English | Telugu
ఈసారి ఈ మూడు సినిమాల మధ్య లొల్లి మొదలైంది
Updated : Oct 14, 2023
పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అందరికీ గుర్తొచ్చేది థియేటర్ల సమస్య. సంక్రాంతి, దసరా సీజన్లలో రిలీజ్ అయ్యే సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురవుతూనే ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆ ప్రాసెస్‌లో పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతుంటాయి. ఈ దసరాకి భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో విడుదలవుతున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా, లియో డబ్బింగ్ సినిమా. ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక థియేటర్ల విషయంలో తప్పకుండా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలకు థియేటర్ల సమస్య ఏర్పడిరది. అప్పుడు కూడా డబ్బింగ్ సినిమా విజయ్‌దే కావడం గమనార్హం. అప్పటికి ఏదో ఎడ్జస్ట్‌మెంట్ చేసుకొని సినిమాలను రిలీజ్ చేసుకున్నారు.
ఇప్పుడు దసరాకి విడుదలయ్యే సినిమాలకు కూడా ఆ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. రెండు తెలుగు సినిమాల మధ్య డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూడు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. లియో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. థియేటర్ల విషయంలో సితార నాగవంశీకి మంచి గ్రిప్ ఉంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు నిర్మాతలతో పోలిస్తే నాగవంశీ ఈ విషయంలో ఎక్స్‌పర్ట్ అనే చెప్పాలి. వాస్తవానికి స్ట్రెయిట్ సినిమాలకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారు. అయితే లియోకి ఉన్న క్రేజ్, నాగవంశీ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో ఆ సినిమాకి కూడా ఎక్కువ థియేటర్లు కేటాయించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం థియేటర్ల విషయంలో లోలోపల వాదనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ ఇంకా నాలుగు రోజులు ఉంది. అప్పటికల్లా థియేటర్ల వ్యవహారంలో జరుగుతున్న గొడవలు బయటికి రావచ్చంటున్నారు.