English | Telugu

వెబ్ సిరీస్ : ది నైట్ మేనేజర్-2


తారాగణం: అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, సస్వతా ఛటర్జీ, రేష్ లాంబా, జగదీష్ రాజ్ పురోహిత్, అరిస్టా మెహతా, రవి బెహ్ల్, శోభిత దూళిపాళ, తిలోత్తమ షోమ్ తదితరులు.
సంగీతం : సామ్ సి. ఎస్
ఎడిటింగ్: కళ్యాణ్ సాహా
సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్
కథ, దర్శకత్వం : సందీప్ మోదీ
నిర్మాణ సంస్థలు: ది ఇంక్ ఫ్యాక్టరీ, బనిజయ్ ఏసియా.
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

సినిమాలే కాదు వెబ్ సిరీస్ లను కొందరు డైరెక్టర్స్ రిమేక్ చేస్తున్నారు. 2016 లో ఇంగ్లీష్ లో రిలీజ్ అయిన 'ది నైట్ మేనేజర్' ని మన నేటివిటికి అనుగుణంగా కొన్ని మార్పులతో రీమేక్ చేసి ఓటిటి లో రిలీజ్ చేసారు.

'జాన్ లి క్యారీ' పుస్తకం ఆధారంగా సందీప్ మోదీ రాసిన కథ 'ది నైట్ మేనేజర్'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని‌ ఈ‌ సిరీస్ లో నైట్ మేనేజర్ గా ఎవరు కనిపించారు? ఈ సిరీస్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.

కథ:

బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఒక హోటల్ కి నైట్ మేనేజర్ గా షాన్ సేన్ గుప్తా(ఆదిత్య‌రాయ్ కపూర్) చేస్తుంటాడు. ఆ హోటల్ కి వచ్చిన ‌ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయి సఫీనా (అరిస్తా మెహతా)‌ తనని ఇండియాకి పంపించమని అడుగుతుంది. దానికి షాన్ మొదట నిరాకరించిన, ఆ తర్వాత ఒప్పుకుంటాడు. షాన్ కాపాడాలని అనుకున్న సఫీనా గురించి తెలుసుకుంటాడు. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్రెడ్డీ రహమాన్(రేష్ లాంబా) కి భార్య అని తెలుస్తుంది. అతను వ్యాపారమే కాకుండా స్మగ్లింగ్ కూడా చేస్తుంటాడని ఒక‌ వీడియోలో చూసి షాన్ తెలుసుకుంటాడు. అదే సమయంలో స్మగ్లింగ్ చేస్తూ, బయటకు గొప్ప బిజినెస్ మ్యాన్ గా కనిపించే శైలేంద్ర రుంగ్తా(అనిల్ కపూర్) కథలోకి వస్తాడు. శైలేంద్ర రుంగ్తా కొడుకుని కాపాడి షాన్ సేన్ గుప్తా(ఆదిత్య రాయ్ కపూర్) దగ్గరవుతాడు. తన గతం గుర్తులేదని చెప్పిన షాన్.. కొన్ని నెలల పాటు శైలేంద్ర దగ్గర ఉంటాడు. అయితే ఇండియాలోని స్పై టీంతో షాన్(ఆదిత్య రాయ్ కపూర్) అనుసంధానంలో ఉంటూ సమాచారాన్ని చేరవేస్తుంటాడు. మరి చివరికి షాన్ తను అనుకున్నట్టుగా చేయగలిగాడా? శైలేంద్ర రుంగ్తాని స్పై చేస్తున్నదెవరో కనిపెట్టాడా? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

