Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 1

                                 

                                శుక్ల యజుర్వేద సంహిత

            అక్షర వాచస్పతి  డాక్టర్  దాశరథి  రంగాచార్య

 

                                      వేద భాస్కరుడు
                                             ఓం నమో వేద పురుషాయ  
                           హృదయం దక్షిణం చాక్షి మండలంచాధిరుహ్యయః |
                            చేష్టతే తమహం నౌమి బుగ్యజుస్సామ విగ్రహం ||

             

 భగవానుడు నన్ను అనుగ్రహించాడు. కేవలం పరమతుమ్ముని కరుణా కటాక్షం వలన శ్రీమద్రామాయణ (1963),శ్రీమహాభారత (1994), శ్రీమహాభాగవత (1970) గ్రంధాలను ఆంధ్ర  వచనంలో రచించగలిగాను. భారత సంస్కృతికి  మూలస్థంభాలు ఆ గ్రంధాలు. ఆ మూడింటినీ ఒక్కడు రచించిన  దృష్టాంతరాలు అరుదు.

    భగవదనుగ్రహం లేక ఏ కార్యము ప్రారంభం కాదు. కొనసాగదు, పూర్తికాదు, ఏలనన సకల కర్మలు  భగవదధీనములు.

    ఈ మూడు మహాగ్రంథాలను శ్రీరామా పబ్లిషర్స్, సిద్డంబర్, హైదరాబాద్ -012 వారు ప్రచురించారు. అందుబాటులో ఉంచారు.

    కేవలం భగవదనుగ్రహం  వలన నాలుగు వేదాల వచనానువాదం చేశాను. ఇది మానవ మాత్రులకు ఆసాధ్య  కార్యం. భగవానుడు నన్ను ప్రోత్సహించాడు. వ్రాయించాడు. కాకున్న వార్థక్యంలో, బలహీన శరీర మనస్సులతో ఇంతటి మహత్కార్యం నావంటి సామాన్యునికి సాధ్యం కాదు.

    వేదం అనువదించాలనే ఆలోచన ఆరున్నరపదులు దాటింతరువాత రావడం ఏమిటి? అది ఆవేశం కావచ్చు. ఆరాటం కావచ్చు. అణగిపోరాదా! పోదే! పట్టుకొని వదలదే? ఇదేమైన సామాన్య కార్యామా? ఉత్తరమా! కథయా! నవలయా! వేదమంటే వేదం!! సామాన్యం కాదు. సాధారణం కాదు. అసామాన్యం! అసాధారణం! అదేమన్నా మానవ ప్రోక్తమా?

    "పురుష ఏవేదగ్ం సర్వం యద్భూతం యచ్చభవ్యం"

    సర్వమూ వేద పురుషుడే. జరిగిందీ, జరుగనున్నదీ సర్వమా వేదమే!

    వేదం హిమవదున్నతం. ఆకాశమంటి విశాలం. సముద్రమంతటి గహనం. గంభీరం. వాయువు వలె సర్వవ్యాప్తం.

    వేదం అంత గొప్పది. నేను ఎంతో చిన్న వాణ్ణి. నేనేమిటి? వేదానువాదం గురించి ఆలోచించడం ఏమిటి? రచనకు పూనుకోవడం ఏమిటి?

    ఇది కేవలం భగవదనుగ్రహం. అంతకన్న వేరు కాదు.   

    ప్రతి ప్రాణికీ పరిమిత శక్తి ఉంటుంది. అదీ పరాత్పరుడు ప్రసాదించిందే. ఆ శక్తి వరకు ఏదైనా చేస్తే అతని శక్తి అనవచ్చు. చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. వప్పుకున్నావప్పుకోవచ్చు.

    కాని శక్తికి మించిన కార్యం చేసిందంటే? చీమ కొండను కదలించిందంటే? దోమ ఆకాశానికి ఎగిరిందంటే? బిందువు సముద్రాన్ని మ్రింగిందంటే? విచిత్రం కదా? ఆశ్చర్యం కదా? అచ్చెరువు కదా! అయినా అప్పుడప్పుడూ అలాంటివి జరుగుతాయి. అది కేవలం భగవదనుగ్రహం వలన జరుగుతాయి!

