Previous Page Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 3


    అప్పుడు నాకు కొత్త ఢిల్లీ వేద ప్రతిష్ఠాన్ వారి 'ఋగ్వేద సంహిత' లభించింది. ఇందులో మూలమంత్రం 'దేవనాగరి'లోనూ - ఇంగ్లీషు లిపిలోనూ ఉంది. మంత్రానికి ఆంగ్లానువాదం స్వామి సత్య ప్రకాశ సరస్వతి - సత్యకామ విద్యాలంకార్ కలిసి చేశారు. అనువాదం బాగుంది. ఇది మహత్తమ కార్యం, అయితే ఇంకా పూర్తి కాలేదు. అయిదు మండలాల ప్రచురణ మాత్రం జరిగింది. ఇది భారతీయ దృక్పథంతో వేదాన్ని పాశ్చాత్యులకు అందించే తొలి ప్రయత్నం.

    ఆ పుస్తకం దొరికింది. నిధి దొరికినంత సంబరపడ్డాను. అరుదైన పుస్తకం లభించినప్పటి ఆనందం పుస్తకాభిమానులే తెలియగలరు. పుస్తకం చదివాను. ఎంతో బావుంది. అనువాదకులు ఎంతో శ్రమించారు. వివరణలు ఇచ్చారు. లభించినవి అయిదు మండలాలే! ముందు అది ముగింతాం. అన్వేషణ కొనసాగింతాం అనుకున్నాను. అనువాదం ప్రారంభించాను. వంద సూక్తాలు అనువదించాను.

    వందసూక్తాల తరువాత నాకు సంతృప్తి కలుగలేదు. అసంతృప్తి వెంటపడింది. కారణాలకై అన్వేషించాను. అప్పుడు నాకు తెలిసినవి.

    1. ఆంగ్లానువాదం  స్వతంత్రం.

    2. ఆధునిక వ్యాఖ్యాతలను అనుసరించారు.

    3. దేవతల పేర్లు విశేషణాలు అయినాయి.

    4. సంప్రదాయానుగుణంగా లేదు.

    ఈ గ్రంథం చదవడానికి చాలా బావుంటుంది. కాని అనువదించి అందించడానికి ఉపకరించదు. ఎంత ఉత్సాహంగా ప్రారంభించానో అంత నిరుత్సాహంగా నిలిపి వేశాను.

    కార్య సాధకుల్లో మధ్యమునిగా మిగిలిపోతానేమోనని దిగులు పట్టుకుంది.

    నా వేదన చూచిన ఒక మిత్రుడు 'అంధ్ర వేదములు - ఋగ్వేదము' అనే గ్రంథం తెచ్చిచ్చారు. దానిలో మంత్రం - మంత్రానికి తాత్పర్యం ఉంది. తాత్పర్యం సాయణ వ్యాఖ్యను అనుసరించారు.దీని ప్రచురణకు ఒక  పవిత్ర చరిత్ర ఉంది.

    మహాత్ముని స్వాతంత్య ఉద్యమం అచ్చం ఆంగ్లేయులను పారదోలడం వరకు పరిమితం కాదు. భారత జాతీయతను పునరుజ్జీవింప చేయడం కూడా పోరాటంలో భాగమే. "బ్రాహ్మణ, బ్రాహ్మణేతర అసమానత్వమును తొలగించుటకు వేదవేదాంగములను ఆంధ్రీకరించి ఆంధ్రుల కెల్లరకు హస్తగతమొనర్చుట భావ్యమని" గొల్లపూడి సీతారామ శాస్త్రిగారు, రాంబొట్ల పాలెం, గుంటూరు జిల్లాలో వినయాశ్రమం ప్రారంభించారు. మహాత్మా గాంధీ వినయాశ్రమాన్ని శ్రీముఖ సం|| మార్గశిర బహుళ సప్తమి 23-12-1933లో ప్రారంభించారు.

