English | Telugu

పేరులోనే డబుల్‌ విక్టరీ ఉన్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌!

వి.వి.వినాయక్‌.. యాక్షన్‌ చిత్రాల్లో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిన డైరెక్టర్‌. హీరోని ఒక రేంజ్‌లో ఎలివేట్‌ చెయ్యడంలో దిట్ట. హీరోలతో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను చేయించడంలో అందె వేసిన చేయి. తొలి చిత్రం ‘ఆది’తోనే తనేమిటో ప్రూవ్‌ చేసుకొని ఓ కొత్త తరహా యాక్షన్‌ చిత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన దర్శకుడు. పేరులో ఉన్న మూడు ‘వి’లు విక్టరీకి మారుపేరు అనే విధంగా సినిమాలు చేస్తూ డైరెక్టర్‌గా టాప్‌ పొజిషన్‌కి వెళ్లిపోయారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమాలు తీయడం వినాయక్‌ ప్రత్యేకత. అలా ఎన్నో విజయాలు అందుకున్నారు. టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. 

వి.వి.వినాయక్‌ పూర్తి పేరు గండ్రోతు వీరవెంకట వినాయకరావు. ఇండస్ట్రీలో అందరూ వినయ్‌ అని పిలుస్తారు. అయితే ఊళ్ళో మాత్రం అతన్ని నాని అని పిలిచేవారు. 1974 అక్టోబర్‌ 9న పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు జన్మించారు.  చిన్నతనం నుంచి సినిమాలపై మక్కువ పెంచుకున్న వినయ్‌ ఎలాగైనా డైరెక్టర్‌ అయిపోవాలని చెన్నయ్‌ బయల్దేరిన వినయ్‌ ‘అబ్బాయిగారు’ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ అయ్యారు. ఆ సినిమా తర్వాత సాగర్‌ దగ్గర చాలా సినిమాలకు పనిచేశారు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, ఎలా తీస్తే సినిమాని ఆదరిస్తారు అనే విషయాలు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే గ్రహించారు వినయ్‌. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి పవర్‌ఫుల్‌ మూవీస్‌లో ఫ్యాక్షన్‌ డ్రామాను అద్భుతంగా చూపించారు. తను కూడా అదే తరహా సినిమాను కొత్తగా తియ్యాలనుకున్నారు. అలా వచ్చిందే ‘ఆది’. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఈ సినిమా అనూహ్యంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు వినాయక్‌. 

‘ఆది’ తర్వాత వెంటనే బాలకృష్ణతో చేసిన ‘చెన్నకేశవరెడ్డి’ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత నితిన్‌ హీరోగా రూపొందించిన ‘దిల్‌’ యూత్‌నే కాదు, మాస్‌ ఆడియన్స్‌ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. నిర్మాత రాజు ఈ సినిమాతో దిల్‌రాజుగా మారిపోయారు. అదే సంవత్సరం మెగాస్టార్‌ చిరంజీవితో రూపొందించిన ‘ఠాగూర్‌’ చిత్రంతో వి.వి.వినాయక్‌ స్టార్‌ డైరెక్టర్‌ రేంజ్‌కి వెళ్లిపోయారు. 22 సంవత్సరాల కెరీర్‌లో వినాయక్‌ చేసిన సినిమాలు కేవలం 17 మాత్రమే. ప్రతి సినిమాను డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీసేందుకు ఇష్టపడే వినయ్‌.. ఎన్టీఆర్‌తో చేసిన ‘అదుర్స్‌’ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. ఎన్టీఆర్‌తో మూడు సినిమాలు చేసిన వినయ్‌.. అల్లు అర్జున్‌తో రెండు సినిమాలు చేశారు. లక్ష్మీ, కృష్ణ, బన్ని వంటి సినిమాలు వినయ్‌ను డైరెక్టర్‌గా తారాస్థాయికి తీసుకెళ్ళాయి. ప్రభాస్‌తో చేసిన యోగి కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు. 

‘ఆది’ చిత్రంతో వినాయక్‌కి దర్శకుడుగా తొలి అవకాశం ఇచ్చారు బెల్లంకొండ సురేష్‌. అందుకే అతని కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ ‘అల్లుడు శీను’ చిత్రాన్ని రూపొందించారు వినాయక్‌. వినాయక్‌ కెరీర్‌లో యోగి, అఖిల్‌, ఇంటిలిజెంట్‌ చిత్రాలు నిరాశపరిచాయి. ‘ఠాగూర్‌’ విడుదలైన 14 సంవత్సరాల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో చేసిన ‘ఖైదీ నెం.150’ చిత్రం మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2018 తర్వాత ఐదేళ్ళపాటు మళ్ళీ సినిమా చెయ్యని వినయ్‌ తెలుగులో సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చెయ్యాల్సి వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ను బాలీవుడ్‌కి పరిచయం చేస్తూ తీసిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వినాయక్‌ మరో సినిమా ప్లాన్‌ చెయ్యలేదు. ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యలు ఏర్పడడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న వి.వి.వినాయక్‌ డైరెక్టర్‌గా మరిన్ని మంచి సినిమాలు రూపొందించాలని ఆశిస్తూ వినయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.