English | Telugu
వినాయక్ అంటేనే సంచలనం.. థియేటర్ ఓనర్ కొడుకు నుంచి మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే దాకా!
Updated : Oct 8, 2023
ఆయన సినిమా థియేటర్ ఓనర్ కొడుకు.. చిన్నతనం నుంచే సినిమాలు చూస్తూ పెరగడం వలన సినిమా మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఏ తండ్రి అయినా తన కొడుకు చదువుకోకుండా సినిమాల్లోకి వెళ్తాను అంటే ఒప్పుకోడు. కానీ ఆయన తండ్రి మాత్రం అతన్ని సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించాడు. అలా తండ్రి ప్రోద్బలంతో వెళ్లిన ఆయన కూడా అనుకోని ఉండడు థియేటర్ ఓనర్ కొడుకుగా పరోక్షంగా సినీ రంగంతో అనుబంధం ఉన్న నేను సౌత్ లోనే పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యి సినిమా రంగాన్నే శాసించే స్థాయికి ఎదుగుతానని. ఆయన ఎవరో ఈ పాటికే మీకు అర్ధం అయ్యి ఉంటుంది. ఆయనే వివి వినాయక్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఆయనకి తెలుగు వన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.
తెలుగు సినిమా పరిశ్రమలో.. ఆ మాటకొస్తే బయట ఎక్కడైనా టాటాసుమో కనపడితే చాలు వివి వినాయక్కే గుర్తుకొస్తాడు. అంతలా అయన తన మొదటి సినిమా ఆదితో ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ అగ్ర హీరో అవ్వడానికి వినాయక్కే కారణం. ఎన్టీఆర్ కూడా చాలా ఇంటర్వ్యూ ల్లో ఈ విషయం చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన చెన్నకేశవరెడ్డి కూడా విజయాన్ని అందుకొని నేటికీ బాలకృష్ణ అభిమానుల ఫేవరేట్ మూవీగా ఉంది. ఆ మూవీ లో బాలయ్య చలపతిరావు తో పెద్దిరెడ్డి అని అనగానే టాటాసుమోలూ మట్టిలో నుంచి లేవడం నిజంగా సూపర్. ఆ తర్వాత నితిన్ తో తీసిన దిల్ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. నేటికీ దిల్ మూవీ టీవీల్లో వస్తుంటే జనం ఇరగబడి చూస్తారు. అప్పటికి పెద్దగా ఎవరకి తెలియని నితిన్ తో ఆ సినిమా తీసి నితిన్ సినీ కెరీర్ కి ఎలాంటి డోకా లేకుండా చేసాడు.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాకి డైరెక్షన్ అవకాశం పొంది పరిశ్రమ మొత్తం తన వైపు చూసుకునేలా చేసాడు. చిరంజీవి సినీ కెరీర్ లోనే ఆ మూవీ బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఆ సినిమా తో వినాయక్ ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ అయ్యాడు. ఇక అక్కడనుంచి ఆయన విజృంభణ స్టార్ట్ అయ్యింది. ఇది వినాయక్ సినిమా అని జనం థియేటర్ కి వెళ్లే పేరుని ఆయన పొందాడు. సాంబ, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, నాయక్ ఇలా వరుస సినిమాల హిట్స్ తో టాప్ రేంజ్ దర్శకుడుగా ఎదిగాడు.
రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైన చిరంజీవి 10 ఏళ్ళ తర్వాత సినిమా చేయబోతున్నాడని ప్రకటన రాగానే చిరు ఫాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులందరూ డైరెక్టర్ గా వినాయక్ అయితే బాగుండు అని అనుకున్నారంటే వినాయక్ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. తనకి మాత్రమే సాధ్యమయ్యే టేకింగ్ తో సినిమా లు తీస్తూ తెలుగు సినీ పరిశ్రమలో సరి కొత్త రికార్డ్స్ ని సృష్టించాడు. బలం లేని సీన్ ని సైతం తన టేకింగ్ తో ఆడియన్స్ ఆ సీన్ ని కళ్ళు ఆర్పకుండా చూసేలా చెయ్యడం వినాయక్ స్టైల్. నేటి చాలా మంది దర్శకులు ఆయన టేకింగ్ ని కాపీ కొట్టేవాళ్లే. అలాగే సినిమా పరిశ్రమలో ఆయనకి ఏకలవ్య శిష్యులు చాలా మందే ఉన్నారు.
ఆయన దర్శకత్వానికి ఎంత బలం ఉంటుందంటే జనరల్ గా ఆయన సినిమాలో కామెడీ అదిరిపోతుంది. ఆయన సినిమా లో కామెడీ ఉన్నట్టు ఇంక ఏ ఇతర సినిమాలో కూడా ఉండదు. అంటే సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు అదే టెంపోతో కామెడీ ఉంటుంది. కానీ కామెడీ ని ఆయన దర్శకత్వ ప్రతిభ డామినేషన్ చేస్తుంది. దిల్, కృష్ణ, అదుర్స్, నాయక్, అల్లుడు శ్రీను సినిమాలే అందుకు ఒక ఉదాహరణ. అలాగే ఆయన ఎంత పెద్ద డైరెక్టరో అంతే పెద్ద మనసున్న వ్యక్తి కూడా. ఒక ఇంటర్వ్యూలో ఆయన్ని రాజమౌళి పొజిషన్ ను చూస్తుంటే ఒక దర్శకుడుగా మీకు అసూయ కలగడం లేదా అని అడిగితే అసూయగా లేదు చాలా గర్వముగా ఉంది అని చెప్పాడు. అలాగే రాజమౌళి కి గుండె దైర్యం ఎక్కువని అందుకే పాన్ ఇండియా లెవల్లో భారీ సినిమాలు తీస్తున్నాడని తనకి అంత దైర్యం లేదని చెప్పాడంటే వినాయక్ మంచి మనసుని అర్ధం చేసుకోవచ్చు.
అలాగే తన దర్శత్వం లో వచ్చిన అఖిల్ సినిమా ఫెయిలైతే డిస్ట్రిబ్యూటర్లని పిలిపించి సినిమాకి తాను తీసుకున్న రెమ్యురేషన్ ని వెనక్కి ఇచ్చాడు. ఒక దర్శకుడుగా తాను తిరిగి ఇవ్వాలసిన అవసరం లేకపోయిన వినాయక్ ఇచ్చాడంటే తన మంచి తనాన్ని అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఆయన నోటివెంట ఏనాడు కూడా పలానా సినిమా ప్లాప్ అయ్యిందటగా అని రాదు అంటే ఆయనకీ సినిమా మీద ఉన్న ప్రేమని అర్ధం చేసుకోవచ్చు. మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద తన స్టామినాని నిరూపించుకోవడానికి కథల్ని వింటూ ఒక భారీ సినిమా తో మన ముందుకు రావటానికి వినాయక్ సిద్ధం అవుతున్నారు. ఆయనకి మరో సారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తుంది తెలుగు వన్.
(అక్టోబర్ 9న వి.వి. వినాయక్ పుట్టినరోజు సందర్భంగా)