English | Telugu

యుద్ధానికి సిద్ధమవుతున్న అల్లువారు, కొణిదెలవారు.. విజయం ఎవరిని వరిస్తుంది?

టాలీవుడ్‌లో హీరోల మధ్య పోటీ ఎలా ఉన్నా వారి వారి సినిమాలు రిలీజ్‌కి వచ్చేసరికి ఎక్కడా లేని పోటీ ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్‌కి వస్తే అది పెద్ద సమస్యగా మారిపోతుంది. రెండు సినిమాల నిర్మాతలు ఒక అండర్‌స్టాండిరగ్‌తో రిలీజ్‌ డేట్స్‌ను మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే సమస్య అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ల సినిమాలకు ఏర్పడేలా ఉంది. అయితే ఈ రెండు సినిమాలు ఒకే డేట్‌లో రిలీజ్‌ కాకపోయినా ఒకే నెలలో రిలీజ్‌కి రాబోతున్నాయి. పుష్ప2, గేమ్‌ ఛేంజర్‌ 19 రోజుల గ్యాప్‌తో రిలీజ్‌ కాబోతున్నాయి.

ఈ రెండు సినిమాలూ చాలా కాలంగా షూటింగ్‌ దశలోనే ఉన్నాయి. పుష్ప బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో దాన్ని మించేలా పుష్ప2ని తియ్యాలన్న పట్టుదలతో సుకుమార్‌ ఆ సినిమాని చెక్కుతూ వస్తున్నాడు. ఆ కారణంగానే వర్కింగ్‌ డేస్‌ పెరిగిపోయాయి. ఎట్టకేలకు ఆగస్ట్‌ 15కి సినిమాను రిలీజ్‌ చేస్తామని ఆమధ్య ప్రకటించారు. షూటింగ్‌ ఓ కొలిక్కి రాకపోవడంతో సినిమా రిలీజ్‌ని వాయిదా వేయాల్సి వచ్చింది. డిసెంబర్‌ 6న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు ప్రకటించారు.

మరోపక్క రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ మూడు సంవత్సరాలుగా జరుగుతోంది. రకరకాల కారణాల వల్ల షూటింగ్‌ వాయిదా పడుతూ, అప్పుడప్పుడూ జరుగుతూ వచ్చింది. భారతీయుడు2 చిత్రానికి కూడా శంకరే దర్శకుడు కావడంతో గేమ్‌ ఛేంజర్‌ని పక్కన పెట్టి ఆ సినిమాపై దృష్టి పెట్టాడు. ఆ కారణంగా కొంత ఆలస్యం జరిగింది. భారతీయుడు2 రిలీజ్‌ అయిన తర్వాత ఇప్పుడు గేమ్‌ఛేంజర్‌ని ట్రాక్‌ ఎక్కించాడు శంకర్‌. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని డిసెంబర్‌ 25న రిలీజ్‌ చెయ్యబోతున్నారు.

అల్లువారు, కొణిదెల వారి మధ్య జరిగే ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో పుష్ప2కే అందరూ ఓటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప చిత్రం ఆల్రెడీ సూపర్‌హిట్‌ సినిమా. వందేళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న సినిమా. అంతేకాదు, కలెక్షన్ల పరంగా కూడా సంచలనం సృష్టించిన సినిమా. పైగా పుష్ప2 కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టీజర్‌, సాంగ్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అలా పుష్ప2కి విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

గేమ్‌ఛేంజర్‌ విషయానికి వస్తే.. గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రామ్‌చరణ్‌ చేస్తున్న సినిమా అనే ఒక్క విషయం తప్ప సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం మనకు లేదు. ఒక్క పాట మాత్రం రిలీజ్‌ అయింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక శంకర్‌ ట్రాక్‌ రికార్డు తీసుకుంటే అతని కెరీర్‌లో రోబో తర్వాత సరైన హిట్‌ లేదు. అతనిలో అంతకుముందున్న ఫైర్‌ ఇప్పుడు కనిపించడం లేదు. దానికి తాజాగా నిదర్శనం భారతీయుడు2. ఇప్పటి ట్రెండ్‌ని పట్టించుకోకుండా 28 ఏళ్ళ క్రితం సబ్జెక్ట్‌తోనే మళ్ళీ సినిమా చెయ్యడం వల్ల జనం తిప్పి కొట్టారు. ఈ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. తమ హీరో సినిమాని శంకర్‌ ఏం చేస్తాడా అని ఇప్పటి నుంచే టెన్షన్‌ పడుతున్నారు. డిసెంబర్‌ 6న పుష్ప2 రిలీజ్‌ అయితే 19 రోజుల గ్యాప్‌లో గేమ్‌ఛేంజర్‌ విడుదలవుతుంది. అప్పుడు తప్పనిసరిగా చరణ్‌ సినిమాకి థియేటర్లు కేటాయించాల్సి వస్తుంది. పుష్ప2కి ఇచ్చిన థియేటర్లను చరణ్‌ సినిమాకి ఇవ్వాలి. అది బన్నీ సినిమాకి పెద్ద ఎఫెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. ఏ విధంగా చూసినా ఈ రెండు సినిమాలు ఒకే నెలలో రిలీజ్‌ అవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ విషయంలో రెండు సినిమాల మేకర్స్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.