    పురాణ వాచస్పతి బంకుపల్లె మల్లయ్య శాస్త్రి గారు ఋగ్వేదానువాదం చేశారు. దీని ప్రచురణ 1940. 480  పేజీల గ్రంథం రెండు రూపాయలన్నారు. తొలి సంపుటిలో ద్వితీయాష్టకంలో తృతీయాధ్యాయం వరకు మాత్రమే ఉంది. అంతటితో ఆ ప్రయత్నం నిలిచిపోయినట్లుంది!

    మిగతా సంపుటులను గురించి నేను వినయాశ్రమం వారికి ఉత్తరం వ్రాశాను. ఋగ్వేద ప్రచురణే తమకు  తెలియదని జవాబు వచ్చింది. ఇది 60 సంవత్సరాల క్రితపు రచన. మళ్లీ అంతటి సత్ప్రయత్నం జరిగినట్లు లేదు.

    అనువాదం మళ్లీ ప్రారంభించాను. పూర్తి ఋగ్వేదం కోసం అన్వేషణ సాగించాను.

    తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేదాల మూల సహితి పద్యానువాదం ప్రచురించారు. దానిది బ్రహ్మ స్వరూపం. ఉన్నదిగాని అగుపించలేదు. ఆ గ్రంథాలు గల అనేకమంది దగ్గరకు నేనూ మిత్రులం వెళ్లాం. వారు సత్యవాదులు. లేదన లేదు! ఇవ్వలేదు! సాక్షాత్తు దేవస్థానం ప్రచురణ విభాగం వారిని అర్ధించాను. వారు పరబ్రహ్మలు. నిరాకారులు! అగుపించలేదు!

    భువన వాణి ట్రస్టు లక్నో వారు నాలుగు వేదాలను హిందీ అనువాదంతో ప్రచురించే ప్రణాళిక రచించారు. ఇది మహత్తమ కార్యం. ఇప్పటికి వారు నాలుగు వేదాల ఒక్కొక్క సంపుటి మాత్రం ప్రచురించారు. మూలమంత్రం - ప్రతిపదార్థం - హిందీ గేయానువాదం - తాత్పర్యం ఇదీ పథకం.

    ఈ ప్రణాళిక  భాగంగా ఋగ్వేదంలో ప్రథమాష్టకం మాత్రం ప్రచురించబడింది. నాకు అర్థం అయినంత వరకు అనువాదం సంప్రదాయానుగుణం కాదు.

    సంస్కృత ప్రచురణ కర్తల కేటలాగులు తెప్పించి చూచాను. చౌఖంబ విద్యాభవన్ - 1 వారణాసి వారి కేటలాగు నాకు పెన్నిధిగా కనిపించింది. ఈ సంస్థను నలుగురు అన్నదమ్ములు నడుపుతారు. అంతా వృద్ధులే. 'చౌఖంబ' అంటే నాలుగు స్తంభాలు. నలుగురు స్తంభాలుగా ప్రచురణ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ సంస్కృత సాహిత్యానికి ఎంతో సేవ చేస్తున్నది. నేను ఢిల్లీ, వారణాసి పుస్తక కేంద్రాలకు వెళ్లాను. యజమానులు భారత సాహితీ, సంస్కృతుల విషయంలో ఎంతో శ్రద్ధాసక్తులు గలవారు.

    చౌఖంబ వారి ఋగ్వేద సంహిత సరిగ్గా నాకు అవసరం అయింది. అనుకూలం అయింది.

    1. ఇది సంపూర్ణ ఋగ్వేదం. ఇందులో ఎనిమిది అష్టకాలు - దశ మండలాలూ ఉన్నాయి.
    2. మంత్రం స్వరయుక్తంగా ఉంది.
    3.పదపాఠున్నాయి.
    4.సాయణాచార్యుల వ్యాఖ్య ఉంది.
    5.పండిత రామగోవింద త్రిపాఠీ హిందీ వచనానువాదం ఉంది.

