెచ్చరించినవారున్నారు. నేను జన్మతః విశిష్టాద్వైతిని, సిద్ధాంతపరంగా వేద కర్మలకు అనుకూలురంకాదు. వేదాధ్యయనం వృత్తిగా చేసేవాళ్ళం కాదు. వేదాన్ని అద్వైతులు తమ జన్మహక్కుగా భావిస్తారు. వారూ, మావాళ్ళూ, వికృత భవిష్యత్తు చూపి భయపెట్టారు. భయం మానస స్వభావం. కుటుంబం గలవాణ్ణి, అరవయ్యైదేళ్ళ వృద్ధుణ్ణి భయపడడం స్వభావమే!
నా స్వభావంలో తిరుగుబాటుంది. మహా భారత రచన పూర్తి చేసినవారు అరుదు. నాకూ పుత్రవియోగం - నాకు ప్రాణాంతకం కలిగాయి. అయినా భగవంతుని మీద భారం వేశాను పూర్తి చేశాను. వేదం భారతాన్ని మించింది. వేదాన్ని మించింది లేదు. భారం భగవంతుని మీద వేశాను. వేదాలు నాలుగూ తెలుగు 'సులభ' వచనంలో అనువదించడానికి కృత నిశ్చయుణ్ణి అయినాను.
ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రప్తులై
యారంభించి పరుత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతో త్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావుతన్
భర్తృహరి - ఏనుగు లక్ష్మణ కవి.
భర్తృహరి కార్య విషయంలో నరులను మూడు రకాలుగా విభజించాడు.
1. నీచులు - విఘ్న భయంతో ప్రారంభించరు.
2. మధ్యములు - ప్రారంభిస్తారు. విఘ్నం కలిగితే మానేస్తారు.
3.ధీరులు - ఎన్ని విఘ్నాలు వచ్చినా ఆరంభించిన కార్యం పూర్తి చేస్తారు.
మధ్యమునిగా ప్రారంభించడానికి నిర్ణయించాను. "శ్రేయాంసి బహువిఘ్నాని" అని ఆర్యోక్తి. శ్రేయోకార్యానికి అనేక విఘ్నాలు. 'తొలిముద్దలోనే ఈగ' అన్నట్లు గ్రంథాలు లభించడం దుష్కరం అయింది.
ఆధునిక యుగంలో పుస్తకాలు పుట్టలకొద్దీ - గుట్టల కొద్దీ దొరుకుతున్నాయి. వీటిలో ఆంగ్ల గ్రంథాలు ఎక్కువ. తదుపరి భారతీయ భాషా గ్రంథాలు దొరుకుతాయి. సంస్కృత గ్రంథాలు దొరకవు. షేక్స్సియరు నాటకాలు మూలమో, అనువాదమో చదివిన వారున్నారు. కాని భాస, కాలిదాస, అశ్వఘోష, భవభూతి నాటకాలు ఎందరికి తెలుసు? పాఠ్యంశాల్లో ఉన్నందున శాకుంతలం పేరు తెలుసు, ఆ నాటకాన్ని చదివిన వారెవరు? కాళిదాసు రచనలు శాకుంతలం మాళవికాగ్నిమిత్రం- విక్రమోర్వశీయ నాటకాలను 1960 లో పిల్లల కోసం సులభ శైలిలో రచించాను.
ఆంగ్లంలో వేదాలను గురించిన గ్రంథాలు చదివాను. కాని అవి వేదం చదివి వ్రాసినట్లుగా కనిపించలేదు. ఒకరి గ్రంథం ఆధారంగా మరొకరు వ్రాసినట్లు అనిపించింది. సంస్కృత మూల వేదం కోసం అన్వేషణ సాగించాను.