English | Telugu

'గుంటూరు కారం' నుంచి ఆ ఇద్దరు ఔట్.. అసలేం జరుగుతుంది?

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా 'గుంటూరు కారం'ని ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ ఆ సినిమాకి అడుగడుగునా బ్రేక్ లు పడుతున్నాయి. ఏవో కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఒకానొక సమయంలో అసలు సినిమా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇటీవల టైటిల్ గ్లింప్స్ విడుదల చేసి, ఆ డౌట్స్ కి చెక్ పెట్టారు మేకర్స్. ఇక అంతా సాఫీగానే సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ని, హీరోయిన్ ని తప్పించారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

త్రివిక్రమ్ గత చిత్రం 'అల వైకుంఠపురములో' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ హిట్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ పూజా హెగ్డేని 'గుంటూరు కారం' కోసం కంటిన్యూ చేశారు త్రివిక్రమ్. అయితే తమన్, పూజా హెగ్డే ఎంపికను ఎందుకనో మొదటి నుంచి మహేష్ ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు. మహేష్ సైతం వారి ఎంపిక విషయంలో సంతృప్తిగా లేడని మొదటి నుంచి వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా తమన్ ని తప్పించాలని మహేష్ పట్టుబట్టినట్లు ఆ మధ్య బలంగా న్యూస్ వినిపించింది. అయితే టైటిల్ గ్లింప్స్ కి తమనే సంగీతం అందించడంతో ఇక అంతా సెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి తమన్ ని తప్పించారని ప్రచారం జరుగుతోంది. తమన్ స్థానంలో అనిరుధ్ లేదా జీవీ ప్రకాష్ ని తీసుకోనున్నారని తెలుస్తోంది. తమన్ ని తప్పించడం త్రివిక్రమ్ కి ఇష్టంలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకే త్రివిక్రమ్ తాను అల్లు అర్జున్ తో చేయబోయే తదుపరి సినిమా కోసం తమన్ నే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డేని సైతం తప్పించినట్లు టాక్ నడుస్తోంది. 'గుంటూరు కారం'లో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా.. ఇప్పుడు పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.