    ఇంతటి గ్రంథం లభించడం భగవదనుగ్రహమే! అయితే మరి ఇంత వినిపించడం ఎందుకయా అంటే వీడికున్న శ్రద్ధ సంకల్పం, కృషీ ఎంతటివి అని పరీక్షిస్తాడు స్వామి.

    తల్లి బిడ్డ ఏడుపు వింటుంది. పనిలో ఉంటుంది. వెంటనే పనివదలదు. పరిగెత్తి రాదు. బిడ్డ బిగ్గరగా ఏడుస్తుంది. తల్లి పని వదులుకుంటుంది. పరిగెత్తుకు వస్తుంది. బిడ్డకు చన్నిస్తుంది.

    భగవంతుని మాతృ స్వరూపం
   

    సంపూర్ణ ఋగ్వేద సంహిత లంభించింది. నాకు సంహీవని లభించినట్లయింది! అమృత భాండం అందినట్లయింది! చందమామదోసిట నిలిచినట్లయింది. పుస్తక ప్రియులకు వలసిన పుస్తకం లభించడం వలచిన వనిత లభించడం లాంటిది!!!

    రచనా యజ్ఞం

    ఒకే వ్యక్తి నాలుగు వేదాల అనువాదానికి పూనుకున్న జాడ, పూర్తి చేసిన జాడ లేవు. భగవంతుడు నాకు ఆ భాగ్యం కలిగించాడు.

    భగవద్గీతలోని ఆరవఅధ్యాయం. ఆత్మసంయమ యోగం. భగవానుడు ఆత్మ సంయమనం ఉపదేశిస్తాడు. అర్జునునికి సంశయం కలుగుతుంది. అడుగుతాడు.

        అయతిశ్శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః|
        అప్రాప్య యోగ సంసిద్ధం కాం గతిం కృష్ణ! గచ్ఛతి||


    అతడు శ్రద్ధావంతుడే కాని అనియతుడు. అందువల్ల అతని మనసు చలిస్తుంది. యోగ భ్రష్టుడు అవుతాడు. కృష్ణా! అలాంటి వాణి పరిస్థితి ఏమి?

    భగవానుడు ఉపదేశిస్తున్నాడు:-

        ప్రాప్య పుణ్యకృతాం లోకానం శిత్వా శాశ్వతీః సమాః|
``        శుచీనాం శ్రమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే||


    యోగభ్రష్టుడు పుణ్యలోకాలకు చేరుకుంటాడు. అక్కడ కలకాలం ఉంటాడు. తదుపరి శుచిమంతులగు శ్రీమంతుల ఇంట్లో జన్మిస్తాడు.

        తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వ దైహికం|
        యతతేచ తతో భూయః సంసిద్ధౌ కురునందన||


    అర్జునా! అతనికి పూర్వజన్మపుబుద్ధి సంయోగం ఈ జన్మలో చేరుతుంది. మళ్లీ అతడు సంసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు.

    సత్కార్యం ప్రారంభించిన వాడు అది పూర్తి కాకుండా జన్మ చాలిస్తే దాన్ని మరుసటి జన్మలో సాధిస్తాడు.

    నేను యోగభ్రష్టుణ్ణి అనుకుంటున్నాను. గత జన్మలో వేదానువాదం సగంలో వదలినట్లున్నాను. ఆ సత్కార్యం పూర్తి చేయడానికే స్వామి ఈ జన్మను ప్రసాదించినట్లున్నాడు.

    ధనికధర్మసంస్థలు రాజాస్థానాలు, ప్రభుత్వాలు తప్ప వేదవ్యాఖ్యాన, వేదానువాదలకు పూనుకోలేదు. ఆ సంస్థలో అనేకమంది పండితులు నిత్యం శ్రమించారు. అయినా నాలుగు వేదాలు పూర్తి చేయటం కష్టతరం అయింది.