షాన్(ఆదిత్యరాయ్ కపూర్) ఒక హోటల్ లో నైట్ మేనేజర్ గా ఉంటూ తన ఇంటలిజెన్స్ తో ఆయుధాలు స్మగ్లింగ్ చేసే శైలేంద్ర రుంగ్తా(అనిల్ కపూర్) కి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం అందరికీ నచ్చేస్తుంది. మొదటి సీజన్ లో మొత్తం నాలుగు ఎపిసోడ్ లుగా ఉన్న ఈ సీరిస్.. సెకండ్ పార్ట్ లో మిగిలిన వాటిని కలిపారు. అయితే ఒక్కో ఎపిసోడ్ నిడివి కాస్త ఎక్కువగా ఉంది. సెకండ్ పార్ట్ లోని మొదటి ఎపిసోడ్‌లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ ఏమీ లేవు కాబట్టి త్వరగా కథలోకి వచ్చేస్తాం. కాకపోతే ఆ ఎపిసోడ్ కాస్త స్లోగా సాగుతుంది. అణు ఆయధాలు, విధ్వంసకరమైన ఆయుధాలు, గన్స్, ఇలా చాలా రకాల ఆయుధాలని చూసే ప్రతీ ఒక్కరికి ఇంత లోతుగా స్మగ్లింగ్ జరుగుతుందా అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. షాన్ ని అభిమన్యుగా తన మార్కెట్ ప్రపంచానికి పరిచయం చేస్తాడు శైలేంద్ర రుంగ్తా. అక్కడినుండి కథ ఒక ఫ్లోలో వెళ్తుంది. అయితే ఈ సీజన్ సెకండ్ పార్ట్ లో శైలేంద్ర రుంగ్తా వెనుక ఉంది ఎవరు అనే ట్విస్ట్ మాములుగా ఉండదు. ఆ నిజం తెలిసాక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నిజం తెలిసాక ఇండియన్ స్పై టీంలోని లిపిక సైకియాకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది.

చివరి ఎపిసోడ్‌ నిడివి గంటకి పైగా ఉండటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ అసలు నిజాలన్నీ ఇందులోనే ఉంటాయి. ట్విస్ట్ లు అలాగే ఉండిపోయేలా చేస్తాయి. అసలైన స్పై ఏజెంట్ ఎలా ఉండాలో? ఎలా ఉంటాడో ఈ ఎపిసోడ్‌లో చూపించారు. ఇన్వెస్టిగేషన్ లో లిపికా సైకియా రోల్ ఈ సిరీస్ కి ప్రాణం పోశాయి. బిజిఎమ్ బాగుంది. హీరో షాన్ కి విలన్ శైలేంద్ర రుంగ్తాకి మధ్య వచ్చే సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ చివరలో హీరో విలన్ దగ్గరే ఎందుకు ఉన్నాడో ఒక క్లారిటీ ఇస్తూ ముగించడం బాగుంటుంది.

బెంజమీన్ జాస్పర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ముఖ్యంగా సిమ్లాలోని మంచు వాతావరణాన్ని బాగా చూపించారు. ‌నిర్మాణ విలువలు బాగున్నాయి. సామ్ సి. ఎస్ సంగీతం పర్వాలేదనిపించింది. సందీప్ మోదీ కథని నడిపిన తీరు బాగుంది.‌ కానీ ఒక్కో ఎపిసోడ్ నిడివి కాస్త తగ్గించి, కొన్ని స్లో సీన్స్ ని తీసేస్తే ఇంకా బాగుండేది. మేకర్స్ చివరి ఎపిసోడ్‌లో మంచి ముగింపునిచ్చారు.

నటీనటుల పనితీరు:

షాన్ గా ఆదిత్య రాయ్ కపూర్‌ ఆకట్టుకున్నాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. శైలేంద్ర రుంగ్తా పాత్రలో అనిల్ కపూర్ తన నటనతో ఈ సిరీస్ కి ప్రాణం పోసాడు. అరిస్టా మెహతా పాత్ర భావోద్వేగానికి గురిచేస్తుంది. శోభితా దూళిపాళ బెస్ట్ గ్లామర్ రోల్ ని ప్లే చేసింది. శశ్వతా చటర్జీ తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయి, ‌శైలేంద్రకి బెస్ట్ ఫ్రెండ్ లాగా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఫ్రెడ్డీ రహమాన్ పాత్రలో రేష్ లంబా ప్రముఖ గ్యాంగ్ స్టర్ లా ఉన్నంతలో ముఖ్య పాత్ర చేసాడు. జగదీష్ రాజ్ పురోహిత్ హోటల్ మేనేజర్ గా ఆకట్టుకున్నాడు. లిపికా సైకియా రావుగా తిలోత్తమా షోమ్ ఒక కీలక పాత్రలో నటించింది. జైవీర్ జయ్ సింగ్ గా రవి బెహ్ల్ పర్వాలేదనిపించాడు. ఇక మిగతావాళ్ళు ఉన్నంతలో ఆకట్టుకున్నారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'ది నైట్ మేనేజర్' ను ఒక్కసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5 / 5

✍🏻. దాసరి మల్లేశ్

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.