    అలాంటిదే నేను వేదాధ్యయనానికి పూనుకోవడం. అర్థంచేసికొనడం. అనువదించడం. ఆశ్చర్యకరమేమరి! మీకు కాదు. వ్రాసిన వాణ్ణి నాకే ఆశ్చర్యం?! ఆంధ్రసాహిత్య చరిత్ర వేయేళ్ళు నిండింది. ఇందులో ఎంతమంది మహా కవులు! మహనీయులు! మహితాత్ములు! మహానుభావులు! ఎవరి కారణాలు వారివి. ఎవరూ నాలుగు వేదాల అనువాదానికి పూనుకొనే లేదు. అంతటి సుదీర్ఘ కాలంలో భగవానుడు నాకే సంకల్పం కలిగించాడు! మరి విచిత్రమే కదా! అచ్చెరువే కదా! ఆశ్చర్యమే కదా!

        "ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీయుర్వింఋరాణావళుల్   
        తెనుగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
        తెనుగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిన్ దెనింగించి నా
        జననంబున్ సఫలంబు చేసెద బునర్జన్మంబు లేకుండగన్"

    అన్నాడు భక్తశిఖామణి బమ్మెర పోతనామాత్యుడు. అది నాకూ వర్తించవచ్చు. కాని అంత అందంగా చెప్పడం రాదు. అందుకే గంటం తేనెలో ముంచి వ్రాసిన పోతన పద్యం ఉదాహరించాను.

    పోతనామాత్యుడు నాకు ఆదర్శం. అతనికి సాటి రాలేను. అందుకే వచనాన్ని వరించాను.

        ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి, పురంబులు వాహనంబులున్
        సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి, శరీరము బాసి కాలుచే
        సమ్మెట పోటులంబడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
        బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్

    పోతన మనుజేశ్వరాధములకు అంకితం ఇవ్వలేదు. నేనూ కాసుకు ఎవరికీ అంకితం ఇవ్వలేదు. మహానుభావుడు పోతన జగత్ హితానికి భాగవతం రచించాడు. నేనూ ఏ రచనా కాసుకోసం గాని, కీర్తి కోసం గాని చేయలేదు.  నా ధర్మంగా రచించాను. జనుల కోసం రచించాను రచన చేసి ఆర్జించింది అతి తక్కువ!

    బాల రసాల పుష్ప నవపల్లవకోమల కావ్యకన్యకన్
    గూళలకిచ్చి యప్పడుపుగూడు భుజించుట కంటె సత్కవుల్
    హాళికులైన నేమి మరి యంతకు నాయతిలేనినాడు గౌ
    ద్డాలికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై

    పోతనదిగా చెప్పబడుతున్న ఈ పద్యం మంచన 'కేయూరాబాహుచరిత్ర'1-13లోనిది.

    నేనూ నిజదార సుతోదర పోషణార్థం ఉద్యోగం చేసుకున్నాను తప్ప కాసుకు కావ్యాన్ని అమ్ముకోలేదు. 71. సంవత్సరాల జీవితంలో ఒకణ్ణి అర్థించి ఎరుగను.

    నా బాల్యంలోనూ తండ్రిగారు వేదంలోనిది అని చెప్పబడే దిగువ శ్లోకం ఉదాహరిస్తుండేవారు.

    "దంతాన్ ధావయేత్ ప్రాతః పలాశ వట పిప్పలైః"

    ఉదయం పళ్లు తోముకోవాలి - మోదుగు, మర్రి, రావి పుల్లలతో దంతధావనం నుంచి జీవితం సమస్తం వేదంలో వివరించబడిందని చెప్పడం వారి ఉద్దేశ్యం.

    ఆనాడే నాకు వేదం మీద ఆసక్తి కలిగింది. మాది విద్వత్ కుటుంబం. ఇంట్లో ఆంధ్ర, ద్రావిడ, సంస్కృత గ్రంథాలు అనేకం ఉండేవి. వాటిలో వేదం వెదకాలని నా ఆతురత. అలా వెదుకుతూ నేను పడిపోయాను. నా మీద భారీ గ్రంథాలు పడ్డాయి. ఆ చప్పుడుకు ఇంట్లోని వాళ్లంతా ఉరికి వచ్చారు. గ్రాంథాలు పడ్డాయి. ఆ చప్పుడుకు ఇంట్లోని వాళ్లంతా ఉరికి వచ్చారు. గ్రంథాలు తీశారు. నన్ను బయటకు తీశారు.

    'ఏం వెదుకుతున్నావు?' మా నాయన అడిగారు. వారి ధ్వనిలో విసుగూ ఉంది, కోపం ఉంది.

    "వేదం" అన్నాను.

    నాయన అంత కోపంలోనూ పగలబడి నవ్వారు- వారిని చూచి అంతా నవ్వారు.

    నేను చిన్నబుచ్చుకున్నాను.