    కార్యం అలాంటిది కాగా అన్యసహాయం లేక వంటరిగా నాలుగు వేదాలు అనువాదం చేయడం అసామాన్యం. అసామాన్య కార్యాలన్నీ భగవంతుడు చేయిస్తాడు!

    భవ సంవత్సర పుష్య పూర్ణిమ 16-1-1995 నాడు భగవదారాధన చేసి ఋగ్వేద అనువాదం ప్రారంభించాను. ఈశ్వర సంవత్సర పుష్య శుక్ల ఏకాదశి 24- 1- 1998 శనివారం ఉదయం 7-15కు అథర్వ వేద అనువాదం ముగించాను. మూడు సంవత్సరాల్లో నాలుగు వేదాల అనువాదం సుమారు 5000 వ్రాత పేజీల్లో పూర్తి చేశాను. 70 సంవత్సరాల వార్ధక్యంలో ఈ  మహత్కార్యం వంటరిగా ఒకే జన్మలో పూర్తి చేయడం కేవలం పరాత్పరుని కరుణా కటాక్షమే!

    ఈశ్వర పుష్య శుక్ల ఏకాదశి ఓకే పర్వదినం! ఒక పండుగ, ఒక ఉత్సవం, ఉదయం 7:15కు అథర్వ వేదంలోని చివరి మంత్రం అనువదించాను. ఋగ్యజుస్సామాధర్వ వేదాల అనువాదం పూర్తి అయింది. ఒక మహాయజ్ఞం ముగిసింది. ఒక తపస్సు ఫలించింది. ఒక మహత్కార్యం సఫలం అయింది. ఒక స్వప్నం సాకారం అయింది. ఒక కల నిజమైంది!!!

    ఈశ్వర పుష్య శుక్ల ఏకాదశి నాడు నా ఆనందానికి అవధులు లేవు. ఒక నిధి దొరికినా, ఒక పదవి చేతికందినా, ఒక దేవత ప్రత్యక్షం అయినా ఇంతటి ఆనందం లభించదు. ఆనందం అక్షరానికీ శబ్దానికి అందదు. అది అనిర్వచనీయం! మనసు పొంగింది. ఉప్పొంగింది. ఉరకలు పెట్టింది. పరుగులు తీసింది! 70 ఏళ్ళవాణ్ణి. వార్ధక్యం దేహానికి! మనసుకు వయసుతో నిమిత్తం లేదు. మనసు పురి విప్పింది. నాట్యం చేసింది. ఎగిరింది. గంతులు వేసింది. తైతక్కలాడింది. నా చేతికి ఆకాశం అందింది. చుక్కల్ను పిడికిట పట్టాను. చంద్రుడు చేతిలో వాలాడు. అరచేతిలో గంతులు వేస్తున్నాడు! నేను ఆకాశంలో విహరిస్తున్నాను. సముద్రాల్లో తేలియాడుతున్నాను. జలపాతాలను తాకుతున్నాను. పూలరాశులను చెల్లాచెదురు చేస్తున్నాను. యువతులులకు పంచిపెడ్తున్నాను.

    ఈశ్వర పుష్య శుక్ల ఏకాదశి నాడు నాకు పరమానందం, ఊపిరి ఆగినట్లనిపించింది. ఇంతటి ఆనందార్ణవంలో నన్ను ముంచిందెవరు? భగవానుడు! స్వామిని సేవించాలి. బంధుమిత్ర సపరివారంగా చేరుకున్నాం. రాముడు లేడిని కొట్టింది ఇక్కడేనట! లేడి గిట్టలు గుర్తులు స్వామి పాదచిహ్నాలు ఉన్నాయి. అక్కడ వంటలు. రుచులు అద్భుతం. శ్రీరామచంద్రస్వామి కళ్యాణం చేయించాం. సాయంత్రం యాదగిరిక్షేత్రం. దిగువ స్వామి దర్శనం. గుట్టమీద రాత్రి విడిది. ద్వాదశి - ఆదివారం 25-1-98 నాడు స్వామి వారికి అర్చనలు, కళ్యాణం, అదొక అనుభూతి!