    "వేలెడు లేడు వేదం చదువుతాడట" అన్నారు నాయన. వారు ఈ విషయం చాలమందికి సగర్వంగా చెప్పుకున్నారు!

    రెండోప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో నేను 5,6 తరగతి చదువుతున్నాననుకుంటా. నలుగురు కలిసిన చోట వేదప్రస్తావన వచ్చేది. హిట్లర్ మన వేదాలు ఎత్తుకుపోయాడు. వేదాలననుసరించే బాంబులు చేస్తున్నాడు. జర్మనులు ఆర్యులు. హిట్లరే గెలవాలి అనుకునేవారు. ఇంగ్లీషు వారి మీద ద్వేషంతో హిట్లరు గెలవాలనేవారనుకుంటా. మరొక కారణమూ ఉంది. హిట్లరు పతాకంలో "స్వస్తిక్" ఉండేది. హిట్లరు గెలవాలనేవారనుకుంటా. మరొక కారణమూ ఉంది. హిట్లరు పతాకంలో "స్వస్తిక్" ఉండేది. హిట్లర్ తనను ఆర్యుడు అనుకునేవాడు. ఆర్యులకే లోకాలను పాలించే అధికారం ఉందనుకునేవాడు. "కృణ్వంతో విశ్వమార్యం" లోకాన్ని ఆర్యమయం చేద్దాం అనేది అతని నినాదం.

    "కృణ్వంతో విశ్వమార్యం" కు హిట్లరుది కువ్యాఖ్యానం. లోకమంతటినీ సభ్యసమాజం చేద్దామని అసలు అర్థం. రాజకీయ ఆధిపత్యం వేద నినాదం కాదు. సమాజాలను సంస్కరించడం వేదపు లక్ష్యం. ఈ విషయాలు తరువాతి అవగాహన. ఆనాడు  నేనూ హిట్లరు గెలవాలనే అనుకున్నాడు.

    తదుపరి కాలంలో నాకు ప్రజా ఉద్యమాలతో సంబంధం ఏర్పడింది. బోల్షివిక్ రష్యా మామీద అనంత ప్రభావం వేసింది. రాజకీయ అవగాహన ఏర్పడింది. జాతి దురభిమానం ప్రమాదకరం అని అర్థం అయింది. అప్పుడు హిట్లర్ ఓడాలనుకున్నాం. ప్రజాస్వామ్యం గెలవాలనుకున్నాం. అలాగే జరిగింది. హిట్లరు ఓడాడు. ప్రజాశక్తులు విజయం సాధించాయి!

    నేను నిజాం వ్యతిరేకం సాయుధ పోరాటంలో పాల్గోన్నాను. 1948లో నిజాం రాజ్యం మీద పోలీసు చర్య విజయవంతం అయింది. నిజాం రాజ్యం భారత యూనియన్ లో విలీనం అయింది. కొద్ది రోజుల్లోనే వచ్చిన స్వాతంత్ర్య 'మేడిపండు' అని తేలిపోయింది. ప్రాణాలకు తెగించి పోరాటం జరిపిన వారు బికారులైనారు. నిన్నటి నిజాం తొత్తులు ఖద్దరు కట్టి రాజ్యమేలారు!

    పోరాట కాలంలో విప్లవ సాహిత్యం అధ్యయనం చేశాం. దాంతో భారతీయ సాహిత్యం విషయంలో విముఖత ఏర్పడింది. విముఖత సరైన పదం కాదు. అసహ్యం ఏర్పడింది అంటే వాస్తవం అవుతుంది. భారతీయ సంస్కృతీ సాహిత్యాలకు ఆంగ్ల సాహిత్యంతో బాటు వామ పక్షాలు ద్రోహం చేస్తున్నాయనేది నేటి నా నిశ్చితాభిప్రాయం.

    వామ పక్ష సాహిత్య ప్రభావం నుంచి బయట పడడం దుర్లభం. అయితే నాకు గల సంప్రదాయ ప్రభావమో, భగవదనుగ్రహమో నేను ఆ ప్రభావం నుంచి బయట పడ్డాను. కాని కమ్యూనినిస్టు పార్టీలను గాని, కమ్యూనిస్టు సాహిత్యాన్నిగాని ద్వేషించడం లేదు.

    ద్వేషించడం నా స్వభావానికి విరుద్ధం!

    అలా బయట పడ్డాను. భారత సాహిత్య, సంస్కృతులను పునరధ్యయనం చేశాను. అప్పుడు భారత సాహిత్యం హిమవదున్నతం. అనన్యసామాన్యం అని అర్థం అయింది. ఒక్కొక్క గ్రంథ అధ్యయనానికి జీవితాలు సరిపోవు. జన్మజన్మలు కావాలని గ్రహించాను.

    1963 అనుకుంటాను నేను రామాయణం రచించిన సందర్భంగా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు నాకు సన్మానం చేశారు. ఈ విషయం నా 'జీవనయానం'లో వివరించాను.

    సభ ముగిసింది. విశ్వానాథ నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. నా చెవిలో మూతి పెట్టి అడిగారు.

    "రంగాచార్లూ! రామాయణం నీకేమైనా అర్థమైందీ?"

    "గురువుగారూ! నాకేమీ అర్థం కాలేదు" అనే వాస్తవం చెప్పాను.

    "ముప్పయ్యేళ్లు ఏడ్చిన ముండావాణ్ణి నాకే అర్థం కాలేదు, నీకేమర్థమవుతుందీ" అన్నాడు మహానుభావుడు. వారు 30 ఏళ్లు శ్రమించి 'రామాయణ కల్పవృక్ష' మహాకావ్యం రచించారు.

    నేను నాలుగుసార్లు రామాయణం వ్రాశాను. 1. శ్రీమద్రామాయణము, 2. సీతాచరితం, 3. బాలల రామాయణం, 4. రామాయణ పాత్రలు.

    వాల్మీకి రామాయణ పారాయణం కాదు - అధ్యయనం ఎనిమిది సార్లు చేశాను. ప్రతి తడవా వాల్మీకి కవిత నిత్యనూతనంగా కనిపిస్తుంది.

    "సముద్రమివరత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరమ్'

    సముద్రంలో రత్నాలుంటాయి. కనిపించవు. వెదకాలి. అప్పుడే రసాస్వాదం. ఇహలోకంతో పని ఉండదు. రామాయణంలో మునిగిపోతాం.

    రామాయణం వంటి కావ్యం భరత జాతికే ఉంది. గర్వించండి. ఈ అదృష్టం మరొక జాతికి లేదు!

    "యథాసముద్రో భగవాన్ యథామేరుర్మహా నగః
    ఉభౌఖ్యాతౌ రత్ననిధయః తథా భారతముచ్యతే"

    సముద్రం, మేరు పర్వతం, రత్న నిధులు అని ప్రసిద్ధి. భారతం ఆ రెంటివంటిది.

    మానవజాతి సాంతం వ్యాసభగవానునికి రుణపడి ఉంటుంది. ఏమి చేసినా అతని రుణం తీరదు. అతడు మనకు తరగని సంపద ఇచ్చాడు. అది అక్షయపాత్ర. ఇవ్వదలచినంత ఇవ్వండి, ఇంకా మిగిలి ఉంటుంది!

    లలిత స్కంధము గృష్టమూలము శుకాలాపాభిరామంబు మం
    జులతా శోభితమున్ సువర్ణ సమనస్సుజ్ఞేయమున్ సుందరో
    జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
    వెలయున్ 'భాగవతాఖ్య' కల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై
                                                                   పోతన శ్రీమహాభాగవతము 1-20

    సాహిత్యం - దశలు

    నరునికి సభ్యత, సంస్కారం, నాగరికత, సామాజిక జీవితం నేర్పింది సాహిత్యం, రాజకీయంకాదు. రాజకీయాలను, రాజ్యాలను, రాజులను ఏర్పరచింది కూడ సాహిత్యమే! మానవజీవితం శాంతిమయం, సుఖప్రదం కావడానికి నిర్విరామ కృషి చేసింది సాహిత్యం. పాశ్చాత్య సాహిత్యానికి ప్రచారమే౦- ఇంకా పాలపళ్లు రాలలేదు. ఆ సాహిత్యానికి వినోదం ప్రధానం. విశ్వ శ్రేయస్సు కోరేదీ, అందుకు కృషి చేసేదీ భారత సాహిత్యం. "విశ్వశ్రేయః కావ్యమ్"

    సాహిత్య సందేశాలను నరుడు పాటించి ఉంటే ప్రభుత్వాల పని ఉండేది కాదు. 'మా విద్విషావహే' - మేము ద్వేషించుకొనం. ప్రపంచంలో యుద్ధాలనుంచి కుటుంబ కలహాల దాక ద్వేషమే కారణం అవుతున్నది. ఒక్కసారి ద్వేషం లేని, ప్రేమైక సమాజాన్ని ఊహించండి. నాడు ప్రభుత్వం, పోలీసు సైన్యం, న్యాయస్థానం అవసరం ఉండదు! 

Next Page