    స్వామి కటాక్షానికి మూల్యం చెల్లించగలమా! అంతా స్వామిదే! ఇవ్వడానికి మనదగ్గర ఏముంది. గంగాజలం, గంగకే అర్పిస్తాం. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు పరమాత్మ. అంతే అదొక తృప్తి! అదొక కృతజ్ఞత! అది భక్తిభావం. అది ప్రపత్తి!

    తండ్రి కొడుకును కంటాడు. విద్యాబుద్ధులు కలిగిస్తాడు. పెద్దవాణ్ణి చేస్తాడు. పుత్రుడు తన సంపాదనలో తృణమో, పణమో చేతిలో పెడ్తాడు. తండ్రి ముమ్మురిసిపోతాడు! అంతా తాను చేసిందే అనుకోడు, ఆ తృణానికి తృప్తి పడతాడు. ఎగిరిపడ్తాడు.

    పరాత్పరుడు సహితం అంతే. అతడే తండ్రి; అతడే తల్లి; అతడే బంధువు; అతడే మిత్రుడు. స్వామికి అర్థమా! కాదు అతడు ప్రేమ పిపాసి - భక్తితాపసి "యోగక్షేమం వహామ్యహం. అని అభయం ఇచ్చారు. ఇస్తున్నారు. ఇస్తారు.

`    "ఓం నమో భగవతే వాసుదేవాయ"

    ఆనందపు ఆవేశం నుండి బయట పడితే వేదం ప్రత్యక్షం అవుతుంది. వేదం పవిత్రాతి పవిత్రం. అయితే అన్య మత గ్రంథాల వలె దీనికి పూర్వం 'పవిత్ర' పదం లేదు. సూర్య, చంద్ర, నక్షత్రాదులను పరిచయం చేయ పనిలేదు. అవి ప్రభావాత్మకములు అని చెప్పనక్కరాలేదు. అవి అందరికీ తెలిసినవే! వేదం పావనం. మంత్రానికి మాన్యత ఉంది. మంత్రానికి ప్రభావం ఉంది. ఈ విషయం వేదంలో చెప్పబడలేదు. అగ్ని కాలుతుంది అని చెప్పనవసరం లేదు!
   
    అనువాద రచన మూల రచన కన్న కష్టతరం. నేను మూల రచనలు చేశాను. అనువాదాలు చేశాను. ఇది స్వానుభవం. స్వీయ రచనలో స్వేచ్ఛ ఉంది. భావాలు మనవి. భాష మనది. స్వేచ్ఛ విహంగంలో రచన సాగుతుంది. అది నేను కన్న బిడ్డ; దాని మంచి చెడులు నావి.

    అనువాదం అలాకాదు. భావం మూలరచయితది. అది స్వేచ్ఛా విహంగం. నేను దానికి భాష సమకూర్చాలి. నేను అతని భావాల పంజరంలో బందీని. అయినా అనువాదం అనిపించదు. పరిధి సంకుచితం అవుతుంది. మూల రచయితది 'లక్ష్మణరేఖ' ఆ రేఖను అతిక్రమించరాదు. అది మరొకరి కన్న బిడ్డ! 'ముద్దూ ముచ్చట' నేను తీర్చాలి. మూల రచయిత అనుభూతులు ఆవేశాలు, సందర్భాలు నాకు లేవు. అతణ్ణి కొడితే ఏడవాలి!

    నేను సంస్కృతం - హిందీ - ఉర్దూ - ఇంగ్లీషుల నుంచి అనువాదాలు -అందరు మెచ్చేలా చేశాను.

 Previous Page Next Page